Full Style

>

మెల్లకన్ను,Squint


మెల్లకన్ను,Squint- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


రెండు కళ్లూ కలిసికట్టుగా పనిచేస్తేనే.. మన చూపు బాగుంటుంది. సంపూర్ణ దృష్టికి మనకు రెండు కళ్లు ఎంత అవసరమో.. ఆ రెండూ సమన్వయంతో పని చేయటం కూడా అంతే అవసరం. కానీ 'మెల్ల' బాధితుల్లో.. ఆ సమన్వయం కొరవడి.. ఒక కన్ను ఒక దిక్కు చూస్తుంటే.. రెండోది మరో దిక్కు చూస్తుండటం.. పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చూపుకు చేటు .

కానీ మెల్లపై మన సమాజంలో ఇప్పటికీ బోలెడు అపోహలు పాతుకుపోయాయి. ఎన్నో తప్పుడు నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ చూపుకి చేటు తెచ్చేవే. బిడ్డకు మెల్ల ఉందని గుర్తిస్తే.. వెంటనే పిల్లల నేత్రవైద్యుల సలహా తీసుకోవటం.. అవసరమైతే సర్జరీతో దాన్ని సరిచేయించటం బిడ్డ భవిష్యత్తుకు చాలా కీలకం.

పసిపిల్లలకు అభంశుభం తెలియదు. కొన్ని ఆరోగ్య సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నా.. వాటి గురించి తల్లిదండ్రులకు చెప్పలేరు. కానీ... వాటి విషయంలో తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకుని వెంటనే చికిత్స చేయించకపోతే పిల్లలు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... మెల్ల! ఎందుకంటే తమ కంటిలో మెల్ల ఉన్నా పిల్లలకు నొప్పీ, బాధా ఏదీ ఉండదు కాబట్టి.. తమకు కనిపిస్తున్నదే ఈ లోకమని భావిస్తూ.. అలాగే పెరిగి పెద్దవాళ్లవుతారు. కానీ దాని ప్రభావం వాళ్లను జీవితాంతం బాధిస్తుంది. ఎలాగో అర్థం చేసుకోవాలంటే.. మెల్ల గురించి కాస్త వివరంగా తెలుసుకోవటం అవసరం.

మెల్ల అంటే..?
మన కళ్లు అద్భుతమైన కెమేరాల్లాంటివి! మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పని చేస్తూ... రెండూ ఒకే దిశలో కదులుతూ.. ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి.. మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెంటినీ సమన్వయించుకుని మెదడు మనకు.. పొడవు-వెడల్పు-లోతులన్నీ తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని (త్రీడీ చిత్రాన్ని) చూపిస్తుంది. ఇదీ సాధారణంగా జరిగేది. ఇలా మన రెండు కనుగుడ్లూ సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు.. వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనకా ఆరు కండరాలు సమన్వయంతో పని చేస్తుంటాయి. కనుగుడ్డు కదలికలకు ఈ కండరాలే కీలకం. కానీ కొందరిలో ఈ కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరవడుతుంది. ఫలితంగా ఒక కనుగుడ్డు ఒక దిక్కు చూస్తుంటే... రెండో కనుగుడ్డు మరో దిక్కు చూస్తుంటుంది. దీన్నే మనం మెల్ల (స్క్వింట్‌/స్ట్రెబిస్మస్‌) అని పిలుస్తాం.

మెల్లతో నష్టం ఏమిటి?
మెల్ల ఉన్న కన్ను పంపించే చిత్రం అస్పష్టంగా ఉంటుంది. రెండు కళ్లూ పంపించే చిత్రాలూ ఒకే తీరుగా లేకపోవటం.. అవి సరిపోలకపోవటంతో క్రమేపీ మెల్ల కన్ను పంపించే చిత్రాన్ని మెదడు గ్రహించటం మానేస్తుంది. ఉదాహరణకు కుడి కన్నులో మెల్ల ఉంటే.. ఆ కంటి నుంచి వచ్చే మసక, మసక దృశ్యాన్ని మెదడు సరిగా గ్రహించలేక.. మంచిగా ఉన్న ఎడమ కంటి నుంచి వచ్చే సంకేతాల మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. క్రమేపీ కుడి కంటి నుంచి మెదడుకు అందాల్సిన సంకేతాలు క్షీణించిపోతాయి. దీనివల్ల మెదడులో దృశ్యాలను క్రోడీకరించుకునే ప్రక్రియ దెబ్బతిని.. మెదడులోని ఆయా భాగాలూ బలహీనపడతాయి. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ కంటి పనితీరు మరింత మందగిస్తుంది. దీన్నే 'లేజీ ఐ (ఆంబ్లయోపియా)' అంటారు. ఫలితంగా మెదడు ఒక కంటి మీదే ఆధారపడటానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సమగ్రమైన, సంపూర్ణమైన (బైనాక్యులర్‌, త్రీడీ విజన్‌) దృష్టి లోపిస్తుంది. రోడ్డు మీద ఏదైనా వాహనం వస్తున్నప్పుడు అదెంత దూరంలో ఉంది, ఏ దిశలో వస్తోంది వంటి అంశాలను సరిగా అంచనా వేయలేరు. చూడటంలో అస్పష్టత నుంచి ప్రమాదాల బారినపడటం వరకూ.. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎందుకొస్తుందీ మెల్ల?
మెల్ల ఎందుకొస్తుందో స్పష్టమైన కారణాలు తెలియదు. ఓ 10-20% మందిలో ఇది జన్యుపరంగా రావొచ్చు. 50-60% మందిలో మాత్రం కచ్చితంగా కారణం చెప్పటం కష్టం. చాలా అరుదుగా మెదడులో కణుతులు, ఇన్ఫెక్షన్ల వంటి జబ్బులు, మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం, చిన్నతనంలోనే కంట్లో శుక్లాలు ఉండటం, కంటికి దెబ్బ తగలటం, కంట్లో కణుతుల వంటివాటివల్ల రావచ్చు. కానీ ఇలాంటివి చాలా చాలా అరుదు. ఎక్కువ శాతం మందిలో ఇలాంటి కారణాలేమీ లేకుండానే మెల్ల మొదలవుతుంది.

గుర్తించేదెలా?
మెల్లను గుర్తించటం కష్టమేం కాదు. చాలావరకూ తల్లిదండ్రులే తేలికగా పసిగడతారు. పసిబిడ్డ తల్లి ముఖాన్ని చూసి నవ్వకపోవటం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడలేకపోవటం.. మెల్లను గుర్తించటానికి తొలి లక్షణాలుగా భావించొచ్చు. కనుగుడ్లు వేర్వేరు దిక్కుల్లో తిరుగుతుండటం, ఒక కన్ను పూర్తిగా కదులుతుంటే రెండో కన్ను దాన్ని అనుసరించకపోవటం.. ఇలాంటి లక్షణాలను బట్టి మెల్లను గుర్తించొచ్చు. చాలాసార్లు ఫొటోల్లో మెల్ల స్పష్టంగా కనబడుతుంది. అరుదుగా మెల్ల కారణంగా కొందరిలో కనుగుడ్లు పైకీకిందికీ కదిలిపోతుంటాయి కూడా(షేకింగ్‌/నిష్టాగ్మస్‌). అయితే 80% మందిలో ఒక కనుగుడ్డు రెండోదాని కన్నా భిన్నంగా బయటివైపో, లోపలివైపో, పైకో, కిందికో తిరిగి ఉండటం కనిపిస్తుంది.
*మెల్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి రోజంతా.. నిరంతరం కనబడే రకం. రెండోది- రోజులో ఎప్పుడన్నా కొన్నికొన్ని సమయాల్లో, ముఖ్యంగా బాగా అలసినప్పుడు, తీవ్రమైన జ్వరం వచ్చినపుడు, పగటి కలలు కంటున్నప్పుడు కనబడుతూ.. ఆ తర్వాత పోతుంటుంది. వీటిలో ఏది కనబడినా, ఏ కొంచెం అనుమానం ఉన్నా పిల్లల కంటి వైద్యులతో పరీక్ష చేయించటం ఉత్తమం. ఈ పరీక్ష ఎంత చిన్న వయసులో చేయిస్తే అంత మంచిది. ఏడాదిలోపు మరీ ఉత్తమం.

చిన్నతనంలో లేకుండా.. పెద్ద వయసులో ఉన్నట్టుండి మెల్ల వస్తే- రెండు కళ్లూ మెదడుకు రెండు రకాల చిత్రాలను పంపిస్తాయి. దీంతో దృశ్యాలన్నీ రెండుగా కనబడతాయి. చూపు దెబ్బతింటుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా కనుగుడ్లను సరైన సమన్వయంతో పనిచేసేలా సర్జరీతో చక్కదిద్దాల్సి ఉంటుంది.

సర్జరీ ఎప్పుడు మేలు?
పసితనంలోనే మెల్ల కనబడితే 8-9 నెలల వయసులో సర్జరీ చేయటం ఉత్తమం. దీనివల్ల చూపు దెబ్బతినకుండా ఉంటుంది. కనుగుడ్లు రెండూ చక్కటి సమన్వయంతో పనిచేస్తాయి కాబట్టి మెదడులోనూ పెద్దగా మార్పులు రావు. చూపు క్షీణించటమన్న సమస్య ఉండదు. స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. కొన్ని రకాలైతే 4-5 ఏళ్లు ఆగొచ్చు. కానీ దేనికి ఆగొచ్చు, దేనికి ఆగకూడదన్నది నిపుణులైన వైద్యులే నిర్ధారించాల్సి ఉంటుంది.
రెండు కనుగుడ్లూ సమన్వయంతో ఒకే దిశలో కదిలేలా చూసేందుకు.. వాటిని ఒకే దిశలో కదిపేందుకు ఒక్కో కనుగుడ్డు వెనకా ఆరు కండరాలు సమన్వయంతో పని చేస్తుంటాయి.
ఏళ్లు గడుస్తున్నకొద్దీ మెల్ల సమస్య వల్ల ఆ కంటి పనితీరు మరింత మందగిస్తుంది. దీన్నే 'లేజీ ఐ' అంటారు. ఫలితంగా మెదడు చూపు కోసం- బాగున్న ఒక కంటి మీదే ఆధారపడటానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సమగ్రమైన, సంపూర్ణమైన దృష్టి (బైనాక్యులర్‌, త్రీడీ విజన్‌) లోపిస్తుంది.

మెల్ల అపోహల పుట్ట
'మెల్ల'పై మన సమాజంలో బోలెడు అపోహలు పాతుకుపోయాయి.
1 మెల్లకన్ను అందానికి చిహ్నమని నమ్మేవాళ్లున్నారు.. కానీ మెల్ల వల్ల అందం ఇనుమడించకపోగా... తోటివారు గేలి చేయటం, చిన్నచూపు చూడటం, వీరితో స్నేహం చేయటానికి అంతగా ముందుకురాకపోవటం.. ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ క్రమేపీ ఈ పిల్లలు న్యూనతా భావానికి గురవుతుంటారు. ఈ విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గమనించటం లేదు.
2 మెల్లకన్ను దేవుడిచ్చిన వరంగా నమ్మేవాళ్లూ ఉన్నారు.. కానీ వాస్తవానికి ఇది వరం కాదు.. మెల్లను నిర్లక్ష్యం చేస్తే ఆ కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
3 పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మెల్ల దానంతట అదే పోతుందని భావిస్తూ.. తాత్సారం చేసేవాళ్లున్నారు. కొందరు వైద్యులు కూడా 5-6 ఏళ్ల వరకూ చూడొచ్చని సూచిస్తుంటారుగానీ.. మెల్ల తీవ్రంగా ఉన్నప్పుడు చిన్నవయసులోనే దాన్ని సరిదిద్దకపోతే ఆ కంటి చూపు క్షీణించిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక పెద్ద వయసులో దాన్ని సరిచేసినా అప్పటికే చాలా నష్టం జరిగిపోతుంది.. ఫలితాలు సంపూర్ణంగాఉండవు.
4 మెల్లకు సర్జరీ చేస్తే మొత్తం చూపు దెబ్బతింటుందన్న భయాలూ కొందరిలో ఉన్నాయిగానీ.. వాస్తవానికి అవసరమైనప్పుడు సర్జరీ చేయించకపోతేనే చూపు దెబ్బతింటుందిగానీ చేయిస్తే కాదు. మెల్ల సరిదిద్దేందుకు చేసే సర్జరీ చాలా సురక్షితమైనది, దాంతో దుష్ప్రభావాలు చాలా తక్కువ.
చిన్నతనంలో తల్లిదండ్రులు అవగాహనారాహిత్యంతో మెల్లను సరిచేయించకుండా వదిలేయటం వల్ల.. పిల్లలు మెల్ల సమస్యతోనే పెరిగి పెద్దవాళ్త్లె.. అప్పుడు పెళ్లి సంబంధాలు కుదరవనో... ఉద్యోగం దొరకటం కష్టంగా ఉందనో హడావుడిగా కంటి వైద్యులను సంప్రదిస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ వయసులోనూ సర్జరీతో 'మెల్ల' కనబడకుండా చక్కదిద్దచ్చుగానీ చూపు విషయంలో ఫలితాలు సంపూర్ణంగా ఉండకపోవచ్చు. అదే చిన్న వయసులోనే సరిచేస్తే చూపు ఎక్కువగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

అందరికీ ఆపరేషన్‌ అక్కర్లేదు!
మెల్ల కన్ను సమస్య ఉన్నవారందరికీ ఆపరేషన్‌ అవసరం రాదు. కొన్నింటిని కేవలం అద్దాలతోనే సరిచేయొచ్చు. మెల్లలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి- కంజెనైటల్‌ లేదా ఇన్‌ఫంటైల్‌ ఈసోట్రోపియా. మెల్ల బాధితుల్లో 70% వరకూ ఇలాంటి వారే. వీరికి ఆపరేషన్‌ తప్పనిసరి. రెండోది- దృష్టిదోషం వల్ల వచ్చే 'అకామడేటివ్‌ ఈసోట్రోపియా' రకం. దీన్ని చాలావరకూ కళ్లద్దాలతోనే సరిచేయొచ్చు. కంటి చూపును పరీక్షించి వారికి అవసరమైన మేరకు అద్దాలు ఇస్తే సరిపోతుంది. కంట్లో దృష్టిదోషం ఉన్నప్పుడు స్పష్టంగా చూసేందుకు మరింత శ్రమతో చూడాల్సి వస్తుంది. దీనివల్ల మెల్లగా కనుగుడ్డు పక్కకు జరగటం ఆరంభిస్తుంది. ఇది క్రమంగా 'మెల్ల'కు దారి తీస్తుంది. ఈ దృష్టిదోషాన్ని సరిచేస్తూ కళ్లద్దాలు ఇస్తే ఈ రకం క్రమేపీ చక్కబడుతుంది. అందుకే వైద్యులు మెల్ల సమస్యతో వచ్చినప్పుడు ముందు సమస్య ఏ స్థాయిలో ఉంది? రెండు కళ్లలోనూ చూపు ఎలా ఉంది? పవర్‌ ఏదైనా ఉందా? కనుగుడ్డు పక్కలకు మాత్రమే మళ్లిందా? పైకీ కిందికీ జరిగిందా? వంటి వాటిని కొలతలతో సహా నిర్ధారిస్తారు. ఎక్కువమందిలో కన్ను లోపలికి మళ్లటం (ఈసోట్రోపియా), బయటకు మళ్లటం (ఎక్సోట్రోపియా) కనిపిస్తాయి. కంట్లో శుక్లాలు, కణుతుల వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయేమో చూసేందుకు సంపూర్ణంగా నేత్ర పరీక్ష చేస్తారు. ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం మెల్ల మాత్రమే ఉందని నిర్ధారిస్తే... 20-30 శాతం మందికి కేవలం గ్లాసులు ఇస్తేనే సరిపోతుంది. వీటితో మెల్ల పూర్తిగా సరి అయిపోతుంది.

* ప్యాచింగ్‌: కొన్నిసార్లు బలహీనపడిన కంటిని మళ్లీ పనిచేయించేందుకు అద్దాలతో పాటు 'ప్యాచ్‌ థెరపీ' కూడా చేస్తారు. బాగున్న కంటిని మూసివేస్తే.. మెల్లతో బలహీనపడిన కన్ను క్రమేపీ అధికంగా పని చేయటానికి అలవాటుపడి, దారిలోకి వస్తుంది. ఉదాహరణకు పిల్లవాడు 4 ఏళ్ల వయసులో వస్తే.. అప్పటికే మెల్ల ఉన్న కన్ను బలహీనపడి ఉంటుంది కాబట్టి దాన్ని మెరుగుపరిచేందుకు- 'లేజీ'గా మారిన ఆ కంటిని మరింతగా పని చేయిచేందుకు.. బాగున్న కంటిని 'ప్యాచ్‌'తో మూసివేస్తారు. కొందరికి కేవలం ఈ ప్యాచ్‌లతోనే మెల్ల సరి అయిపోతుంది.
* సర్జరీ: మెల్ల నిరంతరం లేకుండా వచ్చిపోతుంటే.. సాధారణంగా కొంతకాలం వేచి చూడొచ్చు. నిరంతరం ఉండే వారికి మాత్రం సత్వరమే సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది. కనుగుడ్లు రెండూ సమన్వయంతో కదిలేందుకు వెనకున్న కండరాలు కీలకం కాబట్టి.. సర్జరీలో ప్రధానంగా ఈ కండరాలను సరిచేస్తారు. ఉదాహరణకు గుడ్డు లోపలి వైపు తిరిగితే ఒకవైపు కండరాలను, బయటివైపు తిరిగితే మరో వైపు కండరాలను బిగువు చేయటం, వదులు చేయటం వంటి సర్దుబాట్లు చేస్తారు. దీంతో కనుగుడ్లు రెండూ ఒకే దిశలో కదలటం వీలవుతుంది. వీటిమధ్య సమన్వయం కోసం కొన్నిసార్లు మెల్ల ఉన్న కంటితో పాటు మెల్లలేని రెండో కంటికీ సర్జరీ చెయ్యాల్సి వస్తుంది. ఈ దిద్దుబాటు అంతా కూడా సూక్ష్మమైన లెక్కలతో ముడిపడినది కాబట్టి దీనిలో మంచి అనుభవం ఉన్న సర్జన్లు మాత్రమే దీన్ని చెయ్యగలరు. సర్జరీలోకనుగుడ్డు మీద చాలా చిన్న కోత మాత్రమే పెడతారు, కంటి చుట్టూ ఎటువంటి కోతలూ, మచ్చలూ ఉండవు. ఆపరేషన్‌ తర్వాత కూడా చూపు మెరుగయ్యే వరకూ కొంతకాలం ప్యాచ్‌లు వాడాల్సి రావచ్చు. 90 శాతం మందిలో ఈ సర్జరీతోనే సమస్య తొలగిపోతుంది. 10% మందిలో మాత్రం సర్జరీ తర్వాత కొంతకాలానికి మళ్లీ మెల్ల రావచ్చు. అప్పుడు మరోసారి దిద్దుబాటు చెయ్యాల్సి వస్తుంది. కొందరిలో బొటాక్స్‌ ఇంజక్షన్ల వంటివాటితోనూ దీన్ని సరిదిద్దే వీలుంటుంది.

Post a Comment

0 Comments