Full Style

>

మూత్రపిండాల మార్పిడి,kidney transplantation



మీరు ఏమి తింటారో అదే అవుతారు' అని పెద్దలు చెప్పారు. రెండు రోగాల విషయంలో ఇది అక్షరసత్యం. ఒకటిమధుమేహం, రెండు మూత్రపిండాల వ్యాధి. జీవితపు ఆరంభ దశాబ్దాలలో సాధారణంగా మనం ఏది రుచిగా అని పిస్తే అది తినేస్తూ ఉంటాము. దీనితో మనకు ఎదురయ్యే మొదటి సమస్య ఊబకాయం. ఇది, ఎక్కువకాలం కొనసాగితే, ఆ తర్వాత మధుమేహం మెల్లగా చేరుకోవటం ప్రారంభిస్తుంది.ఆ తర్వాత మూత్రపిండాల వ్యాధి రోగాల చిట్టాలో చేరుకోగానే, రోగాలు మిమ్మల్ని ఇలా ఎలా వేధించగలుగుతున్నాయని ఆశ్చర్యపోవటం ప్రారంభిస్తారు.

మానవ శరీరంలో మూత్రపిండాలపాత్ర అమోఘం. ప్రతి మనిషి శరీరంలో ఈ మూత్రపిండాలు ప్రతి రోజు దాదాపు రెండు వందల లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంటుంది. ఇది నిరంతరం పని చేస్తుంటుంది. మూత్రపిండాలు పాడైతే మనిషి జీవితంలో సగభాగం అంతమైనట్లేనని చెపుతుంటారు. అలాంటి మూత్రపిండాలను సంరక్షించుకోవడంపై అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సం మార్చి 11న ప్రపంచ మూత్రపిండ దినోత్సవాన్ని నిర్వహించడం గమనార్హం.

మధుమేహం కారణంగానే మూత్ర పిండాలు పాడైపోతుంటాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే మూత్రపిండ వ్యాధులను క్రమబద్దీకరించలేము . మూత్రపిండ వ్యాధి వలన కలిగే హాని క్యాన్సర్, గుండె జబ్బుల వల్ల కలిగే హాని కన్నా ప్రమాదకరమైంది . కేవలం ఒక్క మధుమేహం కారణంగానే 40 నుంచి 50 శాతం తీవ్రస్థాయి మూత్రపిండాల వ్యాధుల బారిన పడిన వారికి డయాలసిస్‌, మూత్రపిండాల మార్పిడి అవసరమవుతోంది . మూడింట ఒకవంతు మధుమేహ రోగుల్లో 15-20 సంవత్సరాల్లో మూత్రపిండ వ్యాధులు ప్రారంభమవుతాయి. డయాలసిస్‌, మూత్రపిండాల మార్పిడి చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో వైద్యులు, చికిత్సా కేంద్రాల కొరతను కూడా అధికంగానే ఉందని చెప్పాలి.

దేశంలో, రాష్ట్రంలో వేలమంది మూత్రపిండాల గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఆప్తులుండీ ఇచ్చే అవకాశం లేక, రక్తం గ్రూపు సరిపోక, దానం చేసే అవకాశం ఉన్నవారికి దీనిపై అవగాహన లేక... ప్రాణాపాయానికి చేరువవుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏడాదికి 1,50,000 మూత్రపిండాలు అవసరమవుతాయని వైద్య నిపుణుల అంచనా. అయితే ఏటా జరిగే శస్త్రచికిత్సలు మాత్రం 3వేల నుంచి 4వేల వరకు మాత్రమే ఉంటున్నాయి. మన రాష్ట్రంలో కిడ్నీలు అవసరమైనవారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఏడాదికి 500 మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నగరంలో గుర్తింపు పొందిన కొన్ని ఆసుపత్రుల్లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఆసుపత్రి వద్ద వాటి కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా ఉంది. వీరికి రక్తసంబంధికుల వద్ద కిడ్నీలు దొరక్క, వయస్సు, ఇతర రోగాలు వంటి కారణాల వల్ల మార్పిడి కుదరడం లేదు. దీంతో రక్తమార్పిడి ద్వారా ప్రాణాలను నిలుపుకొంటూ వస్తున్నారు. ఇందుకోసం ఒక్కోసారికి రూ.1000 నుంచి 2000 వరకు వసూలు చేస్తున్నారు. అదే కిడ్నీల మార్పిడికి లక్షన్నర నుంచి రూ.మూడు లక్షల వరకు తీసుకుంటున్నారు.

మూత్రపిండాల మార్పిడిని రెండు రకాలుగా నిర్వహిస్తారు. రక్త సంబంధీకులు లేదా సమీప బంధువుల కిడ్నీలను తీసి అమర్చడం ఒక విధానం. ప్రమాదాలు, రోగాల వల్ల మరణానికి చేరువై, శరీరంలోని ముఖ్యమైన అవయవాలు పనిచేస్తూ ఉన్నా... బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు నిర్ధరించిన వ్యక్తి కిడ్నీలను అవసరమైనవారికి అమర్చడం. ఈ రెండో విధానాన్ని 'కడేవర్‌' పద్ధతి అంటారు. వివిధ సమస్యల వల్ల రక్తసంధీకుల ద్వారా కిడ్నీ మార్పిడి జరుగుతున్న సందర్భాలు తక్కువగా ఉంటున్నాయి. వీటిలో విజయం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక కడేవర్‌ విధానం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రయోజనం కలగడం లేదు. దీనిపై ప్రచారం చేయడానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏటా 15వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధరించిన వ్యక్తుల నుంచి మూత్రపిండాలను సేకరించి అవసరమైన వారికి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ముందుగా బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి సంబంధీకుల నుంచి అనుమతి పొందాలి. తగిన అవగాహన లేకపోవడం వల్ల ఇలా దానమివ్వడానికి ఎక్కువమంది ముందుకు రావడం లేదు. రక్త సంబంధీకుల ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 95 శాతం విజయవంతమవుతాయనీ, అదే కడేవర్‌ విధానంలో 60 నుంచి 65 వరకు ఉంటుందని మెడిసిటీ ఆసుపత్రి మూత్రపిండాల నిపుణుడు ఎ.గోపాలకిషన్‌ పేర్కొన్నారు. విదేశాల్లో బాగా అమలవుతున్న కడేవర్‌ విధానంపై మన దేశంలో అవగాహన తీసుకువస్తే విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. అవయవాల దానంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునే విధానంపై కేంద్ర ప్రభుత్వం 1995లోనే చట్టం చేసింది. కానీ దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన తీసుకువచ్చిన దాఖలాలు లేవు. నేత్రాలు, రక్తదానాలపై స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా కృషి చేస్తుండడంతో వాటికి బాగా ప్రాచుర్యం లభించింది. మూత్రపిండాల దానంపై ఆ స్థాయిలో కృషి జరగడం లేదు.పదేళ్లు వయసు వస్తేగాని మూత్రపిండాల మార్పిడి చేయకూడాదు.



మూత్రపిండాల మార్పిడి : దాత ఎంపిక

మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోదలచిన రోగులు ముందుగా తమకు చికిత్స చేస్తున్న వైద్యులతో ఈ అంశం సాధ్యాసాధ్యాల గురించి సమగ్రంగా చర్చించాలి. తమకు మూత్రపిండం ఎవరు దానం చేయనున్నారు? అది తన శరీరానికి సరిపోతుందా? లేక శరీరం దానిని తిరస్కరిస్తుందా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఒకవేళ మూత్రపిండం దానం చేయడానికి సమీప బంధువులు లేనిపక్షంలో అప్పుడే మరణించిన వ్యక్తినుంచి సేకరించే మూత్రపిండాన్ని తనకు అమర్చాలంటే ఏం చేయాలి?

మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స తరువాత ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు ఎంతకాలం వాడాలి? వంటి అంశాలను చర్చించాలి.అలాగే సమీప బంధువుల్లో ఎవరైనా మూత్ర పిండాన్ని దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారా?అనే విషయాన్ని స్పష్టీకరించుకోవాలి. మూత్రపిండం దానం చేయడం ద్వారా తనకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోననే భయాన్ని వ్యక్తం చేసే వారినుంచి వైద్యులు మూత్రపిండాన్ని సేకరించరు.

మూత్రపిండాన్ని దానం చేయడానికి అంగీకరించిన వ్యక్తికి కూడా రోగితోపాటు వారికి కూడా కొన్ని పరీక్షలు చేస్తారు. టిష్యూ టైపింగ్‌ చేస్తారు.అలాగే దాత తాలూకు ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించడం, నిర్ణీత క్రమంలో డాక్టర్లు రోగినీ, దాతనూ పరీక్షిస్తూ ఉంటారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, ఇతరత్రా అవసరమైన పరీక్షలు జరుపుతారు. మూత్రపిండాన్ని దానం చేయడానికి సమీప బంధువులు ఎవరూ లేని సమయంలో, తప్పనిసరిగా మృతదేహంనుంచి సేకరించిన అవయవాన్ని అమర్చవలసి వచ్చినప్పుడు వైద్యులు రోగికి సంబంధించిన వివరాలు ముందుగా సేకరించి కంప్యూటర్‌లో భద్రపరుస్తారు. రోగికి ఎటువంటి మూత్రపిండం అవసరమవుతుందనే అంశాన్ని తెలుసుకోవడానికి వీలుగా టిష్యూ టైపింగ్‌ చేసి, వివరాలు కంప్యూటర్‌లో భద్రపరుస్తారు.

సెన్సిటివిటీ స్క్రీనింగ్‌ కోసం డయాలిసిస్‌ కేంద్రంనుంచి రోగికి చెందిన బ్లడ్‌ సీరమ్‌ను తరచుగా టిష్యూటైపింగ్‌ లాబ్‌కు పంపుతుంటారు. నిర్ణీత గడువుల ప్రకారం రోగికి ఎక్స్‌రేలు, రక్తపరీక్షలు మొదలైనవి చేస్తుంటారు. మృతదేహంనుంచి మూత్రపిండాన్ని సేకరించాలంటే, అప్పుడే మరణించిన వ్యక్తి శరీరంనుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దానిని నిర్ణీత గడువులోగా రోగికి అమర్చాల్సి ఉంటుంది. కనుక రోగికి చిరునామా, టెలిఫోన్‌ నెంబర్లు మొదలైన వివరాలు కూడా కంప్యూటర్‌లో భద్రపరుస్తారు. రోగి శరీర తత్వానికి సరిపోయే మూత్రపిండం లభ్యం కావడంతోనే ఆ విషయాన్ని రోగికి తెలియపరుస్తారు.

రోగి ఆసుపత్రికి చేరిన వెంటనే శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది కనుక ఏ విధమైన ఆహారాన్ని తినకూడదనీ, మంచినీటితో సహా ఏ ద్రవాలనూ తీసుకోకూడదనీ చెబుతారు. ఆఖరుసారిగా ఎప్పుడు డయాలిసిస్‌ చేశారనే అంశం ఆధారంగా, అవసరమైతే, మరొకసారి డయాలిసిస్‌ చేస్తారు. మార్పిడి చేయాల్సిన మూత్రపిండాన్ని రోగి శరీరంలో కటి వలయం భాగంలో ఉదరకోశ కండరాల కింద అమరుస్తారు. ఈ భాగంలో ఉన్న రక్తనాళాలకు రోగి శరీరంలో సహజంగా ఉన్న మూత్రపిండాలకు చెందిన ధమనులు, సిరలను కలుపుతారు. తరువాత మూత్రపిండాలనుంచి మూత్రాన్ని మూత్రకోశానికి చేర్చే నాళాన్ని (యురెటర్‌)ను అమరుస్తారు. మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స పూర్తికావడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

మూత్రపిండాల మార్పిడి : రిజెక్షన్‌ సమస్యల

శరీరంలోకి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు శరీరం స్పందించి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి శరీరానికి సంబంధంలేని ఏ పదార్థం శరీరం లోకి ప్రవేశించిన దానిని ఫారెన్‌బాడీ అని వ్యవహరిస్తారు. ఇటువంటి 'వెలుపలినుంచి వచ్చిన ఒక కొత్త అవయవం లేదా కణజాలం (ఫారెన్‌బాడీ) పట్ల కూడా శరీరం స్పందించి దానిని తిరస్కరిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో రిజెక్షన్‌ అంటారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయిం చుకున్న ప్రతి వారికి ఏదో ఒక స్థాయిలో ఈ రిజెక్షన్‌ అనుభవమవుతుంటుంది. ఈ రకమైన రిజెక్షన్‌ సమస్య ఏర్పడిందంటే వారికి అమ ర్చిన మూత్రపిండం కూడా పనికి రాకుండా పోతుందని అర్థం కాదు. రిజెక్షన్‌ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తరుణ లేదా ఎక్యూట్‌ రిజెక్షన్‌.
రెండవది దీర్ఘకాలిక లేదా క్రానిక్‌ రిజెక్షన్‌.

ఎక్యూట్‌ రిజెక్షన్‌
మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సానం తరం సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య ఎక్యూట్‌ రిజెక్షన్‌. కొన్ని సందర్భాలలో దీనిని నిర్ధారించడం కష్టమవుతుంది. సరైన చికిత్సతో ఎక్యూట్‌ రిజెక్షన్‌ను సరిచేయడానికి అవకాశం ఉంది. ఎక్యూట్‌ రిజె క్షన్‌ లక్షణాలు బహిర్గతం కావడానికి ముందే వ్యాధి నిర్దారణ పరీక్షల ద్వారా ఎక్యూట్‌ రిజెక్ష న్‌ను కనుగొనవచ్చు. ఎక్యూట్‌ రిజెక్షన్‌ సమస్యకు గురైన రోగు లకు జ్వరం రావడం, శరీరమంతా నొప్పులు, అకస్మాత్తుగా బరువు పెరగడం, మూత్రం పరిమాణం తగ్గిపోవడం, మూత్రపిండం అమర్చినభాగంలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపి స్తాయి. అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ఈ సమస్య జనించవచ్చు.

మూత్రపిండాల మార్పిడి తరువాత మొదటి మూడు నెలల్లో ఎక్యూట్‌ రిజెక్షన్‌ అనేది సాధా రణంగా కనిపించే సమస్య. అయినప్పటికీ కొంతమందిలో ఇది కొన్ని నెలల తరువాత కానీ, లేదా కొన్ని సంవత్సరాల తరువాత కానీ కనిపించవచ్చు. కొన్ని మందులను నిరంతరం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
ఎక్యూట్‌ రిజెక్షన్‌కు గురైన రోగులు ఇంటి వద్దనే ఉంటూ వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స తీసు కుంటూ ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం రోగి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది.

క్రానిక్‌ రిజెక్షన్‌.

-మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స తరువాత రోగి పూర్తిగా కోలుకోవడమనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా రిజెక్షన్‌ స్థాయి, మూత్ర పిండాలు ఎంత త్వరగా పని చేస్తాయి, యాంటి రిజెక్షన్‌ మందులకు రోగి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు, ఏ ఆపరేషన్‌ తరువాత అయినా ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం కావడమనేది మూత్రపిండాన్ని సేకరించిన దాత మీద ఆధారపడి ఉంటుంది.

సమీప రక్త బంధువునుంచి మూత్రపిండాన్ని సేకరించారా? లేక మృతదేహంనుంచి సేకరిం చారా? అనే అంశాలూ ప్రాధాన్యం వహిస్తాయి. రోగి సమీప రక్త బంధువునుంచి సేకరించిన మూత్రపిండం మార్పిడి చేసినప్పుడు సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే వ్యక్తిగత కేసుల విషయంలో సక్సెస్‌ రేటు విభిన్నంగా ఉన్నప్పటికీ, మొత్తం మీద సక్సెస్‌ రేటు 85 శాతం వరకూ ఉంది.రెండు దశాబ్దాల క్రితం మూత్ర పిండాల శస్త్ర చికిత్స చేయించుకున్న వారిలో ఇప్పటికీ ఆ మూత్రపిండాలు పని చేస్తూనే ఉన్నాయి.

సాధారణంగా మార్పిడి చేసిన మూత్రపిండం ఇంత ఎక్కువ కాలం పని చేయదు. మూత్రపిండాల శస్త్ర చికిత్స చేయించుకున్న పలువురు రోగులు కొంతకాలం తరువాత రెండవ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం వైద్యుల వద్దకు వస్తుంటారు. శస్త్ర చికిత్స తరువాత మూత్రపిండం ఎన్నాళ్లు పని చేస్తుందనే అంశం రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. దాతనుంచి సేకరించి అమర్చిన మూత్ర పిండాన్ని శరీరం తొలి నెలల్లోనే తిరస్కరిస్తే మరొకసారి శస్త్రచికిత్స చేసి ఆ మూత్రపిండాన్ని తొలగించాల్సి ఉంటుంది. తరువాత రోగి మళ్లీ డయాలిసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

అనంతరం మరొక మూత్రపిండం లభ్యమైన తరువాత మళ్లీ శస్త్ర చికిత్స చేసి దానిని అమర్చాల్సి ఉంటుంది. నూతనంగా అమర్చిన మూత్రపిండాన్ని శరీరం దీర్ఘకాలం తరువాత తిరస్కరిస్తే, ఆ మూత్రపిండాన్ని శరీరంనుంచి తొలగించాల్సిన అవసరం ఉండదు. రోగి, దాతలిద్దరూ ఏకరూప కవలలు కాని పక్షంలో, రోగి శరీరం కొత్తగా అమర్చిన మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేక మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిని ఇమ్యునో సప్రసెంట్స్‌ అని వ్యవహరిస్తారు. ఈ మందులను మూత్రపిండం పని చేసినన్నాళ్లూ వాడుతూనే ఉండాలి.

కొత్తగా అమర్చిన మూత్రపిండం (ఫారెన్‌బాడీ) పై శరీర రక్షణ వ్యవస్థ దాడి జరుపకుండా చూడటం కోసం ఇమ్యునో సప్రసెంట్స్‌ను వాడాల్సి ఉంటుంది. ప్రిడ్నిసోన్‌, అజాథియో ప్రిన్‌, సైక్లోస్పోరిన్‌, ఎఫ్‌కె506, యాంటి లింఫో సైట్‌ గ్లోబులిన్‌, ఒకెటి3 ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇమ్యునో సప్రసెంట్‌ ఔషధాలు. సాధారణంగా ఏ ఔషధాలతోనైనా దుష్ప్రభా వాలు కలుగుతాయి.

అదే విధంగా ఇమ్యునో సప్రసెంట్స్‌ ద్వారా కూడా కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవల సింది ఇన్‌ఫెక్షన్‌ గురించి. రోగికి కొత్తగా అమర్చిన మూత్రపిండాన్ని కాపాడటం కోసం శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిలో మార్పులు తీసుకురావడమే కాకుండా, సూక్ష్మక్రిములపట్ల వ్యాధినిరోధక శక్తి స్పందనలో కూడా మార్పులు తీసుకు వస్తుంది. ఈ కారణంగా మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తి పలు ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలున్నాయి. కొన్నిసార్లు ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్లు కూడా సోకే అవకాశాలున్నాయి.

ఈ ఇన్‌ఫెక్షన్ల కారణంగా చలి, జ్వరం, శరీరంపై కమిలినట్లు కనిపించడం, వాపు, దగ్గు మొదలైన లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇమ్యునో సప్రసెంట్లుగా వాడే ఏ ఔషధం వల్లనైనా ఇటువంటి సమస్యలు ఎదురు కావచ్చు.
ప్రిడ్నిసోన్‌కు సంబంధించినంత వరకూ దాని ప్రభావం ఔషధం మోతాదుపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఔషధాన్ని మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సకు ఒక రోజు ముందు కాని, శస్త్ర చికిత్సనాడు కాని రోగి శరీర బరువునను సరించి అత్యధిక మోతాదుల్లో ఇవ్వడం జరుగుతుంది. తరువాత నాలుగు నుంచి ఆరు నెలలు పూర్తయ్యాకా, ఈ మందు మోతాదను సవరించి తగ్గిస్తారు. దీనిని మెయింటెనెన్స్‌ డోస్‌ అని వ్యవహరిస్తారు.

రోగి శరీరంలో అమర్చిన మూత్రపిండం పని చేస్తున్నంత కాలం ఈ మోతాదును వాడుతూ ఉండాలి. ఒకవేళ మూత్రపిండం తిరస్కరణకు గురైతే, మోతాదును పెంచాల్సి ఉంటుంది. ఈ ఔషధం మోతాదును పెంచడం వలన రోగికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ప్రధానమైనవి ఈ కింద పేర్కొనడం జరిగింది.

ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు
శరీరంలో లవణం పేరుకుపోయి, ద్రవ పదా ర్థాలు వెలుపలికి పోకుండా అక్కడే నిలిచి పోవడం, ఆహారనాళం, జీర్ణాశయాలు రేగినట్లు కావడం, ఫలితంగా గుండెల్లో మంట, కీళ్ల నొప్పులు, గాయాలు మానడానికి ఎక్కువ కాలం పట్టడం, చెక్కిళ్లు, కడుపు, నడుము భాగాల్లో కొవ్వు తిరిగి పేరుకోవడం, మధు మేహం, కేటరాక్ట్‌, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడం మొదలైనవి. పైన పేర్కొన్న దుష్ప్రభావాలను ఔషధం మోతాదును సరిచేయడం ద్వారా నివారించవచ్చు.

అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో తాజాగా పరిణామం సైక్లోస్పోరిన్‌ అనే ఔషధాన్ని ఇమ్యునో సప్రసెంట్‌గా ఉపయోగించడం. ఈ ఔషధం కారణంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సల సక్సెస్‌ రేటు గణనీయమైన అభివృద్ధిని చూపిస్తోంది. 

Post a Comment

0 Comments