గూని (స్కోలియోసిస్) ,Scoliosis-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కుబ్జ... మనకు అందవికారిగానే తెలుసు! కానీ 'గూని' వల్ల కేవలం అందం తగ్గటమే కాదు.. శారీరక ఆరోగ్యమూ దెబ్బతింటుంది! గూని అన్నది ప్రధానంగా వెన్నెముక-వెన్నుపూసల నిర్మాణంలోనే పెరిగే సమస్య. అందుకే దీన్ని సరిచెయ్యటం చాలా అవసరం. అదీ వీలైనంత వరకూ సాధ్యమైనంత చిన్నవయసులోనే!
వెన్నుపూసల సమాహారమైన 'వెన్నెముక' నిటారుగా ఉంటేనే మన శరీరాకృతి సరిగ్గా ఉంటుంది. అది ఏమాత్రం పక్కకు తిరిగినా రూపం మారిపోతుంది. ముఖ్యంగా వెన్నుపూసల అమరిక వంపు తిరిగిపోవటం.. అదే గూని (స్కోలియోసిస్) తలెత్తితే కేవలం అందంగా లేకపోవటమే కాదు, క్రమేపీ రోజువారీ పనులు చేసుకోవటం కూడా కష్టంగానే పరిణమిస్తుంది. ఈ గూని అరుదైన సమస్యేం కాదు. ప్రతి 100 మందిలో కనీసం ముగ్గురు ఏదో ఒకరకమైన గూనితో బాధపడుతున్నారని అంచనా. కొందరిలో వెన్నెముక పక్కలకు తిరిగి ఉంటే.. మరికొందరిలో ముందుకు గానీ వెనక్కు గానీ తిరిగి ఉంటుంది. నిజానికి గూని స్వల్పంగా ఉంటే మరీ అంత ఇబ్బందేం ఉండదు. కానీ కొందరిలో వయసు పెరుగుతున్నకొద్దీ వంపు మరీ ఎక్కువై వెన్నెముక S ఆకారంలోకి గానీ, C ఆకారంలోకి గానీ మారిపోతుంది. దీన్ని కచ్చితంగా పట్టించుకోవాల్సిందే.
కారణాలు :---
గూని స్త్రీలలో ఎక్కువ. దీనికి కచ్చితమైన కారణమేదీ తెలియదు. కానీ చాలా అంశాలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇది జన్యుపరమైన లోపం కావచ్చన్న భావన బలంగా ఉంది. కొందరిలో పుట్టుకలో లోపం వల్ల గూని వస్తుంది. ఇలాంటి పిల్లల్లో వెన్నెముక ఆకృతి సరిగా లేకపోవటం వల్ల.. వెన్నెముక కుడి, ఎడమల పెరుగుదలలో తేడాలు వస్తాయి. దీంతో వెన్నులో వంపులు తలెత్తుతాయి. మన రాష్ట్రంలో ఇలా పుట్టుకతో వచ్చే గూని సమస్య కూడా ఎక్కువగానే కనబడుతోంది. పిల్లలకు పుట్టుకతోనే గూని వచ్చినట్టు గుర్తిస్తే.. వెంటనే వెన్నెముక, గుండె, మూత్రపిండాల సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటం చాలా అవసరం. యుక్తవయసులో గూని వస్తే వెన్నెముకకు కండరరాలు అతుక్కుపోవటం (టెథెర్డ్ స్పైనల్ కార్డ్), నాడులు-కండరాలకు సంబంధించిన సమస్యలు కారణం కావొచ్చు. వెన్నెముకకు అతుక్కుపోయిన కండరాలు దాని కదలికలను అడ్డుకోవటం వల్ల ఇలాంటి గూని వస్తుంది. కారణమేదైనా.. గూని యుక్తవయసు పిల్లల్లో పెరుగుదలను దెబ్బతీస్తుంది.
గుర్తించటం తేలికే -- గూనిని తేలికగానే గుర్తించొచ్చు. వీరిలో వెన్నెముక వంపు తిరిగి.. శరీరం ఏదో వైపు ఒరిగి ఉంటుంది. చాలామంది పిల్లలో ఒక భుజం కిందికి, మరో భుజం పైకి ఉన్నట్టు కనిపిస్తాయి. లేదంటే నడుం భాగం ఏదో ఒక పక్కకు ఒరిగి పోతుంది. పిల్లలు దుస్తులు వేసుకుంటున్నప్పుడు వీటిని ఇట్టే గుర్తించొచ్చు. గూని లేకపోయినా.. ఒక కాలు పొట్టిగా ఉండటం, పక్కటెముకలు సవ్యంగా లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
సత్వర చికిత్స అవసరం -- గూనికి సరైన చికిత్స చేయకపోతే మున్ముందు తీవ్రమైన వెన్నునొప్పి, అంద వికారం, మానసిక సమస్యల వంటివి మొదలవుతాయి. వూపిరితిత్తుల పనితీరు మందగించటం, గుండె కుడి భాగం విఫలం కావటం, వూపిరితిత్తుల్లో రక్తపోటు అనూహ్యంగా పెరిగిపోవటం వంటి తీవ్రమైన సమస్యలూ ఏర్పడొచ్చు. గూని వంపు 70 డిగ్రీల కన్నా ఎక్కువుంటే మూడింట ఒకరిలో వూపిరితిత్తుల పనితీరు మందగిస్తున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. మోపురంలా తోసుకువచ్చే గూనితో కాళ్లు చచ్చుబడే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి వారికి సాధ్యమైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే ఫలితాలు అంత బాగుంటాయి. ముదురుతున్న కొద్దీ వంపును, ఆకృతిని సరిచేయటం కష్టమవుతుంది.
చికిత్స:
పట్టీలు, ఆపరేషన్ --- గూని ఉంటే యుక్తవయసు వచ్చే వరకూ కూడా ఆగి, అప్పుడు చికిత్స చేయించాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పుట్టుకతో లేకుండా, ప్రత్యేకమైన కారణమేదీ లేకుండా గూని పెరుగుతున్న వారికి.. యుక్తవయసు వచ్చేవరకూ కూడా బిగువు పట్టీలు (బ్రేసెస్) వేస్తూ, ఆ తర్వాత కొంత కాలానికి ఆపరేషన్ చేసే మాట నిజమే గానీ.. పుట్టుకలో లోపాల కారణంగా గూని వచ్చినవారికి వీలైనంత త్వరగా చికిత్స ప్రారంభించాలి. కొందరికి 2-3 ఏళ్ల సమయంలోనే ఆపరేషన్ చేయాల్సిన అవసరమూ ఉంటుంది. గూని చికిత్స ప్రధానంగా- ముందు కొంతకాలం గమనిస్తుండటం, అవసరమైతే పట్టీలు వేయటం, లేదంటే శస్త్రచికిత్స చెయ్యటం.. ఇలా సాగుతుంది.
పరిశీలనలో ఉంచటం: వెన్నెముక వంపు చిన్నగా, 20 డిగ్రీల కన్నా తక్కువుంటే వైద్యులు వెంటనే చికిత్స ఆరంభించకపోయినా.. క్రమం తప్పకుండా ఆ వంపు ఎటు ఎలా మారుతున్నదీ గమనిస్తుంటారు.
పట్టీలు: పిల్లలు ఇంకా ఎదిగే వయసులో ఉన్నప్పుడు- గూని వంపు ఎక్కువగా పెరగకుండా.. చేయి కింది నుంచి నడుం కింది వరకు ప్రత్యేకమైన బిగువు పట్టీలను వేస్తారు. పెద్దల్లో వీటినే గూని నొప్పి తగ్గించేందుకు వాడుతుంటారు. కొందరిలో ఈ పట్టీలను మెడ వరకూ వేయాల్సి వస్తుంది. వెన్నెముక వంపు సరిచేసేందుకు, ఒత్తిడి పెంచే వీటిని దాదాపు రోజంతా వేసుకోవాలి. అప్పుడే ఇవి సమర్థంగా పనిచేస్తాయి. అయితే వీటిని రోజంతా వేసుకోవాల్సి ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా అసౌకర్యం కలిగిస్తాయి. పట్టీలు కడుపుపై ఒత్తిడి తెస్తాయి కాబట్టి శ్వాసలో ఇబ్బంది ఉంటుంది. ఇది పిల్లల్లో మరీ ఇబ్బంది పెడుతుంది. వెన్నెముక వంపు 25 డిగ్రీల కన్నా ఎక్కువున్నా, లేక ఇంకా ఎముకలు పెరిగే అవకాశం ఉండి వంపు 30-45 డిగ్రీల వరకూ ఉన్నా కూడా ఈ పట్టీలు వాడొచ్చు.
శస్త్రచికిత్స: గూని ఉన్నవారిలో వెన్నెముక లోపాలను సరిదిద్దటానికి, పక్క నుంచి చూసినపుడు నిటారుగా ఉండేలా చేయటానికి, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు, నొప్పిని తగ్గించేందుకు 'స్పైనల్ ఫ్యూజన్' శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 45-50 డిగ్రీల కన్నా ఎక్కువ వంపు ఉన్నవారికే ఆపరేషన్ సూచిస్తారు. ఎదిగే పిల్లలో వంపు పెరుగుతున్నా, పెద్దవారిలో అంద వికారంగా తయారవుతున్నా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్‌తో గూనిని పూర్తిగా సరిచెయ్యటం అసాధ్యమే అయినా చాలావరకూ వంపును సరిదిద్దొచ్చు. దీనికి ఇప్పుడు అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ శస్త్రచికిత్సలో శరీరంలోని ఇతర భాగం నుంచి గానీ, దాత నుంచి గానీ ఎముకను తీసి.. లోపం ఉన్నచోట వెన్నుపూసకు అతికిస్తారు. ఇది నయమయ్యాక ఒకే ఎముకగా స్థిరపడుతుంది. దీంతో వెన్నుపూస గట్టిపడి, వంపు పెరగకుండా ఉంటుంది. ఈ ఆపరేషన్ ద్వారా పెద్దగా ముప్పేమీ ఉండదు. అయితే నిపుణులైన వైద్యులు, అన్ని సౌకర్యాలు గల ఆసుపత్రుల్లోనే వీటిని నిర్వహించాలి.
పద్ధతులనేకం: ప్రస్తుతం చిన్నపిల్లల్లో వెన్నుపూసలు త్వరగా కలిసిపోకుండా చూస్తూ.. మరింతగా పెరిగేలా చేసే కొత్త పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆపరేషన్ చేసి లోపల అమరుస్తారు. వెన్నెముక వంపు తిరిగిన చోట పక్కటెముకలు ఊపిరితిత్తుల మీద ఒత్తిడి కలిగిస్తుంటాయి. దీంతో శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ భాగంలో పక్కటెముకలను దూరంగా జరిపేలా కృత్రిమ పక్కటెముకలను అమరిస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి ఛాతీ భాగాన్ని విస్తరించేలా చేసి, అన్నివైపుల నుంచి వెన్నెముక నిటారుగా పెరగటానికి దోహదం చేస్తాయి. కొందరిలో వెన్నెముక వంపు తిరిగిన ప్రాంతంలో రాడ్‌ని అమర్చి పూసలు కలిసిపోకుండా కూడా చేస్తారు. గూని పరిణామాలు వెన్నెముక వంపును బట్టి ఉంటాయి. చిన్న వంపుల కన్నా పెద్ద వంపులతో ముప్పు ఎక్కువ. అలాగే రెండు చోట్ల వంపు ఉన్నా ప్రమాదమే. ఎదుగుతున్న పిల్లల్లో వంపు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే గూనికి ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మంచిది. పిల్లల్లో వెన్ను నిర్మాణ లోపాలను గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించటం మేలు. దీంతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దినవారవుతారు
0 Comments