Full Style

>

జ్వరాన్ని అర్ధం చేసుకోవడం ఎలా ?

జ్వరం.. విషజ్వరం... వైరల్‌ జ్వరం... టైఫాయిడ్‌ జ్వరం... మలేరియా జ్వరం... వీటికితోడు స్వౖన్‌ఫ్లూ, డెంగ్యూ, చికున్‌ గున్యా... ఇన్ని పేర్లు చూసి భయపడకండి. వివరంగా 'హిస్టరీ' తీసుకుని ( హిస్టరీ అంటే ఆ జబ్బు వివరాలు, చరిత్ర) పరీక్షించే, ఏ డాక్టరైనా ఈ జబ్బులను నిర్ధారించగలరు. ఈ జ్వరాలు ఒక్కోసారి తీవ్రరూపం దాల్చి ప్రమాద స్థాయికి చేరుకునే మాట వాస్తవమే. అయినా అది చాలా అరుదుగానే అని నమ్మండి. అయితే రోగనిరోధక శక్తి తక్కువున్న వారిలో జ్వరాల వల్ల కాంప్లికేషన్లు (అంటే ఒక జబ్బు నుంచి ఇంకో జబ్బుకు దారితీయడం) వచ్చే అవకాశముంది.
కాబట్టి జ్వరం గురించి ఒక శాస్త్రీయమైన అవగాహన మనకెంతో ఉపయోగం. ముఖ్యంగా వైరల్‌ జ్వరాలకు, ఇతర జ్వరాలకూ ఉండే తేడా తెలుసుకోవడం వల్ల ఆందోళనలూ, అజాగ్రత్తలు తగ్గుతాయి! శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. కానీ చాలా మంది ఆరోగ్యవంతులకు ఈ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ అటూ ఇటూ ఉండటం కూడా సహజమే. శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువుంటే జ్వరం అంటారు. జ్వరం వ్యాధి కాదు. వ్యాధి తాలూకు లక్షణమే. శరీరం లోపల ఏదో ఒక వ్యాధి ఉండటాన్ని జ్వరం సూచిస్తుంది. గత వారం డెంగ్యూ గురించి తెలుసుకున్నాం. ఈ వారం అసలు జ్వరం అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. దీని వల్ల జ్వరం పట్ల ఒక అవగాహనే కాక, అవసరమైనప్పుడు జాగ్రత్తగా కూడా ఉండొచ్చు.
జ్వరం అంటే ?
మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ లేదా 98.6 డిగ్రీల ఫారెన్‌ హీట్‌గా ఉంటుంది. దీనికంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 'జ్వరం' వచ్చిందనవచ్చు. కొన్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో (వ్యాయామం చేశాక, గర్భిణిగా ఉన్నప్పుడు, బహిష్టు సమయంలో) కూడా కొంత ఉష్ణోగ్రత పెరగొచ్చు. జ్వరం శరీరంలో జరుగుతున్న మార్పులకుఒక హెచ్చరికే కాదు. శరీరంలో చేరిన సూక్ష్మజీవులను నశింపజేసే ఒక రక్షణ ప్రక్రియ కూడా. జ్వరం రావడానికి అనేక కారణాలున్నాయి. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగైలాంటి సూక్ష్మజీవులు వల్లే కాక గాయాలు, గుండెపోటు, క్యాన్సర్‌ లాంటి సమస్యల వల్ల కూడా జ్వరం రావొచ్చు. మందుల వల్ల కూడా జ్వరం రావొచ్చు. దీన్ని డ్రగ్‌ ఫీవర్‌ అంటారు. జ్వరం ఉంటే ఏదీ తినబుద్దికాదు. కానీ బాగా తినాలి. ఏది తినాలనిపించినా అది తినొచ్చు. ఆ పదార్థాలు శుభ్రంగా, వేడిగా ఉంటే చాలు! జ్వరంతో ఉన్నప్పుడు నీళ్లు, ద్రవాలు బాగా తీసుకోవాలి. ఉష్ణోగ్రత వల్ల కోల్పొయిన ద్రవాలను పూరించడానికి ఇది అవసరం.
అంతుపట్టని జ్వరం-విషజ్వరం
విషజ్వరం లక్షణాలు
చికిత్సకు ముందు రోగి లక్షణాలను కనుక్కోవాలి. రోగి తన సమస్యలను పూర్తిగా వైద్యునికి చెప్పడం తప్పనిసరి. సాధారణ జలుబూ, స్వైన్‌ఫ్లూ రెండింటిలోనూ జ్వరం, ముక్కు నుంచి నీరు కారడం, దగ్గు ఉంటాయి. నొప్పులూ ఉంటాయి. అదే డెంగ్యూ, చికున్‌ గున్యాలలో జ్వరంతోపాటు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ జబ్బుల్ని ప్రత్యేకంగా గుర్తించడం ఒక్కోసారి కష్టమవుతుంది. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే వీటన్నింటికీ వైద్యం దాదాపు ఒక్కటే. జ్వరం రెండు వారాలకు మించి వస్తుండి, సాధారణ పరీక్షల అనంతరం కూడా ఏ కారణమూ బయటపడకుంటే దాన్ని పైరెక్సియా ఆఫ్‌ అన్‌నోన్‌ ఆరిజిన్‌ (పియుఓ) అంటారు. నిజానికి చాలా సందర్భాల్లో ఏదో అరుదైన వ్యాధి కాకుండా, సాధారణమైన వ్యాధే దీనికి కారణంగా చివరికి తేలుతుంది. మొత్తం అన్ని పియుఓ జ్వరాలను లెక్కిస్తే జ్వరం కారణాల శాతం ఎలా ఉంటుంది? అని ఒక శాస్త్రీయమైన లెక్కవేశారు. అందులో తేలింది ఏమంటే 40 శాతం జ్వరాలు ఇన్‌ఫెక్షన్ల వల్ల, 30 శాతం జ్వరాలు క్యాన్సర్ల వల్ల, 20 శాతం జ్వరాలు ఇమ్యూనోజెనిక్‌ కారణాల వల్ల, ఇంకో ఒకటి నుంచి ఐదు శాతం జ్వరాలు చాలా స్వల్ప కారణాల వల్ల వస్తాయని తేలింది. ఐదు నుంచి తొమ్మిది శాతం జ్వరాలకు ఏ కారణమై ఉంటుందో అంతుపట్టలేదు. విషజ్వరాలు ప్రబలుతున్నాయనేది మనం తరచూ చూసే వార్త. నిజానికి విషజ్వరాలనేవి వైద్య శాస్త్రంలో లేవు. మన వాళ్లు మలేరియాకూ, టైఫాయిడ్‌కూ, వైరల్‌ జ్వరాలకు కూడా విషజ్వరాలనే పదం వాడుతున్నారు. ఆశ్చర్యమేమంటే ప్రభుత్వాధికారులూ, ప్రభుత్వ డాక్టర్లు కూడా ఈ పదాన్ని విరివిగా వాడుతుంటారు. ఆరోగ్యశాఖ వైఫల్యాలు బయటపడకుండా ఉండటానికీ, బాధ్యత వహించే అవసరం నుంచి తప్పించుకోవడానికీ, ప్రజలకు నిజం అర్థం కాకుండా ఉండడానికీ - ఈ 'విషజ్వరం' పదం ఎంతో ఉపయోగపడుతోంది.
వాతావరణం - జ్వరాలు
కాన్సరు నుండి కండరాల వ్యాధి దాకా అనేక రకాల జబ్బులలో జ్వరం రావొచ్చు. వైరల్‌ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌ సాధారణంగా వచ్చే జ్వరాలు. క్షయ కూడా అటువంటిదే. ఈ మూడు జ్వరాలు ఏడాది పొడుగునా ఏదో ఒక స్థాయిలో ఉంటూనే ఉన్నాయి. కాని ఒక్కో సీజన్‌లో ఒక జ్వరం ఎక్కువైతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. చలి పెరిగే కొద్దీ దోమలకు అననకూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దోమల వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వైరస్‌లకు అననకూలత పెరుగుతుంది.దీంతో వైరస్‌ జ్వరాలు తగ్గుతాయి. వాతావరణం అందరికీ ఒకే రకంగా ఉంటుంది కదా ! మరి కొందరికే ఈ జ్వరాలు ఎందుకు వస్తాయి? అంటే దానికీ కారణం శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ! పౌష్టికాహారం, ముఖ్యంగా ప్రోటీన్లు సమతుల్యంగా తీసుకునే వారిలో ఈ రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. వారి శరీరాలలో సూక్ష్మజీవులనెదుర్కొనే రక్షణ కణాలు చురుగ్గా, పుష్కలంగా ఉంటాయి.
జలుబు
జలుబు తగ్గాలంటే వైద్యం చేస్తే వారం రోజులు, వైద్యం చేయకుంటే ఏడు రోజులు పడుతుందనేది సామెత. ఇది ఒక విధంగా నిజమే. ఏ వైరల్‌ జ్వరానికైనా సాధారణంగా ఎటువంటి వైద్యం లేకుండా దానికదే తగ్గిపోయే గుణం ఉంటుంది. అయితే జలుబు వచ్చే వైరస్‌లు రెంగు గ్రూపుల్లో ఉంటాయి. అందులో ఒక గ్రూపు రైనో గ్రూపు, మరో గ్రూపు కరోనా గ్రూపు. రైనో గ్రూపులో ఉండే 100 రకాల (సీరోటైపుల) వైరస్‌ల వల్లా, కరోనా గ్రూపులో ఉంటే 3 రకాల వైరస్‌ల వల్ల మనిషికి జలుబు చేస్తుంది. అంటే ఒక వైరస్‌ తర్వాత మరో వైరస్‌ వల్ల జలుబు వస్తూ, పోతుందన్నమాట. ఈవైరస్‌లు శ్వానాళాల పైభాగాల పొరలలో చేరి జబ్బును కలుగజేస్తాయి. ఈ వైరస్‌ స్పర్శద్వారా, తుంపర్ల ద్వారా, ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కళ్లు, ముక్కు, దగ్గుల నుండి వచ్చే స్రావాలు చేతుల ద్వారా, వస్తువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
వైరల్‌ జ్వరం-సులువైన వైద్యం
  • 'వైరస్‌' వల్ల వచ్చే జ్వరాన్ని వైరల్‌ జ్వరం అంటారు. వైరల్‌ జ్వరాలకు వైద్యం చాలా సులభం. అయితే డాక్టర్‌ సలహా ప్రకారమే చికిత్స తీసుకోవాలి.
  • బాగా విశ్రాంతి తీసుకోవాలి. బయటకు వెళ్లకూడదు. (దీంతో జలుబు ఇతరులకు సోకుండా జాగ్రత్తపడిన వాళ్లమవుతాం). బాగా నిద్రపోవాలి. నిద్ర వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పత్యం లేదు. ఏ ఆహారమైనా తీసుకోవచ్చు. వేడి వేడి అన్నం, పప్పు, ఇతర కూరగాయలు తీసుకోవాలి. ఇష్టమైతే చికెన్‌ సూపు తీసుకోవచ్చు.
  • జ్వరం మరీ తీవ్రంగా ఉంటే చల్ల నీళ్లతో ఒళ్లు తడుపుకుంటే సరిపోతుంది. చలిగా ఉంటే వెచ్చగా కప్పుకోవడమే వైద్యం.
  • జలుబు, దగ్గుకు వేడి ఆవిరి పట్టడం చేయాలి. ఇతరులకు సోకకుండా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. దగ్గు వస్తే కర్చిప్‌ అడ్డం పెట్టుకోవాలి. చేతులు 20 సెకన్లు సబ్బుతో కడుక్కోవాలి. గొంతు నొప్పి ఉంటే గోరువెచ్చన నీళ్లలో చిటికెడు ఉప్పువేసి పుక్కిలించాలి.
  • వీటిని పాటిస్తూ మందులు ఉపశమనం కోసం వాడాలి. పారాఅసిటమాల్‌ (వ్యక్తి బరువును బట్టి కేజికి 10 నుంచి 20 మిల్లీగ్రాములు ఒక డోసుగా) మాత్రలు రోజూ మూడుసార్లు వేసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులకు ఇది ఉపశమనమే కానీ, పూర్తిగా తగ్గాలని లేదు. తగ్గలేదు కాబట్టి మందు మీద మందు వేసుకుని తగ్గించుకోవాలనుకోవద్దు.

జాగ్రత్తలు
వైరల్‌ ఫీవర్లు సాధారణంగా నిరపాయకరం. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇవి కాంప్లికేషన్లకు, సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. అందుకే జాగ్రత్త అవసరం ! మెదడుకూ, గుండెకూ కూడా ఇవి అరుదుగా వ్యాపించొచ్చు. వాటికి ప్రత్యేక వైద్యం అవసరం. చిన్న పిల్లల్లో సాధారణ జలుబు న్యూమోనియాగా మారే అవకాశముంది. నిమిషానికి 40 నుంచి 50 సార్లు శ్వాసతీసుకోవడం, డొక్కల రెండువైపులా ఎగవేయడం చేస్తుంటే ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు. జ్వరం 103 నుంచి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువైతే కొంత మంది పిల్లల్లో ఫిట్స్‌ వచ్చే అవకాశముంది. వైరల్‌ జ్వరాలలో వచ్చే కాంప్లికేషన్లలో 'రక్తస్రావ జ్వరం' ముఖ్యమైంది. ఇందులో రక్తం శరీరంలోని వివిధ భాగాల నుంచి కారుతుంది. చర్మం కింద గూడుకట్టడం వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇటువంటి మచ్చలు, ఆయాసం, మగత ఇవన్నీ అపాయ సూచికలుగా భావించి ఆసుపత్రిలో చేరాలి. కానీ ఇవి కూడా అరుదుగా వచ్చే సమస్యలే !. ఇతర దేశాల నుంచి స్వైన్‌ఫ్లూ లాంటి కొత్త వైరస్‌లు దిగుమతి అవుతున్నాయి కదా ! వాటికి ఇక్కడి ప్రజలు తట్టుకుని, రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఒకసారి ఈ 'సమిష్టి రోగనిరోధక శక్తి ' (హెర్డ్‌ ఇమ్యూనిటీ) పెరిగితే ఆ వైరస్‌ కూడా అన్ని వైరస్‌లలాగే మామూలయి పోతుంది. గత 3 ఏళ్లలో స్వైన్‌ఫ్లూను తట్టుకునే శఖ్తి ఆ విధంగానే ప్రనజలు సంతరించుకున్నారు. అయితే ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు కొత్త రూపాలను సంతరించుకుంటుంటాయి

Post a Comment

0 Comments