Full Style

>

ఆయుర్వేదం లో జలగ వైద్యము , Leech Therapy in Ayurvedam




-ఆయుర్వేదం లో జలగ వైద్యము , Leech Therapy in Ayurvedam-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శాస్త్రీయ వివరణ లేదుగాని అనుభవముతో కూడుకున్న గతచరిత్ర ఉన్న జలగ వైద్యము - దాని విధివిదానాలు :
మన దేశానికి లీచ్‌థెరపీ (జలగలతో వైద్యం) మరీ కొత్త వైద్యమేమీ కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులు జలగల వైద్యాన్ని వాడుతున్నారు. అయితే మన దేశంలో కంటే విదేశాల్లోనే దీన్ని ఒక వైద్య పద్ధతిగా ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకోగాని మన దేశంలో ఈ వైద్యానికి తగినంత ప్రచారం లేదు. మనిషికి వచ్చే రకరకాల చర్మవ్యాధులకు, ఇతర జబ్బులకు చెడురక్తం ప్రధాన కారణం. తేలిగ్గా, తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఈ చెడురక్తాన్ని తొలగించే ప్రక్రియకు వైద్య శాస్త్రంలో జలగల్ని మించిన ప్రత్నామ్నాయం మరొకటి లేదంటారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు గిడ్డ జీవరత్నం.

గత ముప్పైఏళ్లుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారాయన. "ఆయుర్వేద వైద్యంలో లీచ్‌థెరపీ గొప్ప వరం. మనిషి నుంచి చెడురక్తం తీయడానికి ఆయుర్వేదంలో చాలా వైద్యాలున్నాయి. అన్నిటిలోకెల్లా ఉత్తమమైనది, తేలికైనది లీచ్ థెరపీ. ఆయుర్వేద వైద్య భాషలో దీన్ని 'జలవుక వైద్యం' అంటారు. మూడు దశాబ్దాలుగా లీచ్ వైద్యం చేస్తున్నాను. ఎన్నో అద్భుతాల్ని చేశాం. ఒకటీ రెండు కాదు... జలగలు అన్ని రకాల చర్మవ్యాధుల్ని తగ్గించగలవని, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల, చెడురక్తం వల్ల వచ్చే జబ్బులన్నిటికీ కూడా లీచ్‌థెరపీ ఉపశమనం అన్న విషయం మనవారికి చాలామందికి తెలియకపోవడం దురదృష్టం'' అని అంటారాయన.



ఏ ఏ జబ్బులకు...
లీచ్‌థెరపీతో అన్ని రకాల చర్మవ్యాధులు, రక్తసంబంధిత వ్యాధులన్నిటినీ తగ్గించుకోవచ్చు. సొరియాసిస్, మెటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, పైల్స్...ఇలా అన్ని జబ్బులూ మాయమవుతాయి. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాకుండా ప్రముఖ ఆయుర్వేద ఆసుపత్రులలో కూడా లీచ్‌థెరపీ చేస్తున్నారు. ఈ వైద్యం ఎలా చేస్తారో తెలుసుకుందాం.

సొరియాసిస్‌కి...
మూడేళ్ల కిత్రం ఇదే ఆసుపత్రికి సంతోష్ అనే పాతికేళ్ల కుర్రాడు వచ్చా డు. ఒంటినిండా సొరియాసిస్. "నాకు పదేళ్ల వయసుండగా తెల్లటి మచ్చలు రావడం, పొట్టు రాలడం మొదలయింది. ఇప్పుడు ఒళ్లం తా వచ్చేసింది. మా తమ్ముడు, చెల్లి కూడా నన్ను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. నాకు పెళ్లవ్వదని అమ్మ బెంగపెట్టుకుంది. వైద్యం కోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టారు. టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్లీ వచ్చేస్తుంది. నాకు బతకాలని లేదు. ఎవరో ఒక పెద్దాయన లీచ్‌థెరపీతో సొరియాసిస్‌ని తగ్గించుకోవచ్చని చెప్పారు. ఇదే నా చివరి ప్రయత్నం అనుకొని వచ్చాను. ఇంట్లో చెబితే... జలగలతో వైద్యం ఏంటి? వద్దన్నారు. అయినా ప్రయత్నించి చూద్దామని వచ్చాను'' అని డాక్టర్ దగ్గర తన బాధ చెప్పుకున్నాడట.

వైద్యులు ముందు చిన్నపాటి కౌన్సిలింగ్ చేసి వైద్యం మొదలుపెట్టారు. పెద్ద మచ్చలున్న ప్రాంతంపై జలగల్ని వదిలారు. అలా ఎనిమిది సిట్టింగ్‌లు వైద్యం చేశారు. మళ్లీ మచ్చలు రాకుండా ఉండేందుకు మందులు ఇచ్చి పంపించారు. దాంతోపాటు కొన్ని ఆహారనియమాలు కూడా చెప్పారు. మూడు నెలల్లో సంతోష్‌కి సొరియాసిస్ మచ్చలు పూర్తిగా పోయాయి. చాలా సంతోషపడ్డాడు. తన ఇంట్లోవాళ్ల ఆనందానికి అవధుల్లేవు. ఇతనికి వైద్యం చేసిన జీవరత్నం ఏమంటారంటే..."సొరియాసిస్‌తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. వారికి లీచ్‌థెరపీకి మించిన వైద్యం లేదు. సొరియాసిస్ అనేది చర్మవ్యాధి. శరీరంలో రోగనిరోధక శక్తి లోపించడం వల్ల వచ్చే వ్యాధుల్లో ఇదొకటి. ఈ వ్యాధిని తగ్గించడం ఒకెత్తు, మచ్చలు పోగొట్టడం ఒకెత్తు. లీచ్ థెరపీ వల్ల ఒంటిపైనున్న మచ్చలన్నీ పోతాయి. అలాగే చెడు రక్తం పోతుంది కాబట్టి కొన్ని ఆహారనియమాలు పాటిస్తే మళ్లీ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉండదు''.

మొటిమలకు...
ముఖంపై పెద్ద పెద్ద మొటిమలతో చాలామంది అమ్మాయిలు బోలెడు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటమ్మాయే గీత. ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ముఖం నిండా మొటిమలు. చర్మవ్యాధుల నిపుణులు ఇచ్చిన మందులన్నీ మింగింది. రకరకాల క్రీములన్నీ రాసింది. తాత్కాలిక ఉపశమనాలే కాని...పట్టుమని పదిరోజులు ముఖంపై మొటిమలు లేకుండా లేదు. లీచ్‌థెరపీ గురించి ఇంటర్నెట్‌లో చదివి మరీ వచ్చింది. డాక్టర్ టేబుల్‌పైన జలగలున్న సీసా చూసి 'అమ్మో...' అంది. 'నాకు జలగలంటే చాలా భయం. మొటిమలు పూర్తిగా పోతాయంటే మాత్రం వైద్యం చేయించుకుంటాను డాక్టర్‌గారు..'

అంటూ భయం భయంగా అడిగింది. నువ్వే..చూస్తావుగా అంటూ వైద్యం మొదలుపెట్టారు. మొటిమలు ఎక్కువగా ఉండటంతో ఒకేసారి నాలుగు జలగల్ని మొటిమల దగ్గర వదిలారు. అలా నాలుగు వారాలు....నాలుగు సిట్టింగ్‌లు పెట్టారు. అంతే మొటిమలు మాయం. "మనవాళ్లకి జలగలపట్ల మంచి అభిప్రాయం లేదు కాబట్టి ...వైద్యానికి ముందు బోలెడు సందేహాలు వస్తాయి. అదే యూరప్ దేశాల్లో అయితే ఫేషియల్ చేయించుకున్నంత తేలిగ్గా మొటిమలకు లీచ్ థెరపీ చేయించుకుంటారు'' అని చెప్పారు జీవరత్నం.

బోదకాలు...
బోదకాలుతో బాధపడేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాగా ముదిరిపోతే కష్టం కాని మొదటి దశలో లీచ్‌థెరపీ చేయించుకుంటే చక్కని ఫలితం ఉంటుంది. "బోదకాలు వచ్చిన ఆరునెలలలోపు లీచ్‌థెరపీ చేయించుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాగా ముదిరిపోయాక ఎనభైశాతం మాత్రమే అవకాశం ఉంటుంది. ముందు నాలుగైదు సిట్టింగ్‌లలో జలగల ద్వారా కాలులో పేరుకుపోయిన చెడురక్తాన్ని తీసేస్తాం. కాలు లావు తగ్గి మామూలుగా అయిపోతుంది. తరువాత మళ్లీ రాకుండా కొన్ని మందులు ఇస్తాం. వైద్యం సింపులే కాని దీనికి ఒకటీ రెండు జలగలు సరిపోవు. నాలుగైదు ఉండాలి..'' అంటున్నారు వైద్యులు.

పైల్స్ నివారణ...
మల ద్వార ప్రాంతంలో రక్తం గడ్డకట్టుకుపోయి లేదా పుండుగా ఏర్పడి బాధపెట్టే పైల్స్ నివారణకు కూడా లీచ్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది. గడ్డలు కరగడానికి, పుండు తగ్గడానికి, నొప్పి పోవడానికి... రకరకాల మందులు వాడుతూ ఉంటారు. లీచ్‌థెరపీ వల్ల అన్ని సమస్యలూ ఒకేసారి పోతాయి. చెడురక్తం, గడ్డకట్టిన రక్తం అన్నీ తొలగిపోతాయి. మూడు సిట్టింగ్‌లు పెట్టించుకుని, కొన్ని రకాల ఆహారనియమాలు పాటిస్తే మళ్లీ ఆ సమస్య మీ జోలికి రాదంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రకాశ్.

గడ్డలు మాయం...
ఉన్నట్టుండి ఒంటిమీద గడ్డలు ఏర్పడుతుంటాయి కొందరికి. చెడురక్తం, కొవ్వుపదార్థాల వల్ల ఏర్పడ్డ ఈ గడ్డల్ని మందులతో కన్నా...లీచ్‌లతో చాలా తొందరగా కరిగించవచ్చంటారు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాగసుధ. "చాలామంది ఒంటిపైన గడ్డలు కనిపిస్తాయి. ఎక్కువగా నుదుటిభాగంలో వస్తుంటాయి. మందులకు లొంగని గడ్డల్ని సర్జరీ చేసి తొలగిస్తారు. ఆపరేషన్ లేకుండా లీచ్«థెరపీ ద్వారా వీటిని చాలా తేలిగ్గా తొలగించవచ్చు'' అంటారావిడ.

కంటికి, పంటికి...
లీచ్‌థెరపీని విదేశాల్లో కంటి జబ్బులకు, పంటి జబ్బులకు కూడా వాడుతున్నారు. దీని గురించి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ...'కంటిలో నీటికాసులు(గ్లకోమా) ఏర్పడుతుంటాయి. దీని వల్ల చూపు మందగిస్తుంది. దీన్నే...కంటికి నీరు పట్టిందని చెబుతుంటారు. రక్త నాళాల్లో కొవ్వుపదార్థాలు పేరుకుపోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. దాంతో చూపు మందగిస్తుంది. కంటి చివరి భాగంలో లీచ్‌థెరపీ చేయడం వల్ల రక్తనాణాలలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది.

చెడు పదార్థాలు, నీరు, గడ్డకట్టిన రక్తం అంతా జలగ తీసేసుకుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కొత్త రక్త ప్రసరణ జరుగుతుంది. ఎలాంటి ఆపరేషన్లు, అద్దాలతో పనిలేకుండా జబ్బుని నయం చేసుకునే అవకాశం ఉంది. పంటికి కూడా లీచ్‌థెరపీ వాడుతున్నారు. ఒక్కొక్కసారి పళ్ల చిగుళ్లలో చెడురక్తం చేరి బాగా ఇబ్బంది పెడుతుంది. దీన్ని కూడా జలగల సాయంతో తొలగిస్తారు. కంటికి, పంటికి లీచ్‌థెరపీ మన దేశంలో చాలా తక్కువ కాని యూరప్ దేశాల్లో ఎక్కువగా వాడుతున్నారు'' అని చెప్పారాయన.

మధుమేహం...
మన దేశంలో లీచ్‌థెరపీ ఎక్కువగా వాడేది మధుమేహం వల్ల వచ్చే పుండ్లకు. షుగర్ ఎక్కువగా ఉన్నవారికి శరీరంలోని కొన్ని భాగాల్లో ముఖ్యంగా కాళ్లకు, చేతులకు చెడు రక్తం పేరుకుపోయి రంగు మారిపోతుంది. దురదగా మొదలైన ఆ ప్రాంతం పుండుగా మారిపోతుంది. ఈ పుండ్లు లీచ్‌థెరపీతో తొందరగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. "నా అనుభవంలో ఎక్కువగా లీచ్‌థెరపీ వాడింది షుగర్ పేషంట్లకే. షుగర్ కంట్రోల్లో లేకపోతే ఆ పుండ్లు తగ్గవు. పుండు తగ్గడానికి ఒకోసారి సర్జరీలు కూడా అవసరమవుతాయి. ప్రతిరోజు డ్రసింగ్ చేయించుకోలేక, పుండు పెట్టే బాధ పడలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. పుండు సైజును బట్టి ఎన్ని లీచ్‌లు వాడాలి, ఎన్ని సిట్టింగ్‌లు పెట్టాలో నిర్ణయిస్తాం.

చెడురక్తం, చీము, నీరు, దానివల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా అంతా జలగ తీసేస్తుంది. పుండు మొత్తం మానేవరకూ సిట్టింగ్స్ ఉంటాయి. చాలా తొందరగా ఉపశమనం వస్తుంది.'' అని చెప్పారాయన. లీచ్‌థెరపీతో షుగర్ పుండు తగ్గించుకున్న రాజేశ్వరరావు తన అనుభవాన్ని ఇలా చెబుతారు. " నా వయసు అరవై సంవత్సరాలు. పదేళ్లనుంచి షుగర్‌వ్యాధితో బాధపడుతున్నాను. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా... షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు. నాలుగు నెలల కిత్రం కుడికాలుకి వాపు వచ్చింది. మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో శరీరం రంగు మారడం మొదలయింది. దురద కూడా రావడంతో చిన్నగా పుండు పడింది. వెంటనే ఆసుపత్రికి వెళితే మందులు ఇచ్చారు. అవి వాడుతూ ప్రతిరోజూ డ్రసింగ్ చేయించుకునేవాన్ని.

కొద్దిగా తగ్గిన్నట్టు తగ్గి మళ్లీ ఎక్కువయింది. మరో పెద్ద ఆసుపత్రికి వెళితే... చిన్నపాటి సర్జరీ చేయాలన్నారు. ఆ సమయంలో ఎవరో ఈ జలగ వైద్యం గురించి చెప్పారు. ఇక్కడి వచ్చాక డాక్టర్లు వైద్యానికి సంబంధించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు. ఆరు సిట్టింగ్‌లు అవసరమవుతాయని చెప్పారు. నాకు మూడు సిట్టింగ్‌లతోనే దురద, నొప్పి, వాపు పోయి బోలెడు ఉపశమనం కలిగింది. ఇంత తక్కువ ఖర్చుతో, నొప్పిలేకుండా హాయిగా చేసే వైద్యం అందుబాటులో ఉందని చాలామందికి తెలియదు. నేను ప్రస్తుతం లీచ్‌థెరపీని ప్రచారం చేసే పనిలోనే ఉన్నాను'' అని తన అనుభవాన్ని, అభిప్రాయాన్ని చెప్పాడాయన.

అన్నీ పనికిరావు...
నీటిలో దొరికే జలగలన్నీ వైద్యానికి పనికిరావు. 'కపిలి' అనే జాతి జలగల్ని ఎక్కువగా వాడుతున్నారు మన రాష్ట్ర డాక్టర్లు. ఇతర రాష్ట్రాల్లో 'పుండరిక' అనే జాతి జలగల్ని వాడుతున్నారు. " చెరువుల్లో...కుంటల్లో దొరికే జలగలన్నీ వైద్యానికి వాడము. జలగల్లో రెండు రకాలుంటాయి. పాయిజన్, నాన్ పాయిజన్. పాయిజన్ జలగలకు వెంట్రుకలుంటాయి. ఇవి వైద్యానికి పనికిరావు. వైద్యం కోసం ఎంపిక చేసుకున్న జలగల్ని ముందు శుద్ధిచేస్తాం. ఎందుకంటే అప్పటివరకూ అది రకరకాల జంతువుల రక్తాల్ని పీల్చుకుని ఉంటుంది. దాని పొట్టనిండా బోలెడన్ని విషపదార్థాలు ఉండే అవకాశం ఉంది. మొదట దాని పొట్టని శుభ్రం చేయాలి. అందుకే ఒక వారం రోజులపాటు దాన్ని పసుపు నీళ్లలో ఉంచుతాం.

ఆ నీళ్లు తాగడం వల్ల జలగ పొట్ట పూర్తిగా శుద్ధి అయిపోతుంది. తరువాత దానికి కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. వైద్యానికి అన్ని అర్హతలు పొందిన తర్వాతే దాన్ని థెరపీకి ఎంచుకుంటాం. ఒకరి వైద్యానికి ఉపయోగించిన జలగని మరొకరికి వాడం. లీచ్‌థెరపీ పూర్తవగానే జలగకు ఒక మందు ఇస్తాం. వెంటనే తాగిన రక్తాన్ని వాంతి చేసేసుకుంటుంది. తరువాత మళ్లీ పసుపు నీళ్లలో వేస్తాం. తరువాత సిట్టింగ్‌నాటికి దాని కడుపులో, శరీరంలో ఎలాంటి చెడుపదార్థాలు లేకుండా శుద్ది చేసి మళ్లీ వైద్యానికి ఉపయోగిస్తాం. పేషెంటు రాగానే నీళ్లలో ఉన్న జలగని తెచ్చి అతనిపై వదిలేస్తాం అనుకుంటే పొరపాటు...ఈ వైద్యానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది'' అని చెప్పారు రాగసుధ.

అందరినీ పట్టుకోవు...
వైద్యం చేయడానికి జలగకు ఎలాంటి అర్హతలున్నాయో... మనుషులు కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలంటారు డాక్టర్ జీవరత్నం. "పేషెంట్‌కి ముందుగా కొన్ని రక్తపరీక్షలు నిర్వహిస్తారు. హెచ్ఐవి - పాజిటివ్, టీబి ఉన్నవారికి లీచ్‌థెరపీ చేయరు. వైద్యం చేయించుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలి. లీచ్‌థెరపీ చేయించుకునే రోజు స్నానానికి సబ్బుకు బదులు సున్నిపిండిని వాడాలి. కాస్మోటిక్స్ వాడకూడదు. మద్యం సేవించకూడదు, పొగతాగకూడదు. ఇందులో ఏ వాసన తగిలినా...జలగ ఆ మనిషి జోలికి రాదు.

సాధారణంగా జలగ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకూ రక్తం పీల్చుకుంటుంది. ఇక చాలు...అనుకుంటే పసుపు కాని ఉప్పు గాని దానిపై వేస్తే వెంటనే వదిలేస్తుంది. తరువాత అది పట్టుకున్న చోట వేడినీళ్లతో కడిగి కొద్దిగా పసుపు అంటించి బ్యాండేజ్ వేసేస్తారు. జలగ పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావు. నొప్పి కూడా పెద్దగా ఉండదు.
జలగ రక్తం పీల్చుకుంటున్నప్పుడు ఒకలాంటి మత్తుగా ఉంటుందంటారు పేషెంట్లు. మనవాళ్లు ఈ వైద్యం ప్రయోజనాలు తెలియక ముందుకు రావడం లేదు కాని మా దగ్గరికి వచ్చిన ఏ పేషెంటు కూడా జలగని చూసి భయపడి వెనక్కివెళ్లలేద''ని చెబుతారామె.

జలగల మార్కెట్


మన రాష్ట్రంలోని ప్రముఖ ఆయుర్వేద ఆసుపత్రులన్నిటిలో లీచ్ థెరపీ చేస్తున్నారు. మరి ఈ వైద్యులకు జలగలు ఎవరు ఇస్తారు? అంటే "పదేళ్ల క్రితం పది రూపాయలకు ఒక జలగ అమ్మేవారు. ఇప్పుడు అదే జలగని వంద నుంచి ఐదు వందల రూపాయలు పెట్టి కొంటున్నారు. చెరువుల్లో, కుంటల్లో, పొలాల్లో దొరికే జలగలకు ఇంత ధర ఎందుకు? అంటే బ్లూక్రాస్ వారి ప్రభావం. 2005 వరకూ మా ఆసుపత్రి లీచ్‌ట్యాంకులో ఎప్పుడూ 500 జలగలు ఉండేవి. 'జంతువుల్ని హింసించడం నేరం' అంటూ ప్రచారాలు మొదలయ్యాక మా ఆసుపత్రికి జలగల కొరత ఏర్పడింది. ఒక మనిషికి వాడిన జలగని మరొకరికి వాడం.

వైద్యం పూర్తవ్వగానే దాన్ని బయట పడేస్తాం. వైద్యం పేరుతో జంతువుల్ని అలా చంపడం నేరం అంటూ బ్లూక్రాస్‌వారు జాలర్లను బెదిరించడంతో వాళ్లు జలగల్ని పట్టి అమ్మడానికి వెనకాడుతున్నారు. దాంతో ఎప్పుడూ వందల సంఖ్యలో జలగలుండే మా లీచ్‌ట్యాంక్ ప్రస్తుతం ఎండిపోయింది. మరి వైద్యం ఎలా చేస్తున్నారంటే? ఆ బాధ్యత పేషంట్లపైనే పెడుతున్నాం. లేదంటే ఒకటీ అరా మా దగ్గర ఉన్నవాటితో వైద్యం చేస్తున్నాం. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నట్లు జలగల సేకరణ లేదు. దాంతో ఉన్నవాటికే బోలెడు డిమాండ్. వైద్యం ఎలాగూ ఉచితం కాబట్టి జలగల్ని వందల రూపాయలు పెట్టి కొనుకుంటున్నారు'' అని చెప్పారు జీవరత్నం.

ఇంటర్నెట్‌లో అమ్మకాలు
మన దేశంలో జలగలు కావాలంటే చెరువుల దగ్గరకి వెళ్లాలి. లేదంటే జాలర్లని బతిమలాడాలి. కాని ఆస్ట్రేలియా దేశంలో అలాకాదు. ఇంటర్నెట్ ద్వారా కూడా జలగల్ని అమ్ముతున్నారు. 'లీచ్ ఫర్ సేల్' అనే వెబ్‌సైట్‌లు అక్కడ బోలెడన్ని ఉన్నాయి. చేపల మార్కెట్‌లో జలగలకు ప్రత్యేక విభాగం ఉంటుంది. వైద్యులైనా, పేషెంట్లయినా అక్కడికి వచ్చి వారికి కావాల్సినన్ని జలగల్ని కొనుక్కొని వెళతారు. మన దగ్గర చేపలు, రొయ్యలు పెంచినట్టు యూరప్‌లో జలగల్ని పెంచుతారు. అయితే వాటికి ఆహారం ఏంటని అనుకుంటున్నారా....మనం చేపలకు ఏ ఆహారం వేస్తామో అదే వేస్తారు. దాంతో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న మాంసం ముద్దలు కూడా వేయాలి. వీటికి పెద్దగా జబ్బులు రావు కాబట్టి పెంపకం సులువే. రోజురోజుకీ పెరుగుతున్న లీచ్‌థెరపీ వల్ల వీటి అవసరం కూడా ఎక్కువవుతోంది కాబట్టి జలగలు కూడా అదేస్థాయిలో ధర పలుకుతున్నాయి.

అల్లోపతికి జలగ సాయం
జలగల వైద్యం ఇంత గొప్పదైనపుడు అల్లోపతి వైద్యంలో కూడా వీటిని వాడుకోవచ్చు కదా! అని జీవరత్నం గారిని ప్రశ్నిస్తే..."తప్పకుండా...విదేశాల్లో ఎప్పటినుండో వాడుతున్నారు. యూరప్ దేశాల్లో ఆపరేషన్ తర్వాత కుట్లు విప్పడానికి జలగల్నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా లావాటి వాళ్లకు కుట్లు విప్పే ముందు రెండు వైపులా రెండేసి జలగల్ని పట్టిస్తే నిమిషాల్లో అక్కడి చర్మం వదులుగా అవుతుంది. అలాగే వాపు, ఇన్ఫెక్షన్లు వంటివి పోతాయి కూడా. దీని వల్ల కుట్లు తేలిగ్గా విప్పడానికి వీలవుతుంది.

మన దేశంలో అయితే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్శిటీ ఆఫ్ ఆయుర్వేద కళాశాలలో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బులకు కూడా లీచ్‌థెరపీ చేశారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రివారు ప్లాస్టిక్ సర్జరీ అనంతరం స్కిన్ డ్రాఫ్టింగ్‌కి లీచ్ థెరపీ చేయాలని చెప్పి మా దగ్గరికి వచ్చి జలగల్ని తీసుకెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ అనంతరం ఆ భాగంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తే తొందరగా చర్మం అతుక్కుంటుంది. ఇలా పలు సందర్భాల్లో లీచ్‌థెరపీని అల్లోపతివారు కూడా వాడుతున్నారు. అయితే అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో కూడా లీచ్‌థెరపీ గురించి అవగాహన చాలా పెరగాల్సిన అవసరం ఉంది'' అని అన్నారాయన.

Post a Comment

0 Comments