Full Style

>

అంగవైకల్యంతో పుట్టే చిన్నారులు - నిరోధకచర్యలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి 100 మంది శిశువుల్లో ఇద్దరు తీవ్ర అంగవైకల్యంతో పుడుతున్నారు. అంగవైకల్యపు జననాలు సృష్టితోపాటే మొదలయ్యాయి. పుట్టుకతో అంగవైకల్యం వచ్చే ప్రతి శిశువుకి ఫలానా కారణం అని చెప్పలేం. కొన్ని జాగ్రత్తల ద్వారా పుట్టుకతో అంగవైకల్యాన్ని సులభంగా నిరోధించొచ్చని వైద్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏ జాగ్రత్తలు పాటించకున్నా, మంచిగా ఉండే చిన్నారులు పుడుతున్నారని కొందరు భావించడం వితండ వాదం. ప్రకృతి కలిగించే కొన్ని జన్మరహస్యాలు ఇప్పటికీ మనిషి మేధస్సుకందని సత్యాలు.
వంశపాపరంపర్య కారణాలు
మనిషిలో ప్రతి కణంలోని న్యూక్లియాసిస్‌లో 46 క్రోమోజో ములుంటాయి. వీటిలో కొన్ని జన్యువులుంటాయి. ఈ జన్యువు వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలను నిర్ణయిస్తాయి. జన్యువులో ఏదైనా లోపం జరిగినప్పుడు అంగవైకల్యపు పిల్లలు జన్మిస్తారు. అంతేగాక తల్లిదండ్రుల్లో మియాసిస్‌ కణ విభజన జరిగినప్పుడు పురుష జీవాణువుల్లో కానీ, స్త్రీ జీవాణువుల్లో కానీ,- 23 కన్నా తక్కువ కానీ, 23 కన్నా ఎక్కువ కానీ క్రోమోజోములున్నట్లయితే, ఆ జీవాణువుల వల్ల పిండోత్పత్తి జరిగినప్పుడు అంగవైకల్యపు పిల్లలు జన్మించొచ్చు.
రుబెల్ల వైరస్‌ జబ్బు
గర్భవతులు రుబెల్లా వైరస్‌ జబ్బుకు గురి అయితే పిల్లలు చెవుడు, బుద్ధిమాంద్యం, గుండె జబ్బులతో జన్మించొచ్చు. ఒక్కోసారి గర్భవతికి ఈ జబ్బు వచ్చినట్లు కూడా తెలియదు.
మందులు
గత శతాబ్దపు మధ్యభాగంలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో మనోల్లాసానికి ఉపయోగించిన 'థావిడమైడ్‌' అనే మత్తు మందు వల్ల చాలా మంది అంగవైకల్యపు పిల్లలు పుట్టారు. మాదకద్రవ్యమైన ఎల్‌ఎస్‌డి వాడితే పుట్టబోయే శిశువుల్లో అంగవైకల్యం, పెరుగుదల లోపాలు సంభవించొచ్చు. ఆండ్రోజనులు వాడితే పుట్టబోయే ఆడశిశువుల్లో పురుష లక్షణాలు రావొచ్చు. కేన్సర్‌ వ్యాధికి వాడే దాదాపు అన్ని మందులు పుట్టబోయే శిశువుల్లో అంగవైకల్యం కలిగిం చవచ్చు. గార్డినాల్‌ వాడకం వల్ల కేంద్ర నాడీ మండలపు జబ్బులు రావొచ్చు. క్లోరోమైసిటెన్‌ వల్ల 'గ్రేబేబీ సిండ్రోం' అనే వ్యాధితో పిల్లలు పుట్టవచ్చు. స్ట్రెప్టోమైసిన్‌ వాడితే చెవిటి పిల్లలు పుట్టవచ్చు. టెట్రాసైక్లిన్‌తో పుట్టిన పిల్లల్లో పెరుగుదలలో లోపాలు, దంతాల రంగులో మార్పులు ఉండొచ్చు. ఆస్ప్రిరిన్‌ వాడితే, పుట్టిన బిడ్డకు పచ్చకామెర్లు రావొచ్చు. గర్భస్రావానికి వాడే హార్మోనుల వల్ల వేవిళ్లు తగ్గడానికి వాడే మందుల వల్ల పిల్లల్లో అంగవైకల్యం సంభవిచొచ్చు. ఆరోగ్యానికి మంచిదని విటమిన్లు వాడితే బుద్ధిమాంద్యం, గుండె జబ్బులు, ఎముకల్లో లోపాలతో పిల్లలు పుట్టవచ్చు.
మద్యపానం-పొగాకు వాడకం
మద్యపానం చేస్తే గర్భవతులకు మానసిక, శారీరక పెరుగదల లోపాలతో పిల్లలు పుట్టవచ్చు. పొగాకు వాడే గర్భవతులకు బరువు తక్కువ పిల్లలు పుట్టవచ్చు.
ఎక్స్‌రేలు
గర్భవతులకు ఎక్స్‌రేలు తీస్తే అంగవైకల్యంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
బి-కాంప్లెక్స్‌లోపం
గర్భవతిలో బి-కాంప్లెక్స్‌ విటమిన్‌ లోపం ఉంటే మెదడు, వెన్నుపూస లోపాలతో పిల్లలు జన్మించే అవకాశముంది.
అయోడిన్‌ లోపం
ఇప్పుడు అయోడిన్‌ గురించి అవగాహన పెరిగింది. తల్లిలో అయోడిన్‌లోపం ఉంటే బుద్ధిమాంద్యం, పుట్టుకతో చెవుడు, శారీరక, మానసిక పెరుగుదల లోపాలు సంభవించొచ్చు.
గర్భధారణ వయసు
స్త్రీలలో గర్భధారణ 20 సంవత్సరాలపైన, 30 సంవత్సరాలలోపల అనువైన సమయం. చిన్న వయసులో, బాగా పెద్దవారయిన తర్వాత గర్భధారణ పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు.
మేనరికపు వివాహాలు
మేనరికపు వివాహాల్లో అంగవైకల్యపు పిల్లల జననాలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యనివేదికలు చెబుతున్నాయి.
అంగవైకల్యపు జననాలు నిరోధించాలంటే?
  • సరైన సమయంలో వివాహం చేసుకుని, సరైన వయసులో గర్భందాల్చడం మంచిది. 20 నుంచి 30 ఏళ్ల వయసు దీనికి సరైన సమయం.
  • మేనరికపు వివాహాలను నిరుత్సాహపరచండి.
  • స్వంత వైద్యం, అనవసరపు వైద్యం, అశాస్త్రీయ వైద్యం మానుకోండి.
  • మత్తు కలిగించే మందులు, వాంతులు తగ్గించే మందులు ఎలాంటి పరిస్థితిలో వాడకండి.
  • ఎడాపెడా ప్రతి చిన్న సమస్యకు ఎక్స్‌రేలు తీయించుకోకండి.
  • మద్యపానం చేయకండి. పొగాకు ఏ రూపంలో కూడా వాడకండి.
  • 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఎంఎంఆర్‌ టీకా వేయిస్తే రూబెల్లా వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.
  • కాయగూరలు, ఆకుకూరలు బాగా తినాలి. పాలు పండ్లు బలవర్ధకమైన ఆహారం.
  • అన్ని అవసరాలకు అయోడిన్‌ కలిపిన ఉప్పును వాడండి.
  • గర్భవతులు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
అంగవైకల్య జననాలు శాపం కాదు. ఈ జననాలకు తల్లులే కారణం అని సమాజంలో చాలా మంది భావించడం దురదృష్టకరం. తల్లిలో, తండ్రిలో ఎవరైనా ఈ జననాలకు కారణం కావొచ్చు. వీటి గురించి మహిళలను హింసించే ప్రవృత్తి పోవాలి. ఆలోచించాల్సిన ప్రధానాంశం చిన్నారుల భవిష్యత్తు గురించి. అంగవైకల్యపు చిన్నారులు సమాజంలో తాము ఒక భాగం అనే భావం కలిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది
ఈ అంశాలు మీ కుటుంబం సభ్యులతో, మీ సహచరులతో, మీ స్నేహితులతో పంచుకోండి. రండి ! మనం చిన్నారులకొక మంచి సమాజాన్ని నిర్మిద్దాం !! మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !!!

Post a Comment

0 Comments