Full Style

>

మూర్ఛలకు- స్పృహ తప్పడానికి మధ్య భేదం ,Difference between Fits and Unconsciousness

మూర్ఛలకు- స్పృహ తప్పడానికి మధ్య భేదం (Difference between Fits and Unconsciousness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

స్పృహ తప్పడాన్ని లక్షణ సందర్భాలనుబట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. అనేక సందర్భాలు, వివిధ రకాల స్థితిగతులు మనిషిని తెలివి తప్పేలా చేస్తాయి. ఉదాహరణకు శరీరంలో రక్తభారం(B.P) హఠాత్తుగా తగ్గడం, ఫిట్స్‌, గుండె స్పందనలో అపక్రమం చోటు చేసుకోవటం, మెదడుకు హఠాత్తుగా రక్త సరఫరా తగ్గి ట్రాన్సియంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ రావటం ఇత్యాదివన్నీ స్పృహ తప్పడానికి కారణాలే.

ఒక్కొక్క వ్యాధికి చికిత్స అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక ఏ కారణం వలన స్పృహ తప్పారన్నది తెలుసుకోవడం ముఖ్యం.

చాలామంది ఫిట్స్‌నూ, తెలివి తప్పిపడిపోవడాన్ని ఒకే వ్యాధిగా భ్రమ పడుతుంటారు. ఈ రెండు సందర్భాలలోనూ బాధితుడికి చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో తెలియదు కనుక రెండూ ఒకవే విధమైన వ్యాధులుగా భావిస్తుంటారు. అయితే, ఫిట్స్‌కూ స్పృహ తప్పి పడిపోవడానికీ మౌలికంగా చాలా భేదముంది. ఫిట్స్‌/మూర్ఛల్లో శరీరం బిగుసుకుపోతుంది. కాళ్లూ చేతులూ కొట్టుకుంటూ ఉంటాయి. లేదా మెలికలు తిరిగిపోతాయి. నోటినుంచి నురగ వస్తుంది. బట్టలో మూత్రం పడిపోతుంది. నాలుక దంతాల మధ్య ఇరుక్కుంటే తెగే అవకాశం కూడా ఉంది. స్పృహ తప్పిపడిపోయినప్పుడు ఈ లక్షణాలేమీ కనిపించవు. సొమ్మసిల్లి పడిపోతారంతే. అచేతనంగా, మొదలు నరికిన మానులాగానేలమీద పడిపోతాru. ఈ రెండు స్థితుల్లోనూ వేర్వేరు పూర్వరూపాలు కనిపిస్తాయి. వీటినే ఆరా అంటారు.

ఉదాహరణకు
సొమ్మసిల్లి పడిపోబోయే ముందు కళ్లు బైర్లు కమ్మడం, చూపు మసకబారడం, తల తిరగడం, కాళ్లూ చేతులూ చల్లగా మారడం, చెమటలు కారడం తదితర లక్షణాలు ఉంటాయి.
మూర్ఛలు రాబోయే ముందు లేని శబ్దం వినబడటం, కళ్ల ముందు రకరకాల రంగులు కనిపించడం వంటి వింత భావనలు ఉంటాయి.
గుండె భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా శరీరంలోని రక్తాన్ని తల భాగానికి సరఫరా చేస్తుంది. అలా చేయలేనప్పుడు మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది కనుక స్పృహ తప్పుతుంది. మూర్ఛ వచ్చినప్పుడు కానీ, సొమ్మసిల్లినప్పుడు కానీ మనిషి నేల మీద పడిపోవడంలోని ఆంతర్యం తలకు రక్త సరఫరా అందాలనే. నేలమీద బల్లపరుపుగా పడుకుంటే తలకు రక్తసరఫరా తగినంతగా అందుతుంది. రోడ్డు మీద ఎవరైనా పడిపోతే చుట్టూ చేరిన వాళ్లు వారిని లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. నేల మీద బల్లపరుపుగా పడుకోబెట్టడమే మేలు. ఇలా చేయడం వలన పడిపోయిన వ్యక్తికి త్వరగా మెలకువ వస్తుంది.

ఒక్క ఉదుటున లేచి కూర్చున్నప్పుడు, వేడి వాతావరణం నుంచి హఠాత్తుగా చల్లని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు స్పృహ తప్పుతున్నట్లు ఉంటుందా?
నేలబారుగా అమర్చిన నీటిపైపులో నీరు ప్రవహిస్తున్నప్పుడు హఠాత్తుగా దానిని పైకి ఎత్తితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఒక్కక్షణం పాటు పైపునుంచి నీరు ప్రవహించడం ఆగిపోతుంది. సరిగ్గా ఇదే తరహా ప్రక్రియ మన శరీరంలో కూడా జరుగుతుంది. దీనిని పాస్ట్యురల్‌ హైపోటెన్షన్‌ అంటారు. ఉధృతంగా దగ్గుతున్నప్పుడూ, అదే పనిగా తుమ్ముతున్న ప్పుడూ, శ్వాసను వేగంగా తీసుకుంటున్నప్పుడూ కళ్లు బైర్లు కమ్మి పడిపోయే అవకాశం ఉంది. కుర్చీలోనుంచి హఠాత్తుగా లేచి నిలబడినప్పుడు, తలను వేగంగా తిప్పినప్పుడూ తలకు రక్త సరఫరా తగ్గి స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు శరీరం కొత్త భంగిమకు అలవాటు పడేలా కొంచెం సేపు ఆగితే సరిపోతుంది. ఉదాహర ణకు మంచం మీదనుంచి లేచేటప్పుడు ఒకేదఫాలోకాకుండా రెండు మూడు దశల్లోఅంటే లేచికూర్చున్న తరువాత కొంచెం సేపూ, కూర్చొని నిలబడిన తరువాత కొంచెంసేపూ సమయం తీసుకుని లేవాలి.

మందులు వాడుతున్నారా?
అనేక రకాల అల్లోపతి మందులకు రక్తభారాన్ని తగ్గించేలా, స్పృహ తప్పి పడిపోయేలా చేసే నైజం ఉంది. బ్లడ్‌ ప్రెషర్‌ను తగ్గించే మందులు వీటిలో ప్రధానమైనవి. ముఖ్యంగా మూత్రాన్ని జారీ చేసే డైయూరిటిక్స్‌ తీసుకున్నప్పుడు ఈ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా గుండె నొప్పిలో వాడే గ్లిజరిల్‌ ట్రైనైట్రేట్స్‌కు, మత్తు కలిగించే ట్రాంక్విలైజర్స్‌కూ, బిపి కోసం వాడే బీటా బ్లాకర్స్‌కు కుంగుబాటులో వాడే యాంటి డిప్రసెంట్స్‌కు, గుండె స్పందనలను క్రమబద్దీకరించడానికి వాడే డిగాక్సిన్‌కు, పార్కిన్‌సన్స్‌ వ్యాధిలో వాడే లెవొడోపాకు ఈ లక్షణం ఉంటుంది. ఈ మందుల్లో వేటినైనా వాడుతున్నప్పుడు స్పృహ తప్పుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని మీ డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడం మంచిది.

తరచుగా గుండె దడ, ఛాతి నొప్పి వంటివి వస్తుంటాయా? గుండె శబ్దాల్లో మర్మర్స్‌ వినిపిస్తుంటాయా?
గుండె స్పందన వేగం మరీ తక్కువగా - అంటే నిముషానికి 50 కంటే తక్కువగా ఉంటే మెదడుకు రక్తసరఫరా పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల స్పృహ తప్పుతుంది. గుండె కండరాలు బలహీనంగా మారినప్పుడు హార్ట్‌బ్లాక్‌ ఏర్పడి స్పందనల సంఖ్య తగ్గిపోతుంది. గుండె వేగంగా అంటే నిముషానికి 200 సార్లకు పైగా కొట్టు కుంటున్నా సమస్యే. గుండె పూర్తిస్థాయి సంకోచ వ్యాకోచాలు జరుగవు కాబట్టి మెదడుకు రక్తసరఫరా పరిపూర్ణంగా అందదు. ఈ పరిస్థితి కూడా గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం వల్ల తలెత్తుంది. గుండె కవాటాలకు చెందిన వాల్వులర్‌ వ్యాధులూ, గుండె కండరాలకు రక్తసరఫరా తగ్గడం వలన ఏర్పడే హార్ట్‌ ఎటాక్‌ వంటి వ్యాధులూ మెదడుకు రక్త సర ఫరాను తగ్గించి స్పృహ కోల్పోయేలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా సమస్యలకు వైద్య సహాయం తప్పనిసరి. ఇలాంటి సమ స్యలకు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

కడుపునొప్పితోపాటు మలం నల్లని రంగులో వెలువడు తుందా?
శరీరాంతర్గత ప్రదేశాల్లో రక్తస్రావమవుతున్నప్పుడు, శరీరం వెలుపల ఏర్పడిన గాయాల నుంచి రక్తస్రావమవుతున్నప్పుడు రక్తభారం గణనీయంగా తగ్గిపోయి స్పృహ కోల్పోతారు. చాలా కాలంనుంచి పేగుల్లో
అల్సర్లతో బాధపడేవారి విషయంలోఇలా జరుగుతుంది. అల్సర్లనుంచి రక్తస్రావమై పేగుల్లోని మలాన్ని నల్లగా మారుస్తుంది. అందుకే స్పృహ తప్పుతున్నట్లు ఉండటం తోపాటు ఇతర అల్సర్‌ లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆకలి, చెమటలు, అసహనం వంటివి కనిపించిన తరువాత సొమ్మసిల్లిపడిపోయారా?
ఇలా సాధారణంగా మధుమేహ రోగుల్లో - రక్తంలో గ్లూకోజ్‌ మోతాదు తగ్గిపోయినప్పుడు జరుగుతుంటుంది. ఇన్సులిన్‌ తీసుకొని ఆహారాన్ని తీసుకోవడం మర్చిపోయినా, అలవాటు లేకుండా ఎక్కువగా వ్యాయామం చేసినా, ఇన్సులిన్‌ మోతాదు ఎక్కువైనా ఇలా జరుగవచ్చు. ఇవే లక్షణాలు మధుమేహం లేనివారిలో కూడా కనిపించ వచ్చు. ఎక్కువసేపు ఆహారం తినకుండా, గంటల తరబడి నిలబడి పని చేసే వారిలో మధుమేహం లేకపోయినప్పటికీ ఇలా జరుగుతుంటుంది. ఈ సమస్యతో సతమతమయ్యేవారు ఆహా రాన్ని కొద్దిమొత్తాల్లో తరచుగా తినాల్సి ఉంటుంది.

భయాందోళనలకు లోనైనప్పుడు వేగంగా గాలి పీల్చు కుంటారా?
కొంతమంది భయాందోళనలకు లోనైనప్పుడు, భావావేశాలకు గురైనప్పుడు తమకు తెలియకుండానే వేగంగా శ్వాస తీసు కుంటారు. అప్పుడు హైపర్‌ వెంటిలేషన్‌ అనే స్థితి నెలకొం టుంది. కొద్ది క్షణాలపాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే రక్తంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ మోతాదు తగ్గిపోయి, కాల్షియం నిల్వలలో మార్పు చోటు చేసుకుంటుంది. దీనితో కాళ్లు చేతుల్లో సూదులు గుచ్చుకుంటున్నట్లు ఉండటమే కాకుండా, తలతిరగడం, స్పృహతప్పడం కూడా జరుగవచ్చు. ఇలాంటి లక్షణాలున్నప్పుడు నోటికీ, ముక్కుకూ ఎదురుగా ఒక కాగితం సంచిని తెరిచి ఉంచి, బయటకు వదిలిన గాలినే కొంచెం సేపు మళ్లీ మళ్లీ పీల్చుకోవాలి. శరీరంనుంచి బైటికి వెళ్లిపోయిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ తిరిగి రక్తంలోనికి చేరి కళ్లు బైర్లు కమ్మినట్లు ఉండటం తగ్గుతుంది.

స్పృహ తప్పడంతోపాటు పక్షవాతం, మాటల్లో అస్పష్టత కనిపిస్తున్నాయా?
పక్షవాతం వలన మెదడుకు రక్తసరఫరా తగ్గి స్పృహ తగ్గుతుంది. వివిధ కారణాల వలన శరీరంలోని రక్తనాళు గట్టిపడి రక్త ప్రవాహాన్ని సజావుగా జరుగనివ్వవు. దీనితో రక్తకణాలు ముద్దలుగా తయారై తమ మార్గాలను తామే అడ్డుకుంటాయి. దీనికి శరీరం పరిహార చర్యలు తీసుకుంటుంది.
అధిక వత్తిడితో రక్తాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మార్పును స్వీకరించడానికి అంతకుముందే గట్టిగా తయారైన రక్తనాళాలు సన్నద్ధంగా ఉండకపోవడంతో వాటి గోడలు చిట్లి రక్తస్రావమవుతుంది.అరవై ఏళ్ల వయస్సు దాటిన వారిలోనూ, కొన్ని రకాలైన గుండెజబ్బులున్నవారిలోనూ రక్తపుగడ్డలు ఎక్కువగా తయారయ్యే అవ కాశం ఉంది. రక్తభారం(B.P) నియంత్రణలో లేని వ్యక్తుల్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పక్షవాతాల్లో 85 శాతం రక్తపుగడ్డల వల్లను, 15 శాతం రక్తస్రావాల వల్లనూ ఏర్పడుతాయి. ఈ రెండు సందర్భాలలోనూ కాళ్లూ, చేతులు పడిపోవడం, తిమ్మిరి పట్టడంతోపాటు స్పృహ తప్పడం కూడా ఉంటుంది.

Post a Comment

0 Comments