Full Style

>

మీ పళ్ళని సుబ్రమేనా..!

నిత్యజీవనంలో మనకెంతో సాయపడే పళ్లను మనం పెద్దగా పట్టించుకోమనే చెప్పాలి. లేవగానే బ్రష్‌చేసుకుని ఓ పెద్ద పనైపోయినట్లు, మనం దంతాలకేదో సేవ చేసినట్లు భావిస్తాం. ఆ పళ్లే లేకుంటే మన పరిస్థితేంటి అని ఆలోచించం. ఏవి కనిపిస్తే అవి తినడంలో ఆనందం పొందుతాం. కానీ, నోరు పుక్కిలించాలనే ఆలోచనే రాదు. పళ్లు మనకెంతో ముఖ్యమైనవి. మనం ఆరోగ్యంగా జీవించడానికి కలకాలం ఉపయోగపడేవి పళ్లు. ఏ ఆహారాన్ని ఎంజాయ్ చేయాలన్నా అవసరమయ్యేవి పళ్లు. అందుకే వాటిని కలకాలం పదిలంగా కాపాడుకోవాలి. వాటిని ఎప్పటికీ కాపాడుకునేలా శ్రద్ధచూపాలి.

  • మనలో రెండు పూట్లా బ్రష్‌ చేసుకునేవాళ్లు ఎందరో మరి! కొందరికి ఆ శ్రద్ధ పళ్లు పుచ్చిపోయి పాడైపోతే కానీ రాదు. పళ్ల సందుల్లో ఇరుక్కున్న చిన్న చిన్న ఆహారపదార్థాల ముక్కలు చాలు, బ్యాక్టీరియా విజృంభించి పళ్లు పుచ్చిపోవడానికి! అందుకే, రాత్రి నిద్రపోయే ముందు బ్రష్‌చేయడానికి బద్ధకించకూడదు.
  • బ్రష్‌ చేసుకోవడమంటే బరబరా పళ్లను బ్రష్‌తో రుద్దడం కాదు. పళ్లపై గుండ్రంగా, మృదువుగా బ్రష్‌చేయాలి. ఇలా చేస్తేనే పళ్లు పూర్తిగా శుభ్రపడతాయి. అదేపనిగా గట్టిగా రుద్దేయడంవల్ల జరిగే మేలుకంటే హానే ఎక్కువని గుర్తించాలి.
  • పళ్ల మధ్య చిక్కుకున్న ఆహార పదార్థాలను తొలగించే ప్రక్రియ ఫ్లాసింగ్‌. దీన్ని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఇది పళ్లకు మంచిది.
  • బ్రష్షింగ్‌ తరువాత తప్పనిసరిగా నాలుకను శుభ్రంచేసుకోవాలి. ఆహారపదార్థాల ముక్కలు నాలుక వెనకాల కూడా ఉంటాయి.
  • ఆహారం ఏదైనా కానీండి, తీసుకున్న ప్రతిసారీ మంచినీటితో నోరు పుక్కిలించాలి. మరీ ముఖ్యంగా స్వీట్లు, చాకొలెట్లు, ఐస్‌క్రీములు వంటివి తిన్నప్పుడు అస్సలు ఆదమరవరాదు. ఆ తరువాత మాలీష్‌ చేస్తున్నట్లుగా చిగుళ్లను సున్నితంగా వేలితో రాయాలి. దీనివల్ల చిగుళ్ల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
  • నోట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాల తొలగింపుకు బబుల్‌ గమ్‌ తినడం ఉపయోగపడుతుంది.

ఈ జాగ్రత్తలు చాలవూ! పచ్చి జామకాయ కొరకడానికి! చెరుగ్గడలు చలాగ్గా నమిలేయడానికి! జివ్వుమనకుండా ఐస్‌క్రీమ్‌ ఆస్వాదించడానికి!

Post a Comment

0 Comments