Full Style

>

Drug Resistance and diseases, వ్యాధినిరోధకత-వ్యాధులు

Drug Resistance and diseases, వ్యాధినిరోధకత-వ్యాధులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్‌ ఆరోగ్యంపై పెనుప్రభావం ప్రాణాంతకమవుతున్న విచ్చలవిడి వాడకం నిరోధకతను పెంచుకుంటున్న బ్యాక్టీరియా
ఇన్‌ఫెక్షన్లతో పెరుగుతున్న మరణాలు వైద్యనీతిని పక్కనపెడుతున్న ఆస్పత్రులు ప్రభుత్వ నియంత్రణ లేదు బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడానికి వాడాల్సిన మందులవి. ఎంత వాడాలో, ఎలా వాడాలో, ఎవరికి వాడాలో చెప్పే వైద్యనీతిని అనుసరించే వాటిని వాడాలి.
లేదంటే శరీరం నిర్వీర్యమవుతుంది. లోపలికి ప్రవేశించిన సూక్ష్మక్రిమి ఏ మందుకూ లొంగని మొండిఘటమవుతుంది. ఇంత ప్రమాదమనీ తెలిసీ  యాంటీబయాటిక్స్‌ను ఇష్టానుసారం ఉపయోగించే అలవాటు ఇటీవల కాలంలో బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సత్వర ఉపశమనం  కలిగిస్తున్నామన్న పేరు కోసం పలు ఆస్పత్రులు, పలువురు వైద్యుల్లో ఈ ధోరణి వ్యాపిస్తుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. రోగుల తెలియనితనమూ వారిని ప్రమాదపుటంచుల్లోకి నెడుతోంది. వాడమన్నన్ని రోజులూ వాడకుండా రోగం తగ్గిందని ఆపేస్తుండడం వల్ల కూడా మొండిరోగాలు తయారవుతున్నాయి.

ఔషధాల వాడకంపై ఆంక్షలున్న అమెరికాలోనే... మోతాదుకు మించి మందుల వాడకం, ఆస్పత్రుల్లో సోకుతున్న వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏటా లక్షమందికి పైగా మరణిస్తున్నారు. ఔషధాల వాడకంపై కఠిన మార్గదర్శకాలులేని మన దేశంలో ఈ తరహా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇన్‌ఫెక్షన్లకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించే సాంక్రమిక వ్యాధి  నిపుణుల(Infectious disease specialists) కొరత మన దేశంలో తీవ్రంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆర్థం చేసుకోవచ్చు.

వైద్యుల అనాలోచిత ధోరణి
ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న రోగులకు 10% యాంటీబయాటిక్స్‌ అవసరంకాగా, త్వరగా నయం కావాలనే భావనతో 30% అధిక మోతాదు మందులు ఇస్తున్నారు. దీనివల్ల త్వరగా ఉపశమనం కలిగినా, భవిష్యత్తులో మందులకు లొంగని రీతిలో బ్యాక్టీరియా, వైరస్‌లు రూపాంతరం చెందుతాయని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నివారణ కోసం సగటున రోజుకు 500 మంది రోగులకు
'కార్బాపీనమ్స్‌'(Carbapenems are a class of β-lactam antibiotics with a broad spectrum of antibacterial activity. They have a structure that renders them highly resistant to most β-lactamases.) వాడుతున్నారు. దీనికి రూ.5వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతుంది. ఈ మందులు అందరికీ అవసరం లేదు. ఇన్ఫెక్షన్‌ బాగా ఎక్కువగా ఉన్నవారికే వాడాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో ఉన్న రోగులు త్వరగా కోలుకుంటే, కొత్త రోగులను చేర్చుకోవచ్చన్న అనైతిక ఆలోచనతో వీటిని ఇష్టానుసారం వాడుతున్నారని జాతీయ పౌష్ఠికాహార సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. కార్బాపీనమ్స్‌ మందులు ఒకసారి వాడితే ఆ తరవాత సాధారణ మందులు పూర్తిస్థాయిలో ప్రభావం చూపించవు. ఇది చాలా ఆందోళనకర పరిణామం. మలేరియా, గన్యా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాలు,  పిరితిత్తులు, మూత్రసంబంధిత సమస్యలకు ఇటీవల కాలంలో ఔషధాలు వాడుతున్నా... త్వరగా నయం కాకపోవడానికి యాంటీబయాటిక్స్‌ మందులు మోతాదుకు మించి వాడుతుండం ఒక కారణం.

ఇది మరో ప్రమాదం..
ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్‌కేర్‌లో బ్యాక్టీరియా పొంచి ఉంటుంది. అక్కడికి వచ్చే వారికి అప్పటికే రోగనిరోధకత తక్కువ ఉండడంతో వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశాలుంటాయి. దానికి తోడు నియంత్రణ లేకుండా ఔషధాలు వాడడం వల్ల వాటికి లొంగని విధంగా అవి తయారై పరిస్థితిని విషమం చేస్తాయి. ఆస్పత్రిలో ఇంటెన్సివ్‌కేర్‌లో 48 గంటల కంటే ఎక్కువ కాలం ఉంటే... రోగి శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించినట్లేనని ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్‌ ఎన్‌.సునీత 'ఈనాడు'తో చెప్పారు. ఏడు రోజుల కంటే ఎక్కువ ఉన్న రోగికి ఇన్‌ఫెక్షన్లు రావడానికి 70% అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మందుల వాడకంపై నియంత్రణ లేకపోవడం, ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నివారణకు పటిష్ఠమైన విధానాలు లేకపోవడమే కారణమన్నారు. ఇష్టారాజ్యంగా మందులు వాడడం తదితర కారణాలతో మొండివ్యాధులుగా మారిన తరవాత, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వస్తున్న కేసుల్లో సగటున ప్రతి రోజు 10 వరకు ''గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా కేసులు''   నమోదవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకర పరిణామమని డాక్టర్‌  సునీత చెప్పారు. ఢిల్లీలోని అఖిలభారత వైద్యవిజ్ఞానసంస్థలో రోగులపై అధ్యయనం చేయగా... 11శాతం మంది ఆస్పత్రిలో పలురకాల ఇన్‌ఫెక్షన్లకు (ప్రత్యేకించి గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా) గురైనట్లు తేలింది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే, భవిష్యత్తులో చాలా రకాల వ్యాధులకు ఎక్కువ తీవ్రత(డోసేజీ) ఉన్న మందులు వాడాల్సి వస్తుందన్నారు. దీనివల్ల సహజంగా ఉండే రోగనిరోధకశక్తి దెబ్బతింటుందన్నారు.

కొంపముంచుతున్న ఉజ్జాయింపు చికిత్సలు:
వైద్యపరీక్షలు (కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ) చేసిన తరవాత రోగికి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలి. మన దేశంలో ఈ తరహా విధానాలు పరిమితంగా కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే అమలవుతున్నాయి. ప్రతి చిన్న సమస్యకు యాంటీబయాటిక్స్‌ వాడడం అలవాటుగా మారిపోయింది. రోగ నిర్ధారణ చేయకుండానే చాలా మంది వైద్యులు ఉజ్జాయింపుగా చికిత్సలు చేస్తున్నారు. చాలా చోట్ల రోగనిర్ధారణ పరీక్షల్లోనూ కచ్చితత్వం, నాణ్యత ఉండడం లేదు. దీనివల్ల మందులు వాడినా ఫలితం ఉండడం లేదు.
ఇవీ కారణాలు
* ఎలాంటి జబ్బునైనా త్వరగా నయం చేశామని పేరు సాధించాలనే తపన ప్రైవేటు ఆస్పత్రులతో పాటు వైద్యుల్లో పెరిగింది.
* కొత్త రోగిని చేర్చుకుంటే, వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సల ద్వారా ఆదాయం వస్తుంది. అందుకే రోగులకు అధిక మోతాదు మందులు ఇచ్చి, కొంత ఉపశమనం రాగానే ఇంటికి పంపిస్తున్నారు.
* గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు ఇష్టారాజ్యంగా యంటీబయాటిక్స్‌ ఇస్తున్నారు.
* మందుల తయారీ కంపెనీలు యాంటీబయాటిక్స్‌ విక్రయాలు పెంచుకోవడానికి ఆదాయంలో దాదాపు 25శాతం దుకాణాలు, వైద్యులకు ప్రోత్సహకాలుగా ఇస్తున్నాయి. దీనివల్ల కూడా యాంటీబయాటిక్స్‌ వాడకం పెరుగుతోంది.  ప్రభుత్వ ఆస్పత్రులకు కొనుగోలు చేస్తున్న మందుల్లో సుమారు రూ.65 కోట్లు యాంటీబయాటిక్స్‌ ఉన్నాయి. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఇన్‌ఫెక్షియస్‌ వ్యాధుల నివారణ విభాగంలో వైద్యులకు శిక్షణ ఇచ్చే సంస్థలు మూడు మాత్రమే ఉన్నాయి.
 1. హిందూజా(ముంబాయి),
2. సీఎంసీ(వేలూరు),
3. అపోలో(చెన్నై)లో మాత్రమే ఈ శిక్షణ అందుబాటులో ఉంది. పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్ల తీవ్రత దృష్ట్యా కొన్ని మినహాయింపులతో ఈ కోర్సులను విస్తరించడానికి భారతీయ వైద్యమండలి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చెన్నై ప్రకటన---యాంటీబయాటిక్స్‌ విచ్చలవిడి వినియోగంపై గత ఏడాది ఆగస్టులో చెన్నైలో నిర్వహించిన సమావేశంలో కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ, వైద్యపరిశోధన మండలి, మందుల కంపెనీలు, వైద్యరంగ నిపుణులు పలు అంశాలపై చర్చించారు. యాంటీబయాటిక్స్‌ నియంత్రణ విధానం తీసుకురావాలని నిర్ణయించినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. ఔషధకంపెనీలు లాబీయింగ్‌ చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
* ఆస్పత్రుల్లో 72 గంటల కంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ వాడాల్సి వస్తే, మరో వైద్యనిపుణుడి సిఫారసు తప్పనిసరి.
* కార్బాపీనమ్స్‌ వల్ల ఇంటెన్సివ్‌కేర్‌లో చికిత్స పొందుతున్న వారిలో 51% మందిలో మందుతీవ్రతను తట్టుకునే స్థాయి పెరిగింది. ఈ తరహా మందుల వాడకంపై వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఆస్పత్రుల్లో ఔషధాల వాడకంపై పర్యవేక్షణ కోసం అక్కడ పనిచేసే వైద్యులతో అంతర్గతంగా కమిటీ ఏర్పాటు చేయాలి.
* జిల్లా, రాష్ట్రస్థాయుల్లో పర్యవేక్షణ కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు, ప్రతి నెలా సమీక్షా సమావేశాలు.
* ఎంబీబీయస్‌, పీజీ వైద్యకోర్సుల్లో ఔషధాల వాడకంపై ప్రత్యేక శిక్షణ.
* తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మందుల దుకాణాల్లో వైద్యుల సిఫారసులు లేకుండా యాంటీబయాటిక్స్‌ విక్రయాలకు వీల్లేకుండా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ తరహా విధానాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి.
* ఔషధనియంత్రణశాఖ ద్వారా పటిష్ఠమైన నిఘా.

Post a Comment

0 Comments