If platelets count decrease?,ప్లేట్‌లెట్లు తగ్గిపోతే?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
డెంగ్యూ లాంటి కొన్ని వ్యాధుల్లో ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం సహజం. అలా ప్లేట్లు తగ్గడం మొదలెట్టగానే అయిన వాళ్లంతా బెంబేలెత్తిపోతారు. వెంటనే ప్లేట్‌లెట్‌లు ఎక్కించేందుకు పరుగు తీస్తారు. వాస్తవానికి,రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతిసారీ వాటిని బయటినుంచి ఎక్కించవలసిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఆ అవసరం ఉంటుంది. శరీరం ప్లేట్‌లెట్లను తిరిగి ఉత్పత్తి చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా కొందరు ప్లేట్‌లెట్లు ఎక్కించడానికే సిద్ధమవుతారు. అలా అవసరం లేనివారికి కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ పోతే, అత్యవసరమైన కొందరికి అవి అంద కుండా పోతాయని నిపుణులు అంటున్నారు. ప్లేట్‌లెట్ల లోపాల మూలాలు, వాటి నివారణోపాయాల గురించిన వివరాలకు వెళితే....
శరీర వ్యవస్థలో ప్లేట్‌లెట్లకో ప్రత్యేక స్థానమే ఉంది. రక్తంలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్లు అనే మూడు రకాల మౌలిక కణాలు ఉంటాయి. ఈ మూడూ ఎముక మజ్జ (బోన్ మేరో) నుంచే ఉత్పత్తి అవుతాయి. తెల్ల రక్తకణాలు శరీరం రోగగ్రస్తం కాకుండా చూసే రక్షక దళంగా అంటే వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ద్వారానే శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందుతుంది. ఇక మిగిలినవి ప్లేట్‌లేట్లు. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య శరీర ధర్మాన్ని అనుసరించి వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. సాదారణంగా ఒక వ్యక్తిలో ఒకటిన్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల దాకా ఉంటాయి. అంతే తప్ప అందరికీ ఒకే సంఖ్యలో ఉండాలని లేదు. పైగా అవి స్థిరంగా కూడా ఉండవు. ఒక వ్యక్తిలోనే ప్లేట్‌లెట్లల సంఖ్య రోజుకో పరిమాణంలో ఉంటుంది. వీటి సంఖ్య ఒకటిన్నర నుంచి నాలుగున్నర లక్షల మధ్య ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే. ప్లేట్‌లెట్ కణం జీవిత కాలం 7 నుంచి 10 రోజుల దాకా ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్టేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరతాయి.
రక్తస్రావాన్ని నివారిండంలో...
శరీరానికి గాయమైనప్పుడు కాసేపు ర క్తం స్రవిస్తుంది. ఆ తరువాత దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్రక్రియ వెనుక రక్తనాళం, ప్లేట్‌లెట్లు, రక్తం గడ్డకట్టే వ్యవస్థల (కోయాగులేషన్ సిస్టం) పాత్ర కీలకమైనది. రక్తనాళం లోపల సహజంగానే 'ఎండో థీలియం' అనే పొర ఉంది. ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతోంది. ఏదైనా కారణం వల్ల ఈ పొరకు దెబ్బ తగిలితే రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్లేట్‌లెట్‌లు సిద్ధమవుతాయి. కొన్ని ప్లేట్‌లెట్లు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి గడ్డగా మారతాయి. ప్లేట్‌లెట్లకు తోడుగా రక్తం గడ్డకట్టే వ్యవస్థ నుంచి 'ఫిబ్రిన్' విడుదలవుతుంది. ప్లేట్‌లెట్లు, ఫిబ్రిన్ గాయమైన చోట గడ్డగా ఏర్పడతాయి. ఫలితంగా రక్తస్రావం ఆగిపోతుంది. అయితే ప్లేట్‌లెట్లు మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయమూ లేకుండానే రక్తస్రావం అవుతుంది.
ర క్తస్రావం ఎందుకు ?
తమ విధులు నిర్వహించడంలో ప్లేట్‌లెట్లు విఫలమవుతూ ఉంటాయి. అప్పుడిక రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోవడం గానీ, ప్లేట్‌లెట్ల నాణ్యత త గ్గిపోవడం గానీ, కారణం కావచ్చు. ప్లేట్‌లెట్ల సంఖ్య నార్మల్ గానే ఉన్నా, రక్తస్రావం ఆగకపోవడానికి ఉన్న ప్లేట్‌లు నాణ్యంగా లేకపోవడమే మూలం. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండడానికి మౌలికంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది ప్లేట్‌లెట్ల ఉత్పత్తే తక్కువగా ఉండడం. దీనికి ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడమే కారణం. ఎముక మజ్జ సరిగా పనిచేయకపోవడానికి పలు కారణాలున్నాయి. వాటిలో ఎముక మజ్జ బలహీనపడటం ఓ కారణం. కొందరిలో మజ్జ బాగానే పనిచేస్తూ ఉంటుంది. ప్లేట్‌లెట్‌ల ఉత్పత్తి బాగానే ఉంటుంది. కానీ, అవి క్షీణించే వేగం ఎక్కువగా ఉంటుంది. కొందరిలో బ్లడ్ క్యాన్సర్ వల్ల ఇలా క్షీణిస్తాయి. మామూలుగా మన శరీరంలో ఉండే ప్లేట్‌లెట్లలో మూడోవంతు ప్లీహం(స్ప్లీన్)లో నిలువ ఉంటాయి. అయితే కొన్ని రకాల జబ్బుల మూలంగా ఒక్కోసారి ప్లీహం బాగా పెద్దదవుతుంది. అప్పుడు ప్లేట్‌లెట్లలో మూడోవంతు కన్నా ఎక్కువగా ప్లీహంలోకి వెళతాయి. ఇందువల్ల రక్తంలో ఉండే ప్లేట్‌లెట్లు సంఖ్య బాగా తగ్గుతుంది.
మరికొన్ని మూలాలు
ప్లేట్‌లెట్ ఉత్పత్తి లోపాలు కొన్ని పుట్టుకతో వచ్చేవి కావచ్చు. మరికొన్ని బాహ్యమైన ప్రభావాలతో వచ్చేవి కావచ్చు. ఈ రెండవ రకం సమస్యకు కారణం హృద్రోగులు రక్తం పలచబరచడానికి వాడే మాత్రలు. ఈ మాత్రల వల్ల కొందరిలో ప్లేట్‌లెట్‌లు సంఖ్యా పరంగానో లేదా నాణ్యతా పరంగానో తగ్గిపోతుంటాయి. కొన్ని యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ప్లేట్‌లెట్లు త గ్గే ప్రమాదముంది.ప్లేట్‌లెట్లు తగ్గడంలో ఇన్ఫెక్షన్ల పాత్ర కూడా ఉంటోంది. వాటిలో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల్లో ఈ తరహా ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎముక మజ్జలో క్షయ మొదలైనప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కూడా ప్లేట్‌లెట్లు పడిపోవడానికి దారి తీస్తోంది. కొందరిలో ఎముక మజ్జలో ఫైబ్రోస్ టిష్యూ చోటుచేసుకుంటుంది. మైలో డిస్‌ప్లేషియా అనే జబ్బులో కూడా ఎముక మజ్జ దెబ్బతిని ప్లేట్‌లెట్లు బాగా పడిపోతాయి.
ఎలా తెలుస్తుంది ?
ఎప్పుడైనా రక్తస్రావం అయితే తప్ప సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేలకు తగ్గేదాకా ఏ లక్షణాలూ కనిపించవు. ఒకవేళ అంతకన్నా పడిపోతే మాత్రం వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. సూక్ష్మ రక్తనాళాల్లోంచి చిట్లినట్లు కొందరి చర్మం మీద చుక్కల్లా చిన్న చిన్న రక్తం మచ్చలు కనిపిస్తాయి. ఇక స్త్రీలలో అయితే బహిష్టు సమయంలో రక్తస్రావం మామూలుగా కన్నా చాలా ఎక్కువగా (మెనొరేజియా)అవుతుంది. స్త్రీలలో అతిగా రక్తస్రావం కావడానికి ఎంతసేపూ గర్భాశయ సమస్యలే కారణమని అనుకోకుండా, ప్లేట్‌లెట్లు తగ్గాయేమోనని అనుమానించాలి. శస్త్ర చికిత్స అయిపోయిన కొన్ని గంటల తరువాత కొందరిలో రక్తస్రావం మొదలవుతుంది. కాకపోతే ప్లేట్‌లెట్ల సంఖ్య సరిగానే ఉందని శస్త్ర చికిత్స చేసేస్తే వాటిని నాణ్యతలో లోపాల కారణంగా రక్తస్రావం కావచ్చు. ఇది అతి తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అలాంటి స్థితిలో ప్లేట్‌లెట్ కణాల నాణ్యతను తెలుసుకునేందుకు ''రిస్టాసెటిన్'' అనే పరీక్ష చేయవలసి రావచ్చు.
కొందరిలోనే...
ప్లేట్‌లెట్లు తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని కాదు. కొందరిలో ఏ లక్షణమూ కనిపించకపోవచ్చు. నిజానికి ప్లేట్‌లెట్ల సంఖ్య 10 వేలకు పడిపోయే దాకా రక్తస్రావాలేమీ ఉండవు. డెంగ్యూ సోకిన వారి విషయంలో వారికి 30 వేలకు పడిపోగానే విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. ఒకవేళ 10 వేల కన్నా తక్కువయినా... అప్పుడే శస్త్ర చికిత్స చేయవలసి వచ్చినా... అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. ఎముక మజ్జ లోపాలతో ప్లేట్‌లెట్లు తగ్గిపోయిన వారిలో తెల్ల రక్తకణాలు, ఎర్రరక్తకణాల్లో కూడా లోపాలు ఉంటాయి. వాటి ప్రభావంతో వేరే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.
డెంగ్యూ ఉన్నప్పుడు ఆ వ్యాధి లక్షణాలన్నీ ఉంటాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ప్లేట్‌లెట్లు బాగా పడిపోయినప్పుడు రక్తస్రావంతోనూ రావచ్చు. నోరు, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, పేగుల్లోంచి రక్తస్రావం అయితే నల్లటి విరేచనాలు కావడం వంటివి కనిపిస్తాయి. రక్తస్రావం మొదలయ్యిందీ అంటే ఇక ప్లేట్‌లెట్లు ఎక్కించవ లసిందే. రక్తస్రావమేదీ లేకపోతే 10 వేలకు వచ్చేదాకా ప్లేట్‌లెట్లు ఎక్కించవలసిన అవసరం లేదు. ఒక వేళ ఎక్కడైనా రక్తస్రావం అవుతూ ఉంటే అప్పుడింక 20 వేలు ఉన్నప్పుడు కూడా ఎక్కించవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్‌లు ఏ సంఖ్యలో ఉండాలన్నది వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా ప్లేట్‌లెట్లు 10 వేల కన్నా త గ్గినప్పుడు రక్తస్రావం మొదలవుతుంది. అయితే ఈ రక్తస్రావం శరీరంలోని కీలక భాగాల్లో జరిగితే అది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. ఉదాహరణకు మెదడులో రక్తస్రావం కావడం. ఇక మిగతా భాగాల్లో లివర్, కిడ్నీల్లో రక్తస్రావం సమస్య ఉండదు. కానీ, ముక్కులోంచి గానీ, నోటి నుంచి గానీ, పేగుల్లోంచి గానీ, గర్భాశయం లోంచి గానీ, రావచ్చు.
చికిత్స
కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతే మలేరియాకే చికిత్స చేయాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్లు పడిపోతూ ఉంటే వెంటనే ఆ మందులు మానేయాలి. మానేసిన వెంటనే ప్లేట్‌లెట్లు వాటికవే పెరుగుతాయి. ముందు కారణానికి చికిత్స చేస్తూ వెళ్లాలి. ఒకవేళ అప్పటికీ రక్తస్రావం ఉంటే ప్లేట్‌లెట్ల తోడ్పాటు కూడా తీసుకోవాలి. డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల వచ్చే సమస్య. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. డెంగ్యూ జ్వరం తగ్గేలోపే కొందరిలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య చాలా వేగంగా పడిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో రక్తస్రావం కూడా కావచ్చు. అప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కించి పరిస్థితిని నిలకడగా ఉంచవలసి ఉంటుంది.
చాలా మంది ప్లేట్‌లెట్లు ఏకాస్త తగ్గినా వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలనే అభిప్రాయంతో ఉంటారు. అది సరికాదు. సాధారణంగా 10 వేల కన్నా తగ్గితే గానీ, ప్రమాదం రాదు. ఒకవేళ 10 వేల కన్నా ఎక్కువే ఉన్నా రక్తస్రావం ఉంటే మాత్రం ఎక్కించక తప్పదు. ఐటిపి (ఇడియోపతిక్ థ్రాంబోసైటోపేనిక్ పర్‌ప్యూరా) అనే సమస్యలోనూ ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోతుంటాయి. ఏ కార ణంగా వస్తుందో మాత్రం తెలియదు. అన్ని రిపోర్టులూ నార్మల్ అనే వస్తాయి. కానీ, ప్లేట్‌లెట్లు మాత్రం పడిపోతుంటాయి.. కొందరిలో ఆటో ఇమ్యూన్ డిసీస్ కారణంగా కూడా ప్లేట్‌లెట్లు పడిపోవచ్చు.ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్లు మరీ తీవ్రమైన ప్పుడు డి ఐసి ( డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగులేషన్) అనే సమస్య తలెత్తుతుంది. ఇందులో కూడా ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గిపోతుంటాయి. అలాగే టిటిపి ( థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపేనిక్ పర్‌ప్యూరా) సమస్యలోనూ, హెచ్‌యుఎస్ (హెమోలైటిక్ యూరిమిక్ సిండ్రోమ్) ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గిపోతుంది.తగ్గిపోయిన ప్లేట్‌లెట్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి సహజంగానే శరీరానికి ఉంటుంది. చాలాసార్లు మనం చేయవలసిందల్లా వ్యాధి దుష్ప్రభావాలను నియంత్రిస్తూ ఉండడమే. ఇక అనివార్యమమైనప్పుడు ప్లేట్‌లెట్లు ఎలాగూ ఎక్కిస్తాం. అంతే గానీ ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడల్లా వాటిని ఎక్కించవలసిన అవసరం లేదు. ప్లేట్‌లెట్ అనేది నిజంగా ఎంతో అరుదుగా లభించే ఉత్పాదన. అందువల్ల అత్యవసరమైనప్పుడే వాటిని వినియోగించాలి. అంతేగానీ, అవసరం లేకపోయినా వాటిని వినియోగించుకుంటూ పోతే... అత్యవసరమైన వారికి అవి లభించవు. అమూల్యమైన ప్లేట్‌లెట్లను అత్యవసర పరిస్థితులల్లో వినియోగించడానికే పరిమితమైతే నిజంగా వాటి అవసరమున్న ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.
0 Comments