Full Style

>

పట్టరాని కోపం.. జీవితం దుర్భరం

ఆలోచనలు, నిర్ణయాలు ఎంత గొప్పవైనా కావచ్చు. కానీ, వాటిని ఆచరణలో పెట్టడంలో ఎంతో నిబ్బరం అవసరం. ఆ సమయంలో ఎవరైనా భావోద్వేగాల మీద అదుపు కోల్పోతే, ఏ ఒక్క ఆలోచనా ఆచరణకు నోచుకోదు. అందుకే ఆ నియంత్రణ సాధించే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం అంటున్నారు నిపుణులు.
అతనిని పేరు శీతల్. వయసు 28. ఐదేళ్ల క్రితమే ఎంబిఏ పూర్తి చేశాడు. కొన్ని కంపెనీల్లో కొంత కాలం ఉద్యోగం చేశాడు. అయితే అందులో చేరిన కొద్ది రోజులకే కొలీగ్స్‌తో గొడవపడి, ఉద్యోగాన్ని వదిలేసే వాడు. తన కొలీగ్‌తో ఆరోజు అలా ప్రవర్తించకూడా ఉండాల్సింది అని ఆతరువాత అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే అలా అనడమే కానీ, ఆ మార్పు అతనిలో కనిపించేది కాదు. ఏదో ఒక సమయంలో ఆవేశానికీ, ఆగ్రహానికీ గురయ్యేవాడు. అలా పదే పదే ఘర్షణ పడుతూ చివరికి అక్కడ మనలేని స్థితికి వచ్చేవాడు. అలా అరడజనుకు పైగానే ఉద్యోగాలు వదిలేశాడు.
చివరికి ఇంక తాను ఎవరి వద్దా ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. సొంత వ్యాపారం గురించిన ప్రణాళిక వేశాడు. ఆ విషయమే పేరెంట్స్ తో చెప్పాడు. అయితే, సొంత వ్యాపారమే అయినా తన ఎంప్లాయీస్‌తో కూడా సఖ్యంగా ఉండాల్సిందే కదా! ప్రతిదానికి ఆగ్రహావేశాలకు గురైతే ఎవరు మాత్రం ఇతని దగ్గర పనిచేస్తారు? అన్న అనుమానం అతని పేరెంట్స్‌లో బలంగా ఉండిపోయింది. అందుకే అతని ప్రతిపాదనకు పేరెంట్స్ పెద్దగా స్పందించలేదు. కొద్ది రోజుల తరువాత పేరెంట్స్‌కు ఏమీ చెప్పకుండా తాను అనుకున్న వ్యాపారానికి బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులే పూచీకత్తు గా దరఖాస్తు పెట్టడం వల్ల సంతకం కోసం తండ్రికి విషయమంతా చెప్పక తప్పలేదు. ముందు కాదూ కూడదు అన్నా, చివరికి తండ్రి ఆ పేపర్స్‌మీద సంతకం చేశాడు. లోన్ మంజూరు అయ్యింది. వ్యాపారం మొదలయ్యింది.
ఉద్యోగుల మీద అగ్రహం
ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారు చేసే ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం కోసం మొత్తంగా 100 మంది దాకా ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఇక్కడ కూడా ముందు పేరెంట్స్ అనుకున్నట్లే జరిగింది. వారానికి ఒకరిద్దరు ఉద్యోగలు పైనైనా, ఏదో ఒక కారణంతో ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. పేరెంట్స్ ఈ విషయమై ఏమైనా చెప్పాలని చూస్తే, ఆ విషయాలన్నీ నాకు తెలుసు. మీరు నాకేమీ పాఠాలేమీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పే వాడు. ఏమీ చేయలేక వారు మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరి మీద మరీ ఆగ్రహంగా మాట్లాడటంతో కొద్ది రోజుల్లోనే ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయారు.
ఆ తరువాత ఇతని ధోరణిని భరించలేమని అనుకన్న వాళ్లంతా ఒక్కొక్కకరుగా జాబ్ మానేసి వెళ్లిపోయారు. వారిలో ప్రొడక్షన్ మేనేజర్లు కూడా ఉండడంతో ఉత్పత్తి బాగా కుంటుపడింది. ఫలితంగా అంతకు ముందే కుదుర్చుకున్న అగ్ర్రిమెంట్ మేరకు వస్తువులను సరఫరా చేయలేకపోయాడు. ఫలితంగా ఆ అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. చివరికి ఫ్యాక్టరీ మూతబడటం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. సకాలంలో బ్యాంక్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించకపోవడంతో బ్యాంక్ వారు వచ్చి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఆర్థికంగా దెబ్బ తిన్నందుకు మాత్రమే కాదు గానీ, చివరికి ఇతని జీవితం ఏమైపోతుందోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో బాగా ఎక్కువైపోయింది.
అన్నింటికీ అసహనమే
ఎవరైనా అది తప్పని నాకు తె లుసు అంటూనే, అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నారూ అంటే ఏమిటి? అతడు తెలుసు అని చెబుతున్నదేదీ అతనికి తెలియదని అర్థం. తనకు తెలిసిన కొన్ని సూత్రాల ఆధారంగా ఎవరైనా, కొన్ని చేయకూడదనుకుంటాడు. ఆ అనుకోవడం అనేది. ఆలోచనాత్మకంగా తీసుకున్న నిర్ణయం. అయితే, ఆ నిర్ణయాలు ఎంతో సేపు నిలవవు.
దానికి చాలా సార్లు చెయ్యకూడదనుకున్న వాటివైపే మొగ్గుచూపే భావోద్వేగాలే కారణం. ఆలోచనా పరంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, భావేద్వేగాల మీద నియంత్రణ లేకపోతే, ఆ నిర్ణయాలేవీ పనిచేయవు. అందుకే తాననుకున్న వాటికి అన్నీ విరుద్ధంగా జరిగిపోతాయి. అబద్దం ఆడకూడదని అనుకుంటే సరిపోదు. అబద్దం చె ప్పడానికి సిద్ధమయ్యే మనసును నియంత్రించగలగాలి. అప్పటిదాకా అబద్దం ఆడకూడదని తెలిసినా తెలియనట్టే అవుతుంది.
ఇ.క్యు కొరవడితే అంతే!
భావోద్వేగాల మీద నియంత్రణ సాధించగలిగే శక్తినే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ ఇంటలిజెన్స్ లేనంత కాలం ఎవరూ తమ బాధ్యతను సాఫీగా నిర్వహించలేరు. ఆలోచనల మీద భావోద్వేగాలది పైచేయి కావడమే ఇందుకు కారణం. ఇంటెలిజెన్స్ అందరికీ ఉంటుంది. కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొందరిలో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ప్రతి చిన్న దానికీ విపరీతమైన అసహనానికీ, ఆగ్రహావేశాలకూ గురవుతారు. వీరికి కౌన్సెలింగ్ అవసరం ఎంతో ఉంటుంది.
వీరిలో సహజంగానే ఇగో ఎక్కువ. అందుకే కుటుంబ సభ్యులు గానీ, అయిన వాళ్లు గానీ, ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వారికి చేదు అనుభవమే ఎదురవుతుంది. అందుకే మానసిక నిపుణులతో వీరికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. వీరిలో చాలా మందికి మందుల అసవరం లేకపోవచ్చు కానీ, కౌన్సెలింగ్ అవసరం మాత్రం తప్పనసరి అవుతుంది. నిపుణులైన వారి కౌన్సెలింగ్‌తో వారిలో గణనీయమైన మార్పు వస్తుంది.

Post a Comment

0 Comments