Full Style

>

Cardiomegaly-గుండె పెరిగితే ?

ఇప్పుడు - Cardiomegaly-గుండె పెరిగితే ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మన గుండె ఒక పంప్‌ వంటిది. ఈ పంపు బలహీన మైనప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్‌ చేయలేదు. అంతేకాక వివిధ అవయవాలకు అవసరమైన పోషకాలు అందవు. ఈ పరిస్థితినే హార్ట్‌ఫెయిల్యూర్‌ అంటారు. ఒత్తిడి పెరిగినప్పుడు తాత్కాలికంగా గుండె విస్తరిస్తుంది. ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు, గుండె కండరాలు బలహీనమైనప్పుడు, కరొనరి ఆర్టిరి వ్యాధి వచ్చినప్పుడు, గుండె కవాటాల సమస్యలున్నప్పుడు, గుండె అసాధారణంగా కోట్టుకుంటున్నప్పుడు గుండె పెరుగుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో గుండె విస్తరించడాన్ని నివారించలేం కానీ, చాలా కేసుల్లో చికిత్స చేసే వీలుంది. గుండె విస్తరించడానికి కారణమయ్యే వాటిని దృష్టిలో పెట్టుకుని చికిత్స చేస్తారు. మందులు, అవసరమైతే శస్త్రచికిత్సతో కూడా వైద్యం చేస్తారు.


గుండె విస్తరించడాన్ని (హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌) వైద్యపరిభాషలో కార్డియోమెగలె అంటారు. ఇది వ్యాధి కాదు. ఇతర పరిస్థితికి చెందిన ఒక లక్షణం. ఛాతి ఎక్స్‌రే తీసినప్పుడు అందులో గుండె విస్తరించిందని వైద్యులు చెబుతుంటారు. ఆ తర్వాత ఇతర పరీక్షలు చేస్తారు. కొంత మందిలో గుండె విస్తరించినా ఎలాంటి లక్షణాలు, చిహ్నాలు కనిపించవు. కానీ కొంత మందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి...శ్వాసక్రియలో సమస్యలు, కళ్లు తిరగడం, గుండె అసాధారణంగా కొట్టుకోవడం, వాపు (ఎడిమ), దగ్గు, ఛాతిలో నొప్పి. గుండె విస్తరించడాన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది. మీ గుండె ఆరోగ్యం గురించి మీకున్న ఆందోళనలను డాక్టర్‌తో పంచుకోండి. దీని వల్ల కలిగే పరిణామాలను ఎలా నివారించాలో చర్చించండి. పైన పేర్కొన్న లక్షణాలు, చిహ్నలు మీలో కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్యం చేయించడం తప్పనిసరి.

కారణాలు

గుండె విస్తరించడం వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. లేదా గుండె కండరాలు దెబ్బతింటాయి. కొన్ని సార్లు గుండె విస్తరించడానికి ఎలాంటి కారణాలు ఉండకపోవచ్చు కూడా. గుండె విస్తరణతో సంబంధం ఉండే పరిస్థితులు...

అధిక రక్తపోటు : అధిక రక్తపోటు వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేయడం కష్టమవుతుంది. అంతేకాక గుండె విస్తరించడం, కండరాలు పలుచబడతాయి.

గుండె కవాటాల వ్యాధి : గుండెలోని నాలుగు కవాటాలు సరైన దిశలో రక్తం ప్రవహించడానికి తోడ్పడతాయి. రుమాటిక్‌ ఫీవర్‌, గుండెలో లోపం, ఇన్‌ఫెక్షన్లు (ఇన్‌ఫెక్టివ్‌ ఎండొకార్డైటిస్‌), కనెక్టివ్‌ టిష్యూ డిసార్డర్స్‌, ప్రత్యేక మందులు లేదా క్యాన్సర్‌ కోసం తీసుకున్న రేడియేషన్‌ చికిత్స వల్ల గుండె కవాటాలు దెబ్బతిని గుండె విస్తరించే అవకాశముంది.

కార్డియోమయోపతి : దీన్నే గుండె కండరాల జబ్బు అంటారు. అంటే గుండె కండరాలు పలుచబడటం, గట్టిపడటం. కార్డియోమయోపతి తొలి దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పరిస్థితి తీవ్రమయ్యే కొద్దీ శరీరానికి రక్తాన్ని మరింత పంప్‌ చేయడానికి గుండె విస్తరిం చడానికి ప్రయత్నిస్తుంది.

గుండెపోటు : గుండె పోటు సమయంలో గుండె దెబ్బతిని గుండె విస్తరిస్తుంది. కొంత మందిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉండటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకా శాలున్నాయి. చాలా రకాల పుట్టుకతో కలిగే గుండెలో లోపాలు గుండె విస్తరణకు దారితీస్తాయి.

అసాధారణ హృదయ స్పందన : దీన్నే వైద్య పరిభాషలో అరిత్మియా అంటారు. అంటే ఈ పరిస్థితిలో గుండె రక్తాన్ని అంత సమర్థవంతంగా పంప్‌ చేయలేదు. రక్తాన్ని పంప్‌ చేయాలంటే గుండె అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది గుండె విస్తరణకు దారితీస్తుంది.

పల్మనరీ హైపర్‌టెన్షన్‌ : గుండెకు, ఊపిరితిత్తులతో సంబంధం ఉండే ధమనుల్లోని అధిక రక్తపోటు కూడా గుండె విస్తరణకు కారణం అవుతుంది. దీన్నే పల్మనరీ హైపర్‌టెన్షన్‌ అంటారు. పల్మనరీ హైపర్‌టెన్షన్‌ ఉన్నప్పుడు ఊపిరితిత్తులు, గుండెలో ఉండే రక్తాన్ని తరలించడానికి గుండె కష్టంగా పంప్‌ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల గుండె కుడివైపు విస్తరిస్తుంది.

రక్తహీనత : తక్కువ ఎర్ర రక్తకణాల కౌంట్‌ను రక్తహీనత అంటారు. శరీరంలోని కణజాలాలకు అవసరమైన ఆక్సీజన్‌ను తీసుకెళ్లే ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేని పరిస్థితిని రక్తహీనత అంటారు. దీన్ని చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది దీర్ఘకాల రక్తహీనతగా మారి, గుండె కొట్టుకోవడంలో క్రమం తప్పడానికి దారితీస్తుంది. రక్తహీనత పరిస్థితి ఏర్పడినప్పుడు, రక్తంలో అవసరమైన ఆక్సీజన్‌ లేకపోవడం వల్ల గుండె మరింత రక్తాన్ని పంప్‌ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా రక్తహీనత ఉండి, చికిత్స చేయించు కోకుంటే అరుదుగా గుండె విస్తరిస్తుంది.

థైరాయిడ్‌ : హైపర్‌ థైరాయి డిజం, హైపోథైరాయిడిజం గుండె విస్తరణతో సహా గుండె జబ్బులకు దారితీస్తాయి.

అధిక ఐరన్‌ : శరీరంలో ఎక్కువ ఐరన్‌ ఉండటాన్ని హిమోక్రొమటొసిస్‌ అంటారు. శరీరం సరిగ్గా ఐరన్‌ను జీవక్రియకు ఉపయోగించుకోకపోవడం. దీని వల్ల ఇది శరీరంలోని ఇతర అవయవాల్లో, గుండె కండరాల్లో నిర్మితమై ఉంటుంది. ఫలితంగా గుండె కండరం బలహీనమై ఎడమ జఠరిక విస్తరిస్తుంది.

అమిలొఇడొసిస్‌ : అరుదైన వ్యాధులు కూడా గుండె విస్తరణకు కారణం అవుతాయి. అందులో ఒకటి అమిలొఇడొసిస్‌. అంటే రక్తంలో అసాధారణంగా ప్రోటీన్లు ప్రవహించి, గుండెలో నిక్షిప్తమవుతాయి. దీంతో ఇవి గుండె పనితీరుకు అడ్డుపడతాయి. గుండెలో అమిలొఇడొసిస్‌ ఏర్పడితే గుండె విస్తరణకు దారితీస్తుంది.

ప్రమాద కారకాలు-ఉపద్రవాలు

అధిక రక్తపోటు, కార్డియోమయోపతి వంశపారంపర్యంగా ఉన్నా, గుండె ధమనుల్లో అడ్డంకులు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బు, గుండె కవాటాల వ్యాధి, గుండెపోటు వంటి వాటి వల్ల గుండె విస్తరించే ప్రమాదం వృద్ధి చెందే అవకాశముంది. గుండె విస్తరణ గుండెలో ఏ భాగంలో జరిగిందనే దాన్ని బట్టి, అంతర్గతంగా ఉన్న కారణాలను బట్టి ఈ ఉపద్రవాలుంటాయి.

హార్ట్‌ ఫెయిల్యూర్‌ : గుండె విస్తరణ, ఎడమ జఠరిక విస్తరణ వల్ల తీవ్ర పరిణామాలు కలుగుతాయి. అందులో హార్ట్‌ ఫెయిల్యూర్‌ ప్రమాదం అధికమవడం ఒకటి. శరీరానికి అవసరమైన రక్తాన్ని గుండె పంప్‌ చేయకపోవడం వల్ల కలిగే పరిస్థితి హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటారు. క్రమేణా గుండె కండరాలు బలహీనమవుతాయి.

రక్తంలో గడ్డలు : గుండె విస్తరించడం వల్ల గుండె పొరలో చిన్న రక్తం గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువుంటుంది. ఒక వేళ రక్తం గడ్డలు గుండె నుండి బయటికి పంపింగ్‌ అయ్యి, రక్తప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తే, ఇవి శరరీంలోని కీలక అవయవాలకు రక్తం వెళ్లకుండా అడ్డుకుంటాయి. రక్తపు గడ్డలు గుండె ఎడమవైపు ఏర్పడితే, ముఖ్యంగా గుండె మెదడు ప్రభావితమై గుండెపోటు, పక్షవాతం వస్తాయి. రక్తం గడ్డలు గుండె కుడివైపున ఏర్పడితే, ఇవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల ప్రమాదకరమైన పల్మనరీ ఎంబొలిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది.

గుండె గొణుగుడు : దీన్నే హార్ట్‌ మర్మర్‌ అంటారు. గుండె విస్తరణ ఉన్న వారిలో, నాలుగు కవాటాల్లో రెండు కవాటాలు (మైట్రల్‌, ట్రైకప్సిడ్‌ కవాటాలు) సరిగ్గా మూసుకోవు. ఇవి ఉబ్బడమే కారణం. ఇలా రక్తం వెనక్కి రావడంతో కొన్ని శబ్దాలు వస్తాయి. వీటినే హార్ట్‌ మర్మర్‌ అంటారు. అయితే, గుండె గొణుగుడు ప్రమాదకరమైనవి కాకపోయినా, వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

కార్డియాక్‌ అరెస్ట్‌ : కొన్ని రూపాల్లో ఉండే గుండె విస్తరణ గుండె కొట్టుకునే లయ వ్యవస్థపై ప్రభావం చూపి అంతరాయం కలిగిస్తుంది. అసాధారణ గుండె లయల వల్ల శోష వచ్చి పడిపోవడం, కొన్నిసార్లు కార్డియాక్‌ అరెస్ట్‌ లేదా సడన్‌ డెత్‌ సంభవించొచ్చు.

నిర్ధారణ పరీక్షలు

గుండె, ఊపిరితిత్తుల పరిస్థితిని తెలుసుకోవడానికి ఛాతి-ఎక్స్‌రే చిత్రాలు ఉపయోగపడతాయి. ఒక వేళ గుండె విస్తరించి ఉంటే, ఛాతి ఎక్స్‌రే ద్వారా దాన్ని తెలుసుకునే వీలుంది. దీనికి గల ప్రత్యేక కారణాలు తెలుసుకోవడానికి ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎకోకార్డియోగ్రాం పరీక్ష చేస్తారు. ఇందులో ధ్వని తరంగాలను ఉపయోగించి గుండె వీడియో చిత్రాలను రూపొందిస్తారు. ఈ పరీక్షలో గుండెలోని అన్ని గదులను విశ్లేషిస్తారు. గుండె ఏమైన భిన్నంగా పంపింగ్‌ చేస్తుందా ? అని గుండె కవాటాలను అంచనా వేయవచ్చు. అంతేకాక ఇంతకు ముందు వచ్చిన గుండెపోటుకు సంబంధించిన ఆధారాలను, పుట్టుకతో గుండె జబ్బును కూడా గుర్తించే వీలుంది. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు, వ్యాయామం గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్ట్రెస్‌ టెస్ట్‌ చేస్తారు. మిగతా సమయాల్లో కన్నా గుండె వ్యాయామం చేస్తున్నప్పుడు వేగంగా రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ పరీక్షనే ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ అని అంటారు. ఈ పరీక్షల తర్వాత అవసరాన్ని బట్టి సిటి స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేస్తారు.


జీవనశైలిలో మార్పులు

ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వల్ల గుండె విస్తరణను నయం చేయడం వీలుకాదు. కానీ మీ పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవాలి. అవి...ధూమపానం మానాలి. అధిక బరువు ఉంటే తగ్గాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే నియంత్రించుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. వైద్యునితో సంప్రదించిన తర్వాత నిరాడంబరమైన వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించుకోవాలి. కనీసం రాత్రిపూట 8 గంటలు నిద్రపోవాలి.

మందులు- అత్యాధునిక వైద్యం

చాలా కేసుల్లో ఇప్పుడు అత్యాధునిక మందులు, వైద్య చికిత్సల వల్ల గుండె విస్తరణను నయం చేసే అవకాశముంది. కేవలం కొన్ని కేసుల్లో మాత్రమే గుండె విస్తరణను నివారించలేం. కొన్ని రకాల మందులతో గుండె పెరగడాన్ని తగ్గించొచ్చు కూడా. గుండె పెరిగితే కొత్త వైద్య చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. జబ్బును గుర్తించి నివారిస్తే, గుండె పెరగడాన్ని నివారించే వీలుంది. కార్డియోమయోపతి, ఇతర గుండె జబ్బులను ముందుగానే గుర్తిస్తే, జబ్బు ముదరకుండా చికిత్స చేయవచ్చు. గుండె విస్తరణకు కారణమయ్యే ధమనుల వ్యాధి, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటివి నియంత్రించడం వల్ల గుండె విస్తరణను, హార్ట్‌ఫెయిల్యూర్‌ను తగ్గించే వీలుంది. ఫలితంగా గుండెపోటు కూడా తగ్గే అవకాశముంది. గుండె పంపింగ్‌ వ్యవస్థను మెరుగు పరిచే మందులు అందుబాటులో ఉన్నాయి. హార్ట్‌ రిలాక్స్‌ కోసం కూడా మందులున్నాయి. ఒంట్లో చేరిన నీటి శాతాన్ని తగ్గించడానికి మందులున్నాయి. ఒంట్లో నీరు చేరిన వారు లీటరు నుంచి లీటరున్నర నీళ్లు తగ్గించి తాగాలి. చికిత్సలో భాగంగా పేస్‌ మేకర్‌ను అమరుస్తారు. కవాటంలో సమస్య వల్ల గుండె పెరిగితే, సర్జరీ చేసి కృత్రిమ కవాటాన్ని అమరుస్తారు. కరొనరి బైపాస్‌ సర్జరీ, లెఫ్ట్‌ వెంట్రికల్‌ అసిస్ట్‌ డివైజ్‌తో చికిత్స చేస్తారు.

Post a Comment

0 Comments