Full Style

>

ముందే రుతుచక్రం,ప్రికాషియస్‌ ప్యూబర్టీ,Precocious puberty



ముందే రుతుచక్రం,ప్రికాషియస్‌ ప్యూబర్టీ,Precocious puberty- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

    వయసుకు తగ్గట్టుగా శారీరక మార్పులు జరిగితేనే ఆనందం. రుతు చక్రానికీ ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు మొదలవ్వాల్సిన రుతుక్రమం పదేళ్లలోపే వచ్చేస్తే... దానిని ఓ సమస్యగానే భావించాలి. అవగాహనతో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

అమ్మాయి... బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు సహజం. ముఖ్యంగా ఎముకలూ, కండరాల ఎదుగుదలా, శరీర ఆకృతిలో తేడా, సంతానోత్పత్తికి అనువుగా మరికొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నిటితో పాటూ రుతుచక్రం కూడా సాధారణంగా వచ్చే మార్పే. ఇది పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో పదేళ్ల వయసుకి ముందే రుతుచక్రం మొదలవడం ఎక్కువవుతోంది. ఈ పరిస్థితిని 'ప్రికాషియస్‌ ప్యూబర్టీ' అంటున్నాం. మూడు నాలుగేళ్ల ముందుగానే ఇలా జరగడానికి ఇవీ కారణాలని స్పష్టంగా చెప్పలేం! కానీ కొన్ని రకాల సమస్యలు ఆ పరిస్థితికి దారితీస్తున్నాయని అధ్యయన కర్తలు చెబుతున్నారు.

యౌవన మార్పులంటే...
ఆడపిల్ల రజస్వల అవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు బాల్యం నుంచి యౌవనంలోకి అడుగుపెట్టే సమయంలో శారీరకంగా ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకోవాలి. మెదడులో ఈ ప్రక్రియ మొదలై గోనాడోట్రోఫిన్‌ హార్మోను విడుదలవుతుంది. అది పిట్యూటరీ గ్రంథికి చేరి ఎల్‌హెచ్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ రెండూ అమ్మాయిల్లో శారీరక మార్పులు జరిగేందుకు తోడ్పడే ఈస్ట్రోజెన్‌ను అండాశయాల్లో
విడుదలయ్యేలా చేస్తాయి. అప్పట్నుంచి శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ తరవాతే నెలసరి వస్తుంది.

ఇన్‌ఫెక్షన్లు లేదా కణుతులు కావచ్చు..
కొన్నిసార్లు ఎలాంటి సమస్యలూ, లోపాలూ లేకుండానే రుతుచక్రం ముందుగా వచ్చేయవచ్చు. మరికొన్ని సార్లు మెదడు లేదా వెన్నెముకలో కణితి ఉండటం, అమ్మాయి పుట్టే సమయంలో మెదడులో నీరు చేరి కణితిగా మారడం, మెదడూ వెన్నెముకపై రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండటం, వాటికి గాయాలవడం కూడా అందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. తక్కువ మందిలో కావచ్చు కానీ జన్యు పరమైన సమస్యలూ అందుకు కారణం అవుతాయి.

వీటిల్లో ఎముకలూ, చర్మం రంగుని ప్రభావితం చేసే జన్యు సమస్య 'మెక్‌క్యూన్‌ ఆల్‌బ్రైట్‌ సిండ్రోమ్‌' ఒకటి. దీనివల్ల హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అడ్రినల్‌, పిట్యూటరీ గ్రంథులూ, అండాశయాల్లో లోపాల వల్లా శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోను త్వరగా విడుదలవుతుంది. ఇన్‌ఫెక్షన్లూ, హార్మోన్ల పనితీరులో తేడా, హైపో థైరాయిడిజం వల్ల కూడా రుతుచక్రం ముందే వచ్చేయవచ్చు. వయసూ, శరీరాకృతికి తగినట్లు సరైన బరువు లేకపోయినా సమస్యే. పీలగా
కనిపించే వారిలో రుతుక్రమం త్వరగా వచ్చేస్తుంది. సెక్సు హార్మోనుగా పరిగణించే ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టీరాన్‌లను కొన్ని సమస్యలకు మాత్రల రూపంలో తీసుకోవడం వల్ల కూడా ముందే రుతుక్రమం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అండాశయాల్లో ఉండే కణుతులు, సిస్ట్‌లు కూడా ఈ మార్పును  తీసుకురావచ్చు. పిల్లలు జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తినడం, అది పడకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమే అని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

లక్షణాలను గుర్తించవచ్చు...
అంతగా వూహ తెలియని వయసులో రుతుక్రమం మొదలు కావడంతో చాలామంది అమ్మాయిలు భయపడతారు. రొమ్ముల పెరుగుదల, మొటిమలు రావడం, చేతులు కింద వెంట్రుకలు రావడం వంటివి అర్థం కాక అయోమయానికి గురవుతారు. అదీకాక తమ వయసు వారి కన్నా ముందే గబగబా పొడవు పెరుగుతారు. ఎముకలు కూడా త్వరగా పరిణతి చెందుతాయి. అయితే రుతుక్రమం మొదలై కొన్నాళ్లు గడిచేప్పటికి ఆ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. దాంతో కొన్నేళ్ల తరవాత చూసుకొంటే వయసుకు తగిన పొడవు ఉండరు. ఈ మార్పుల్ని పట్టించుకుని తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే
వయసుకు తగిన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న వయసులో రుతుక్రమం  మొదలైన అమ్మాయిల్లో తోటి వారితో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవడం, అది ఒత్తిడికి దారితీయడం, చురుగ్గా లేకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో తల్లి పాత్ర ఎంతో కీలకం. శరీర నిర్మాణం, రుతుక్రమం రావడం గురించి అమ్మాయికి వివరించాలి. కొన్నేళ్లు ముందు రావడం సమస్య కాదనీ, అలా జరుగుతుంటుందనీ చెప్పాలి. స్కూల్లో, చుట్టు పక్కల వాళ్లు ఆటపట్టించినా, ఏదయినా మాట అన్నా ఆత్మన్యూనతకు గురికాకుండా సర్ది చెప్పాలి. ఈ విధంగా ముందుగా మెచ్యూర్‌ అయిన వాళ్లపై టీవీ, నెట్‌ ఆకర్షణల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్నాళ్లు రాకుండా..
చిన్నవయసులోనే రుతుక్రమం మొదలైనప్పుడు లేదా అంతకన్నా ముందే ఆ లక్షణాలను గుర్తించడానికి వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తారు. అమ్మాయి చేయి, మణికట్టును ఎక్సరే తీసి ఎముక వయసును గుర్తిస్తారు. ఎముకల ఎదుగుదల ఎంత వేగంగా ఉంది అన్న దాన్నిబట్టి హార్మోన్ల పనితీరుని తెలుసుకుంటారు. అలాగే రక్తపరీక్ష, గోనాడోట్రోఫిన్‌ హార్మోను పరీక్ష చేస్తారు. వాటిని బట్టి ఇతర హార్మోన్ల గురించి తెలుసుకుంటారు. మెదడులో లోపాలేమైనా
ఉన్నాయా లేదా అన్నది తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐని చేయించుకోమంటారు. కొన్నిసార్లు హైపోథైరాయిడిజం కూడా ఈ సమస్యకు కారణం కాబట్టి థైరాయిడ్‌ పరీక్ష  చేయించుకోమంటారు. వీటివల్ల కేవలం రుతుక్రమం గురించి తెలుసుకోవడమే కాదు, అందుకు కారణమయ్యే ఇతరత్రా సమస్యలనూ గుర్తించవచ్చు. .

తాత్కాలికంగా ఆగిపోయేలా..
పరీక్షలన్నీ చేశాక సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ఎలాంటి కారణం లేకుండా రుతుక్రమం మొదలయ్యిందని తేలితే కొన్నిరకాల మాత్రలను సూచిస్తారు డాక్టర్లు. అయితే కొన్నిసార్లు ఆ ముందును ప్రతినెలా ఇంజెక్షన్‌ రూపంలో చేయించుకోమంటారు. దానివల్ల కొంతకాలం పాటు ప్రతినెలా వచ్చే నెలసరి ఆగిపోతుంది. రుతుక్రమానికి తగినట్లుగా వయసు వచ్చే వరకూ వాటిని వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి సరైన వయసు వచ్చాక డాక్టర్‌ సలహాతో వాటిని మానేయవచ్చు. ఆ తరవాత మళ్లీ మార్పులు మొదలవుతాయి. మెదడులో కణుతుల్లాంటివి ఉంటే వాటికి చికిత్స చేయడం వల్ల కూడా ఈ మార్పు జరగకుండా కొంతకాలం అదుపులో ఉంచవచ్చు.

ముందు జాగ్రత్తగా..
సమస్య వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందు జాగ్రత్త పడటం మంచిది. ఏ రూపంలో కూడా ఈస్ట్రోజెన్‌, టెస్టోస్టీరాన్‌ హార్మోన్లను వాడకుండా చూడాలి.  అలాగే వయసుకు తగినట్లుగా శారీరక వ్యాయామం ఉండాలి. కనీసం ఇరవై నిమిషాలు నడక లేదా యోగా లాంటివి చేయించడం అవసరం. ఒత్తిడి  సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. అలాగే జంక్‌ఫుడ్‌ని తగ్గించి బదులుగా పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

Post a Comment

0 Comments