Group discussion -సమిష్టి సమావేసము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఏదయినా ఓ అంశం, భావన చూసే కోణాన్ని బట్టి మంచిదవుతుంది. చెడ్డగా మారుతుంది. పగటి నిద్ర అస్సలు మంచిది కాదంటారు. కొన్ని ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు తెలిపాయి. ఆలోచిస్తే, మన దైనందిన జీవితంలో పూర్తిగా తప్పుబట్టే ఆలోచనలు, పక్కనబెట్టే అలవాట్లు చాలానే కనిపిస్తాయి. కానీ అవగాహన కలిగి, హద్దుల్లో ఉంటూ వాటిని ఆచరిస్తే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
'కాళ్లకు చక్రాలున్నట్టు అటూఇటూ తిరిగేస్తుంటాడు. ఒక్క నిమిషం కుదురుండదు. ఒరేయ్, కదలకుండా కూర్చోవడం అలవాటు చేసుకో' అని ఇంట్లో పెద్దవాళ్లు, బడిలో ఉపాధ్యాయులు పిల్లలకు గట్టిగా చెప్పడం వింటూనే ఉంటాం. అక్కడ సందర్భం కొంత నిలకడ నేర్చుకొమ్మని, హడావుడి తగ్గించమని. నిజానికి కుదురుగా కూర్చోలేకపోవడం తప్పేం కాదు. అదీకాక ఎంచక్కా కలియతిరుగుతూ ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల మహిళలు, పెద్ద వాళ్ల ఆరోగ్యానికి మంచిదేనని వైద్యులు చెబుతున్నారు. దానివల్ల ఎంచక్కా కెలొరీలు ఖర్చవుతాయి.
కాఫీ తాగాలని మనసు లాగుతుంది. తాగితే ఆరోగ్యానికి హాని అని చాలామంది మానేస్తారు. కానీ మితంగా ఓ కప్పు తాగితే శరీరం ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుంది. జీవ క్రియలు వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా మహిళలు రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధనలు తెలిపిన విషయమిది.
పక్కింటి వాళ్ల గురించి, సహోద్యోగినుల గురించి అవీఇవీ మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఇలా చెప్పుకోవడం వల్ల ఇసుమంత లాభం లేదన్న వాదన ఉంది. కానీ అది సరికాదనీ, ఓ స్థాయి మేరకు అలాంటి మాటలకు చెవి ఒగ్గడం వల్ల అవి సృష్టించే వాళ్లు ఎదుటి వ్యక్తుల్లోని గోరంత లోపాన్ని కొండంతగా ఎలా చెప్పుకొస్తారో తెలుస్తుంది. అవి గుణపాఠాలుగా ఉపయోగపడతాయి. అయితే ఎవరికీ హాని కలిగించని, ఇబ్బంది పెట్టని అంశాలను మాట్లాడుకుంటున్నామా అన్న వివేచన ముఖ్యం.
పనిచేసే చోట చిన్నచిన్న మాటపట్టింపులు, మనస్పర్థలు వస్తుంటాయి. పోతుంటాయి కూడా! ఆ చేదు జ్ఞాపకాలను మనసులో అణిచిపెట్టుకొని దీర్ఘకాలం బాధపడితే ఎలా! అది అంతర్గతంగా ఒత్తిడి పేరుకుపోయేట్టు చేస్తుంది. కోపం వచ్చినప్పుడు చిన్నపాటి చిటపట. మరు నిమిషంలోనో, మర్నాడో చిరునవ్వుల పదనిస. మనసులోని భావాలను వెల్లడించడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.
ఎండాకాలంలో బకెట్ల కొద్దీ నీటితో రెండుసార్లు స్నానం చేసి, నాలుగుసార్లు ముఖం కడుక్కొని.. అదే శుభ్రత అనుకుంటే ఎలా? పొదుపుగా నీటి వాడకం ప్రకృతిని ప్రేమించడం. నీటి వృథాకు అవకాశం ఇవ్వకుండా పరిశుభత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.
భావోద్వేగాలని అదుపులో ఉంచుకొన్నవారే నిజమైన విజేతలంటారు. కానీ వాటిని అతిగా అణిచిపెట్టడం కూడా ప్రమాదమే! ఎవరూ సరదాకి కంటతడిపెట్టరు కదా! అదో అసంకల్పిత చర్య. దానిని అలానే స్వీకరించాలి. దుఃఖం ముంచుకొచ్చినప్పుడు ఉద్వేగాన్ని ప్రకటించడమే సమంజసం! ఆ కన్నీళ్లతో పాటు కష్టం కూడా కొట్టుకుపోతుంది.
కాస్త ఎండలో తిరగాలంటే భయం. ఎక్కడ అతి నీలలోహిత కిరణాలు దాడిచేస్తాయో అని చెప్పి ఎప్పుడూ స్కార్ఫ్‌లు కప్పుకొంటూ, చేతికి గ్లవుజులు వేసుకొని తిరుగుతుంటాం. సన్‌స్క్రీన్ తప్పనిసరి. కానీ ఎండలో తిరగడం వల్ల ఎముకల బలమే కాదు.. జలుబు వంటి చికాకులని కూడా తొలగించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏడాది పొడవునా ఎండ ఉండే మన దేశంలో డి విటమిన్ లోపానికి అవకాశాలు తక్కువని మరిచిపోకూడదు.
ఆదివారం సెలవు. ముసుగుతన్ని నిద్రపోవడం, వ్యాయామం మానేయడం అందరూ చేసే పనే. ఏ సాయంత్రమో అయ్యాక సెలవంతా పాడయ్యిందే అనుకోవడం. ఇకనుంచీ అలా అనుకోకుండా ఓ అధ్యయనం బద్దకానికి మద్దతు పలుకుతోంది. అలా రోజంతా పరిమితుల్లేకుండా నిద్రపోవడం అనేది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
కొన్ని సమస్యలకు ఎంతగా బుర్రబద్దలు కొట్టుకొన్నా పరిష్కారాలు దొరకవు. అప్పుడు కాసేపు సేద తీరండి. నిద్రలో మీకు తెలియకుండానే అంతఃచేతనలో దాగిన ఆలోచనలు పరిష్కారాలని అందిస్తాయి. నిద్రకున్న శక్తి అది.
0 Comments