Full Style

>

Stomach migrine-స్టమక్‌ మైగ్రేన్‌



Stomach migrine-స్టమక్‌ మైగ్రేన్‌- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మైగ్రేన్‌ అనగానే మనకు తీవ్రమైన తలనొప్పి గుర్తొస్తుంది.  కానీ స్టమక్‌ మైగ్రేన్‌ అనే సమస్యలూ ఉన్నాయని మీకు తెలుసా?
ఇది పార్శ్వనొప్పుల్లోని ఒకరకం. పెద్దల్లో అరుదు గానీ పిల్లల్లో తరచుగా కనిపిస్తుంది. సాధారణంగా కుటుంబంలో పార్శ్వనొప్పి బాధితులు గలవారి పిల్లలకు వస్తుంది. దీని బారినపడ్డ పిల్లలకు పెద్దయ్యాక పార్శ్వనొప్పి వచ్చే అవకాశమూ ఉంది. స్టమక్‌ మైగ్రేన్‌లో కడుపు మధ్యలో, బొడ్డు సమీపంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఈ సమస్యకు కచ్చితమైన కారణమేంటో బయటపడలేదు. కానీ హిస్టమిన్‌, సెరటోనిన్‌ రసాయనాల్లో మార్పుల మూలంగా వస్తుందని భావిస్తున్నారు. మానసిక అంశాలూ దోహదం చేస్తాయి. అలాగే నైట్రేట్లతో కూడిన మాంసం, చాక్లెట్లు కూడా దీన్ని ప్రేరేపిస్తాయి.

లక్షణాలు
* కడుపు మధ్యభాగంలో తీవ్రమైన నొప్పి
* వికారం
* వాంతి
* చర్మం పాలిపోవటం
* ఆకలి లేకపోవటం, ఆహారం తీసుకోకపోవటం

స్టమక్‌ మైగ్రేన్‌లో కడుపు నొప్పి ఒక గంట నుంచి మూడు రోజుల వరకు ఉండొచ్చు. ఇది ఎలాంటి హెచ్చరికలు లేకుండానే హఠాత్తుగా రావొచ్చు. మామూలు కడుపునొప్పికీ దీనికీ తేడాలను గుర్తించటం అంత తేలిక కాదు. అందువల్ల దీన్ని నిర్ధరించటం కష్టం. దీన్ని గుర్తించటంలో కుటుంబ చరిత్రే కీలకం. ప్రస్తుతానికి దీనికి కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. ఇతర పార్శ్వనొప్పులకు ఇచ్చే మందులే ఇందులోనూ ఇస్తారు. కొందరికి సెరటోనిన్‌ బ్లాకర్లు, ట్రైసీలిక్‌ యాంటీడిప్రెసెంట్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఏయే పదార్థాలు కడుపునొప్పిని ప్రేరేపిస్తున్నాయో గుర్తించి వాటికి దూరంగా ఉంటే స్టమక్‌ మైగ్రేన్‌ను నివారించుకోవచ్చు. పెద్దవాళ్లు ఒత్తిడిని నియంత్రించుకోవటం, ఆరోగ్యకరమైన జీవనశైలితో దీన్ని దూరంగా ఉంచుకోవచ్చు.

Post a Comment

0 Comments