Full Style

>

Tension in women-awareness,స్త్రీలు ఒత్తిడి వలలో పడకుండా అవగాహన



Tension in women-awareness,స్త్రీలు ఒత్తిడి వలలో పడకుండా అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    తలనొప్పిగా ఉంటే ఓ మాత్ర వేసుకుంటాం. జలుబు చేసినా, జీర్ణ సంబంధ సమస్యలు ఎదురైనా వాటిని నివారించే పరిష్కారాలు ఆలోచిస్తాం. అయితే అవి ఒత్తిడి వల్ల ఎదురవుతున్నాయని ఎప్పుడూ అనుకోం. తగిన జాగ్రత్తల్ని తీసుకోం. ఉద్యోగినుల్నే కాదు... గృహిణుల్ని సైతం ఇబ్బందిపెట్టే ఒత్తిడిని తగ్గించుకోకపోతే... శారీరక, మానసిక సమస్యలు తప్పవు. అందుకే వెంటనే దాన్ని తగ్గించుకునే మార్గాలను తెలుసుకుని, ఆచరణలో పెట్టాలి.

'ఒత్తిడి..'
ఉద్యోగినుల్ని మాత్రమే వేధిస్తుందని అనుకుంటారు చాలామంది. కానీ ఇంటిదగ్గర ఉండే మహిళల్నీ ఇబ్బందిపెడుతుందీ సమస్య. చేసే పనులొక్కటే కాదు పెరిగిన వాతావరణం, శారీరకంగా జరిగే మార్పులూ, సామాజిక పరిస్థితులూ లాంటివెన్నో కూడా ఒత్తిడికి దారి తీస్తాయి. స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారు కానీ.. ఉద్వేగాల పరంగా కుంగదీసే ప్రయత్నం చేస్తే త్వరగా ఒత్తిడికి లోనవుతారు.

ఎన్ని సమస్యలున్నా...
ఒత్తిడి మానసికంగా ఎదురవుతుందనేది కొంతవరకే. కౌమారంలో మొదలయ్యే రుతుక్రమం నుంచి మెనోపాజ్‌ వరకూ వివిధ దశల్లో చోటు చేసుకునే శారీరక మార్పులూ, చుట్టూ ఉండే పరిస్థితులూ, హార్మోన్ల పనితీరూ ఉద్వేగాలపై ప్రభావం చూపుతాయి. అవే ఒత్తిడికి దారితీస్తాయి. ఇంట్లో ఇద్దరు పిల్లల్నీ సమానంగా చూస్తున్నాం అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ తమకు తెలియకుండానే మగపిల్లలతో పోల్చి కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని చిన్నచూపు చూస్తారు. 'ఆడపిల్లవి అలా చేయకూడదు..' అంటూ నిబంధనలు పెడతారు. పదేపదే 'నువ్వే సర్దుకుపోవాలి మరి...' అని మాటలూ, చేతలతో నిర్దేశిస్తారు. చదువై ఉద్యోగంలో స్థిరపడ్డాక డెడ్‌లైన్లు చేరుకోవడం, పోటీని తట్టుకోవడం, పదోన్నతులు పొందే ప్రయత్నం వంటి సమస్యలెన్నో. వీటికి తోడు పెళ్లయ్యాక పెరిగే బాధ్యతల గురించి చెప్పక్కర్లేదు. భార్యగా, ఉద్యోగినిగా, తల్లిగా... ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాలి. గృహిణులకూ ఉద్యోగ విధులు తప్ప ఇంచుమించు ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. పైగా చాలామందికి భాగస్వామి నుంచి సహకారం అందదు. వీటన్నిటితో చాలాసార్లు మహిళలు బాగా అలసిపోతారు. ఆందోళనకు గురవుతారు. రకరకాల పనులూ... శక్తికి మించి చేయాల్సి వచ్చినా 'తప్పదు మరి' అనుకుంటూ చేసుకుపోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడికి లోనుచేస్తాయి.

చిరాకు నుంచి రక్తపోటు దాకా...
మనసు బాగా లేకపోతే ఆ ప్రభావం ముందుగా శరీరంపైనే పడుతుంది. ఒత్తిడి లక్షణాలు అనగానే కోపం, చిరాకూ, అసహనం.. లాంటివే చెబుతారు. అవి చాలా చిన్నవి. తరచూ తలనొప్పి రావడం, వికారంగా అనిపించడం, నిస్సత్తువకు లోనవడం, రోగనిరోధక శక్తి తగ్గి జలుబూ జ్వరం... గుండె దడా... అజీర్ణం... అధిక రక్తపోటూ, థైరాయిడ్‌, ఎసిడిటీ వంటివి మరికొన్ని సమస్యలు. పీసీఓడీకి కొన్నిసార్లు ఒత్తిడీ కారణం అవుతుందని అధ్యయనాలు తెలిపాయి. దీనివల్ల నెలసరి సమస్యలు బాధపెడతాయి. ఒత్తిడితో కొందరు అతిగా తింటే.. మరికొందరు అసలు తీసుకోరు. దీనివల్ల వూబకాయం, రక్తహీనతకు గురవుతారు. 'ఈ మధ్య సరిగ్గా నిద్ర పట్టడం లేదు' అని చాలామంది అంటుంటారు. అందుకు గల కారణాలను పరిశీలించుకుంటే కచ్చితంగా ఒత్తిడి ముందుంటుంది. సైనస్‌, ఉబ్బసం లాంటివి శాశ్వతంగా తగ్గకపోవచ్చు కానీ.. ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల వాటి తీవ్రత చాలామటుకు అదుపులోకి వచ్చేస్తుంది. అలాగే ఒత్తిడిలో ఉండే గర్భిణులకు తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. ఒత్తిడి వినడానికి చిన్న పదమే. కానీ చిక్కు సమస్యలకు కారణమవుతుంది. అధ్యయనాల ప్రకారం విపరీతంగా ఒత్తిడి ఉన్నవారిలో మధుమేహం, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే సాధ్యమైనంత త్వరగా దాన్ని అదుపు చేసుకోవాలి. ఒత్తిడిని చిత్తు చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలించి, ఆచరణలో పెట్టాలి.
ఇలా చిత్తు చేద్దాం...
మీకోసం రోజుకో అరగంట: ఇల్లూ, ఆఫీసూ, పిల్లల బాధ్యతలూ... అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే పనుల జాబితా చాలానే ఉంటుంది. ఎంత చేసినా, కొత్తవి వచ్చి చేరుతూనే ఉంటాయి. అయినా ఆ పనుల ప్రవాహంలో పడిపోకూడదు. ముఖ్యమైన పనులు చేస్తూనే, వ్యక్తిగత అభిరుచులకూ కొంత సమయం కేటాయించుకోవాలి. టొరంటోకి చెందిన ఓ అధ్యయనం, 'మనసుకు నచ్చిన పనుల్లో ఏదో ఒకదానికి రోజూ కనీసం అరగంట కేటాయించండి. శరీరంలో ఉత్సాహాన్ని నింపే హార్మోన్లు విడులవుతాయి. ఒత్తిడి దూరమై, భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి సొంతమవుతుంది' అని తెలిపింది.
మథనపడితే నష్టమే: చాలామంది ఒత్తిడికి గురవుతారు. బాధ పడతారు. ఆరోగ్య సమస్యలకు లోనవుతారు. కానీ ఎవరితో పంచుకోరు. ఎందుకలా? ఒత్తిడి మన మీద స్వారీ చేయకుండా చూసుకోవడం మన చేతుల్లో పనే. శక్తికి మించిన పనులు ఉన్నాయి అనిపించినప్పుడు తగ్గించుకునే మార్గం ఆలోచించాలి. ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల సాయం తీసుకోవాలి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం కోరాలి. ఎలాంటి సమస్య ఉన్నా జీవిత భాగస్వామితో చర్చించాలి. అవసరాన్ని బట్టి సన్నిహితులూ, నిపుణుల సాయం పొందాలి. మనసులో భారంగా మాత్రం మిగుల్చుకోకూడదు.
అధ్యయనాలను గమనించండి: ఉదయం పూట టిఫిన్‌ చేయరు. వేళకు భోంచేయరు. తగినంత నిద్ర ఉండదు. మహిళలకు సంబంధించిన చాలా అధ్యయనాలు వెల్లడించిన వాస్తవాలివి. కారణం... పనుల ఒత్తిడి. ఈ తీరు పోషకాహార లేమికి గురి చేస్తుంది. ఒత్తిడికీ కారణమవుతుంది. అందుకే మీ పనుల జాబితాలో వేళకు భోంచేయడం, తగిన సమయం నిద్రపోవడం చేర్చుకోవాలి. యోగా, ధ్యానం జీవనశైలిలో భాగం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి పనుల్లో సాయం, మద్దతూ లభించనప్పుడు 'వాళ్లంతే' అని వదిలేయకుండా... మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఇది కష్టమైన పనే... కానీ మన ఆరోగ్యం కోసం ప్రయత్నించక తప్పదు.
నేను బాగుండాలి అనుకోవాలి: జీవితమే కాదు... చుట్టూ ఉండే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా 'నేను సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను' అనే అనుకోవాలి. అది సెల్ఫ్‌ హిప్నాటిజంలా పని చేస్తుంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తే ఒత్తిడికి లోనయ్యే అవకాశం తగ్గుతుంది.

ఇవన్నీ పాటించడం వల్ల ఒత్తిడి తగ్గాలి. ఆ సానుకూల పరిస్థితి కనిపించకపోతే మానసిక నిపుణుల్ని సంప్రదించాలి. మొదట కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఒత్తిడి తగ్గడానికి మందుల్ని సూచిస్తారు. స్ట్రెస్‌ మేనేజిమెంట్‌ చికిత్సనీ అందిస్తారు. అంటే... మాటలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తారు. అవసరాన్ని బట్టి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌, రిలాక్సేషన్‌ థెరపీ ఇస్తారు.

Post a Comment

0 Comments