Full Style

>

Overian Cysts awareness, ఒవేరియన్ సిస్టులు



ఒవేరియన్ సిస్టులు అంటే?(Overian Cysts)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



స్త్రీలలో పునరుత్పత్తికి ఉపయోగపడే అతి ముఖ్యమైన అంగం అండాశయం (ఓవరీ). స్త్రీ పొత్తి కడుపులో ఉండే గర్భాశయానికి రెండువైపులా ఒవేరియన్ లిగమెంట్ల ద్వారా రెండు అండాశయాలు అతుక్కుని ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 3 సెం.మీ. పొడవు, 1.5 సెం.మీ. వెడల్పు, 1.5 సెం.మీ మందం ఉంటాయి.

చిన్నపిల్లలకు, బహిష్టులు ఆగిపోయిన స్త్రీలకు అండాశయాలు చిన్నవిగా ఉంటాయి. అండాశయాల నుంచి గర్భధారణకు కావలసిన అండం విడుదల అవుతుంది. వీటి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. స్త్రీ లక్షణాలు అభివృద్ధి చెందడానికి, రుతుచక్రం క్రమబద్ధం కావడానికి ఈ హార్మోన్లు ఉపయోగపడతాయి.

ఆడపిల్ల పుట్టినప్పుడు అండాశయాల్లో అండాలు పెరిగే తిత్తులు లేక ఫాలికల్స్ ఒక మిలియన్ సంఖ్యలో ఉంటాయి. వీటిమధ్యలో స్ట్రోమా, చుట్టూ ఎపిథీలియమ్ అనే పొరతో కప్పబడి ఉంటాయి. యవ్వనదశకు చేరేటప్పటికి అండాలు పెరిగే ఈ ఫాలికల్స్ కొన్ని నశించిపోయి, నాలుగు లక్షలు మాత్రమే మిగులుతాయి. వీటిలో స్త్రీ జీవితకాలంలో సుమారుగా 400-450 అండాలు మాత్రమే పరిణతి చెంది విడుదలవుతాయి. మిగతావన్నీ నశించిపోతాయి. బాలిక యవ్వనదశకు చేరేటప్పటికి మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల, ప్రతినెలా నాలుగు లక్షల ఫాలికల్స్‌లో, ఆరు నుండి పది కణాలు పరిణతి చెందుతాయి. అందులో ఒక్క అండం మాత్రమే విడుదలవుతుంది. ఇలా సాధారణంగా నెలకొకటి చొప్పున ఒక నెల ఒక అండాశయం నుంచి, మరోనెల మరొక అండాశయం నుంచి విడుదలవుతాయి. అమ్మాయి రజస్వల అయినప్పటినుండి ఈ ప్రక్రియ మొదలయ్యి, క్రమంగా బహిష్టులు ఆగిపోయే సమయానికి ఆగిపోతుంది.

యవ్వనదశలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. మెదడులోని హైపోథాలమస్ అనే భాగం ఉత్తేజితమయ్యి, కొన్ని హార్మోన్ల (జీఎన్‌ఆర్‌హెచ్) ద్వారా, పిట్యూటరీ గ్రంథి ప్రేరేపించడం ద్వారా... పిట్యూటరీ గ్రంథి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్), ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్)ను ఉత్పత్తి చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండాశయాల్లోని ఫాలికల్స్‌ను ప్రేరేపిస్తుంది. దానివల్ల ఫాలికల్స్ పెరగడంతో పాటు, వాటి నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది.తర్వాత ఎల్‌హెచ్ హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫాలికల్‌లోని అండం పరిణతి చెంది, ఫాలికల్ పగిలి, అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. దీనినే ఒవ్యులేషన్ అంటారు. అలా విడుదలైన అండం ఫాలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశిస్తుంది. పగిలిన ఫాలికల్ మార్పుచెంది, కార్పస్ లూటియమ్‌గా మారుతుంది. ఇది ఈస్ట్రోజన్‌తో పాటు, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో గర్భధారణ జరగకపోతే, కార్పస్ లూటియమ్ కృశించిపోయి, హార్మోన్లు తగ్గిపోయి, బహిష్టు మొదలవుతుంది. బహిష్టు మొదలైన రోజునుంచి మరలా అండాశయంలో కొత్త ఫాలికల్ పెరుగుదల మొదలవుతుంది. అది పెరిగి 11 నుంచి 16వ రోజు లోపల పగిలి, అండం విడుదలవుతుంది.

క్రమంగా జరిగే ఈ ప్రక్రియలో కొన్ని సార్లు ఏవైనా తేడాలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయాల్లో నీరులాంటి ద్రవం, రక్తం లేదా ఇతర ద్రవాలతో చేరిన సంచులు, గడ్డలు ఏర్పడతాయి. వీటినే ఒవేరియన్ సిస్టులు అంటారు. సిస్టుల్లో ఉన్న పదార్థాన్ని బట్టి, తయారయిన కారణాన్ని బట్టి, వీటిని అనేక రకాలుగా విభజించారు. అవి....

1. ఫంక్షనల్ సిస్ట్. మళ్లీ దీనిలో ఫాలికులార్ సిస్ట్, హేమోరేజిక్ సిస్ట్, కార్పస్ లూటియల్ సిస్ట్ అని మూడు రకాలుంటాయి.
2. డర్మాయిడ్ సిస్ట్
3. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లేదా చాకొలెట్ సిస్ట్
4. పాలిసిస్టిక్ ఓవరీస్
5. సిస్టడినోమా సిస్ట్

Treatment :

సుమారు 90% ఒవేరియన్‌ సిస్ట్ లు క్యాన్సర్ గా మారవు .వీటి పరిమాణము , కలిగించే నొప్పిని బట్టి చికిత్స ఉంటుంది .
నొప్పి తగ్గడానికి పారాసిటమాల్ , ఎసిక్లోఫెనాక్ , బ్రూఫెన్‌ వంటివి వాడాలి.
వేడీ నీళ్ళ సంచి పొత్తికడుపు పైన ఉంచడము వలన నిప్పి తగ్గుతుంది,
హార్మోనల్ కాంట్రాసెప్టివ్ కంబైండ్ పిల్ల్సు వాడడము వలన కొత్త సిస్ట్ లు తయారవడం తగ్గుతుంది. ఉన్న సిస్ట్ లు కృషించుకు పోతాయి.
పరిమాణము పెద్దవిగా ఉన్నవాటిని ఆపరేషన్‌ ద్వారా తొలగించడము జరుగుతుంది.

Post a Comment

0 Comments