రోటా వైరస్ టీకాలు,Rotavirus Vaccination- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ప్రపంచ వ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలలో సంభవించే మరణాలలో 17 శాతం అతిసార సంబంధిత సంక్రమణల వలన జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల మరణానికి కారణం అవుతున్న వ్యాధులలో ఇది రెండవది. పారిశుధ్య వసతులు సక్రమంగా లేక పోవడం వలన, ఈ వ్యాధి నీరు, ఆహారం, పాత్రలు, అశుభ్రమైన చేతులు, ఈగల నుండి వ్యాపిస్తుంది. రోటా వైరస్‍కు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే లక్షణం చాలా ఎక్కువ. ఇది తీవ్రమైన అతిసారా కలుగజేసి, పిల్లల మరణానికి (20%) కారణమవుతుంది. రోటా వైరస్ డయేరియాను నిరోధించడానికి పారిశుధ్య ఏర్పాట్లు ఒక్కటే సరిపోవని WHO చెపుతోంది. రోటా వైరస్ టీకాలకు కాపాడే శక్తి చాలా ఎక్కువ, సురక్షితం. వాటికి విలువకు తగిన ప్రయోజనాన్ని ఇచ్చే సామర్ధ్యం ఉంది.
పిల్లల్లో డయేరియాకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పాటు వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా కారణమవుతుంటాయి. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే డయేరియా తక్కువ శాతమే అయినా వీటిని అడ్డుకుంటే చాలావరకు మరణాలను తగ్గించొచ్చని నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. ముఖ్యంగా డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి సురక్షితమేనా? కావా? అనే దానిపై ఇన్నాళ్లు సందేహాలు ఉండేవి. ఈ అనుమానాలకు ఎఫ్‌డీఏ ఇటీవలే తెరదించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోటా వైరస్ టీకాలు రోటారిక్స్, రోటాటెక్‌లు సురక్షితమైనవేనని తేల్చి చెప్పింది. ఇవి రోటావైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరటం, ప్రాణాలు కోల్పోవటాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. ఈ టీకాలు వేయించుకున్న తర్వాత ఇబ్బందులేమైనా వస్తాయేమోనని పిల్లలను ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరమూ లేదంది. అయితే వైరల్ ఇన్‌ఫెక్షన్లు సోకే విధానాన్ని టీకాలపై ముద్రించాలని మాత్రం సూచించింది.
0 Comments