దోమల దాడి నుంచి రక్షణ సాధనాల అవగాహన,Protection aids from mosquito bite-Awareness - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సాయంత్రం అయ్యిందంటే చాలు.. దోమల దాడి ప్రారంభం. ఒక్క దోమ కుట్టినా చాలు.. కొన్నిసార్లు వ్యాధుల పాలయ్యే ఆస్కారముంది! అందుకే వీటి నుంచి రక్షణ పొందడానికి ఎక్కువ మంది దోమల చక్రాలు (మస్కిటో కాయిళ్లు), దోమల బిళ్లలు (మస్కిటో మ్యాట్లు) వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ బ్యాటులు, శరీరానికి రాసుకునే కొన్ని రకాల క్రీములనీ చాలామందే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రక్షణ సాధనాల నుంచి గరిష్ఠ ప్రయోజనం పొంది.. దోమలు పరార్ అయ్యేలా చేయాలంటే వీటికి సంబంధించి కచ్చితమైన అవగాహన కలిగి ఉండటం అవసరం.
వీటిని పూర్తిగా అరికట్టడం, సంపూర్ణంగా నివారించడం మాటలు చెప్పినంత సులువేం కాదు. వీలైనంత వరకు దరిచేరకుండా చూసుకోవాలి. ఈ విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తే, ఒంట్లోని రక్తాన్ని పీల్చేయడంతో పాటు భయంకరమైన వ్యాధులు వ్యాపించడానికి కారణం అవుతాయి. భూమిపై సుమారు 2,700 జాతుల దోమలున్నా అందులో హాని కలిగించేవి అనాఫిలెస్, క్యూలెక్స్ దోమలే. వీటి కారణంగా మలేరియా,ఫైలేరియా, ఎల్లోఫీవర్, డెంగ్యూ, ఎన్‌సఫైలిటిస్ వ్యాధులు వ్యాపిస్తాయి.
పరిశుభ్రతతో నియంత్రణ...
సాధారణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు దోమలు వృద్ధి చెందే ఆవాసాలు. అందుకే నీరు ఒకచోట నిల్వ ఉండకుండా చూడాలి. అది సాధ్యం కానప్పుడు ఆ నీటిలో క్రిమి సంహారకాలను కలపడం ద్వారా దోమలని దూరంగా ఉంచొచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకొన్నా అవి దాడి చేస్తున్నప్పుడు.. దోమల చక్రాలు, దోమల బిళ్లలు, మేని పూతలు, గదిలో వాడే రసాయన స్ప్రేల వంటి మార్గాలను అనుసరించాల్సిందే. బ్యాటుల వంటి ఎలక్ట్రికల్ పరికరాలు వాడుతున్నా అవి కొంత ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం, పైగా వినియోగంలో సౌలభ్యం తక్కువ. ఇవి కాకుండా ఖరీదైన ఫ్త్లెజాప్పర్, అల్ట్రావయెలెట్ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి దోమలని చంపకుండా దారి మళ్లిస్తాయి. మస్కిటో రిపల్లెంట్ క్రీములని ఒంటికి పూతగా రాసుకోవడం వల్ల దోమలు వాసన గ్రహించే శక్తిని కోల్పోతాయి. ఓ రకంగా.. వాటికి సరిగ్గా కనిపించం. అయితే ఈ క్రీమ్‌లని మోము, కళ్లు, నోటి భాగంలో రాసుకోకూడదు. తరవాత వదులుగా ఉండే లేత రంగు దుస్తులు ధరిస్తే మేలు. ముదురు రంగువి ఎంచుకోకపోవడం మంచిది.
* దోమల చక్రాలని సాధారణంగా పైరెత్రమ్ అనే పూవు నుంచి తీసిన తైలానికి, రసాయనాలు కలిపి తయారుచేస్తారు. చక్రాల్లా ఉండే కాయిళ్లని ఒక్కసారి వెలిగిస్తే మొత్తం పన్నెండు గంటల పాటు వెలుగుతాయి. వీటికి విద్యుత్ వాడకం అవసరం లేదు. తేలిగ్గా ఉపయోగించుకొనే అవకాశం ఉండటంతో పల్లెల్లో వీటి వాడకం ఎక్కువవుతోంది. అయితే వీటి నుంచి వచ్చే పొగ కారణంగా త్వరగా అలెర్జీలు వస్తుంటాయి. అందుకే ఇప్పుడు అందుబాటులోకి వస్తోన్న పొగరాని చక్రాల (నో స్మోక్ కాయిల్స్) గురించి తెలుసుకొని కొనుగోలు చేయాలి.
* వేపరైజింగ్ మ్యాట్లకి కూడా ఈ మధ్యకాలంలో ఆదరణ పెరిగింది. వీటిని సాధారణ విద్యుత్ సాకెట్‌లో ఉంచగానే, అది క్రమంగా వేడెక్కి దోమల కదలికలను నిర్వీర్యం చేసేలా పొగను విడుదల చేస్తాయి.
కొనేముందు పరిశీలించాలివి...
నిత్యం వేధించే దోమల సమస్య నుంచి బయటపడటానికి కొంత మొత్తం ఎలా కేటాయిస్తున్నామో, ఆయా ఉత్పత్తుల కొనుగోలుకు ముందు కూడా కొన్ని అంశాలపై దృష్టి కేటాయిస్తే నాణ్యమైన వాటిని ఉపయోగించగలం.
* దోమలను పారదోలే ఉత్పత్తుల్లో ఏయే పదార్థాలు ఉపయోగించారో గమనించాలి. అందుకోసం వాడే అల్లాత్రిన్, పారాల్లాత్రిన్ ఏ మోతాదులో వినియోగించారో ప్యాక్‌పై చూడాలి. అది తయారయిన చిరునామా, లైసెన్సు నంబరు, కాలావధి (డేటాఫ్ ఎక్స్‌పైరీ), ఉపయోగించే తీరుని కూడా పరిశీలించాలి.
* కాయిల్‌ని కొనే ముందు అది ఎంత సేపు వెలుగుతోంది, ఎంత సమయం దోమల నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తోంది.. అని గమనించాలి. దోమల చక్రాలను విడదీస్తుంటే అవి సులభంగా ముక్కలు కాకుండా రెండుగా రావాలి. ఒక డబుల్ కాయిల్ బరువు 25గ్రాములు కంటే తక్కువగా ఉండకూడదు. అది ఎనిమిది గంటల పాటు వెలగాలి. అదే 30 గ్రాములు ఉంటే పది గంటలు పాటు, 36 గ్రాములుండే జంబో కాయిల్ అయితే పన్నెండు గంటల పాటు నిరాటంకంగా వెలగాలి. ఇదే సమయంలో అవి దోమలని ఎంత వేగంగా, సమర్థంగా పారదోలుతున్నాయి అనేదీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే.
0 Comments