Full Style

>

పసి బిడ్డల కంట్లో నీటికాసులు(గ్లకోమా) ,Glaucoma in Neonates

-పసి బిడ్డల కంట్లో నీటికాసులు(గ్లకోమా) ,Glucoma in Neonates- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


కలవరపెట్టే సమస్యల్లో తప్పకుండా చెప్పుకోవాల్సింది నీటికాసులు! బిడ్డ పుడుతూనే కంట్లో నీటికాసులు ఉండొచ్చు.. లేదా పుట్టినప్పుడు బాగానే ఉన్నా తర్వాత మెల్లగా మొదలవ్వచ్చు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. దీనికి చక్కటి చికిత్సలున్నాయి. కాకపోతే దీన్ని సత్వరమే గుర్తించి.. వెంటనే వైద్యులకు చూపించటం, అవసరమైతే వెంటనే సర్జరీ చేయించటం.. బిడ్డ చక్కటి ఎదుగుదలకు చాలా చాలా అవసరం.

పసి బిడ్డలకు కళ్లు పెద్దగా ఉంటే అందంగానే ఉంటుందిగానీ అవి మరీ పెద్దగా ఉంటే మాత్రం సమస్య ఏదైనా ఉందేమో అనుమానించటం చాలా అవసరం. ఎందుకంటే పసివయసులో.. కనుగుడ్డు అసహజంగా, పెద్దగా ఉండటానికి 'నీటికాసులు' కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. ఇది ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి వీల్లేని... బిడ్డ చూపును హరించివేసే సమస్య. దీన్నే 'గ్లకోమా' అంటారు. గ్లకోమా ఏ వయసులోనైనా రావొచ్చు. కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఉండొచ్చు కూడా.

-
పుడుతూనే నీటికాసుల సమస్య ఉంటే దాన్ని 'కంజెనిటల్‌ గ్లకోమా' అంటారు. ఈ సమస్య ఉన్న పిల్లల కళ్లను చూస్తే చిత్రమైన లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో కనుగుడ్డు పెద్దగా, పూర్తిగా నీలి రంగులో, లేదా తెల్లగా ఉండొచ్చు. బయటి నుంచి కాంతిలోపలికి ప్రవేశించేలా పారదర్శకంగా ఉండాల్సిన కార్నియాపొర.. వీరిలో దళసరిగా, మబ్బు మబ్బుగా, తెల్లతెల్లగా గానీ నీలంగాగానీ ఉంటుంది. పిల్లలు కళ్లు తెరవలేరు (హైడింగ్‌). ముఖ్యంగా ఎండలోకి వస్తే కళ్లు గట్టిగా మూసేసుకుంటుంటారు (ఫొటో ఫోబియా). వెలుతురును కళ్లు తెరచి చూడలేరు. కంటిలోంచి నీరు కూడా కారుతుంటుంది. పసిబిడ్డల కంట్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే- తక్షణం వైద్యులకు చూపించటం, అదీ పిల్లల కంటి సమస్యలను చూసే ప్రత్యేక నిపుణులకు చూపించటం చాలా అవసరం. ఎందుకంటే పసిబిడ్డల్లో నీటికాసులు ఉంటే సత్వరమే చికిత్స ఆరంభించటం, అవసరమైతే వెంటనే సర్జరీ చెయ్యటం చాలా అవసరం. నీటికాసుల విషయంలో ఎంత త్వరగా చికిత్స ఆరంభిస్తే ఫలితాలు అంత బాగుంటాయి. ఆలస్యం చేసిన కొద్దీ.. బిడ్డ చూపు.. మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత వరకూ మందులతో చికిత్స చేసినా, పిల్లల్లో నీటికాసులకు చాలావరకూ శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. ఈ ఆపరేషన్‌ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెయ్యాలి. పిల్లలకు మత్తు తట్టుకునే శక్తి ఉంటే పుట్టిన రోజునే... లేకపోతే రెండు, మూడు రోజులబిడ్డకు కూడా సర్జరీ చెయ్యచ్చు. అయితే చాలామంది పిల్లలకు పుట్టిన రెండు మూడు వారాల్లోపు కామెర్లు వస్తుంటాయి. ఒకవేళ ఇలాంటి వారికి గ్లకోమా ఉన్నట్టయితే ఆ సమయంలో మందులతో చికిత్స చేసి, కామెర్లు నయమయ్యాక నీటికాసులకు సర్జరీ చేస్తారు.


కొన్నిసార్లు పుట్టినప్పుడు బాగానే ఉన్నా.. రెండేళ్లలోపు ఎప్పుడైనా నీటికాసుల లక్షణాలు హఠాత్తుగా రావచ్చు. దీన్ని 'ఇన్‌ఫెంటైల్‌ గ్లకోమా'అంటారు. దీన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోతే జబ్బు ముదిరిపోతుంటుంది. ఒకవేళ ఇది బాగా ముదిరిపోతే చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకని పిల్లల కళ్లలో సమస్యగా అనిపిస్తే వెంటనే స్పందించాలి. కొందరిలో కంటిమీద తెల్లటి పొర, నీలంపొర వంటివి లేకపోయినా కనుగుడ్డు పెద్దగా ఉండొచ్చు. కార్నియా విస్తీర్ణం పెద్దగా ఉంటుంది. ఇది కూడా నీటికాసుల ఆనవాళ్లను పట్టిచ్చే లక్షణమే. ఇలాంటి దాన్ని గుర్తిస్తే వెంటనే గ్లకోమా ఉందో లేదో నిర్ధారించుకోవటం ఉత్తమం.

నిర్ధారించేదెలా?
పిల్లలు అటూ ఇటూ కదులుతుంటారు కాబట్టి వీరిలో గ్లకోమా కంటి పరీక్షలు చేయటానికి ముందు కొద్దిగా మత్తు మందు ఇస్తారు. తర్వాత కంట్లో ఒత్తిడి ఎంత మేరకు ఉందో పరీక్షిస్తారు. కార్నియా చుట్టుకొలతను కొలుస్తారు. ప్రత్యేకమైన పరికరం సాయంతో దృశ్యనాడి మీద ఒత్తిడి పడుతోందా? అన్నదీ పరిశీలిస్తారు. దృశ్యనాడి 'కపింగ్‌' ఏర్పడిందేమో చూస్తారు. నీటికాసుల సమస్య ఉందని నిర్ధారణకు వస్తే- పిల్లలు సర్జరీ, మత్తు తట్టుకోగలరా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు మరికొన్ని రక్తపరీక్షలు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు వంటివీ పరీక్షిస్తారు. ఆ తర్వాతే మత్తుమందు ఇచ్చి కంటికి ఆపరేషన్‌ చేస్తారు.

* కొన్నిసార్లు బిడ్డల ముఖం ఆకృతి మారిపోవటం, ముఖంలో ఒక భాగం ఎర్రగా అవటం వంటివీ నీటికాసులతో ముడిపడిన లక్షణాలు కావచ్చు. కాళ్లూ చేతులు, కడుపులోని అవయవాలు సరిగా ఏర్పడకపోవటం వంటి ఇతర లోపాలతోనూ గ్లకోమా ముడిపడి ఉండొచ్చు.

* కొన్నిసార్లు హఠాత్తుగా కంట్లో ఒత్తిడి పెరిగి.. దాంతో నొప్పి, కళ్లు ఎర్రబడటం, అసౌకర్యం వంటి లక్షణాలు కనబడతాయి. నొప్పి మూలంగా వాంతులు కూడా కావొచ్చు. బల్బును చూసినపుడు దాని చుట్టూ ఇంధ్రధనుస్సు ఆకారంలో కాంతి కనిపిస్తుంది. సాధారణంగా ఇది గ్లకోమా తీవ్ర దశలో, అంతకు ముందు దశలో కనిపిస్తుంది.

* ఒక రకం నీటికాసుల్లో కనుగుడ్డు పెద్దగా ఉన్నా, అది పైకి అంతా బాగానే కనబడుతుంటుంది. అయితే ఐదారు నెలల తర్వాత కనుగుడ్డు హఠాత్తుగా మబ్బుమబ్బుగా మారుతుంది. కంట్లో ఒత్తిడి పెరిగి కార్నియా పొరలోకి నీరు చేరి.. కనుగుడ్డు మసకమసకగా కనబడుతుంది.

ఎందుకొస్తుంది?
సాధారణంగా మన కంట్లో నిరంతరం నీరు ఊరుతూ.. కొత్తది వస్తూ, పాతది బయటకు పోతుంటుంది. ఈ నీరు కంటిని శుభ్రం చేస్తూ, కంటికి కావాల్సిన పోషకాలు అందిస్తుంటుంది. ఈ నీరు బయటకు వెళ్లిపోవటానికికంట్లో ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. కానీ కొందరికి పుట్టుకతోనే ఈ బయటకు వెళ్లే మార్గం మూసుకొని ఉండొచ్చు. దీంతో కంట్లో నీరు వస్తూ, అది బయటకు వెళ్లే అవకాశం లేకపోవటం వల్ల అక్కడే నీరు చేరిపోతుంటుంది. ఫలితంగా కంట్లో ఒత్తిడి పెరిగిపోయి కనుగుడ్డు పెద్దగా అవుతుంది. పసిబిడ్డల్లో కనుగుడ్డు సైజు పెరగటంతో పాటు అది నీలంగా, లేదా తెల్లగా కనబడుతుంది. కనుగుడ్డు మామూలుగానే ఉన్నా కొందరిలో ఐదారు నెలల తర్వాతా బయటపడొచ్చు. నీరు బయటకుపోకుండా ఒత్తిడి పెరిగిపోవటం వల్ల... కంటిచూపునకు అత్యంత కీలకమైన దృశ్యనాడి దెబ్బతినిపోవటం ఆరంభమవుతుంది. దీన్ని 'కపింగ్‌' అంటారు, ఇది నీటి కాసులతో ఉన్న అత్యంత ప్రమాదకరమైన, చూపును హరించివేసే సమస్య. కొన్నిసార్లు ఈ డ్రైనేజీ మార్గం సక్రమంగా ఉన్నప్పటికీ అందులో అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా నీటికాసులు రావొచ్చు, సాధారణంగా పెద్దవారిలోకనబడే రకం ఇది!

చికిత్స ఏమిటి?
పెద్దవారిలో వచ్చే గ్లకోమాను చాలావరకూ మందులతో నియంత్రించొచ్చు, ఇందుకు కంట్లో ఒత్తిడిని తగ్గించేవి, నీరు ఎక్కువగా బయటకుపోయేలా చేసేవి.. ఇలా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు లేజర్‌ చికిత్స, దాంతోనూ ఫలితం ఉండదనుకుంటే సర్జరీ చేస్తారు. అయితే పుట్టుకతో వచ్చే నీటికాసులకు మాత్రం చాలావరకూ శస్త్రచికిత్స తప్ప మరో ఉత్తమ మార్గం లేదు. దీన్ని వీలైనంత త్వరగా చేయటం అవసరం. కంట్లో ఒత్తిడి ఎంతమేరకు ఉంది? దీన్ని దృశ్యనాడి ఎంత వరకు భరించగలదు? తదితర అంశాలను బట్టి శస్త్రచికిత్స చేస్తారు. శస్త్రచికిత్సలో భాగంగా మూసుకుపోయిన డ్రైనేజీ మార్గాన్ని తెరుస్తారు.

సర్జరీ ఫలితాలెలా ఉంటాయి?
శస్త్రచికిత్స తర్వాత చూపు తిరిగి వస్తుంది. అయితే ఇది గ్లకోమా తీవ్రతను బట్టి ఉంటుంది. ఒత్తిడి, కనుగుడ్డు పరిమాణం, లోపలి కోణంలో లోపం వంటి అంశాల ఆధారంగా గ్లకోమాను స్వల్ప, ఓ మోస్తరు, తీవ్ర రకాలుగా వర్గీకరిస్తారు. స్వల్ప, ఓ మోస్తరు నీటికాసులు గల పిల్లల్లో శస్త్రచికిత్స తర్వాత చూపు బాగా మెరుగవుతుంది. కనుగుడ్డు పెద్దగా అయిన వారికి చక్కటి చూపు కోసం మైనస్‌ పవర్‌ అద్దాలు అవసరమవుతాయి. పుట్టుకతో వచ్చే గ్లకోమాలో కనుగుడ్డు పెద్దగా అవుతుంది. సర్జరీ తర్వాత కూడా ఆ సైజు అంతగా తగ్గదు. కాబట్టి సర్జరీ తర్వాత 70-80% పిల్లలకు కళ్లద్దాలు అవసరమవుతాయి. ఆర్నెల్లు, ఏడాది పిల్లలకూ అద్దాలు సిఫారసు చేస్తారు. మొదట్లో వీళ్లు అద్దాలను పెట్టుకోవటానికి ఇష్టం చూపకపోయినా.. క్రమేపీ అద్దాలతో చూపు బాగా కనబడుతుంటే నెమ్మదిగా వాటికి అలవడతారు. కళ్లద్దాలు తీయటానికి ఇష్టపడరు కూడా.

అయితే గ్లకోమా తీవ్రంగా ఉన్నవారికి ఆపరేషన్‌ చేసినప్పటికీ అప్పటికే దృశ్యనాడి దెబ్బతిని ఉండటం వల్ల పోయిన చూపు తిరిగి రావటం కష్టం. ఇలాంటి వారికి ఆపరేషన్‌తో పాక్షికంగా మాత్రమే ప్రయోజనం ఉంటుంది, ముఖ్యంగా ఉన్న చూపును పరిరక్షించటం కీలకంగా మారుతుంది. ఉన్నచూపు మరీ దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ ఉన్న చూపుతోనే వాళ్లు చూడటం, చదవటం వంటివి ఎలా సాధ్యమో పరిశీలిస్తారు.

జీవితాంతం పరీక్షలు తప్పనిసరి..
ఒకసారి గ్లకోమా వస్తే- సర్జరీ చేసినా, చేయకున్నా ఎవరైనా సరే జీవితాంతం తరచుగా వైద్యులతో పరీక్షించుకోవటం తప్పనిసరి. తీవ్ర గ్లకోమా గలవారిలో చూపు విస్తీర్ణం తగ్గిపోతుంది. దీన్ని గుర్తించి సరిగ్గా చికిత్స తీసుకోకపోతే చూపు పూర్తిగా పోయే ప్రమాదముంది. అందువల్ల తరచుగా డాక్టరుకి చూపించుకుంటూ కంట్లో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక కారణాల వల్ల మందులు వేసుకోలేని స్థితి ఉంటే ఆ విషయాన్ని ముందే డాక్టర్లతో చర్చించటం అవసరం. దీన్నిబట్టి అవసరమైతే వెంటనే శస్త్రచికిత్స చేయటానికి వీలుంటుంది. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత.. ఆపరేషన్‌ అయిపోయిందని సరిపెట్టుకోవటం తగదు. తర్వాత కూడా వైద్యులు చెప్పినట్టుగా కచ్చితంగా పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం.

ఒక కన్ను పెద్దగా ఉన్నా..
పిల్లల్లో ఒక కన్ను పెద్దగా ఉంటే కొందరు అది అందానికి చిహ్నమని భావిస్తుంటారు. నిజానికి ఇది గ్లకోమా ఉందనటానికి గుర్తు. అది అప్పటికి బయటపడక పోయినప్పటికీ 10, 12 ఏళ్లు గడిచేసరికి దృశ్యనాడి దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఇది పెద్దవారిలో కనిపించే 'ఓపెన్‌ యాంగిల్‌ గ్లకోమా'లా పరిణమిస్తుంది. దీన్ని పెద్దవారిలో మాదిరిగా మందులతో కొంతకాలం అదుపులో పెట్టొచ్చు గానీ శస్త్రచికిత్స చేయటమే ఉత్తమం.


మేనరికాలతో కష్టం
అమెరికా వంటి దేశాల్లో ప్రతి 15,000 మందిలో ఒకరు నీటికాసులతో పుడుతున్నారు. అదే మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో నీటికాసులతో పుట్టే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. 'ఆంధ్రప్రదేశ్‌ ఐ డిసీజ్‌ స్టడీ' ప్రకారం.. మన రాష్ట్రంలో ప్రతి 3,300 మంది పిల్లల్లో ఒకరు నీటికాసులతో పుడుతున్నట్టు అంచనా. అంటే పాశ్చాత్య, ఐరోపా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఐదారు రెట్లు ఎక్కువన్న మాట. ఇందుకు మేనరికాలు, దగ్గరి సంబంధీకుల మధ్య వివాహాలు కూడా కారణమవుతున్నాయి. మేనరికం, దగ్గరి సంబంధీకులను వివాహం చేసుకున్నవారిలో తల్లి తరఫున గానీ తండ్రి తరఫున గానీ గతంలో ఎవరికైనా నీటికాసులు ఉండి ఉంటే వారి పిల్లలకూ వచ్చే అవకాశముంది. అలాగే నీటికాసుల బారినపడ్డ వారికి పుట్టే పిల్లలకూ నీటికాసులు వచ్చే అవకాశం ఉంది గానీ తప్పకుండా రావాలనేం లేదు. ఒక బిడ్డ నీటికాసుల సమస్యతో పుడితే- తల్లిదండ్రుల రక్తనమూనాలతో జన్యు పరీక్షలు చేసి, తర్వాత పుట్టే బిడ్డల్లో ఈ సమస్య వచ్చే అవకాశాలేమైనా ఉంటాయా? అన్నది కొంత వరకూ అంచనా వెయ్యచ్చు.

స్టిరాయిడ్లు.. ఇష్టారాజ్యంగా వాడొద్దు
కొన్నిసార్లు పిల్లలకు వాడే మందుల దుష్ప్రభావాలతో కూడా నీటికాసుల వంటి తీవ్ర సమస్యలు రావచ్చు. పిల్లల్లో కంటి దురదలు, అలర్జీలకు కంటి వైద్యులు స్టీరాయిడ్‌ చుక్కల మందులు రాస్తారు. వీటిని వైద్యులు తగు మోతాదులోనే ఇస్తారు. కానీ తల్లిదండ్రులు వారి సూచనలు పాటించకుండా అవసరానికి మించి అధికమోతాదులో గానీ, దీర్ఘకాలంగానీ వాడితే నీటికాసులకు దారితీసే ప్రమాదముంది. దీన్ని 'డ్రగ్‌ ఇండ్యూస్‌డ్‌ గ్లకోమా' అంటారు. కాబట్టి కంటిచుక్కల మందులను వైద్యుల సలహాలు, సిఫార్సులు లేకుండా దుకాణాల్లో కొనుక్కుని వాడెయ్యద్దు.

Post a Comment

0 Comments