Respiratory diseases in Summer , వేసవిలో శ్వాసకోశ వ్యాధులు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సంవత్సరంలో కొన్ని మాసాల్లోనే అధికంగా ప్రబలే శ్వాసకోశ వ్యాధులు రాసురాను వేసవిలో కూడా రావడం ఇటీవలి కాలంలో కనిపిస్తున్నది. గత కొన్నేళ్లనుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా వీటి బారినపడి ఇబ్బందులకు గురైన వారి సంఖ్య చాలా పెరిగింది. నిజానికి ఈ మాసాల్లో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుముఖం పట్టడం, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ మార్పులకు వాతావరణంలో జరిగే ఒడుదోడుకులే కారణమని అనిపిస్తుంది. అకాల వర్షాలుపడటం, సముద్రంలో ఏర్పడే అల్పపీడనం వంటి మార్పుల వలన వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ శాతాలతో పోలిస్తే ఒక రోజు ఉన్నట్లు మరొక రోజు ఉండటం లేదు. ఈ కారణంగా వాతావరణంలో ఉండే సక్ష్మజీవులు (బాక్టీరియా, వైరస్) అధికమై వ్యాధులు వచ్చేలా చేస్తున్నాయి. వీటిలో ప్రధాన కారకాలు వైరస్‌లు. వైరస్‌లలో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అడినో వైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, బాక్టీరియా స్ట్రెప్టోకాకస్, హెచ్-ఇన్‌ఫ్లూయెంజా ముఖ్యమైనవి.
ప్రధానంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు వాటిలో తరచుగా జరిగే జన్యుపరమైన మార్పుల వలన కొత్త తరహా వ్యాధులను కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తాయి. వ్యాక్సిన్‌ల ద్వారా ఈ రకమైన వ్యాధులు ప్రబలకుండా చేసే అవకాశం ఉంది. కాని తరుచుగా జరిగే జన్యుమార్పుల వలన వచ్చే కొత్త వైరస్‌లకు వ్యాక్సిన్‌లను తయారు చేసి విడుదల చేసే నాటికి అవి మళ్లి కొత్త రూపు దాలుస్తున్నాయి.
చలికాలం నుంచి వేసవి కాలంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, వాతావరణంలోని వేడి గాలిని పీలిస్తే సున్నితంగా ఉండే శ్వాస నాళాలు, వాటి పైన ఉండే పొర (మ్యూకస్, సిలియా) కూడా దెబ్బతింటాయి. అలాగే ఎండ ప్రభావానికి గొంతు తడారిపోతున్నదని చల్లని నీళ్ళు(ice water) తాగితే గొంతులోని సున్నితమైన పొరలు ఈ వేడి, చలి మార్పులు తట్టుకోలేక దెబ్బ తింటాయి. ఇలా దెబ్బతిన్న గొంతు, స్వరపేటిక, శ్వాసనాళాలలో వైరస్, బాక్టీరియా తేలికగా ప్రవేశించి, రక్తంలోకి చేరి వాధ్యులను కలుగచేస్తాయి.
వీటి వలన జలుబుతోపాటు, దగ్గు, గొంతునొప్పి, గొంతు తడి ఆరిపోవడం, దగ్గులో కఫం, జ్వరం, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర సమస్యలు ఏర్పడతాయి. అడినోవైరస్‌తో వచ్చే వ్యాధి కారణంగా కళ్ళ కలకలు, గొంతులో బిళ్లలు (లిఫ్‌నోడ్స్) తోపాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం కూడా వస్తాయి. సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే ఈ వ్యాధి లక్షణాలు కొంతమందిలో ఈ వ్యాధి తీవ్రంగా మారడానికి కూడా ఈ వాతావరణ మార్పులే కారణం.
ఏంచేయాలి?
ఈ వ్యాధులు అంటు వ్యాధులు గనుక వ్యాధిగ్రస్తులు దగ్గేప్పుడు, తుమ్మేప్పుడు రుమాలును నోటికి అడ్డంగా పెట్టుకోవాలి.
ఒకరి నుండి మరొకరికి చేతుల ద్వారా కూడా ఈ వ్యాధులు సోకవచ్చు. కనుక చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలి.
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి తరచుగా పుక్కిలించాలి. పసుపు లేదా మెంథాల్ వేసిన నీటి ఆవిరిని రోజూ రెండుమూడు సార్లు పట్టాలి. ఒక్కసారిగా అతి చల్లని నీటిని తాగకూడదు. వాతావరణ పరిస్థితి బట్టి మామూలు నీటిలో కొద్ది కొద్దిగా చల్లని నీరు కలుపుతూ తాగాలి. ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ తీసుకున్నట్లయితే, వీలైనంత త్వరగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. దగ్గు, జ్వరం నాలుగైదు రోజుల్లో తగ్గకపోతే, యాంటిబయాటిక్స్ వంటి మందులను వైద్య సలహా మేరకు వాడాల్సి ఉంటుంది.
0 Comments