Full Style

>

Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు


Pricklyheat prevention methods , చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం. పిల్లల్లో స్వేదగ్రంథులు పూర్తిగా రూపొందకపోవడంతో చిన్నారులలో ఇవి ఎక్కువ. వాటితో కలిగే చికాకూ ఎక్కువే. ఒక్కోసారి వాటిని భరించలేక చిదిపేస్తూ ఉంటారు. ఫలితంగా సమస్య తీవ్రమవుతుంది. శరీరంపై కాసే ఈ కాత... మనం కోరని కాత. కాయకముందే కోయాల్సిన కోత. ఈ కాతను రాల్చాలంటే కేవలం ప్రేమ మాత్రమే చాలదు. కాసిని జాగ్రత్తలు కూడా కావాలి.

చెమట లేదా స్వేదం చర్మం నుంచి ఉత్పత్తి అయ్యే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటుంది. స్వేదంలో కొద్దిగా యూరియా వంటి మలిన పదార్థాలుంటాయి. అయితే స్వేదానికి దుర్వాసన ఉండకపోయినా, చెమట పట్టడం వల్ల శరీరంపై అభివృద్ధి చెందే ప్రాపియోనీ బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. (ఇలా దుర్వాసన రావడాన్ని బ్రామ్‌హిడరోసిస్ అంటారు). చెమట పట్టడం అనేది ఒక రకంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం. చెమట అధికమయినప్పుడు శరీరం మీద చెమటకాయలు ఏర్పడతాయి. వీటిని వైద్య పరిభాషలో ‘మిలీరియా రుబ్రా’ అంటారు
వేసవిలో వేడి మూలంగా చాలామందికి చర్మం పేలినట్లయి, చెమటకాయలు వస్తుంటాయి. జిడ్డు చర్మం గలవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం.

చెమటకాయలు ఎలా వస్తాయి?

చర్మంలో ఎక్రైన్ స్వెట్‌గ్లాండ్స్ అనే చెమట గ్రంథులు ఉంటాయి. ప్రతి గ్రంథికి ఎక్రైన్ అనే ఒక నాళం (డక్ట్) ఉంటుంది. మన చర్మంలో సహజంగా స్టెఫలోకాకస్ ఎపిడెర్మిడిస్ అనే బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల, మృత చర్మ కణాల వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. స్వెట్ డక్ట్‌ కు అడ్డుపడి, చెమటకాయలలాగ తయారవుతుంది. ఒక్కోసారి ఈ చెమటకాయలలో చీము కూడా చేరుతుంది. దీనిని‘మిలీరియా పస్టులోసా అంటారు.

ఈ చెమటకాయలను నిర్లక్ష్యం చేస్తే, ఇవి పెద్ద పెద్ద గడ్డలుగా మారే అవకాశం లేకపోలేదు. దీన్ని పెరిపొరైటిస్ స్టెఫిలోజిన్స్ అంటారు. సాధారణంగా చెమటకాయలు వచ్చినచోట చెమట పట్టడం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చెమట పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే పగిలినట్టుగా అయిన స్వేద నాళిక ) పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కొద్దిరోజులు పడుతుంది. చెమట పట్టకుండా ఆగిపోవడానికి ఇదే కారణం.

ఎవరికి వస్తాయి?

ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు వయసున్న పిల్లలలో అప్పుడే ఈ చెమటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలో ఈ స్వేదనాళం పూర్తిస్థాయిలో పనిచేయదు. అంటే అప్పటికి పూర్తిగా అభివృద్ధిచెందదు. అందువల్ల చెమట పట్టినప్పుడు, ఈ నాళిక త్వరగా పగిలినట్టు అయి, చెమట కాయలు వస్తాయి. ఇవి క్రింది కారణాల వల్ల వస్తాయి.

    చిన్నపిల్లలకు, పెద్దవారికి

    ఎండలో ఎక్కువగా తిరిగేవారికి,
    చల్లటి ప్రదేశాల నుంచి వేడి ప్రదేశాలకు తరలి వెళ్లిన వారికి,
    బిగుతుగా ఒంటికి పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు ధరించేవారికి,
    జ్వరం వచ్చినవారికి,

చెమట పడితేనే చికాకుగా ఉంటుంది. అటువంటిది చెమటకాయలు వస్తే? చికాకు రెట్టింపు అవుతుంది. అంతేకాక ఏ పని చేయాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యను ముందుగానే నివారించుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని చేసినప్పటికీ చెమటకాయలు ఎక్కువ బాధిస్తుంటే మాత్రం చర్మవ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది.

ఏయే ప్రదేశాలు

    చెమటకాయలు శరీరం మీద చాలా భాగాలలో కనిపిస్తాయి. ముఖం, మెడ, చర్మం ముడత పడే చోట, వస్ర్తాల ఒరిపిడి ఉండే చోట.
    పిల్లలలో - వీపు, మెడ, గజ్జలు, బాహుమూలాలలో. పెద్దవారిలో - మెడ, తల, వీపు, బాహుమూలాలలో

జాగ్రత్తలు

    కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు.
    చెమట ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి,
    వేడి వాతావరణం లోకి వెళ్లకూడదు,
    చల్లటి ప్రదేశాలు లేదా ఏసి ఉన్నచోట ఉండాలి,
    మందంగా ఉండి, శరీరాన్ని చుట్టేసేలాంటి వస్ర్తాలు ధరించకూడదు,
    బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి,
    సాధ్యమయినంతవరకు పల్చగా ఉండే నూలు వస్ర్తాలు ధరించాలి,
    సబ్బును ఎక్కువగా వాడకూడదు,
    సన్‌స్క్రీన్ లోషనులు వాడాలి,
    పిల్లలు ఎండలో చెమటపట్టేలాంటి ఆటలు ఆడకూడదు,
    ఎక్కువ మంచినీరు తాగుతుండాలి.,

చికిత్స

ప్రిక్లీ హీట్ పౌడర్: ఈ పౌడర్‌లో డ్రయింగ్ మిల్క్ ప్రొటీన్, ట్రైక్లోజాన్, మెంథాల్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిలోని మిల్క్‌ప్రొటీన్, ట్రైక్లోజాన్‌లు ఇన్‌ఫెక్షన్‌ని తగ్గిస్తాయి. మెంథాల్ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.

    తరచు స్నానం, అంటే రోజుకి మూడు నాలుగు సార్లు చన్నీటి చేస్తుండాలి. సబ్బును ఎక్కువగా వాడకూడదు,
    క్యాలమిన్‌ లోషన్‌ను వాడాలి.
    జింక్ ఆక్సైడ్ వాడటం మంచిది,
    నిపుణుడైన వైద్యుని సలహా పై, ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదా
    ట్రోపికల్ యాంటీబయాటిక్స్ వాడాలి.

పైన చెప్పిన వాటిలో మొదటి రెండింటి (క్యాలమిన్ లోషన్, జింక్ ఆక్సైడ్) తో సమస్య తగ్గకపోతే, చర్మవ్యాధుల నిపుణుని (డెర్మటాలజిస్టు) సూచన మేరకు మాత్రమే (ట్రోపికల్ కార్టికోస్టెరాయిడ్స్, టాపికల్ యాంటీబయాటిక్స్) వాడాలి.

* కొన్నిసార్లు చుండ్రు కూడా నుదురు, బుగ్గల మీద చెమటకాయలు రావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే చికిత్స తీసుకోవాలి. దిండు కవర్లను తరచుగా శుభ్రం చేసుకోవాలి. ముఖంపై జుత్తు పడకుండా చూసుకోవటమే కాదు.. చెమటకాయలు ఉన్నచోట స్క్రబ్స్‌ అసలే ఉపయోగించరాదనీ గుర్తుంచుకోవాలి.

* జిడ్డుచర్మం గల కొందరు పదే పదే సబ్బుతో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయటం మంచిది కాదు. దీంతో చర్మంలో పీహెచ్‌ స్థాయులు అస్తవ్యస్తమవుతాయి. అయితే వాతావరణం బాగా వేడిగా, తేమగా ఉన్నపుపడు మామూలు నీటితో ముఖాన్ని తరచుగా కడుక్కుంటే ఇబ్బందేమీ ఉండదు.

* ఉదయం, రాత్రి రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దూదితో చర్మం బిగుతుగా ఉండేందుకు దోహదం చేసే (ఆస్ట్రింజెట్‌) లోషన్‌ లేదా దోసకాయ రసం రాసుకొని.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

* చెమటకాయలు వచ్చినచోట గోళ్లతో గోకటం ఏమాత్రం మంచిదికాదు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. బాగా దురద పెడుతుంటే మూడొంతుల నీరు, ఒకవంతు వెనిగర్‌ను కలిపి, అందులో దూదిని ముంచి దద్దు వచ్చినచోట అద్దాలి. ఇది దురద తగ్గటానికి తోడ్పడుతుంది. నీటిలో కొద్దిగా బైకార్బోనేట్‌ సోడాను కలిపి కడుక్కునా దురద తగ్గుతుంది. జిడ్డు కూడా తొలగిపోతుంది.

* గంధం అన్నిరకాల చర్మాలకీ బాగా పనిచేస్తుంది. ఇది మంచి యాంటీసెప్టిక్‌ మాత్రమే కాదు.. చర్మంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్నీ పెంచుతుంది. దురదనూ తగ్గిస్తుంది.

* గంధానికి కొద్దిగా రోజ్‌ వాటర్‌ను కలిపి ముద్దగా చేయాలి. దీన్ని చెమటకాయలు వచ్చినచోట అద్ది, 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

* పిడికెడు వేప ఆకులు తీసుకొని నాలుగు కప్పుల నీటిలో వేసి సన్నటి మంట మీద గంటసేపు మరిగించాలి. దీన్ని రాత్రిపూట అలాగే వదిలేసి, తెల్లారాక ఆకులను వడగట్టి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను కూడా ముద్దగా నూరి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.

* అయితే చెమటకాయలు, దురద తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించటం తప్పనిసరి. 

Post a Comment

0 Comments