Full Style

>

వినికిడి లోపం -కాక్లియర్‌ ఇంప్లాంట్‌లు , Deafness and Cochlear inflants

ఫోలేట్‌' లోపంతో వినికిడి తగ్గుతోంది!

ఒక వయసు వచ్చేసరికి వినికిడి శక్తి కొంత తగ్గటం సహజమే. చెవులలోని అత్యంత సున్నితమైన వినికిడి యంత్రాంగంలో క్షీణతతో పాటు... దీనికి మరికొన్ని అంశాలూ తోడవుతాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

భారీ శబ్దాల బారినపడటం, పోషకాహార లోపం, ముక్కు-చెవులలో ఇన్‌ఫెక్షన్ల వంటి వివిధ అంశాలు వినికిడి శక్తిని దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వృద్ధాప్యంలో వినికిడి మందగించి, చెవుడు ముంచుకురావటానికి ఫోలేట్‌ (ఫోలిక్‌ యాసిడ్‌), బి12 విటమిన్ల లోపం కూడా కారణమవుతున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు.

ఒకే వయసు వృద్ధుల్లో మామూలుగా శబ్దాలు వినగలిగే వారితో పోలిస్తే వినికిడి లోపం ఉన్నవారి రక్తంలో 'ఫోలిక్‌ యాసిడ్‌' స్థాయులు తక్కువగా ఉంటున్నట్టు నైజీరియాలోని ఇబదాన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఇక ఫోలిక్‌ యాసిడ్‌ 35 శాతం తక్కువగా ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినబడనంతగా చెవుడు ఉంటున్నట్టు గుర్తించారు. ఫోలేట్‌తో పాటు కొద్ది మోతాదులోనైనా 'విటమిన్‌ బి12' లోపం కూడా దీనికి కారణమవుతోంది. ఈ లోపాలను చాలా తేలికగా మందులతో, మాత్రలతో సరిచేయొచ్చని పరిశోధకులు గుర్తించటం విశేషం. ఫోలేట్‌, బి12 విటమిన్లను ఇచ్చినప్పుడు వినికిడి మెరుగుపడటమే కాకుండా... జ్ఞాపకశక్తి పెరగటం, కాళ్లూ చేతుల్లోని నాడుల పని తీరుతో పాటు కేంద్ర నాడీ మండల వ్యవస్థ కూడా శక్తిని పుంజుకుంటున్నట్టు గుర్తించారు.

ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వయసు మీదపడుతున్న కొద్దీ సంప్రాప్తించే చెవుడు సమస్యను సరిచేయటం సాధ్యం కాదనే చిరకాల నమ్మకాన్ని ఇది మార్చేస్తుందని.. ఆ లోపాన్ని అధిగమించేందుకు కొందరికైనా ఇది మార్గం చూపుతుందని భావిస్తున్నారు.

వినికిడి లోపం -'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'లు , Deafness and Cochlear inflants:

వృద్ధాప్యంలో నడక వేగం తగ్గొచ్చు. కదలికల్లో చురుకు తగ్గొచ్చు. ఆలోచనల్లో ఉరవడి తగ్గొచ్చు. కంటి చూపు మందగించవచ్చు. అలాగే వినికిడి శక్తీ మందగించవచ్చు. అయితే మిగతా లోపాలకూ దీనికీ చాలా తేడా ఉంది. దీనివల్ల మనిషి సామాజిక సంబంధాలే తెగిపోయి.. సంఘజీవనం కోల్పోయి.. ఏదో లోకంలో.. ఒంటరితనంలో కూరుకుపోవచ్చు. సమూహంలోనే ఏకాకిగా మారిపోవచ్చు. డిప్రెషన్లోకి జారిపోవచ్చు. ఒకప్పుడు దీన్ని ఎదుర్కొనటం కష్టంగా ఉండేది. వినికిడి లోపం ఒక స్థాయికి చేరుకున్న తర్వాత.. అందులో కూరుకుపోవటమే తప్పించి విరుగుడు ఉండేది కాదు. కానీ ఆధునిక డిజిటల్‌ శ్రవణ యంత్రాల ఆగమనంతో ఈ కొరత చాలా వరకూ తీరింది. వాటి వల్ల కూడా తీరని తీవ్ర వినికిడి లోపాన్ని ఇప్పుడు 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'లు తీరుస్తున్నాయి. వీటితో ఏ రకం చెముడునైనా అధిగమించే అవకాశం మన సొంతమవుతోంది.

మన వినికిడి అత్యంత సున్నితమైన ప్రక్రియ. అలాగే అత్యంత సంక్లిష్టమైనది కూడా. అందుకే ఒక వయసు వచ్చేసరికి చాలామందికి నిశితమైన ఈ ప్రక్రియలో కాస్త మందకొడితనం మొదలవుతుంది. మన దేశంలో కొన్ని లక్షల మంది ఇలా వయసు వచ్చేసరికి ఎంతోకొంత వినికిడి శక్తి తగ్గి యాతనపడుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పుడు చాలామంది ఎంతోకొంత ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అలాగని వినికిడి సమస్య వృద్ధుల్లోనే అనుకోవటానికి లేదు. వాస్తవానికి ఈ సమస్య- పిల్లలతో సహా ఎవరికైనా, ఏ వయసులోనైనా, ఎప్పుడైనా రావచ్చు. అయితే వృద్ధాప్యంలో పలకరించే చెవుడుకు చాలా ప్రత్యేకతలున్నాయి. వీరిలో చాలామందికి సమస్య వినటంలో కంటే కూడా.. విన్నదాన్ని విడమర్చి అర్థం చేసుకునే శక్తిలో లోపం ఉంటుంది. ఇది వినిపించకపోవటం, చెవుడు వల్ల కాదు.. వృద్ధాప్యంలో సహజంగానే చురుకుదనం తగ్గటం వల్ల వచ్చే సమస్య! వృద్ధాప్యంలో శారీరక భాగాలన్నీ కొంత నెమ్మదించి, వెనకబడి, క్షీణించటం దీనికి మూలం. నిజానికి శబ్దాలు మనందరికీ వినిపించవచ్చు. కానీ వాటిని వినిపించుకుని, అర్థం చేసుకోవటమన్నది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సిన పని. వృద్ధాప్యంలో ఈ ప్రయత్నం కాస్త నెమ్మదిస్తుంది. అందుకే చాలామంది వృద్ధులు తమకు సరిగా వినిపించటం లేదని ఖరీదైన మిషన్లు కొని పెట్టేసుకున్నా పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తుంటారు. దీనికి కారణం వినిపించకపోవటం కాదు.. విన్నది గ్రహించుకోలేకపోవటం! కాబట్టి ఆడియాలజిస్ట్‌లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే వృద్ధుల్లో వినికిడి సమస్యను ఆడియోమెట్రీ ద్వారా కచ్చితంగా అంచనా వేసి.. వినికిడి యంత్రాల వంటివి సూచిస్తారు.

వినికిడి లోపం రకరకాలు
మన చెవిని ప్రధానంగా మూడు భాగాలుగా చూస్తారు. ఇవి బయటి చెవి, మధ్య చెవి, అంతర్‌ చెవి. వినికిడి లోపానికి అరుదుగా మధ్య చెవి, తరచుగా అంతర్‌ చెవికి సంబంధించిన లోపాలే కారణమవుతుంటాయి. వీటిని ముఖ్యంగా మూడు రకాలుగా విభజిస్తారు.

* కర్ణభేరిలో రంధ్రం వల్ల, కర్ణభేరికి అనుసంధానంగా మధ్య చెవిలో ఉండే మూడు గొలుసు ఎముకల్లో ఒకటి గట్టిపడిపోవటం, వాటిలో మార్పులు రావటం వల్ల ఆ ప్రకంపనలు సరిగా కర్ణభేరికి చేరక కొందరిలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అలాగే మధ్య చెవి నుంచి ముక్కుకు ఉండే యూస్టేషన్‌ ట్యూబు మూసుకుపోయి చెవిలో ద్రవాలు, జిగురు వంటి పదార్థాలు పేరుకుపోవటం, మధ్యచెవిలో కణుతులు రావటం వంటి సందర్భాల్లో కూడా కర్ణభేరికి ప్రకంపనలు చేరక వినికిడి తగ్గొచ్చు. ఈ తరహా సమస్యలన్నింటినీ 'కండక్టివ్‌ హియరింగ్‌ లాస్‌' అంటారు.

* ఇక అంతర్‌ చెవి చాలా సున్నితమైనది. చెవిలోని శ్రవణనాడులు బలహీనపడటం, కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ నాడులు దెబ్బతినటం తదితర కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. వీటన్నింటినీ 'సెన్సరీ న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌' అంటారు. అంతర్‌ చెవిలో తలెత్తే ఈ వినికిడి లోపానికి మందులు గానీ సాధారణ శస్త్రచికిత్సల వంటివేవీ గానీ పెద్దగా ఉపయోగపడవు. కొందరికి మధ్య చెవిలోనూ, అంతర్‌ చెవిలోనూ కూడా సమస్యలుండొచ్చు. దాన్ని 'మిక్స్‌డ్‌ హియరింగ్‌ లాస్‌' అంటారు.

* కొందరికి మధ్య చెవి, అంతర్‌ చెవి రెండూ బాగానే ఉండొచ్చుగానీ మెదడులో వినికిడికి సంబంధించిన కేంద్రం దెబ్బతిని ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఈ తరహా సమస్యను 'సెంట్రల్‌ ఆడిటరీ ప్రోసెసింగ్‌ డిజార్డర్స్‌' అంటారు. దీనికి మనం చెయ్యగలిగిందేం లేదు. వీటికి తోడు మన చుట్టూ ఉండే ధ్వని కాలుష్యం వల్ల చాలామందిలో మానసిక ప్రవర్తనలో అనేక మార్పుల వల్ల ఏకాగ్రత కోల్పోవటం, చీటికీమాటికీ సహనం కోల్పోవటం, నిశ్శబ్ద వాతావరణంలో ఉండేందుకు మొగ్గుచూపటం వంటి దుష్ప్రభావాలు కనబడుతున్నట్టు శాస్త్రీయంగా రుజువైంది. ఒక వయసు వచ్చే సరికి రకరకాల ఆరోగ్య సమస్యల మూలంగా సాధారణ ఆరోగ్యమూ క్షీణించటం తదితరాల వల్ల శ్రవణ నాడుల్లో సామర్థ్యం, సున్నితత్వం తగ్గటం, శ్రవణ ప్రక్రియ మందగించటం జరుగుతోంది. చాలామంది వృద్ధుల్లో ధ్వని కాలుష్యం కూడా వినికిడి సమస్య జఠిలం కావటానికి దోహదం చేస్తోంది. అయితే దీన్ని ఆడియాలజిస్టుల ద్వారా నిర్ధారించుకోవటం ముఖ్యం.

వినికిడి లోపం ఎప్పుడు?
సాధారణంగా 4-6 అడుగుల దూరం నుంచి ఎవరైనా వ్యక్తి మాట్లాడితే దాన్ని వినటంలో, గ్రహించటంలో ఇబ్బందిగా ఉంటే దాన్ని వినికిడి లోపంగా భావించవచ్చు. టెలిఫోన్లో ఎదుటి వ్యక్తి మాట్లాడేది అర్థం కాకపోవటం, నలుగురిలో సంభాషించేటప్పుడు మాటలు వినపడకపోవటం, మెల్లిగా మాట్లాడితే ఏదో వినపడుతున్నట్టున్నా ఆ విన్నదేమిటో అర్థం కాకపోవటం, టీవీ వాల్యూమ్‌ బాగా పెద్దగా పెట్టుకోవాల్సి వస్తుండటం.. ఒకప్పుడు బాగా మట్లాడేవారు కూడా క్రమేపీ మాటలు తగ్గించేస్తుండటం.. ఇవన్నీ 'వినికిడి లోపాన్ని' పట్టిచెప్పే లక్షణాలు.

కాస్త లోతుగా చూస్తే..
సాధారణంగా మనం వినే మంద్ర ధ్వనులు తక్కువ (లో) ఫ్రీక్వెన్సీలో ఉంటాయి, తీవ్ర స్వరాలు ఎక్కువ (హై) ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఉదాహరణకు స్త్రీల కంఠస్వరాలు హైఫ్రీక్వెన్సీ(బారిటోన్‌)లోకి వస్తాయి. పురుషుల కంఠధ్వని (బాస్‌) లోఫ్రీక్వెన్సీ కోవలోకి వస్తుంది. మొత్తమ్మీద మన మాటల్లోని ధ్వనులన్నీ కూడా 250 హెర్జ్‌ నుంచి 8000 హెర్జ్‌ లోపలే ఉంటాయి. ఆపైన ఉండే అతిధ్వనులు (అల్ట్రాసానిక్స్‌) మనకు వినపడవు. కాబట్టి ఈ 0-20 డెసిబుల్స్‌లో ఈ ఫ్రీక్వెన్సీలన్నీ బాగా వినపడుతుంటే మనకు వినికిడి బాగున్నట్టు. మనం వినే శబ్దాల్లో ఈ హై, లో ఫ్రీక్వెన్సీలు రెండూ కలగలిసి ఉంటాయి. ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే మనం వాటిని గ్రహించటం చాలా కష్టం. ఈ రెండు ఫ్రీక్వెన్సీల శబ్దాలను విని, అర్థం చేసుకుంటేనే గ్రహింపు బాగా ఉంటుంది. కానీ కొందరికి పెద్ద వయసు వచ్చేసరికి హైఫ్రీక్వెన్సీలు సరిగా వినపడవు. వృద్ధాప్యంలో 95% మందిలో ఈ సమస్యే కనిపిస్తుంది. అందుకే చాలామంది వృద్ధులు కొన్ని మాటలు వింటున్నప్పుడు మధ్యలో 'ఆ.. ఏమన్నారు?' అని అడుగుతుంటారు. లోఫ్రీక్వెన్సీలు బాగానే వినపడుతున్నా హైఫ్రీక్వెన్సీల వినికిడి శక్తి తగ్గిపోవటాన్ని 'స్లోపింగ్‌ కర్వ్‌' అంటారు. దీనివల్ల మాటల్లోని అన్ని ధ్వనులూ సరిగా వినపడకపోవటం, వినిపించినా ఒక ధ్వనికి బదులు మరో ధ్వని (టేబుల్‌ అంటే కేబుల్‌లాగా) వినపడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా హైఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే స, ష, జ, ఝ వంటి స్వరాలు సరిగా అర్థం కాక.. అన్నీ ఒకేలా వినపడతాయి.

* సాధారణంగా లోఫ్రీక్వెన్సీలన్నవి మనం శబ్దం ఉనికిని గుర్తించటానికి ఉపయోగపడితే హైఫ్రీక్వెన్సీలు ఆ వినిపించిన దాన్ని విడమర్చి, విశ్లేషించి అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి.

కాబట్టి ఈ హైఫ్రీక్వెన్సీ లోపం ఉన్న వారికి ఏవేవో ధ్వనులు వినపడుతుంటాయిగానీ అవి స్పష్టంగా, విడమర్చి అర్థం కావు. దీంతో అంతా గందరగోళంగా తయారవుతుంది. కాబట్టి వీరిలో

హైఫ్రీక్వెన్సీల వినికిడి లోపం ఎంత తీవ్రంగా ఉంది? దాన్ని ఏయే ఫ్రీక్వెన్సీల్లో ఎంత పెంచాలన్నది ఆడియాలజిస్ట్‌లు పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. వినికిడి లోపం ఒకరిలో ఉన్నట్టు మరొకరిలో ఉండదు. కొందరికి 90లలోనూ చక్కగా వినపడుతుంటే కొందరికి 60లలోనే వినికిడి శక్తి తగ్గొచ్చు. కొందరికి లోఫ్రీక్వెన్సీలు బాగుంటే కొందరిలో అవీ సమస్యగా తయారవ్వచ్చు. కాబట్టి వినికిడి లోపం ఎవరికి వారికే ప్రత్యేకం. దీన్ని కచ్చితంగా నిర్ధారించి అప్పుడు ఎలాంటి వినికిడి యంత్రాలు ఉపయోగపడతాయో సిఫార్సు చేస్తారు.

సులభంగా చెప్పుకోవాలంటే...
0-20 డెసిబుల్స్‌ అన్నది సాధారణ వినికిడి పరిధి అయినా.. 30, 35 డెసిబుల్స్‌ లోపం వచ్చే వరకూ కూడా పెద్దగా లోపంగా అనిపించదు. 40, 45 లోపం వచ్చేసరికి ఎవరైనా కాస్త మెల్లిగా మాట్లాడితే చాలు.. కాస్త బిగ్గరగా మాట్లాడితే బాగుండునని అనిపించటం ఆరంభమవుతుంది. దీంతో ఇంకోసారి చెప్పండని అడుగుతారు. 50, 55 వచ్చేసరికి ముందుకు వంగి ఏకాగ్రతగా వింటూ తరచూ మళ్లీ చెప్పండని అడుగుతుంటారు. 55-60 వస్తే ఈ మనిషి వినిపించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చెయ్యాల్సి వస్తుంది. మాట్లాడే వారిని పక్కన వచ్చి కూర్చోమనటం, ముఖం పెదాల కదలికలు చూడటం, గట్టిగా మాట్లాడమనటం.. ఇవన్నీ మొదలవుతాయి.


సాంకేతిక పరిజ్ఞానంతో..
సాధారణంగా వినికిడి సరిగా లేనివారికి 'ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ' పరీక్ష చేయటం ద్వారా ఏయే ధ్వనులు చక్కగా వినపడుతున్నాయన్నది స్పష్టంగా గుర్తించొచ్చు. కాస్త ఎక్కువ సమయం పట్టేదే అయినా ఇది అన్ని పరీక్షల కంటే ఉత్తమమైంది. దీంతో సమస్య ఏ స్థాయిలో, ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుస్తుంది. దీనిబట్టి ఆడియాలజిస్ట్‌లు లోపాన్ని అధిగమించేందుకు ఏం చెయ్యాలో, ఎటువంటి యంత్రాలు వాడాలో సూచిస్తారు.

డిజిటల్‌ మార్గం
ఒకప్పుడు అనలాగ్‌ రకం శ్రవణ యంత్రాలు విరివిగా వాడేవారుగానీ ఇవి నాణ్యత రీత్యా చాలా తక్కువస్థాయివి. వీటితో ధ్వని నాణ్యత చాలా తక్కువ. అలాగే ఏదో ఒక శ్రవణ యంత్రాన్ని షాపులో కొనుక్కోవటం కూడా సరైన పద్ధతి కాదు. మనం దృష్టిలోపం ఎంతో తెలుసుకుని కళ్లజోడు వేయించుకున్నట్టే శ్రవణ యంత్రాన్ని కూడా ఎవరికి వారు ప్రత్యేకంగా తీసుకోవాల్సిందే.

చెవుడు ఉన్న వారికి 80-85 శాతం మందికి 'డిజిటల్‌' శ్రవణ యంత్రం ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికివారు వినికిడి లోపాన్ని బట్టి ప్రోగ్రామింగ్‌ (అడ్జస్ట్‌మెంట్‌) చేయించుకునే వీలుంటుంది. 15-20 శాతం మందికి చెవుడు ఈ డిజిటల్‌ వినికిడి యంత్రం స్థాయిని మించి ఉంటుంది, వారికి ఆపరేషన్‌ చేసి చెవి వెనక అమర్చే 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'తో ఉపయోగం ఉంటుంది. మన దృష్టిలోపం లాగానే ఈ వినికిడి లోపం కూడా అలాగే ఉండిపోవచ్చు లేదూ క్రమేపీ (పవర్‌) పెరుగుతూ ఉండొచ్చు. బీపీ, మధుమేహం వంటి కొన్నికొన్ని వ్యాధుల వల్ల వేగంగానూ పెరగొచ్చు.

* ప్రోగ్రామింగ్‌: వినికిడి యంత్రాన్ని ఆడియాలజిస్టులు చెవుడుకు తగ్గట్టుగా ప్రోగ్రామింగ్‌ చేస్తారు. ఒకవేళ వినికిడి లోపం పెరుగుతుంటే- ఈ యంత్రాన్ని అందుకు తగ్గట్టుగా ట్యూనింగ్‌ చేస్తారు.

* డిజిటల్‌ యంత్రాల్లో బయటకు అంతగా కనబడని ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆడపిల్లలకు చెవి వెనకాల పెట్టుకునే చిన్నచిన్న, శక్తిమంతమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కాస్త ఖరీదు ఎక్కువే అయినా వీటితో జీవన ప్రమాణాలు ఎంతో మెరుగవుతాయి. మున్ముందు ఈ రేట్లు మరింత తగ్గే అవకాశమూ ఉంది.

* వినికిడి లోపం 75 డి.బి. కంటే ఎక్కువ ఉన్నవారికి వినికిడి యంత్రాలతో అంతగా ఉపయోగం ఉండదు. వారికి 'కాక్లియర్‌ ఇంప్లాంట్‌'తో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా హైఫ్రీక్వెన్సీలు వినపడని వారికి, ఆ లోపం తీవ్రంగా ఉన్నవారికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సంజీవని వంటిది. ఇది డిజిటల్‌ యంత్రాల్లో అంతగా సాధ్యం కాదు. మొత్తానికి డిజిటల్‌ వినికిడి యంత్రం లేదా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ల వాడకం పెరిగాక.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇవాల్టి రోజున ఏ రకం చెవుడు నుంచైనా బయటపడటం తేలికే అయ్యిందని చెప్పుకోవచ్చు!
గుర్తించే పరీక్షలు
వినికిడి శక్తిని గుర్తించటానికి, విశ్లేషించటానికి ఆడియాలజిస్టులు వివిధ ఆడియోమెట్రీ పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా వ్యక్తి స్పందించి చెబుతున్న దాన్ని గుర్తించేవి (సబ్జెక్టివ్‌ పరీక్షలు) కొన్ని అయితే వ్యక్తి స్పందనలతో ప్రమేయం లేకుండా వినికిడి ఎంత ఉందన్నది అంచనా వేసి (ఆబ్జెక్టివ్‌) చెప్పేవి మరికొన్ని. అయితే వృద్ధాప్యంలో మాత్రం ఎక్కువగా వ్యక్తి స్పందనల మీద ఆధారపడి చేసే 'ప్యూర్‌టోన్‌ ఆడియోమెట్రీ' పరీక్షే ఎక్కువగా ఉపయోగపడుతుంది. వారి నుంచి సరైన స్పందన లేనప్పుడు, సందేహాస్పదంగా అనిపించినపుడు ఆబ్జెక్టివ్‌ పరీక్షలు చేస్తారు.

వీటిల్లో బెరా టెస్ట్‌, ఒటోఎకూస్టిక్‌ ఎమిషన్‌ టెస్ట్‌, ఇంపిడెన్స్‌ ఆడియోమెట్రీ టెస్ట్‌లు ముఖ్యమైనవి.

* బెరాటెస్ట్‌: ఆరు నెలల నుంచి ఏడాది లోపు పిల్లల్లో వినికిడి సమస్యను బెరా (బ్రెయిన్‌స్టెమ్‌ ఇవోక్‌డ్‌ రెస్పాన్స్‌డ్‌ ఆడియోమెట్రీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు. స్వల్పంగా మత్తు మందుతో నిద్రపుచ్చి ఈ పరీక్ష చేస్తారు. చెవి వెనక, నుదురు మీద ఎలక్ట్రోడ్‌లు అమర్చి.. చెవి లోపలికి శబ్దాలను పంపిస్తారు. దీని తర్వాత కొద్దిసేపయ్యాక మెదడులో కొన్ని తరంగాలు ఉత్పన్నమవుతాయి. అవి ఎన్ని మిల్లీసెకండ్లలో ఉత్పన్నమయ్యాయన్నదాన్ని బట్టి ఎలక్ట్రోడ్‌లు క్రోడీకరించి గ్రాఫ్‌ రూపంలో ఫలితాలను తెలియజేస్తాయి. ఇందులో వినికిడి సమస్యతో పాటు దానికి ఏ భాగం (మధ్యచెవి, లోపలిచెవి, నాడులు) కారణమవుతుందో కూడా తెలుస్తుంది. దీన్నిబట్టి వినికిడి లోపాన్ని 'అంచనా' వేస్తారు. ఇది వినికిడి లోపం ఎంత ఉండొచ్చన్నది అంచనా వేసే పరీక్ష మాత్రమేగానీ కచ్చితంగా ఇంత ఉందని చెప్పేది కాదు. ఇది ఆబ్జక్టివ్‌ పరీక్ష. సరిగా స్పందించలేని స్థితిలో ఉన్న వారికి ఇది బాగా పనికొస్తుంది.
* ఒటో ఎకూస్టిక్‌ ఎమిషన్‌ టెస్ట్‌: ఇందులో చెవిలోకి కొన్ని శబ్దాలను పంపిస్తారు. అప్పుడు లోపలి చెవిలో నుంచి కొన్ని తరంగాలు ఉత్పన్నమై కర్ణభేరి (టింపానిక్‌ మెంబ్రేన్‌) వైపు ప్రవహిస్తాయి. వాటిని ఈ యంత్రం గ్రహించి కంప్యూటర్‌ ద్వారా క్రోడీకరించి ఒక గ్రాఫ్‌ని ఇస్తుంది. ఇది కూడా వినికిడి శక్తిని అంచనా వేసే పరీక్ష. అయితే మధ్యచెవి కర్ణభేరికి రంధ్రం ఉన్నా, చెవిలో గులిమి ఉన్నా, పరీక్ష చేసే సమయంలో చుట్టుపక్కల ధ్వనికాలుష్యం ఉన్నా ఇందులో ఫలితం సరిగ్గా తేలదు.
* ఇంపిడెన్స్‌ టెస్ట్‌: మధ్య చెవిలో ఏవైనా సమస్యలుంటే అదేమిటన్నది దీని ద్వారా తెలుస్తుంది. గతంలో ఈ సమస్యలను తెలుసుకోవటానికి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చేది. ఇంపీడెన్స్‌ అందుబాటులోకి వచ్చాక ఆ బెడద తప్పిపోయింది. ఈ పరీక్షలో చెవిలోకి ఒక గొట్టం పెడతారు. ఈ గొట్టంలో రిసీవర్‌, మైక్రోఫోన్‌, ప్రెషర్‌పంప్‌లు ఉంటాయి. ప్రెషర్‌ ద్వారా కర్ణభేరి బిగుతుగా ఉండేలా చేస్తారు. తర్వాత శబ్దాలను పంపించి వెనక్కి వచ్చిన తరంగాల మోతాదును లెక్కిస్తారు. ఒక రకంగా ఇది మద్దెల వంటి వాటి మీద చర్మం పొరను బిగించి చేసే పరీక్షలాంటిది. ఈ పరీక్షలో కర్ణభేరి కదలికలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. అలాగే ఎముకలకు అంటుకొని ఉండే 'స్టిపిడియస్‌ కండరం' సంకోచాలను బట్టి వినికిడి సామర్థ్యమూ బయటపడుతుంది.
* ప్యూర్‌టోన్‌ పరీక్ష: మూడేళ్లు దాటిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ధ్వనులు విని స్పందించ గలిగిన వారెవరికైనా ఈ పరీక్ష చెయ్యచ్చు. ఇందులో చెవులకు హెడ్‌ఫోన్స్‌ పెట్టి, రకరకాల పౌనఃపున్యాల శబ్దాలను వినిపిస్తారు. ఏ చెవిలో శబ్దం వినిపించినా మీట నొక్కి స్పందించాల్సి ఉంటుంది. శబ్దాల తీవ్రతను బట్టి వినికిడి స్థాయిని గుర్తిస్తారు. ఉదాహరణకు 25 డెసిబెల్స్‌ దగ్గర అతి తక్కువ శబ్దాన్ని విన్నట్టుగా మీట నొక్కితే.. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించి వినికిడి స్థాయి ఆ మేరకు ఉన్నట్టు గుర్తించి గ్రాఫ్‌ను రూపొందిస్తారు. ఈ గ్రాఫ్‌ మీద ఒక వైపు 250 నుంచి 8000 (హెర్ట్జ్స్‌) వరకు.. మరోవైపు 0 నుంచి 120 (డెసిబెల్స్‌) వరకు అంకెలుంటాయి. 0-25 డెసిబెల్స్‌ తీవ్రతలో అన్ని ఫ్రీక్వెన్సీల శబ్దాల వినికిడి స్థాయి నమోదైతే వినికిడి మామూలుగా ఉందని అర్థం. 25 డెసిబెల్స్‌ కన్నా వినికిడి స్థాయి మించుతున్నకొద్దీ సాధారణంగా ఉండాల్సిన దానికన్నా వినికిడి లోపం ఆ మేరకు ఉన్నట్లు గుర్తిస్తారు.
రెంటిలోనూ లోపం!
చాలామందికి వినికిడి లోపం రెండు చెవుల్లోనూ ఉంటుంది. అప్పుడే అది లోపం కింద బయటపడుతుంది. వాస్తవానికి ఒక చెవి బాగున్నా కూడా 95% వినికిడి శక్తి బాగానే ఉంటుంది. ఒక చెవే వినపడుతుంటే- 'స్టీరియోఫోనిక్‌' ప్రభావం.. అంటే ధ్వని ఏ దిక్కు నుంచి వస్తోందో చెప్పగలిగే శక్తి ఉండదు. అందుకే ఒకే చెవితో వినేవారు.. ఎవరన్నా పిలిస్తే అన్ని దిక్కులా వెతుక్కుంటుంటారు. అలాగే ఆ చెవితో సెల్‌ఫోన్‌లో మాట్లాడాలన్నా, ఆ చెవిలో గుసగుసలు చెప్పినా వినపడదు. అంతకు తప్పించి ఒక చెవిలో వినికిడి శక్తి బాగున్నవారు మాట్లాడటానికి ఏమీ ఇబ్బంది ఉండదు. వినికిడి బానే ఉంటుంది.


చెయ్యి చేసే మేలు
వినికిడి లోపం మొదలవగానే చాలామంది ముందుకు వంగి, చెవి వెనక చెయ్యి పెట్టుకుని.. డొప్పలా వంచి.. వింటుంటారు. దీన్నే 'కప్పింగ్‌ ఆఫ్‌ ఇయర్స్‌' అంటారు. ఇలా చేయటం వల్ల ధ్వని పరావర్తనానికి అవకాశం పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ధ్వని 3-4 డెసిబుల్స్‌ ఎక్కువగా వినపడుతుంది. దీంతో వినికిడి చాలా మెరుగ్గా అనిపిస్తుంది. ఒకప్పుడు వినటానికి దోహదపడేలా ఇలాగే చెవి వెనక పెట్టుకునేందుకు రేకులాంటి పరికరం కూడా వాడేవారు!
తైలాలతో కష్టం, నష్టం
చెవిలో తైలాలు వేస్తే చెవుడు పోతుందన్న ప్రచారం ఉందిగానీ ఇది నిజం కాదు. మన మధ్యచెవి బయటి ప్రపంచంతో ఏ సంబంధమూ లేకుండా కర్ణభేరితోనే మూసుకుపోతుంది. కాబట్టి మనం బయటి నుంచి చెవిలో నూనెలాంటివి వేసినా అవి కర్ణభేరి దగ్గరకు వెళ్లి ఆగిపోవాల్సిందేగానీ లోనికి వెళ్లలేవు. కాబట్టి ఈ తైలాలతో ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పైగా వీటి వల్ల లేనిపోని ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటివీ వచ్చే ప్రమాదం ఉంది. ఇక కర్ణభేరిలో రంధ్రం ఉంటే తైలాలు మధ్యచెవిలోకి వెళ్లి పూర్తిగా వినికిడి లోపానికి దారీతీసే అవకాశం ఉంది.

ప్రొ|| వి.యు.నండూర్‌-ప్రొఫెసర్‌ అండ్‌ చీఫ్‌ ఆడియాలజిస్ట్‌-స్పీచ్‌ పెథాలజిస్ట్‌ (రిటైర్డ్‌)-ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, కోఠి, హైదరాబాద్‌,.

కొవ్వు పదార్థాలు మన వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి,
Fatty foods Diminish hearing ability

వింటున్నారా?.....'విన్నాను కానీ పూర్తిగా వినిపించలేదు' తరచూ తోటివారికి మీరిచ్చే సమాధానం ఇదే అయితే ఆ తప్పు మీది కాదు జంక్‌ఫుడ్‌దే అంటున్నారు వైద్యులు. జంక్‌ఫుడ్‌లో ఉండే కొవ్వు పదార్థాలు మన వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉండటంవల్ల చెవి నుంచి మెదడుకి చేరాల్సిన సంకేతాలకు మధ్యలోనే అంతరాయం ఏర్పడుతుందని గినియా పందులపై చేసిన ఓ పరిశోధనలో తేలింది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌(ఎల్‌డీఎల్‌)ను 50 శాతం మేర తగ్గించుకున్నా ఈ సమస్యనుంచి బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ రక్త ప్రసరణను మందగించేలా చేయడమూ వినికిడి సమస్యకు మరో కారణంగా చెబుతున్నారు. చెడ్డ కొలస్ట్రాల్‌ను దూరం చేయాలంటే ఏం చేయాలంటారా? వ్యాయామంతో పాటు, వివిధ రకాల నట్స్‌ తింటే చాలు.

మధుమేహంతో వినికిడి లోపం-Defective hearing due to Diabetes

మధుమేహంతో గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు, చూపు కోల్పోవటం వంటి పలు సమస్యలు పొంచి ఉంటాయని నిపుణులు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నారు. అయితే దీంతో వినికిడి లోపం ముప్పూ ఉంటోందని పరిశోధకులు కనుగొన్నారు. మధుమేహం లేనివారితో పోలిస్తే ఈ జబ్బుని సరిగా నియంత్రణలో పెట్టుకోలేని వృద్ధ మహిళల్లో వినికిడి లోపం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. మధుమేహంతో బాధపడుతున్న చిన్న వయసు మహిళలకూ ఈ ముప్పు పొంచి ఉంటోందని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే పురుషుల్లో ఈ ప్రభావం కనబడలేదు. నిజానికి స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వినికిడి లోపం ఎక్కువ. అందువల్ల మధుమేహం మూలంగా పురుషుల్లో మరింత అధికంగా వినికిడి లోపం తలెత్తుతున్నా దాన్ని గుర్తించటం కష్టం కావటమే ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటే వినికిడి లోపం బారిన పడకుండా, ఒకవేళ ఉన్నా అది మరింత తీవ్రం కాకుండా చూసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. మధుమేహులు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటున్నట్టుగానే వినికిడి పరీక్షలూ చేయించుకోవటం అవసరమని తాజా అధ్యయనం రుజువు చేస్తోంది.

Post a Comment

0 Comments