Full Style

>

హోమియోతో అలర్జీ మటుమాయం

తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, గొంతునొప్పి, కళ్లల్లో, చెవుల్లో దురద... ఇవన్నీ అలర్జీతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు. ఈ మ«ధ్యకాలంలో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే ఆధునిక హోమియో వైద్యంతో అలర్జీని ఆదిలోనే చెక్ పెట్టవచ్చని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాశి.

అలర్జీ అన్న పదాన్ని అందరూ వాడుతున్నప్పటికీ దానిగురించి సరియైన అవగాహన చాలా మందికి లేదనే చెప్పాలి. చిన్న చిన్న ప్రేరణలు శరీరంలో ఎక్కువ మార్పులు కలుగచేస్తాయి. ఏ వస్తువు వల్ల అలర్జీ వస్తుందో చెప్పడం కష్టమైనప్పటికీ దేనివల్ల మనకు అలర్జీ వస్తుందో చెప్పడానికి వీలుంటుంది.
అలర్జిక్ రైనైటిస్
మనకు సరిపడని ప్రేరేణలు ముక్కుకు తగిలి, అలర్జీ మొదలైతే హిస్టమైన్ విడుదలవుతుంది. దీంతో ముక్కులోని పొరలు ఉబ్బిపోతాయి. ఫలితంగా ఆగకుండా తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో దురద, ముక్కులో దురద, మంట, ముక్కు వెంట నీరు కారడం, ముక్కులు బిగుసుకుపోవడం జరుగుతుంది. ఇది బాగా చికాకు పెట్టే సమస్య. దుమ్ము, చల్లటి పదార్థాలు, ఘాటు వాసనలు, వాతావరణ మార్పుల మూలంగా ఈ బాధలు అధికమవుతాయి. ముఖ్యంగా ముక్కులోని పొరలు వాచిన కొద్దీ వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది.
అలర్జిక్ సైనసైటిస్
ముక్కులో మొదలైన అలర్జీ లక్షణాలను పట్టించుకోకుండా వదిలేస్తే ముక్కుకు ఇరువైపులా ఉండే సైనస్ గదులలో అలర్జీ మొదలవుతుంది. ముక్కు చుట్టుపక్కలా 8 సైనస్ గదులుంటాయి. అలర్జీ వల్ల సైనస్ గదులలోని చర్మమంతా ఉబ్బిపోయి ఉంటుంది. చలిగాలి తగిలినా, చల్లటి ఆహారం తీసుకున్నా, వర్షంలో తడిచినా, వాతావరణ పరిస్థితులు మారినా, దుమ్ము,ధూళి తగిలినా ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. ముక్కు మూసుకుపోవడం, ముక్కుకారడం, తలబరువుగా ఉండటం, తల వంచితే నొప్పి ఎక్కువ కావడం, నొసల మధ్యభాగంలో, బుగ్గల మధ్య భాగంలో నొప్పి ఉండటం వంటి లక్ష ణాలుంటాయి. మనిషి ప్రాణాలను హరించే వ్యాధి కాదు కానీ, మనిషికి చికాకు ఇబ్బంది, తీవ్రమైన మానసికి ఒత్తిడిని కలిగిస్తుంది.
ఆస్తమా
ముక్కులో వచ్చే అలర్జీ, ఊపిరితిత్తులలోకి పాకితే ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలు మొదలవుతాయి. ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ముందు సాధారణ జలుబు, తుమ్ములు, ముక్కు కారడంతో మొదలై తరువాత దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దుమ్ము, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి, చల్లటి పదార్థాలు, ఆస్తమా రావడానికి కారణం కావచ్చు. రాత్రిపూట ముఖ్యంగా తెల్లవారుజామున ఈ బాధలు ఎక్కువవుతాయి.
నాసల్ పాలిప్స్
అలర్జీ ముదిరితే ముక్కులో పాలిప్స్ తయారవుతాయి. ఇవి ముక్కుకు రెండువైపులా నీటి తిత్తుల్లా మారుతాయి. సైనస్‌గదుల్లో పేరుకుపోయి అక్కడంతా నిండిపోయిన తరువాత ముక్కులోకి వచ్చి వేల్లాడుతుండటంతో ముక్కుమార్గాలు మూసుకుపోయి రాత్రివేళ శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటారు. రెండు, మూడు సార్లు శస్త్రచికిత్స చేసినా తిరిగివస్తూనే ఉంటాయి.
చికిత్స
అలర్జీ బాధలను పోగొట్టడానికి ముందుగా కారణాలు తెలుసుకోవాలి. అలర్జీ కారణాలకు దూరంగా ఉండటం చెప్పడానికి సులువుగానే ఉంటుంది కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాదు. శస్త్రచికిత్సతో కొంత ప్రయోజనం ఉంటుందనే మాట వాస్తవం కానీ మూలకారణాన్ని గుర్తించి నివారించకపోతే జీవితాంతం ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇక్కడే హోమియోపతి చికిత్స ప్రాధాన్యత తెలిసివస్తుంది. అలర్జీలను సరియైన రీతిలో చికిత్స చేస్తే సమస్య సమూలంగా తొలగిపోతుంది. 
చికిత్సా విధానం అలర్జీ బాధతో ఉన్నప్పుడు ఒక విధంగానూ, లేనప్పుడు మరో విధంగానూ ఉంటుంది. వ్యాధి గురించి అవగాహన, మందుల గురించి అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్యయినా దూరమవుతుంది. హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే పనిచేస్తుందనేది అపోహ మాత్రమే. హోమియోవైద్య విధానం నియమబద్దమైనది, శాస్త్రీయమైనది. అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని చేతిలో పడితే అలర్జీ సమస్యను శస్త్రచికిత్స అవసరం లేకుండానే నివారించవచ్చనడంలో సందేహం లేదు.

Post a Comment

0 Comments