Ten point formula for good health,చక్కని ఆరోగ్యానికి పది సూత్రాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
అవసరానికన్నా అధికంగా తినటం అలవాటైన వారికి.. కడుపులో జీర్ణాశయం గోడలపై వాపు తరహా ఇన్‌ఫ్లమేషన్ తలెత్తి... అజీర్తి, ఆకలి పెరగటం, పేగుల్లో చిరాకు, బరువు పెరగటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆహార అలవాట్లు, జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు తీసుకురావటం ద్వారా ఆరోగ్యంలో, శరీర ఆకృతిలో పెద్దపెద్ద మార్పులే తీసుకు రావచ్చంటున్నారు నిపుణులు.
1. రోజూ గ్లాసుడు పచ్చి కూరగాయల రసం తాగటం శ్రేయస్కరం. క్యారెట్, ఉసిరి, కూరగాయల రసాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఉత్తేజాన్నిస్తూ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తాయి.
2. సరిపడినన్ని మాంసకృత్తులు తీసుకోవాలి. ఇవి కణజాలానికి మరమ్మతులు చేస్తాయి. ఎముకల ఎదుగుదలను ప్రేరేపిస్తాయి.
3. బీటాకెరటిన్, విటమిన్-సి, విటమిన్-ఇ, కూరగయాలు, గింజల్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి.
4. ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారనేది శరీరాకృతి చక్కగా ఉండటం ఒక సంకేతం. తక్కువగా తినటం ద్వారా వృద్ధాప్య ఛాయలూ నెమ్మదిస్తాయి.
5.వారంలో ఒకరోజు ఇతరత్రా ఆహారం తీసుకోకుండా పచ్చి కూరగాయ ముక్కలు (సలాడ్లు) తినొచ్చు. స్థూలకాయాన్ని అడ్డుకోవటానికి ఇది చక్కని మార్గం.
6. నెలకు ఒక్కరికి 500 మి.లీ.కన్నా ఎక్కువగా నూనెల్ని వాడకూడదు. అది కూడా ఆలివ్, తవుడు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు మేలు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్ ఆహారం, వేపుళ్లు తగ్గించటం ద్వారా వయసు మీద పడటాన్నీ నిరోధించవచ్చు.
7. ఒత్తిడిని నియంత్రించాలి. వ్యాధులకు కారణమయ్యే వాటిలో మనసూ ముఖ్యమైనదే. ఒత్తిడి రోగ నిరోధక వ్యవస్థను అణచి పెడుతుంది. వయసు మీద పడేలా చేస్తుంది.
8. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువులతో అనుబంధాల్ని పెంచుకోవాలి. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే శక్తివంతమైన సాధనం.
9. వారానికి అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వల్ల నిల్వఉండే విషపదార్థాలు బయటికి పోతాయి. ఏరోబిక్ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి.
10. పొగతాగటం మానటం ద్వారా ఆరోగ్యానికి మరింత బలాన్ని అందించవచ్చు.
0 Comments