కడుపులో మంట అనగానే అల్సర్ అని చాలా మంది అనుకుంటారు. ఏవో తెలిసిన నాలుగు
మాత్రలు వేసేసుకుంటారు. కానీ అది కేన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా
ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకుని చికిత్స
అందించినా ఫలితం ఉండని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఏ కాస్త ఆకలి తగ్గినా,
అరుగుదల తగ్గినా, మంటగా ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన వైద్యపరీక్షలు
చేయించుకోవాలంటున్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా.
టి.ఎల్.వి.డి ప్రసాద్‌బాబు.
ఒక్కోసారి సాధారణ లక్షణాలను గుర్తించడంలో పొరపాటు చేస్తే అది బాగా
ముదిరిపోయిన దశలో కేన్సర్‌గా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నవాహిక,
జీర్ణకోశం, పెద్దపేగుకు వచ్చే కేన్సర్లలో ఈ అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఈ
కేన్సర్ల బారినపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. 60లో వచ్చే కేన్సర్
ఇప్పుడు 40లోనే కనిపిస్తోంది.
కారణాలు
ప్రధానంగా ఆహారపు అలవాట్లలో మార్పులు కేన్సర్‌కు కారణమవుతున్నాయి. ఫ్రైడ్
ఫుడ్, స్మోక్‌డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, పికిల్స్ ఎక్కువగా తినడం వల్ల
కేన్సర్ బారినపడే అవకాశం పెరుగుతోంది. వీటితోపాటు వాతావరణ కాలుష్యం,
టాక్సిన్స్, కూరగాయలు, ఇతర పంటలపైన చల్లే పురుగుమందులు కారణమవుతున్నాయి.
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్, పాసివ్ స్మోకింగ్ వల్ల కేన్సర్
వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి.
కోలన్(పెద్దపేగు) కేన్సర్
ఈ కేన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఒక కుటుంబంలో రెండు తరాలలో
పెద్దపేగు క్యాన్సర్ వచ్చినట్లయితే వారి సంతానానికి వచ్చే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వారు వైద్యులను సంప్రదించి కొలనోస్కోపీ వంటి
పరీక్షలు చేయించుకోవాలి. ఈ కేన్సర్ బారినపడిన వారిలో పేగు పూర్తిగా
పూడుకుపోయిన తరువాత గానీ లక్షణాలు బయటపడవు.
అంటే అడ్వాన్స్ స్టేజ్‌లో ఆసుపత్రికి వస్తుంటారు. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో
గుర్తిస్తే సులువుగా బయటపడే వీలుంది. ఆకలి తగ్గిపోవడం, అరుగుదల శక్తి
తగ్గిపోవడం, గ్యాస్ ఫామ్ అవుతుండటం, రక్తహీనత వంటి లక్షణాలున్నప్పుడు
తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. 50 ఏళ్లు పైబడిన వారిలో రక్తహీనత
ఉన్నట్లయితే తప్పనిసరిగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్ మూలంగా
పేగు పూర్తిగా బ్లాక్ అయినపుడు పొట్ట ఉబ్బడం, మోషన్ నల్లగా రావడం వంటి
లక్షణాలు కనిపిస్తాయి.
అన్నవాహిక కేన్సర్
ఈ కేన్సర్ కూడా చాలా అలస్యంగా బయటపడుతుంది. ఆహారవాహిక మూడవ వంతు
మూసుకుపోయినప్పుడు తప్ప అన్నం మింగటం కష్టమవుతోందనే విషయం తెలియదు.
పూర్తిగా పూడుకుపోయినపుడు అన్నం తీసుకోవడం కష్టంగా మారుతుంది. అప్పుడు
అసుపత్రికి వస్తారు. కానీ వ్యాధి అప్పటికే చివరి దశకు వెళ్లిపోతుంది. ఈ
కేన్సర్ బారినపడిన వారికి అన్నవాహికను పూర్తిగా తొలగించడం జరుగుతుంది.
తరువాత చిన్న పేగును తీసుకెళ్లి ఆహారవాహికగా ఏర్పాటుచేయడం జరుగుతుంది.
సర్జరీ తరువాత కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది.
జీర్ణకోశ క్యాన్సర్
కడుపులో మంట అల్సర్ వల్ల రావచ్చు, కేన్సర్ వల్ల రావచ్చు. మందుల వల్ల అల్సర్
తగ్గడం లేదు అంటే కేన్సర్‌గా అనుమానించాలి. అప్పుడు మూడు నాలుగు సార్లు
ముక్క పరీక్ష చేయించాలి. అల్సర్ కేన్సర్‌గా మారదు. కానీ కేన్సర్ అల్సర్
సాధారణ అల్సర్‌గా బయటపడవచ్చు. అప్పుడు సాధారణ మందులు వాడటం వల్ల ఫలితం
ఉండదు. ఆకలి తగ్గినట్టుగా ఉండటం. కొంచెం ఎక్కువ తినలేకపోతున్నాం
అనుకున్నప్పుడు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
నిర్ధారణ
అన్నవాహిక, జీర్ణకోశ కేన్సర్‌లను ప్రాథమికంగా గుర్తించడానికి ఎండోస్కోపీ
పరీక్ష ఉపయోగపడుతుంది. నిర్ధారణ కోసం ఆ ప్రదేశం నుంచి ముక్క తీసి బయాప్సీ
కోసం పంపించడం జరుగుతుంది. పెద్దపేగు కేన్సర్‌ను గుర్తించడానికి
కొలనోస్కోపీ పరీక్ష ఉపయోగపడుతుంది.
చికిత్స
కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది అక్కడే ఉందా? లేదా కాలేయం,
ఊపిరితిత్తులకు, ఎముకలకు పాకిందా? లింఫ్‌గ్లాండ్స్‌లోకి కేన్సర్ కణాలు
వెళ్లాయా?అని తెలుసుకోవడానికి సి.టిస్కాన్, పెట్‌స్కాన్ వంటి పరీక్షలు
ఉపయోగపడతాయి. ఈ పరీక్షల వల్ల కేన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవచ్చు.
కేన్సర్‌కి చికిత్స అందించాలంటే ఏ స్టేజ్‌లో ఉందనేది నిర్ధారణ చేసుకోవడం
చాలా ముఖ్యం. స్టేజ్ 1, స్టేజ్ 2లో కేన్సర్‌ను గుర్తించినట్లయితే సర్జరీ
చేసి కేన్సర్ భాగాన్ని తొలగించి కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ
దశలో కేన్సర్ నుంచి కోలుకునే అవకాశాలుంటాయి. స్టేజ్3లో వచ్చిన వారికి కూడా
సర్జరీ చేయవచ్చు. కేన్సర్‌కణాలు శరీరంలో ఇతర అవయవాలకు పాకినట్లయితే స్టేజ్
4లో ఉందని భావించాలి. ఈ దశలో ఉన్న వారికి క్యూర్ అయ్యే అవకాశాలు చాలా
తక్కువ. వీరికి సర్జరీ చేయకుండా మందులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
లాప్రోస్కోపిక్ సర్జరీ
అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగు... ఏ భాగానికి కేన్సర్ వచ్చినా
లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి కేన్సర్ భాగాన్ని తొలగించవచ్చు. శరీరంపై చిన్న
రంధ్రం(కీహోల్) చేసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రోగి త్వరగా
కోలుకుంటారు. గాయం ఉండదు కాబట్టి వెంటనే కీమోథెరపీ ప్రారంభించవచ్చు.
ముందు జాగ్రత్తలు
కేన్సర్ బారినపడకుండా ఉండాలంటే లైఫ్ స్టయిల్ మార్చుకోవాలి. తాజా కూరగాయాలు,
విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో యాంటీ కేన్సర్ ఏజెంట్లు ఎక్కువగా
ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్
చేయించుకోవాలి.
0 Comments