-Lower Abdominal pain during Sex,సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కొందరు స్త్రీలకి సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. దాంతో వాళ్ళకి సెక్స్ లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఒకవేళ కోరికతో సెక్స్ లో పాల్గోన్నప్పటికి ఆ తర్వాత బాధపడతారు. గర్భస్రావాలు అయినప్పుడు, కాన్పు అయినప్పుడు తగిన శుభ్రత పాటించకపోయినా, యాంటిబయోటిక్ మందులు వాడకపోయినా యోనిలోపల వ్యాధి క్రిములు చేరుతాయి. ఈ క్రిములు గర్భాశయంలోపలి చేరతాయి. ఆపైన ఫెలోపియన్ ట్యూబుల్లోకి చేరతాయి. వ్యాధిక్రిములు సోకడంతో గర్భాశయం దాని పక్కనే ఉండే ట్యూబులు, ఓవరీస్ పుండుగా మారతాయి.
గర్భాశాయంలోకి వ్యాధిక్రిములు ప్రవేశించిన తోలి దశలో కొంతమందికి జ్వరం వస్తుంది. చలిచలిగా అనిపిస్తుంది. మూత్రంలో మంట కలుగుతుంది. పొత్తికడుపు బిగదీస్తుంది. అందరిలోనూ ఈ బాధలు ఇంతగా లేకపోయినా కొంతైనా వాపు లోపల ఉంటుంది. ఆ వాపు వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఇన్ ఫెక్షన్ వల్ల గర్భాశయం,ఫెల్లోపియన్ ట్యూబులు, ఓవరీస్ వాచినప్పుడు పొత్తికడుపు దిగువన కొంత చీము కూడా చేరవచ్చు. గర్భాశయం ప్రేగుల వాపునే వైద్యభాషలో పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ (పి.ఇ.డి.) అంటారు. పి.ఇ.డి. పరిస్థితి కొందరిలో క్రానిక్ గా ఉండిపోతుంది. దీర్ఘకాలంగా ఇటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు వేరే బాధలు లేకపోయినా సెక్స్ లో పాల్గొంటే బాధ అనిపించడం ఉంటుంది. పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ ఎక్కువమంది స్త్రీలల్లో ఇంటిదగ్గర కాన్పులైన వాళ్ళలోనూ, నాటుమంత్రసానుల చేత కాన్పులు చేయించుకున్నవాళ్ళల్లోనూ కనబడుతుంది. దానికి కారణం కాన్పు సమయంలో తగిన శుభ్రత పాటించకపోవడం, ఇటువంటి స్త్రీలు కాన్పు అయ్యాక తిరిగి దాంపత్యంలో పాల్గొంటే సెక్స్ లో
పాల్గొన్న ప్రతిసారీ బాధ అనిపిస్తుంది.
సెక్స్ అయిపోయిన తరువాత వెంటనే కాని, ఆ మరుసటి రోజు కాని పొత్తికడుపు బిగదీసి బాగా బాధ అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఆసుపత్రిలలోనే కాన్పు అవ్వాలి. చాలామంది స్త్రీలు కాన్పు అయిన తర్వాత డైపర్స్ గా పాతగుడ్డలు వాడతారు. పాతగుడ్డలు వాడటం వల్ల వాటిలో ఉన్నటువంటి క్రిములు యోనిలోకి చేరి గర్భాశయం ప్రేగులు వాచినట్లు చేస్తాయి. అందుకని కాన్పు సమయంలోనూ, మామూలు మెన్సస్ సమయంలో కూడా కేర్ ఫ్రీ వంటి పరిశుభ్రమైన డైపర్స్ నే ఉపయోగించాలి. గర్భాశాయంలోకి బాక్టీరియా వంటి వ్యాధిక్రిములు చేరడం వల్ల ఎండోమెట్రైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి కలిగినవారిలో గర్భాశయంలోని పొరలు వాచుతాయి. ఇటువంటి పరిస్థితి అకస్మాత్తుగా జరగవచ్చు. లేదా నిదానంగా జరగవచ్చు ఈ పొరల వాపు కొద్దికాలమే ఉండవచ్చు లేదా దీర్ఘకాలం ఉండవచ్చు.
పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నా, ఎండోమెట్రైటిస్ ఉన్నా తెల్లబట్ట అవుతుంది. సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి అనిపిస్తుంది. గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చినవారిలోనూ, అబార్షన్లు అయినవారిలోనూ వెంటనే తగిన చికిత్స పొందకపోయినట్లయితే గర్భాశయం పేగు వాపు, ఎండోమెట్రైటిస్ డిసీజ్ వస్తుంది. సుఖవ్యాధులు వచ్చినవాళ్ళలో యోనిమార్గం పుండుగా మారడమే కాకుండా గర్భాశయం పేగు కూడా వాచుతుంది. కొందరిలో సుఖవ్యాధులు దీర్ఘకాలంగా మిగిలిఉంటాయి. ఇలాంటివారితో సెక్స్ లో పాల్గొంటే పొత్తికడుపులో నొప్పి వస్తుంది. చాలామంది స్త్రీలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు నొప్పి అన్పించి ఆ తర్వాత నొప్పిలేకపోవడంతో నొప్పిని నిర్లక్ష్యం చేస్తారు. కాని వ్యాధిక్రిములు తన ప్రభావాన్ని చూపిస్తూ గర్భాశయం ట్యూబులు మూసుకుపోయేలా చేస్తాయి. దాంతో గర్భం రాదు.
కొంతమంది స్త్రీలకి కొన్ని రకాల భంగిమల్లో సెక్స్ లో బాధ అనిపిస్తుంది. దానికి ఇన్ ఫెక్షన్ ఒక ప్రాంతం వరకే పరిమితం అవడం కారణం. ఏది ఏమైనా రతిలో పాల్గొన్నప్పుడు నొప్పి అనిపిస్తే వైద్యపరీక్షలు అవసరం. అల్ట్రాసౌండ్ స్కానింగ్, రక్తపరీక్షలు వీరికి అవసరం అవుతాయి. కాన్పులైనప్పుడు యోనిమార్గం చీరుకుపోవడంవల్ల, యోని దగ్గర కుట్లు పడటం వల్ల కొందరికి సెక్స్ లో పాల్గొంటే నొప్పి అన్పించవచ్చు. కొందరికి ఏ వాపు లేకుండానే కామోద్రేకం క్లైమాక్స్ చేరినప్పుడు పొత్తికడుపు దగ్గర నొప్పి అన్పిస్తుంది.ఈ నొప్పి కొద్ది నిముషాలుండి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని "ఆర్గజమిక్ పెయిన్'' అంటారు. గర్భాశయం పక్కన ఉన్న ప్రేగు స్పాజం కి లోనుకావడం వల్ల ఈ బాధ కలుగుతుంది.
0 Comments