భయం కూడా ఓ జబ్బే , Phobia is also a Disease- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
క్షణ క్షణం భయం.. భయంగా చాలా మంది గడుపుతుంటారు. ప్రతిదానికి ఏదో భయం వారిని పీడిస్తుంటుంది. మాకు తెలిసిన ఒక కుర్రాడు నవీన్. బి.టెక్ పాసయ్యాడు. మంచిర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని మల్టీ నేషనల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. స్టేషన్ వరకు వెళ్ళి రైలు ఎక్కడానికి భయపడి ప్రయాణం రద్దు చేసుకున్నాడు. దూరప్రాంతాలలో ఉద్యోగం చేస్తే రైలు ఎక్కాల్సి వస్తుందన్న భయంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఉన్న ఊరిలోనే చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకున్నాడు.
వైదేహి అమెరికాలో ఎం.ఎస్. చేసింది. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించింది. పెద్దల బలవంతంమీద అక్కడే ఉద్యోగం చేస్తున్న తెలుగువారి అబ్బాయిని పెళ్ళి చేసుకుంది. మొదటి రాత్రి విపరీతంగా భయపడి విచిత్రంగా ప్రవర్తించింది. మానసిక వైద్యునికి చూపిస్తే ఆమె పానిక్ డిజార్డర్ (కారణం లేని భయం)తో బాధ పడుతున్నట్టు చెప్పాడు. దీంతో భర్త ఆమెను ఒదిలిపెట్టేశాడు.
భయాలు పలురకాలు : ఉదాహరణ ->
ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.
ఏక్రోఫోబియా (Acrophobia) : ఎత్తైన ప్రదేశాలంటే భయం
క్లాస్ట్రోఫోబియా (Claustrophobia): ఒంటరితనం అంటే భయం.
నెక్రోఫోబియా (Necrophobia) : చావు అంటే భయం
పైరోఫోబియా (Pyrophobia) : అగ్గి అంటే భయం
హీమోఫోబియా (Hemophobia) : రక్తం అంటే భయం
హైడ్రోఫోబియా (Hydrophobia) : నీరు అంటే విపరీతమైన భయం
భయం మనిషి సహజ లక్షణం. ప్రమాదకర వ్యక్తులు, జంతువులు, సంఘటనలు ఎదురైనప్పుడు ప్రతివారు భయపడతారు. అయితే కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా భయపడుతూ ఉంటారు. ‘‘క్షణక్షణం భయం భయం… బ్రతుకంతా చీకటిమయం’’ అన్నట్టు వ్యవహరిస్తుంటారు. పులికంటె గిలి (భయం) ప్రమాదమన్నట్టు చిన్న విషయాలకే వణికి పోతుంటారు.
మరణం మనిషికి ఒకసారి వస్తే అనవసర భయస్తులు ప్రతి నిత్యం చచ్చి బ్రతుకుతుంటారు. ప్రాణాంతక వ్యాధుల కంటే భయం ఎక్కువగా బాధిస్తుంటుంది. మనిషిలో స్వతహాగా ఉండే శక్తియుక్తుల్ని, మేధా సంపత్తిని భయం విచ్ఛిన్నం చేస్తుంది. అన్నిటికీ అవరోధంగా మారుతుంది.
కాదేదీ కవిత్వకనర్హం అన్నమాట భయానికి వర్తిస్తుంది. బల్లి, నల్లి, గాలి, నీరు లాంటి చిన్నచిన్న విషయాలకు భయపడేవారున్నారు. భయం వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వైఫల్యం చెందుతామన్న భయం విజయానికి అవరోధంగా మారుతుంది. లక్ష్య సాధనకు అడ్డంకిగా పరిణమిస్తుంది. ఆరోగ్యంపట్ల పెంచుకునే భయం లేని జబ్బులను గూర్చి ఆలోచింపచేస్తుంది. మరణభయం ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. నష్టాలను గూర్చిన భయం ఆందోళనకు దారి తీస్తుంది.
భయాలన్నింటికంటే అపజయం పాలవుతామన్న భయం ప్రగతికి అవరోధంగా నిలుస్తుంది. ప్రతికూల భావాలను పెంచి పోషిస్తుంది. అధిక శాతం విద్యార్థులు పరీక్షలంటే భయపడుతుంటారు. ఈ భయం ముదిరి డిప్రెషన్, ఆత్మహత్యలకు దారి తీస్తుంటుంది. అలాగే ఒక్కో విద్యార్థి ఓక్కో సబ్జెక్టును చూసి భయపడుతుంటారు. ఇలాంటి భయం వారి ఉన్నత చదువులకు అడ్డంకిగా మారుతుంది. లెక్కల భయం ఇంజనీరుని కానివ్వదు. కప్పలు, పాములను కోయాల్సి వస్తుందన్న భయం మెడిసన్ చదవనివ్వదు. ఈ భయం ముదిరితే ఫోబియగా మారుతుంది.
నిజానికి భయం, ధైర్యం లాంటివి అలవాటుగా వస్తాయి. చిన్నప్పటి నుంచి పెంచుకున్న నమ్మకాలు, విశ్వాసాలు, అనుభవాలే ఇందుకు మూలలుగా ఉంటాయి. పెంపకలోపం, పరిసరాల ప్రభావం భయాన్ని పెంచి పోషిస్తాయి. కొంతమంది బాల్యపు అనుభవాలవల్ల భయానికి గురవుతారు. అధిక శాతం మందిలో తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలే భయాన్ని రేకెత్తిస్తుంటారు. బాల్యంలో అన్నం తినని పిల్లల్ని బూచోడు వస్తాడు అంటూ భయపెడతారు. అల్లరి చేస్తే స్కూలుకు పంపేస్తా. హాస్టల్లో పడేస్తా… డాక్టర్‌చేత సూది వేయిస్తా అంటూ భయపెడుతుంటారు. సైకిల్ తొక్కాలంటే పడిపోతావని, ఈత నేర్చుకోవాలంటే మునిగిపోతావని భయాన్ని రుద్దుతారు. అలాగే ప్రతికూలంగా మాట్లాడి పిల్లల్లో పిరికిమందు పోస్తుంటారు. మా బాబుకి ఎక్కాలే రావు. వాడు ఇంజనీరింగ్ ఏమి చేస్తాడు అంటూ ఇతరుల ముందు హేళన చేస్తారు. అలాగే మా అమ్మాయి బొద్దింక అంటే ఆమడ దూరంలో ఉంటుంది. ఇక డాక్టర్ కోర్సు ఎలా చేస్తుందంటూ ఆట పట్టిస్తుంటారు. ఇలాంటి మాటలు పిల్లలను భయస్తులుగా మారుస్తాయి. చాలామంది తల్లిదండ్రులు భయపెడితే బాగుపడతారని ఆలా చేస్తుంటారు. భయపెట్టడానికి జాగ్రత్త పర్చడానికి తేడా తెలియక అలా చేస్తుంటారు.
అయితే భయాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. భయం, ఫోబియాలకు గురయ్యేవారు వాస్తవాలను ఆలోచించాలి. మిగిలిన వారికి లేని భయం తమకే ఎందుకుందో విశే్లషించుకోవాలి. సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. నెమ్మది, నెమ్మదిగా భయాన్ని ఎదుర్కోవడంలో సాధన చేయాలి. అవసరమైతే సైకాలజిస్టుల సహాయం పొందాలి.
0 Comments