Full Style

>

Dog Bite , రేబిస్ (Rabies)

కుక్క కాటు
కుక్క మానవునికి ఏంతో విస్వాసమయిన పేంపుడు జన్తువు. కుక్క కాటు వలన కలిగే వ్యాధిని”రాబిస్ లేదా హైడ్రోఫోబియా” అంటారు. ఇది చాలా భయంకర మైన వైరస్-”లిస్సా వైరస్”వలన వస్తంది.

రేబిస్ (Rabies)
రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి (Hydrophobia) అని కూడా అంటారు. ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర కార్నివరస్(carnivarous) జంతువులు. జబ్బు తో ఉన్న జంతువు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తిచెందును. జంతువులలోనైనా, మనుషులలోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడము తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు (వ్యాక్షిన్) వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.

కుక్క కాటు కుక్క కాటుతల తిరగడం జ్యరంరేబిస్ వాక్షిన్ తీసుకోవడం
గాయాన్ని కడగడం
వైరస్ గురించి
ఇది ఆర్.ఎన్.ఎ. (RNA) జాతికి చెందిన ‘లిస్సా వైరస్’ సిలిండ్రికల్ ఆకారములో ఉండి 180 నానో మీటర్ల పొడవు, 75 నానో మీటర్ల వ్యాసము కలిగి ఒక చివర గుండ్రముగాను, రెండవ చివర కుంభాకరము కలిగి యుండును. దీని లైపోప్రోటీన్ లో గ్లైకోప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. వీటీనే రైబోనూక్లియో ప్రోటీన్ అంటారు, RNA చాలా ముఖ్యమైనది.

మనుషులలో వ్యాధి గుర్తించే విధానము
రేబిస్ నరాలకు, మెదడుకు సంభందించిన వ్యాధి. మెదడులో ‘ఎన్-కెఫలైటిస్’ అనే ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలుగజేయును. మిగతా ఏ వైరస్ వ్యాధి వలనైనా ఈ ఎన్కెఫలైటిస్ లక్షణాలు కనిపించవచ్చును. ఉదా. హెర్ఫీస్ వైరస్, ఎంటిరో వైరస్, ఆర్బో వైరస్, ముఖ్యముగా హెర్పెస్ సింప్లెక్ష్ టైప్ 1, వేరిసెల్లా జోస్టర్, మొదలగునవి. కొన్ని లేబొరేటరీ పరీక్షలు వలన తేడాను కనిపెట్టాలి.

వ్యాధి వ్యాపించే విధానము
ఏ క్షీరదమైనా, మానవులతో కలిపి ఈ వ్యాధికి గురి కావచ్చును. ఈ వైరస్ ఉన్న జంతువు ఇతర జంతువులను, మనుషులను కరడం వలన ఒకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించును. కొన్ని సమయాలలో గాలి లో (Aerosol) ఈ వైరస్ ఎగిరి వ్యాపించే అవకాశసమూ ఉంది. ఉదా: గనులలో పనిచేసే కార్మికులు అక్కడ తిరిగే ఈ వ్యాధివున్న గబ్బిలాల ద్వారా మనుషులకు, మ్యూకస్ పొరలద్వారా వైరస్ సోకే అవకాసముంది, కాని ఎక్కువగా గబ్బిలాలు కరడం ద్వారానే ఈ జబ్బు సోకే అవకాశము చాలా ఎక్కువ. మనుషుల నుండి మనుషులకు కరుచుట వలన, కొంతమేరకు చర్మం లేదా కార్నియా ట్రాన్స్-ప్లాంటేషన్ మరియు ముద్దుల వలన వ్యాపించే అవకాశమూ ఉంది.

ఖచ్చితమైన జబ్బుతో బాధ పడుతున్న ఏ జంతువైనా మనుషులకు కరిస్తే రేబీస్-వైరస్ బాహ్య నాడీమండలము ద్వారా కేంద్రనాడీమండలం చేరి వ్యాధి లక్షణాలు కలుగజేయును. ఇలా జరుగడానికి పట్టే కాలము 9 రోజులనుండి 90 రోజులలో జరుగును, దీనినే ఇంకుబేషన్ కాలము అంటాము. మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశముంది.

వ్యాది లక్షణాలు
ఈ వ్యాధి తో బాధపడుచున్న జంతువు లోనూ, మనుషులలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. గాభరాగా ఉండడం, తికమక పడడం(confision) మితిమీరిన భయము, భయంకరమైన చూపు, తనదైన లోకములో విహరించడం, నోటి వెంబడి లాలాజలం కారడం , గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయపడడం (Due to throat muscles Spasm) ఇతరులను చూసి భయపడి కరిచేయడం మున్నగునవి. ఈ లక్షణాలు ముదిరి, గొంతు కండరాలు పెరాలసిస్ కి గురియై మనిషి ఏమీ తినలేక కోమాలోకి వెల్లి పోయి చనిపోవును. జబ్బు లక్షణాలు కనిపించిన 2 నుండి 10 రోజులలో చనిపోవును. ఒకవేల అరుదుగా బ్రతికినా మెదడు దెబ్బతిని పిచ్చివాడుగా బ్రతుకును.

చికిత్స
వ్యాధి రాకుండా కాపాడుకోవడం (prevention) : మనుషులలోను, జంతువులలోను ఈ వ్యాధి రాకుండా టీకా మందు వేసుకొని కాపాడుకోవచ్చు. 1885 లో లూయీస్ పాచ్చర్ మరియు ఇమిలె రౌక్స్ ఈ వాక్షిన్ ని కనుగొన్నారు. దీనిని ARV (Anti Rabis Vaccine) అంటాము. దీనిని మొదట 9 సంవత్సరాల బాలుని (జోసెఫ్ మైస్టర్) పై జూలై 06 1885 లో ఉపయోగించారు.
వాక్షిన్ తయారు చేయు విధానము : రేబిస్ వైరస్ క్రిములను జంతువుల (గొర్రె) మెదడు కణాలలో ప్రయోగశాలలో పెంచి వాటిని నిర్జీవము చేసి శుద్ధిచేసి తగినటువంటి ద్రావకము లో నిలువచేసి సుబ్కుటేనియస్ గా ఇంజక్షన్ చేస్తారు. ఈ పాత వాక్షిన్ వల్ల పోస్టు వాక్షినేషన్ ఎన్కెఫలైటిస్ అనే సైడు ఎఫక్ట్ ఊన్నందున రాను రాను హూమన్ డిప్లోయిడ్ సెల్ వాక్షిన్ 1967 లో తయారవడం మొదలైనది. తరువాత చిక్ ఎంబ్రియో, డక్ ఎంబ్రియో, ఆ తరువాత వెరోసెల్ కల్చర్ ద్వార కోతి మూత్రపిండాల కణాల కల్చర్ ద్వార, పూరిఫైడ్ వెరోసెల్ రేబిస్-వాక్షిన్ తయార్వుతుంది.
ముందుగా వాక్షిన్ తీసుకోవడం : ఎక్కువగా పెంపుడు జంతువులతో గడిపేవారు, పశువైద్యులకు, పశువైద్యసిబ్బందికి, జంతుప్రదర్శన శాలలో పనిచేసేవారికి రేబిస్ ఎక్కువగా వున్న ప్రదేశాలలో తిరిగేవారికి ఇవ్వాలి. వీరోసెల్ కల్చర్ వాక్షిన్ 1వ,7వ,14వ రోజులలో 3 వాక్షిన్లు తీసుకొని, ప్రతి సంవత్సరము 1 డోసు బూస్టర్ డొసుగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదము ఉండదు.
చికిత్సా విదానము : ఈ కుక్క కాటు (ఏ జంతువైనా సరే) మూడు రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్. ఏది ఏమైనా కరిచిన చోట సబ్బుతో బాగా కడగాలి, యాంటిసెప్టిక్ లోషన్ రాయాలి. గాయము బాగా ఎక్కువైనా కుట్లు వేయకూడదు, వేసితే వైరస్ క్రిములు కుట్లు లోపల ఉండిపోయి జబ్బు ఎక్కువ అవడానికి ఆస్కారముంటుంది. రోజూ క్లీనింగ్ చేసుకోవడం మంచిది. సివియర్ కాటు అయితే గాయము చుట్టూ పాసివ్ వాక్షిన్ ఇంజక్షన్ చేయాలి. నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పిని తగ్గించే మాత్రలు వాడాలి. గాయము చీము పట్టకుండా యాంటిబయోటిక్సు వాడాలి.
వాక్షిన్ ఇచ్చే ముందు ఆయా జంతువులు లౌ 10 రోజులు నిజముగా రేబిస్ అయినదో కాదో పరిశీలనలో వుంచాలి. పూర్వపు కోనూరు ఎ.ఆర్.వి తయారుకావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ లో 5 నుండి 6 రకాల వాక్షిన్లు దొరుకుతున్నాయి.
కుక్క పిచ్చి ప్రవర్తన చూడాలి
కుక్క సొంగ కార్చుచున్నదేమో చూడాలి
కుక్కకు గజ్జి వగైరా వున్నాయేమో చూడాలి
పెంచిన కుక్కా, వూర కుక్కా అడిగి తెలుసుకోవాలి
తెలిసి ప్రతి పిచ్చి కుక్క కాటుకి పూర్తి కోర్సు ఇంజక్షన్లు వేసుకోవాలి వీరోసెల్ రేబిస్ వాక్షిన్ అయితే 0 - 3 - 7 - 14 - 28 - 90 రోజుల కోర్సు వాడాలి . ఇది IM (intramuscular) గా తీసుకోవచ్చు.

అనుమానము వున్న కుక్క కాటుకు 3 ఇంజక్షన్లు సరిపోతాయి. ఇవి 1- 7 - 14. రోజులలో తీసుకోవాలి.
వాక్షిన్ తీసికోని కేసులలో రేబీస్ వ్యాధి పూర్తిస్థాయిలో వచ్చి మనిషి చనిపోవును. ఈ వ్యాధి కి చికిత్స లేదు
ఈనాడు సుఖీభవ ఆర్టికిల్ :

ఒకసారి రేబిస్‌ బారినపడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. కాబట్టి రేబిస్‌ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదృష్టవశాత్తూ ఈ ఒక్క వ్యాధి విషయంలోనే... వైరస్‌ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా వాటిని సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబిస్‌ రాకుండా చూసుకోవటం సాధ్యమేనన్న విషయం మర్చిపోకూడదు.

రేబీస్‌ కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 55,000 మంది మరణిస్తున్నారు. వీరిలో కనీసం 20,000 మంది మన భారతదేశంలోనే మరణిస్తున్నారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అంటే కుక్కల బెడద.. మనకు ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రేబిస్‌ పిల్లుల వంటి మిగతా జంతువుల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉన్నా... రేబిస్‌ మరణాల్లో 99% కేసులకు కుక్క కాటే కారణమవుతోంది. వీరిలోనూ 15 ఏళ్లలోపు పిల్లలే ఎక్కువగా రేబిస్‌ బారినపడి మరణిస్తున్నారు.

* రేబిస్‌ ప్రధానంగా జంతువుల నుంచి మనకు సంక్రమించే 'వైరస్‌'తో వచ్చే వ్యాధి. ఈ రేబిస్‌ కారక వైరస్‌ను 'లిస్సా వైరస్‌' అంటారు. ఇది జంతువుల లాలాజలం (చొంగ)లో ఉంటుంది. ఇది మనుషుల్లోనే కాదు, జంతువుల్లోనూ రేబిస్‌ వ్యాధిని కలుగజేస్తుంది. ఈ వైరస్‌ ఒంట్లో ఉన్న జంతువులు.. ముఖ్యంగా కుక్కలు.. మనల్ని కరిచినా.. పీకినా.. మన శరీరం మీద గాయాలున్న చోట నాకినా.. దాని ద్వారా వైరస్‌ మన శరీరంలో ప్రవేశిస్తుంది. రేబిస్‌కు ఇదే మూలం.

* రేబిస్‌ వ్యాధి సాధారణంగా ఏ కుక్క కరిచినా వచ్చేది కాదు. అప్పటికే తన శరీరంలో ఈ వ్యాధి కారక వైరస్‌ ఉన్న కుక్క మనల్ని కరిచినప్పుడే ఈ సమస్య మొదలవుతుంది. అయితే అప్పటికే ఈ వైరస్‌ ఆ కుక్కలో ఉందో, లేదో చెప్పటం అంత తేలిక కాదు. చాలామంది 'పిచ్చి కుక్క' కరిస్తేనే రేబిస్‌ వస్తుందని భావిస్తుంటారుగానీ ఈ వైరస్‌ అప్పటికే దాని ఒంట్లో ఉన్నా.. దాని ప్రవర్తన మారిపోయి, పిచ్చి కుక్కలా తయారవ్వాలనేం లేదు. కాబట్టి వూరకుక్కల వంటివి ఏవి కరిచినా మన జాగ్రత్తలు మనం తీసుకోవటం మేలు. పెంపుడు కుక్కలకు ఇప్పటికే టీకాలు వేయించినా.. అవి కరిచినప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవటమే ఉత్తమం.

* ఈ వైరస్‌ మన ఒంట్లో ప్రవేశించిన తర్వాత రేబిస్‌ వ్యాధి 1-3 నెలల్లోపు ఎప్పుడైనా రావచ్చు. అయితే కొందరిలో మొదటి వారంలోపే రావచ్చు.. కొందరికి ఏడాది తర్వాతా రావచ్చు. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవటం అవసరం.

కుక్క కరిచింది! ఏం చెయ్యాలి?
* కుక్క నుంచి మనకు రేబిస్‌ వ్యాధి కారక వైరస్‌ సంక్రమించి ఉంటే.. ఆ వైరస్‌ నాడులను చేరుకుని.. గంటకు 3 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ మన మెదడును చేరి.. క్రమేపీ రేబిస్‌ లక్షణాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కరిచిన 'తక్షణం'.. లేదంటే 'సత్వరం'.. ఆ వైరస్‌ నాడులను చేరక ముందే.. చికిత్స ఆరంభించటం ఉత్తమం.

* కుక్క కాటు విషయంలో మన కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ ప్రత్యేకంగా జాతీయ మార్గదర్శకాలను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మార్గదర్శకాలను వెలువరించింది. వీటి ప్రకారం గాయాలను తీవ్రత దృష్ట్యా చికిత్సా విధానాన్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు.

1. మొదటి రకం: కుక్కకు ఆహారం పెట్టేటప్పుడో.. ఇతరత్రా సమయాల్లోనో మన చేతికి కేవలం కుక్క కోరలు తగలటం.. లేదా పుండ్లు, పగుళ్ల వంటివేవీ లేని మన చర్మం మీద కుక్క నాకటం వంటివి జరిగితే.. దాని గురించి ప్రత్యేకంగా ఎటువంటి ఆందోళనా అవసరం లేదు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

2. రెండవ రకం: రక్తస్రావం లేకుండా కేవలం పైపైన గీరుకుపోవటం, పైచర్మం తోలు లేచిపోవటం వంటివి జరిగితే.. దీనికి వెంటనే పద్ధతి ప్రకారం పుండును శుభ్రం చేయటం, యాంటీ రేబిస్‌ టీకాలు తీసుకోవటం ముఖ్యం.

3. మూడవ రకం: కోరలు దిగిపోవటం, చర్మం చీరుకుపోవటం, రక్తం వస్తూ గాయాలవ్వటం లేదా మన శరీరం మీద ఉన్న పుండ్లను కుక్క నాకటం, మన గాయాలకు కుక్క చొంగ తగలటం.. ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణించాలి. దీనికి 1. పుండును పద్ధతి ప్రకారం శుభ్రం చెయ్యాలి. 2. వెంటనే 'రేబిస్‌ ఇమ్యునోగ్లోబ్యులిన్లనే' ప్రత్యేక టీకాలు ఇవ్వాలి. 3. యాంటీ రేబిస్‌ టీకాలూ పూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి తీవ్రమైన గాయాలకు ఈ మూడు చర్యలూ ముఖ్యమే!
ఇవీ స్పష్టమైన మార్గదర్శకాలు. రేబిస్‌ రాకుండా నివారించుకునేందుకు వీటిని కచ్చితంగా పాటించాల్సిందే.
పుండు కడగటం
కరిచిన లేదా గీరిన గాయం ద్వారానే రేబిస్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కుక్కకు సంబంధించిన లాలాజలం, ఆ చొంగ తాలూకూ అంతా పోయేలా శుభ్రంగా కడగటం ముఖ్యం. గాయం దగ్గర వైరస్‌ చాలాకాలం జీవించి ఉంటుంది, అక్కడ తన సంతతిని పెంచుకుంటుంది కాబట్టి కరిచిన వెంటనే.. లేకపోతే ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు గాయాన్ని- కనీసం 10-15 నిమిషాల పాటు ధారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో, సబ్బుతో కడగాలి. గాయాన్ని నేరుగా మన చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు వేసుకుంటే మేలు. ఒకవేళ కుక్క కరిచిన తర్వాత రోగి ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చినా.. అప్పుడైనా శుభ్రంగా కడగాలి. గాయాన్ని పొడిగా తుడిచి బిటడిన్‌, డెట్టాల్‌, శావలాన్‌ వంటి యాంటీసెప్టిక్‌ లోషన్లు రాసి వదిలెయ్యాలి. గాయం పెద్దగా ఉన్నా సాధ్యమైనంత వరకూ కుట్లు వేయకూడదు. తప్పనిసరిగా వెయ్యాల్సి వస్తే వదులుగా వెయ్యాలి. తర్వాత- ధనుర్వాతం రాకుండా 'టీటీ' ఇంజక్షన్‌, గాయం మానటానికి యాంటీబయాటిక్స్‌ వంటివి ఇస్తారు.
ఇమ్యూనోగ్లోబ్యులిన్లు
* కుక్కకాటు గాయం తీవ్రంగా (మూడో రకం) ఉంటే ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఇంజక్షన్లను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. రేబిస్‌ రాకుండా తక్షణం అడ్డుపడే కీలకమైన 'రడీ మేడ్‌' యాంటీబోడీలివి. దీనిలో రెండు రకాలున్నాయి. ఒకటి- గుర్రాల నుంచి తయారు చేసినవి. వీటినే 'ఈక్విన్‌ రేబిస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్‌' అంటారు. రెండోది- మనుషుల నుంచి తయారు చేసినవి. వీటిని 'హ్యూమన్‌ రేబిస్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్‌' అంటారు. గుర్రాలవి అయితే మనిషి బరువును బట్టి కేజీకి 40 ఇంటర్నేషనల్‌ యూనిట్ల చొప్పున గరిష్ఠంగా 3000 ఐయూ వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మనుషుల నుంచి తీసిందైతే రోగి బరువు కేజీకి 20 ఐయూ చొప్పున గరిష్ఠంగా 1500 ఐయూ వరకూ ఇవ్వాల్సి ఉంటుంది.

* రోగి బరువును బట్టి ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ల డోసు లెక్కించి.. సాధ్యమైనంత ఎక్కువగా కరిచిన గాయం చుట్టూ, ఆ ప్రాంతంలో ఇంజెక్షన్ల రూపంలో ఇచ్చెయ్యాలి. ఇంకా డోసు మిగిలితే కండలోకి ఇంజెక్షన్‌ చెయ్యచ్చు. ఒక్కోసారి కుక్క కరిచిన గాయాలు బాగా పెద్దగా, ఎక్కువ సంఖ్యలో ఉంటే.. ఈ మందును సెలైన్‌తో 2, 3 రెట్లు పల్చన చేసి.. గాయాల చుట్టూ ఇవ్వటం మంచిది. రోగి బరువుకు మించిన డోసు మాత్రం ఇవ్వకూడదు.

* ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్లు అభయ్‌రిగ్‌, ఈక్విరాబ్‌, ర్యాబ్‌గ్లోబ్‌, బెరీరాబ్‌, ఇమోగాబ్‌రేబిస్‌ వంటి పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటి ఖరీదు ఎక్కువే ఉంటుంది. అయినా రేబిస్‌ రాకుండా నిరోధించటంలో ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్ల పాత్ర చాలా చాలా కీలకం. వీటివల్ల తక్షణం మన శరీరానికి రక్షణగా 'రెడీ మేడ్‌ యాంటీబోడీలు' లభ్యమవుతాయి. ఇక దీర్ఘకాలంలో మన శరీరమే యాంటీబోడీలు తయారు చేసుకునేలా చూసేందుకు వెంటనే 'యాంటీ రేబిస్‌ టీకాలు' కూడా మొదలుపెట్టాల్సి ఉంటుంది.
యాంటీ రేబిస్‌ టీకాలు
కుక్క కాటు గాయం ఓ మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్నవారందరికీ (రెండు, మూడు రకాలు) ఈ యాంటీరేబిస్‌ టీకాలు ఇవ్వటం అవసరం. 'సెల్‌ కల్చర్‌' విధానంలో మనుషులు, బాతులు, కోడిపిల్లల వంటివాటిలోతయారు చేసే ఈ టీకాలు వెరోరాబ్‌, రాబిపుర్‌, అభయ్‌రాబ్‌, వెరోరాక్స్‌, వోరాబ్‌ వంటి పేర్లతో దొరుకుతున్నాయి. వీటి డోసులు, ఇచ్చే పద్ధతి అన్ని వయస్సుల వారికీ ఒకే తీరులో ఉంటుంది. వీటి ఖరీదు కొంత ఎక్కువే. ఈ ఇంజక్షన్లు కండలోకి (ఐఎం) చేస్తే ఎక్కువ మోతాదు అవసరమవుతోంది. అదే ఈ టీకాలను కేవలం చర్మంలోకి ఇ (ఇంట్రా డెర్మల్‌-ఐడీ) ఇస్తే తక్కువ డోసుల్లో, అంతే సమర్థంగా పని చేస్తున్నాయని గుర్తించారు. ఇప్పుడు మన భారతీయ మార్గదర్శకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ చర్మంలోకి ఇచ్చే ఇంజక్షన్లను సమర్థిస్తున్నాయి.

* ఎలా ఇస్తారు: కండలోకి ఇంజక్షన్లు ఇస్తుంటే కరిచిన రోజున లేదా వైద్యుల వద్దకు వచ్చిన రోజున ఒకటి, అక్కడి నుంచి 3, 7, 14, 28 రోజుల్లో- మొత్తం ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని పిర్ర/తుంటి కంటే చేతులకు ఇవ్వటం మేలు. పసిపిల్లలకైతే తొడలకు మేలు. హెచ్‌ఐవీ వంటి ఇతరత్రా సమస్యలున్న వారికి 90వ రోజున కూడా మరో డోసు ఇవ్వాలి.

* ఈ టీకాలు కండలోకి కాకుండా చర్మంలోకే ఇస్తుంటే- చాలా తక్కువ డోసే సరిపోతుంది. దీనివల్ల ఖరీదు చాలా తగ్గిపోతుంది. ఇలా చర్మంలోకి ఇవ్వటం కోసం వెరోరాబ్‌, రెబిపుర్‌, అభయ్‌రాబ్‌ టీకాలను ఇప్పటి వరకూ ఆమోదించారు. వీటిని రోగి వచ్చిన వెంటనే 0.1. ఎంఎల్‌ చొప్పున రెండు చేతులకు రెండు ఇంజక్షన్లు చెయ్యాలి. తర్వాత 3, 7, 28 రోజుల్లో కూడా ఇలాగే రెండు చేతులకూ ఇదే డోసులో చెయ్యాలి. ఇందుకోసం సన్నగా ఉండే 'ఇన్సులిన్‌' సిరంజిలు వాడొచ్చు.

* చర్మంలోకి ఇంజక్షన్‌ ఇచ్చే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. సూదిని చర్మం కిందకు కొద్దిగా గుచ్చి.. ఇంజక్షన్‌ ఇచ్చినప్పుడు అక్కడ లోపల మందు చిన్న బుడిపెలా ఉబ్బినట్టు కనబడుతుంది. మరీ లోతుగా ఇస్తే ఇలా కనబడదు. అలా బుడిపె రాకపోతుంటే.. వెంటనే సూది తీసి మళ్లీ తేలికగా గుచ్చి ఇంజక్షన్‌ చెయ్యాలి. ఇలా చర్మంలోకే ఇంజక్షన్‌ చెయ్యటం వల్ల చాలా తక్కువ డోసు ఇస్తేనే పూర్తి సమర్థంగా పని చేస్తున్నట్టు స్పష్టంగా నిర్ధారించుకున్నారు. కాబట్టి ఇప్పుడీ విధానాన్ని మనం విరివిగా ఉపయోగించుకోవటం లాభదాయకం.
బొడ్డు టీకాల్లేవు!
కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేస్తారనే భయం చాలామందిలో ఉంటోంది. ఒకప్పుడు ఇలా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు ఇచ్చిన మాట నిజమే. ఈ రకం టీకాలను 'నెర్వస్‌ టిష్యూ వాక్సీన్లు' అంటారు. ఖరీదు తక్కువే అయినా వీటితో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ కావటంతో చాలా దేశాల్లో వీటిని వాడటం లేదు. మన దేశంలో కూడా 2004 డిసెంబరు నుంచీ వీటి తయారీ నిలిపివేశారు. ప్రస్తుతం వాడకంలో ఉన్న రాబిపూర్‌ వంటి చిక్‌/డక్‌ ఎంబ్రియో వాక్సీన్లు సురక్షితమైనవి. వీటిని బొడ్డు దగ్గర చెయ్యాల్సిన పని లేదు. చేతులకు, పిర్రలకు, కరిచిన చోట మాత్రమే చేస్తారు.
ఆకు మందులు లేవు
చాలామంది కుక్క కరిచిన చోట గాయం మీద పసుపు, కారం, నూనె, సున్నం, ఉప్పు, మన్ను, నిమ్మరసం.. ఇలా ఏదో ఒకటి చల్లుతుంటారు. కానీ ఇలా చెయ్యకూడదు. కాల్చటం, యాసిడ్‌ పొయ్యటం వంటివీ తప్పే. వీటివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. గాయాన్ని 10-15 నిమిషాల పాటు ధారగా పరిశుభ్రమైన నీటితో కడగటం, సబ్బుతో సున్నితంగా రుద్ది శుభ్రం చేయటం, పొడిగా ఆరిన తర్వాత దాని మీద డెట్టాల్‌, బిటడిన్‌, శావలాన్‌ వంటి యాంటీసెప్టిక్‌ ద్రావణాలు రాయటం ముఖ్యం. రేబిస్‌ రాకుండా ఆకు పసర్లు, చెట్ల మందుల వంటివేవీ లేవు. అవేవీ రేబిస్‌ను నిరోధించలేవు. రేబిస్‌ రాకుండా సత్వరమే, క్రమ పద్ధతిలో టీకాలు తీసుకోవటం ఒక్కటే సమర్థ మార్గం.
గర్భిణులకూ సురక్షితం
కుక్క కరిచినప్పుడు... గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, వృద్ధులు, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు.. ఎవరైనా ఈ టీకాలు తీసుకోవచ్చు. ఇవి సురక్షితమైనవి.

* హెచ్‌ఐవీ వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిని కుక్క కరిచినప్పుడు.. కాటు ఓ మోస్తరుగానే (రెండో రకం) ఉన్నా.. వారికి పూర్తికోర్సు యాంటీ రేబిస్‌ టీకాలతో పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్లూ ఇవ్వటం అవసరం.

* పెంపుడు కుక్కలు, పిల్లుల వంటివాటికి ముందే టీకాలు వేయించటం మంచిది. అయితే ఇలా వాటికి టీకా ఇప్పించినా అవి కరిస్తే మనకు రేబిస్‌ రాదని నిశ్చింతగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే రకరకాల కారణాల రీత్యా ఆ టీకా వాటిలో సమర్థంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఏ కుక్క కరిచినా గాయం తీవ్రతను బట్టి టీకాలు తీసుకోవటం ఉత్తమం.

* మనల్ని కరిచిన కుక్క లేదా పిల్లిని ఆ తర్వాత కూడా గమనిస్తూ ఉండాలి. పది రోజుల తర్వాత కూడా ఆరోగ్యంగానే తిరుగుతుంటే మనం టీకాలు మానెయ్యచ్చు. అయితే వూర కుక్కలు కరిస్తే మాత్రం టీకాలను పూర్తిగా కొనసాగించటమే ఉత్తమం.

Post a Comment

0 Comments