నిమ్ము , న్యుమోనియా, Pneumonia-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సాధారణంగా ఎవరికైనా దగ్గు, కఫం వస్తుంటే నిమ్ము చేసిందని అంటూ ఉంటాము. ఇలా నిమ్ము చేయడాన్ని వైద్యపరిభాషలో న్యుమో నియా అంటారు. న్యుమోనియా శ్వాసకోశాలకు వచ్చే ఒక ఇన్ ఫెక్షన్. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధి .
కారణాలు
న్యుమోనియా వ్యాధి వైరస్, బాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవాల వలన కలుగుతుంది. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలితో పాటుగా ఈ సూక్ష్మజీవులు మన శరీరాల్లోకి చేరుతాయి. అయితే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే యాంటిబాడీస్, తెల్ల రక్త కణాలు వీటిని నిర్వీర్యం చేసి శరీరానికి రక్షణ కలిగి స్తుంటాయి. శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాటి తీవ్రత ఎక్కువగా ఉన్నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి వాటిని ఎదుర్కొనలేకపోవచ్చు. కొంతమందిలో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం, లేదా కొన్ని రకాల వ్యాధుల వలన ఈ శక్తి సన్నగిల్లడం జరుగుతుంది.
ధూమపానం చేసే వారిలో, మద్యం తీసు కునే వారిలో, సమతులాహారం తీసుకోని వారిలో, మధుమేహం, హెచ్‌ఐవి, కేన్సర్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారిలో కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.వీరందరిలో న్యుమోనియా వచ్చే అవకాశాలు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. సాధారణంగా రెండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులలో న్యుమోనియా రావడానికి పైన పేర్కొన్న అంశాలే కారణమవుతాయి. వీరంద రిలో న్యుమోనియా తరచుగా వచ్చే అవకాశాలు న్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి రావచ్చు.
జలుబు చేసిన తరువాత కొందరిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. న్యుమోనియా సోకిన తరువాత ఒకటి రెండు వారాలు బాధిస్తుంది. ఆ సమయంలో తీవ్రంగా ఉన్న సూక్ష్మజీవులతోపాటు, తీవ్రత తక్కువగా ఉన్న సూక్ష్మజీవులు కూడా తమ ప్రతాపాన్ని కనబరుస్తాయి.చిన్న పిల్లలలో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వి), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వలన వచ్చే జలుబు, దగ్గు తరువాత న్యుమోనియా తరచుగా వస్తుంటుంది.సహజంగా ప్రతివారికి ముక్కులోనూ, గొంతు, నోటిలో ఉండే సూక్ష్మజీవులు ఎలాంటి వ్యాధి కలుగజేయవు. అయినా కొన్ని సందర్భాలలో మాత్రం న్యుమోనియాను కలుగజేస్తాయి.
-యాస్పిరేషన్ వలన గొంతులో క్రిమి శ్వాసకోశాల లోకి ప్రవేశిస్తే అది న్యుమోనియాను కలుగ జేస్తుంది. మత్తు పదార్థాలు, ఆల్కహాల్ సేవనం వంటి అలవాట్లుఉన్న వారిలో, మెదడుకు సంబంధించిన వ్యాధి లేదా దెబ్బలు తగిలిన వారిలో స్పృహ తప్పడం వలన గొంతులో ఉండే పదార్థాలు శ్వాసకోశాల్లోకి చేరుతాయి. పలితంగా యాస్పిరేషన్ న్యుమోనియా సోకుతుంది.న్యుమోనియాను కలిగించే కారణాలనుబట్టి దీనిని వైరల్ న్యుమోనియా, బాక్టీరియల్ న్యుమోనియా, ఫంగల్ న్యుమోనియా అని వ్యవహరిస్తారు. వీటిలో సాధారణంగా కనిపించేది, ప్రమాదకరమైనది బాక్టీరియల్ న్యుమోనియా.
లక్షణాలు
చలితో కూడిన జ్వరం, దగ్గు, కఫం, ఛాతీలో నొప్పి సాధారణంగా ఉంటాయి.కొందరిలో దగ్గుతోపాటు రక్తం కూడా పడవచ్చు. కొంతమందిలో కఫం చిక్కగా, కొందరిలో పలుచగా పడవచ్చు. కొంతమందిలో కొద్దిగానే కఫం పడితే, ఇంకొంతమందిలో అరగ్లాసు, గ్లాసు వరకూ కూడా పడవచ్చు. కఫం రంగు ఎరుపుగా కానీ, పసుపుగా కానీ, ఆకు పచ్చగా కానీ ఉండవచ్చు.కొంతమందిలో కఫం దుర్వాసనతో కూడి ఉండవచ్చు. వీటినిబట్టి కొంత వరకూ వ్యాధి కారక కారణాలు కనుగొనవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు రక్తం ద్వారా ఇతర అవయవాలకు పాకే అవకాశం ఉంది. దీనిని బాక్టీరీమియా, సెప్టిసీమియా అంటారు. వీటి వలన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర అవయవాల్లోకి ఇన్‌ఫెక్షన్ పాకే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ
రక్త పరీక్షలో తెల్ల రక్త కణాల సంఖ్య, ఇఎస్‌ఆర్ వంటి వాటి వలన వ్యాధి ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. అలాగే వ్యాధి తీవ్రతను కూడా తెలుసు కోవచ్చు. కొన్ని సందర్భాలలో వరుసగా చేసే ఈ పరీక్షల్లో వ్యాధి తగ్గుముఖం పట్టిందా? లేదా? అనే విషయం కూడా తెలుస్తుంది.బ్లడ్‌కల్చర్, కళ్లె పరీక్ష, ఛాతి ఎక్స్‌రే, ఛాతికి సిటి స్కాన్, బ్రాంకోస్కోపీ వంటి పరీక్షలలో వ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను గుర్తించడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా అంచనా వేయగలుగుతాము. కఫంలో కనిపించే క్రిములను గుర్తించి, వాటికి తగిన మందు లను ఇవ్వడం అవ సరం. దీనికి కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే పరీక్ష తప్పనిసరి. కొన్ని సందర్భాలలో వ్యాధి కారకాలను సరిగ్గా గుర్తించలేకపో యినప్పటికీ, వైద్యుని అనుభవంపైనే సరైన మందులు ఇవ్వవలసి ఉంటుంది.
చికిత్స
ఆరోగ్యవంతుల్లో వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్ న్యుమోని యాకు, ఆసుపత్రుల్లో వచ్చే హెల్త్ కేర్ అసోసియేటెడ్ న్యుమోనియాకు, హాస్పిటల్ అక్వైర్డ్ న్యుమోనియాకు వాటిని కలిగించే కారకా లకనుగుణంగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే, ఇంజెక్షన్ల రూపంలో యాంటిబయాటిక్స్‌ను ఇవ్వవలసి ఉంటుంది. కనీసం 7 - 10 రోజులపాటు మందులను వ్యాధిని నియంత్రించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐవి ఫ్లూయిడ్స్, ఆక్సిజన్ కూడా అవసరమవుతాయి.సరైన సమయంలో వైద్య సహాయం అందక పోతే, పలు దుష్ప్రభావాలు చోటు చేసుకుం టాయి. శ్వాసకోశాల్లోని న్యుమోనియా చీముగా మారడం, ఛాతీలో చీము చేరడం, మెదడు తదితర అవయవాల్లోకి చేరడం జరుగవచ్చు. సెప్సిస్ వలన వివిధ అవయవాలు దెబ్బ తినవచ్చు. కొంతమందిలో అక్యూట్ లంగ్ ఇంజ్యూరీ (ఎఎల్‌ఐ) కూడా వచ్చే ప్రమాదం ఉంది.తొలిదశలోనే వ్యాధిని సరిగ్గా గుర్తించి సరైన వైద్య సలహాను పాటిస్తే, తరువాత జరిగే దుష్పరిణామాలను నివారించవచ్చు.
0 Comments