Full Style

>

దంత కళ అరవిరిసిన అందం , Dental arrangements and face beauty

ముఖానికి చిరునవ్వే అసలైన అందం! ఆ అరనవ్వులో.. ఎన్నెన్నో భావాలు. ఎంతో సోయగం. ఆ క్షణంలో ఆనందం తాండవిస్తుంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పలువరస పలకరిస్తుంది. అన్నీకలిసి... ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తళుక్కున మెరుస్తుంది.
అందుకే చిరునవ్వుకూ, ఆత్మవిశ్వాసానికీ, పలువరుసకూ, అందానికీ.. అంతటి విడదీయరాని బంధం!
ఎగుడుదిగుడు పళ్లు.. రంగుమారిపోయిన దంతాలు.. విరిగిపోయిన ముందుపళ్లు.. మరీ ముందుకు తోసుకొచ్చే ఎత్తుపళ్లు.. పళ్ల మధ్య పెద్దపెద్ద సందులు.. అసహజంగా తయారైన చిగుళ్లు... ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్నే కాదు.. మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి. మనసులో న్యూనత పేరుకుపోయేలా చేసి ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీస్తాయి. అయితే ఇవేవీ సరిచెయ్యలేనివి కాదు. అందుకే... ఆధునిక దంత వైద్యంలో 'సౌందర్య' విభాగానికి అంతటి ప్రాముఖ్యం పెరిగింది. వీటన్నింటినీ సరిచేసేందుకు ఇప్పుడు ఎన్నో అత్యాధునికమైన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా చిరునవ్వునే కళాత్మకంగా తీర్చిదిద్దే 'స్మైల్‌ డిజైన్‌' ప్రక్రియలూ వూపందుకున్నాయి.

రంగు మారితే?

పళ్లు చక్కగా తెల్లగా, సహజంగా ఉండాలి. వాటి సౌందర్యం తెల్లదనం మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ రంగుమారే పళ్లు, గారకట్టే పళ్లు, టీ-కాఫీలు పొగాకు నమలటం వంటి అలవాట్ల వల్ల సహజ రంగును కోల్పోతుంటాయి. టెట్రాసైక్లిన్‌ వంటి యాంటీబయోటిక్‌ మందులు కూడా పళ్ల మీద మచ్చల వంటి వాటికి కారణమవుతాయి. వీటిని తిరిగి మళ్లీ తెల్లగా మార్చేందుకు 'బ్లీచింగ్‌' ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. రసాయనాలతో దంతాలను 'బ్లీచ్‌' చేసే ఈ విధానంలో రకరకాల పద్ధతులున్నాయి. వీటి ద్వారా పళ్లు క్రమంగా తిరిగి సహజరంగులోకి వస్తాయి. ఫలితాలు చాలాకాలం పాటు ఉంటాయి.

పంటి పైపొర కింది డెంటిన్‌ మీద మచ్చలు ఏర్పడటం వల్ల కూడా పళ్ల రంగు మారుతుంది. దీన్నీ కొన్నిరకాల బ్లీచింగ్‌ పద్ధతుల ద్వారా సరిదిద్దొచ్చు. ఒకవేళ బ్లీచింగ్‌తో ఫలితం ఉండదనుకుంటే 'బాండింగ్‌' పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. పంటిపై భాగంలో అదే రంగు పూతతో సరిచెయ్యటం దీని ప్రత్యేకత. ఇది దంత సౌందర్య చికిత్సలో చాలా తేలికైన, చౌకైన ప్రక్రియ. దీంతో విరిగిన పళ్లు, పళ్ల సందులను కూడా సరిచేయొచ్చు. పంటి ఆకారం మార్చటం కూడా సాధ్యమే.
పళ్లు విరిగితే?
ప్రమాదాల్లోనో, కింద పడినప్పుడో తరచుగా ఎంతోమందికి ముందు పళ్లు విరుగుతుంటాయి. కొన్నిసార్లు ఇవి సగానికన్నా పైగా కూడా విరగొచ్చు. అలాంటి సమయాల్లో రక్తస్రావం జరగకుండా ఉండి, దంతమూలం, రక్తనాళాలు దెబ్బతినకుండా బాగున్నట్టయితే.. విరిగిన పన్ను వరకు 'కాంపోజిట్‌ ఫిల్లింగ్‌' చేస్తారు. ఇవి కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే ఆ పళ్ల మీద 'సిరామిక్‌ లామినేట్‌' చేయాల్సి ఉంటుంది. ఇందులో అసలు పన్ను ఆకారంలోనే 2 మి.మీ. మందం గల సిరమిక్‌ పొరను తయారు చేసి పంటి మీద అతికిస్తారు. ఇవేగాకుండా అవసరమైతే పన్ను పైన 'సిరామిక్‌ క్రౌన్‌' కూడా బిగిస్తారు.

వరుసగా ఒకటి కన్నా ఎక్కువ పళ్లు విరిగిపోతే ఆ ఖాళీని 'బ్రిడ్జెస్‌' ద్వారా పూరిస్తారు. అటుపక్క, ఇటుపక్క ఉండే దంతాల ఆధారంగా వాటిని అంటిపెట్టుకుని ఉండేలా వీటిని రూపొందిస్తారు. అయితే వీటిని కట్టుడుపళ్లలా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించటానికి వీలుకాదు. ఇవి చిగుళ్ల వ్యాధి రాకుండా కాపాడుతుంది. వీటివల్ల మాట కూడా సరి అవుతుంది. నోటి శుభ్రతను పాటిస్తే ఇవి చాలాకాలం బాగుంటాయి.

విరిగిన పళ్లకు క్రౌన్స్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇవి పన్ను ఆకారంలో తొడుగులాగా ఉంటాయి. అసలు పన్ను సైజుని అన్ని వైపుల నుంచి కొద్దిగా తగ్గించిన తర్వాత.. దానిపైన వీటిని గట్టిగా అమరుస్తారు. ఈ క్రౌన్స్‌తో పళ్ల ఆకారం, పరిమాణం, బలం, అందం మెరుగవుతాయి. వీటిల్లో పింగాణీ అతికిన లోహం, రెజిన్‌, సెరామిక్‌ వంటి చాలా రకాలున్నాయి. ఒకసారి ఈ క్రౌన్‌ను అమరిస్తే సాధారణంగా 10-15 ఏళ్ల వరకూ సమస్య ఉండదు.
ఫ్లోరోసిస్‌ దుష్ప్రభావానికి?
తాగునీటిలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరోసిస్‌ కారణంగా పళ్లు రంగు మారిపోయి.. అవి చూడ్డానికి వికారంగా తయారవుతాయి. పళ్లు కొద్దిగానే పసుపు రంగులోకి మారితే బ్లీచింగ్‌ వంటివి ప్రయత్నిస్తారు. ముందు రెండు పళ్లు రంగు మారితే.. వీటి మీద కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేస్తారు. ఈ ప్రక్రియలో రంగు మారిన పొరలను తొలగించి, పళ్ల రంగులోనే ఉన్న పదార్థాన్ని అతికిస్తారు. దాని మీద అతి నీలలోహిత కిరణాలను ప్రసరింప జేయటం ద్వారా అది గట్టిగా అవుతుంది. ఇది పది పదిహేను నిమిషాల్లోనే ముగుస్తుంది. కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ చేసిన పళ్లు సహజమైన దంతాల మాదిరిగానే ఉంటాయి. కొద్దికాలం తర్వాత ఇవి ఎప్పుడైనా రంగు మారితే పాలిష్‌ చేస్తారు. ఫిల్లింగ్‌ ఊడిపోయినా తిరిగి అతికించుకోవచ్చు.

ఒకవేళ ఎక్కువ సంఖ్యలో పళ్లు రంగు మారితే కాంపోజిట్‌ ఫిల్లింగ్‌ అంతగా పనికిరాదు. అప్పుడు లామినేట్స్‌ వేస్తారు. రంగు మారిన పొరను తొలగించి, తిరిగి అంతే మందంలో, ఆకారంలో సిరమిక్‌ పొరను తయారు చేసి పన్ను మీద అతికిస్తారు.

కొందరికి దెబ్బ తగలటం వల్ల కూడా పళ్లు నల్లగా అవుతుంటాయి. వీరికి లామినేట్స్‌గానీ, క్రౌన్స్‌ గానీ బాగా ఉపయోగపడతాయి. పన్ను సైజు అన్నివైపులా తగ్గించి అదే ఆకారంలో సిరమిక్‌తో చేసిన క్రౌన్‌ని బిగిస్తారు.
పళ్ల సందులు
పళ్లు, చిగుళ్ల ఆకారంలో తేడా ఉంటే పళ్లసందులు ఏర్పడుతుంటాయి. కొందరిలో పై రెండు మధ్యపళ్ల నడుమ పెదవి కణజాలం (ఫ్రేనలమ్‌) అతుక్కుపోయి ఉంటుంది. దీనిని మిడ్‌లైన్‌ డయాస్టెమా అంటారు. దీంతో చిగుళ్ల మధ్య ఖాళీ ఏర్పడి పళ్ల సందులు ఏర్పడతాయి. ఇలాంటి వారికి 'కాంపోజిట్‌ ఫిల్లింగ్‌'తో ఖాళీలను సరిచేయొచ్చు. అవసరమైతే చిగురును కత్తిరించి తర్వాత లామినేట్‌ చేస్తారు. ఇందులో పన్నుని కత్తిరించి ముందుకు కనిపించే భాగాన్ని లామినేట్‌ చేయటం ద్వారా పన్ను ఆకారాన్ని కొద్దిగా పెంచుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో క్రౌన్‌ కూడా బిగించొచ్చు.

దంత సౌందర్య చికిత్సల్లో ఎక్కువగా క్లీనింగ్‌, పాలిషింగ్‌, బ్లీచింగ్‌ వంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. పంటి మీద లామినేట్స్‌, వినీర్స్‌ అతికించటం, క్రౌన్స్‌, బ్రిడ్జెస్‌, ఇంప్లాంట్స్‌ అమర్చటం వంటి

ప్రక్రియలు అందంతో పాటు నోటి ఆరోగ్యాన్నీ కాపడతాయి. ముందుపళ్లు అందంగా తీర్చిదిద్దటం, ఎత్తుపళ్లు సరిచేయటం వంటివీ తరచుగా అవసరమయ్యేవే.
స్మైల్‌ డిజైనింగ్‌
చిరునవ్వును.. అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చికిత్సలన్నీ దీని కిందకు వస్తాయి. కొందరికి చిగుళ్లపై వరకూ ఉండటం వల్ల దంతాలు చిన్నగా కనిపిస్తాయి. మరికొందరిలో చిగుళ్లు ఒకేరకంగా కాకుండా ఎగుడు దిగుడుగానూ ఉంటాయి. దీంతో నవ్వినపుడు అంత అందంగా కనిపించరు. చిగుళ్ల పరిమాణాన్ని తగ్గించటం ద్వారా దీనిని సరిచేయొచ్చు. ఆపరేషన్‌ చేసి కొంత చిగురు భాగాన్ని తొలగిస్తారు. దీంతో పళ్లు పొడవుగా కనిపించి, నవ్వినపుడు అందాన్ని తెచ్చిపెడతాయి. ఇది చిగురు ఉబ్బెత్తుగా, ఎక్కువగా ఉన్న ఒక పన్నుకి గానీ బయటకు కనిపించే అన్ని పళ్లకు గానీ చేస్తారు. అవసరాన్ని బట్టి అందం ఇనుమడించేలా పళ్ల ఆకృతినీ సరిచేస్తారు.
వజ్రాల మెరుపు
ఇటీవల కొందరు ఫ్యాషన్‌ కోసం పళ్ల మీద డైమండ్స్‌, రంగు రాళ్లు, కలర్‌ చిప్స్‌ పొదిగించుకుంటున్నారు. రంధ్రం చేయకుండా వీటిని పన్ను మీదనే అమరుస్తారు. పన్నుకు రంధ్రం చేసి అందులో డైమండ్స్‌ను అమరిస్తే దానిని తొలగించినపుడు పన్ను దెబ్బతింటుంది. అందుకే వెనకవైపు నున్నగా ఉండే డైమండ్స్‌ని అతికించటం ద్వారా ఆ ఇబ్బందేమీ ఉండదు. రంగురాళ్లు, చిప్స్‌ని కూడా ఇదే పద్ధతిలో అమరుస్తారు.
ఎత్తుపళ్లు
ఎత్తుపళ్లు ఉన్నవారికి బ్రేసెస్‌తో సరిచేస్తారు. ముందుగా దంతాల నమూనా తీసుకొని, పళ్లు తొలగించకుండా సరిచేసే అవకాశాన్ని పరిశీలిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు పళ్లు తొలగించాల్సిన అవసరముంటుంది. బ్రేసెస్‌ను పళ్ల మీద అమర్చి, వాటి మధ్య నుంచి సన్నటి తీగను తొడుగుతారు. దానిని బిగించటం ద్వారా పళ్ల మీద ఒత్తిడి పెరిగేలా చేస్తారు. దీంతో క్రమంగా అవి లోపలి వైపు నెట్టుకొని వెళ్తాయి. మూడు వారాలకు ఒకసారి తీగను తిరిగి గట్టిగా బిగించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సాధారణంగా 6-8 నెలల్లో ఎత్తుపళ్లు సరి చేసుకోవచ్చు. ఎత్తుపళ్లు ఉన్నవారు చిన్నతనంలోనే బ్రేసెస్‌ వాడటం మంచిది. వీటిల్లో అవసరమైనప్పుడు తీయటానికి వీలైనవి (రిమూవబుల్‌), ఎప్పుడూ లోపలే ఉండేవి (ఫిక్స్‌డ్‌) అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పారదర్శకంగా ఉండే సిరమిక్‌ బ్రేసెస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మెటల్‌ బ్రేసెస్‌లా పైకి ఎబ్బెట్టుగా కనిపించవు.

వంకర పళ్లు: పాలపళ్లు ఊడకముందే శాశ్వతపళ్లు రావటం ప్రారంభిస్తే వంకరపళ్లకు దారి తీస్తుంది. కొంతమందికి చిగుళ్లు చిన్నగా ఉండి, పెద్ద పళ్లు రావటం, ఉండాల్సిన సంఖ్యకన్నా ఎక్కువ పళ్లు రావటం కూడా దీనికి కారణమవుతాయి. ఇలాంటివారికి ముందే ఎక్స్‌రే తీసి పరిస్థితిని గమనిస్తారు. పాలపళ్లను ముందే తీసేస్తారు. శాశ్వత పళ్లు సరిగా ఉన్నాయో లేవో చూసుకున్నాక ఎత్తుపళ్లు, వంకరపళ్లను సరిచేయటం మొదలెడతారు. వీటిని క్లిప్స్‌ (బ్రేసెస్‌) అమర్చి సరిచేస్తారు. సాధారణంగా వీటిని పళ్ల ముందే అమరుస్తారు గానీ కొందరికి వెనకవైపున కూడా అమరుస్తారు. కాకపోతే వీటి ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఎత్తుపళ్లు, వంకర పళ్లకు బ్రేసెస్‌ ఉపయోగపడకపోతే ఆపరేషన్‌ చేసి ఒకేసారి సరిచెయ్యాల్సిన అవసరం కూడా ఉంటుంది. వంకర పళ్లను దవడ ఎముక గట్టిగా ఉంటే ఏ వయసులోనైనా చేస్తారు.
ఇంప్లాంట్‌
పళ్లు విరిగినప్పుడు కొందరికి దంత మూలం కూడా దెబ్బతింటుంది. అప్పుడు ఆ మూలాన్ని పూర్తిగా తీసేసి దవడ ఎముకలో టైటానియంతో చేసిన ఇంప్లాంట్‌ బిగిస్తారు. దాని మీద క్రౌన్‌ని (కృత్రిమ పన్ను) అమరుస్తారు. దీంతో ఖాళీలు పూర్తిగా తొలగిపోయి, మిగతా పళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఇంప్లాంట్‌ దవడ ఎముకలో ఇమిడిపోయి కదలకుండా గట్టిగా ఉంటుంది. బ్రిడ్జెస్‌, కట్టుడుపళ్లతో ఎదురయ్యే ఇబ్బందులేమీ దీనిలో ఉండవు. ఒకటి, అంతకన్నా ఎక్కువ పళ్లు విరిగినవారికి.. ఎముక బలంగా ఉన్నవారికి ఇది ఉత్తమమైన పద్ధతి.

* ముందు పళ్లు దెబ్బతిన్నప్పుడు దవడ ఎముక బలంగా ఉన్నట్టయితే.. ఇంప్లాంట్‌ బిగించి, అదే రోజు లేదంటే మరునాడు క్రౌన్‌ కూడా అమరుస్తారు. దీన్నే 'ఇమ్మిడియేట్‌ లోడింగ్‌' అంటారు.

* వెనకపళ్లు దెబ్బ తిన్నవారికి దవడ ఎముక సరిగా లేకపోతే ఇంప్లాంట్‌ బిగించి, దాని మీద తాత్కాలికంగా పన్ను ఆకారం అమరుస్తారు. ఇంప్లాంట్‌ పూర్తిగా ఎముకలో స్థిరపడటానికి మూణ్నెల్లు పడుతుంది. అప్పుడు దానిపైన క్రౌన్‌ బిగిస్తారు. ఇది మధ్యవయసు వారికి, వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇంప్లాంట్‌ అనేది చాలా కష్టమైన ప్రక్రియగా భావించేవారు. ఇప్పుడు చాలా తేలికగా మారింది. కాకపోతే కొంత ఖర్చు ఎక్కువవుతుంది. మధుమేహం, బీపీ వంటి జబ్బులు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

Post a Comment

0 Comments