-మోకాలి మార్పిడి శస్త్రచికిత్స- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వయసు పైబడిన వారిని వేధించే సమస్య మోకాలి నొప్పి. దీనివల్ల పది అడుగులు వేయటం కష్టమైపోతుంది. నాలుగు మెట్లు కూడా ఎక్కలేకపోతుంటారు. రోజువారీ సాధారణ పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. నొప్పి మూలంగా కింద కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. నేడు మనదేశం లో 15 శాతము మంది మోకాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు . వీరిలో దాదాపు 14 శాతము మందికి మందులతోనే ఉపశమనం కలుగుతుంది . మిగతా ఆ 1% మందికి కీళ్ళ మార్పిడి చికిత్స తప్ప మరోమార్గము లేదు . ఇటువంటి వారికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఒక వరంలాంటిదంటున్నారు డాక్టర్ అఖిల్ దాడి. మోకాలి నొప్పితో బాధపడే వారు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుని హాయిగా జీవించవచ్చంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…
మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడటం, కాల్షియం లోపం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే కీళ్లవాతానికి గురవడం, ‘హైపోథైరాయిడిజం’ వల్ల మోకాలు త్వరగా అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా మోకాలి నొప్పి మొదలవుతుంది. మోకాలి నొప్పికి మరొక ప్రధానకారణం స్థూలకాయం. అధిక బరువు వల్ల మోకాలు కీళ్లలో అరుగుదల ఎక్కువగా జరిగి నొప్పి ప్రారంభమవుతుంది. ప్రాథమిక దశలో మోకాలి నొప్పిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే మందులతోనే నయం అవుతుంది. ఆలస్యం చేస్తే కీళ్ల మధ్య అరుగుదల ఎక్కువయి సమస్య మరింత ఎక్కువవుతుంది. ప్రస్తుతం ఈ నొప్పులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు ''గ్లూకోజమైన్'' అనే మందులు వాడటం ద్వారా చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు వ్యాయామం చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం, కీళ్లవాతానికి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మోకాలి నొప్పిని తగ్గించుకోవచ్చు.
ఎవరికి ఆపరేషన్ అవసరం
కనీసం 500 అడుగులు కూడా నడవలేని వారికి, రోజు వారి కార్యక్రమాలు చేసుకోలేకపోతున్న వారికి ఆపరేషన్ అవసరమవుతుంది. నొప్పి నివారణ మాత్రలు వాడినప్పటికీ పనిచేయనపుడు, మోకాలు మధ్యలో ఉండే గుజ్జు పూర్తిగా అరిగిపోయి తీవ్రమైన నొప్పలతో బాధపడుతున్నప్పుడు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడమే ఉత్తమం, కాళ్లు వంగిపోయిన వారికి కృత్రిమ కీలు అమర్చడం చక్కని పరిష్కారం.
ఏది ఉత్తమం
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశోధనల అనంతరం వివిధ రకాల కృత్రిమ మోకాళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రోగి సౌలభ్యాన్ని బట్టి, ఆరోగ్య స్థితిని పరిశీలించి ఏ రకమైనది సరిపోతుందో వైద్యులు నిర్ధారిస్తారు. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న 10 నుంచి 15 శాతం మందిలో లోహ సంబంధమైన అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కొందరిలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ అలర్జీలను నివారించే అధునాతమైన కృత్రిమ సిరామిక్ మోకాళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది
a s knee
జర్మనీ వారి ఆధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఈ కృత్రిమ సిరామిక్ మోకాలును తయారుచేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే మోకాలు ఏడు పొరలుగా వివిధ ఔషధాలతో నిర్మాణం చేయబడి ఉంటుంది. ప్రధానమైన ఐదు పొరలు క్రోమ్ నైట్రేట్-తో తయారు చేయబడి ఉంటాయి. ఇది మోకాలుకు గట్టిదనాన్ని ఇస్తుంది. ఆరవ పొర జిర్కోనియమ్ నైట్రోజన్ - తో తయారుచేయబడి ఉంటుంది. దీని ద్వారా కృత్రిమ మోకాలు కఠినంగా తయారయి సిరామిక్ గుణం వస్తుంది. ఏడవ పొర జిర్కోనియమ్. ఏ ఎస్ నీ తయారీలో ఉపయోగించే జిర్కోనియమ్ లోహం మానవ శరీరంలోని ఎముకలకు చాలా దగ్గరగా ఉంటుంది. దీనికి శరీరంలో త్వరగా కలిసిపోయే గుణం ఉంటుంది. మోకాలుకు శక్తిని, పటుత్వాన్ని ఇస్తుంది. ఏ ఎస్ నీలోని ఏడు పొరలలోని ఔషధాలు లోహం నుంచి విడుదలయ్యే అయానులు రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. దీనిద్వారా అలర్జీ రాకుండా ఉంటుంది. అరుగుదల కూడా తక్కువ ఉండి ఎక్కువ కాలం మన్నుతుంది. మిగతా సిరామిక్ మోకాళ్లతో పోలిస్తే తొడవైపు ఎముక భాగం మరియు కాలివైపు వెనక భాగానికి అంటే పూర్తి కాలుపై దీనికి పటుత్వం ఉంటుంది.
వెనుకవైపునకు జరిగే అరుగుదలను కూడా ఇది నివారిస్తుంది.
ఆపరేషన్ సమయంలో…
తొడ ఎముక కింది భాగం, కాలు పైభాగం అరిగిపోవడం వల్ల రాపిడి ఎక్కువై నొప్పి మొదలవుతుంది. ఎముకల మధ్య ఉండే జిగురు తగ్గిపోవడం, ఎముక, వాషర్ అరిగిపోవడం వల్ల నొప్పి ఎక్కువవుతుంది. ఆపరేషన్‌లో భాగంగా ఎముక ఆరిగిన స్థానంలో మెటల్‌ను అమర్చడం జరుగుతుంది. రెండు వైపులా మెటల్ వేసిన తరువాత అరిగిన వాషర్ స్థానంలో కొత్త వాషర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. A.S.knee చూడటానికి బంగారం లాగా ఉంటుంది. తక్కువ అరుగుదలతో ఎక్కువ కాలం మన్నడం, పటుత్వం కలిగి ఉండటం, అలర్జీలు నివారించడం వల్ల మోకాలు నొప్పితో బాధపడేవారికి బంగారు మోకాలేనని చెప్పొచ్చు. శస్త్రచికిత్స తరువాత నొప్పి పూర్తిగా తగ్గిపోయి మామూలుగా నడవటం, రోజు వారి పనులు చేసుకోవడం సాధ్యపడుతుంది. మోకాలు మార్పిడి తరువాత కూడా నొప్పి తగ్గదనేది అపోహ మాత్రమే. ఒకసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు పదిపదిహేనేళ్ల పాటు నడవటం, మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం లాంటి పనులు చేసుకోవచ్చు.
ఆపరేషన్ తరువాత…
మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అనంతరం నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. కాళ్ల వంకర కూడా తొలగిపోతుంది. కృత్రిమ కాలు ఎంతకాలం మన్నుతుంది అనే విషయం వారి అలవాట్లు, జీవనవిధానం, శస్త్రచికిత్సలో అమర్చే మెకాలుపై ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శస్త్రచికిత్స తరువాత ఎంత దూరమైన నడవచ్చు. ఎన్ని మెట్లయినా ఎక్కవచ్చు. కానీ కింద కూర్చునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోకాలు మార్పిడి అనంతరం ఇరవై, ముఫ్పై ఏళ్ల పాటు హాయిగా జీవించవచ్చు.
0 Comments