Full Style

>

Ejaculation problems,స్ఖలన సమస్యలు

-స్ఖలన సమస్యలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శీఘ్ర స్ఖలనాన్ని- ప్రపంచవ్యాప్తంగా పురుషులను ఆవేదనకు గురి చేస్తున్న అతి పెద్ద లైంగిక సమస్యగా చెప్పుకోవాల్సి వస్తోంది. తన అసంతృప్తికి తోడు.. తన కారణంగా భాగస్వామి కూడా అసంతృప్తికి లోనవ్వాల్సి వస్తోందన్న భావన మనసులో పీడిస్తుండటం దీని తీవ్రతను మరింత పెంచుతోంది.

స్ఖలనమన్నది మనసూ-శరీరం.. మెదడూ-కండరాలూ సమన్వయంతో సాధించే సంక్లిష్టమైన ప్రక్రియ, గాఢానుభూతి. లైంగిక సంతృప్తికి ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ అనూహ్యంగా, వేగంగా ముగిసిపోతే ఎంత వేదనకు లోనవుతారో సకాలంలో ఆ భావన కలగకపోయినా అంతే సమస్యగా తయారవుతుంది. నిజానికి శీఘ్రం, జాప్యం రెండే కాదు.. స్ఖలన సమయంలో నొప్పి, బాధ; ఒక్కోసారి వీర్యం బయటకు రాకుండా వెనక్కిపోవటం వంటి సమస్యలూ ఎదురవ్వచ్చు. వీటిని అధిగమించటంలో ఆధునిక వైద్యం మంచి పురోగతే సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా పురుషులు ఎదుర్కొనే లైంగిక సమస్యల్లో చాలా సర్వసాధారణంగా, చాలా ఎక్కువగా కనబడే సమస్య- శీఘ్ర స్ఖలనం. ఎంతోమంది దీనితో లోలోపల అసంతృప్తికి లోనవుతూనే ఉన్నా బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడరు. చిన్నతనంగా భావిస్తూ దీనికి చికిత్స తీసుకునే ప్రయత్నాలు కూడా చెయ్యరు. అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఒకప్పుడు శీఘ్రస్ఖలనానికి సమర్థ చికిత్సలేవీ ఉండేవి కూడా కావు. వైద్యులు కూడా దీన్ని మానసిక సమస్యల గాటన కట్టేవారు. చాలాసార్లు దీనికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేకపోయినా ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు వాడే మందులే వాడేవారు. పరిస్థితి ఏమంత మెరుగవ్వకపోవటం మూలంగా ప్రజల్లో దీనికి సమర్థమైన చికిత్సలే ఉండవన్న భావన బలపడింది. కానీ ఇప్పుడీ విషయంలో వైద్యశాస్త్రం, పరిశోధనా రంగం ఎంతో అభివృద్ధి చెందాయి. నేరుగా స్ఖలనానికి సంబంధించిన మెదడు కేంద్రాల మీదే పని చేసే మందుల వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శీఘ్రస్ఖలనమన్న సమస్యను అర్థం చేసుకునే తీరులోనే ఎంతో మార్పు వస్తోంది.

ఆది నుంచీ అపోహలు!
వీర్యం కూడా ఇతరత్రా సాధారణ శారీరక ద్రవాల వంటిదే అయినా వీర్యంలో ఏదో మహత్తు ఉందని బలంగా విశ్వసించటం దాదాపు అనాదిగా అన్ని సంస్కృతుల్లోనూ కనిపిస్తుంది. వీర్యాన్ని శక్తికి చిహ్నంగా భావిస్తూ, శరీరంలో వీర్యం కొంత మోతాదులో నిల్వ ఉంటుందనీ, స్ఖలనమైనప్పుడల్లా అది కొంచెం కొంచెం తరిగిపోతుందనీ భావిస్తూ అలా వీర్యం పోవటాన్ని 'బలహీనత'కు చిహ్నంగా అపోహపడుతుండేవారు. నిజానికి వీర్యంలో ఏముంటుందో, అది సంతానానికి ఎలా కారణమవుతోందో మనిషికి చాలా శతాబ్దాల పాటు పెద్ద విస్మయంగానే ఉండేది. మొట్టమొదటిసారిగా 1674లో లీవెన్‌హక్‌ అనే శాస్త్రవేత్త వీర్యాన్ని మైక్రోస్కోపు కింద పరీక్షించి శుక్రకణాలు ఎలా ఉంటాయన్నది ప్రపంచానికి తెలియజెప్పాడు. ఈ శుక్రకణం స్త్రీ అండాన్ని ఫలదీకరణం చెందించి సంతానికి కారణమవుతోందని 1779లో ''స్పాలెంజని'' నిర్ధారించాడు. అయినా ఇప్పటికీ వీర్యం గురించి మన సమాజంలో అపోహలు ప్రచారంలో ఉండటం విషాదకర వాస్తవం. శాస్త్రీయమైన అవగాహన లేని నాటువైద్యుల విస్తృత ప్రచారం కూడా దీనికి ఒక ముఖ్యకారణం. స్ఖలనం విషయంలో కూడా ఇటువంటి రకరకాల అపోహలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. నిజానికి స్ఖలనం అన్నది గాఢమైన అనుభూతికి కారణమయ్యే సంక్లిష్టమైన చర్య. లైంగికంగా రతిక్రియ ఒక దశకు చేరుకున్న తర్వాత శరీరంలో మెదడు, నాడీ మండలం, కండర వ్యవస్థ వంటివన్నీ కలిసి ఎంతో సమన్వయంతో దీన్ని సాధిస్తాయి. దీన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే దీనికి సంబంధించి రకరకాల సమస్యలూ తలెత్తుతుంటాయి.

పరిణామ ఫలం!
త్వరగా స్ఖలనమవటమన్నది పురుషులకు ప్రకృతి సహజంగానే.. పరిణామక్రమంలోనే వచ్చింది. ఆదిమకాలంలో స్త్రీపురుషులకు ఇప్పటిలా సురక్షితమైన ఇళ్లు, విశ్రాంతి సమయం ఉండేవికావు. వారు చాలావరకూ ప్రమాదరకర పరిస్థితుల్లోనే సెక్స్‌లో పాల్గొనేవారు. పులులు, సింహాల వంటి క్రూర జంతువులు, ప్రకృతి వైపరీత్యాల భయం నిరంతరం వెన్నాడేది. ఇలా లైంగిక చర్య చాలావరకూ మానవ జాతి మనుగడకు ఆధారమైన పునరుత్పత్తి ప్రక్రియగానే కొనసాగింది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా వీర్యం స్ఖలనమవటమనేది ప్రకృతి సిద్ధంగానే పురుషుడికి అలవడింది.. ఇదే ఆధునిక మానవుడికీ సంక్రమించింది. అయితే సురక్షితమైన ఇళ్లు, సదుపాయాలు, భయం కలిగించే వాతావరణం లేకపోవటం, ఆటంకం లేకుండా చూసుకోవటం వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులు ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనటం ఆరంభించారు. ఇది చాలాసేపు లైంగిక ఆనందాన్ని, అనుభూతులను పొందటానికి వీలు కలిగించింది.

ఒకప్పుడు సంతానార్థమే అయిన శృంగారం.. ఆనందకరమైన, మానసికోల్లాసానిచ్చే ప్రక్రియగా మారింది. ఇక్కడే అనాదిగా, పరంపరాగతంగా వస్తున్న శీఘ్రస్ఖలన పద్ధతికీ, ఆధునిక మానవుడి గాఢానుభూతి కాంక్షకూ మధ్య సంఘర్షణ మొదలైంది. అందువల్ల ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు తోడ్పడేలా శీఘ్రస్ఖలనానికి చికిత్సలు, మందుల వంటివి చర్చకు రావటం ఆరంభమైంది.

శీఘ్ర స్ఖలనం
శీఘ్రస్ఖలనమన్నది ఎంత సర్వసాధారణ సమస్య అంటే 75% మంది పురుషులు ఎప్పుడోకపుడు దీనికి గురయ్యేవారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుతో పాటు వచ్చే 'స్తంభన, పటుత్వ లోపం (ఎరక్త్టెల్‌ డిస్‌ఫంక్షన్‌)' కన్నా దీనితో సతమతమయ్యే వారి సంఖ్యే ఎక్కువ. సంభోగంలో పొల్గొన్నప్పుడు త్వరగా.. అంటే మరికాస్త సమయం లైంగిక చర్యలో పాల్గొనాలని అనిపిస్తున్నప్పటికీ కాస్త ముందుగానే స్ఖలనం అయిపోవటాన్ని శీఘ్రస్ఖలనం అనుకోవచ్చు. ఇది ఏ వయసువారికైనా రావొచ్చుగానీ యువకులు, మధ్యవయసు వారిలో అధికం. వయసు పెరుగుతున్న కొద్దీ పరిస్థితి మెరుగుపడే అవకాశముంది కూడా. చాలామందికి చాలా సందర్భాల్లో స్ఖలనం మామూలుగానే అవుతుంటుందిగానీ కొన్నిసార్లు మాత్రం త్వరగా అయిపోతుండొచ్చు. దీనికి ఆయా పరిస్థితులు కారణమై ఉండొచ్చు. కొత్త ప్రదేశాల్లోనో, హడావుడిగానో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆత్రుత, భయం, ఆందోళన, ఆదుర్దా మూలంగా శీఘ్రస్ఖలనం జరగొచ్చు. దీనికి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు.
ఏది శీఘ్రం..?
నిజం చెప్పాలంటే శీఘ్రస్ఖలనాన్ని నిర్వచించటం కష్టం. కొందరికి అసలు లైంగిక భావనలు జ్ఞప్తికొస్తేనే స్ఖలనమైపోతుంది. మరికొందరి విషయంలో తమకు తృప్తి దక్కుతున్నా, భాగస్వామిని సంతృప్తిపరిచేంత సమయం ఉండకపోవచ్చు. అందుకే మొత్తమ్మీద సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ భాగస్వామి ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ఏ వయసులోనైనా.. అంగప్రవేశానికి ముందు లేదా ప్రవేశమైన వెంటనే చాలా కొద్దిపాటి ప్రేరణలతోనే, తాను ఆశించిన దానికంటే చాలా ముందే స్ఖలనమైపోతుండటాన్ని శీఘ్ర సమస్యగా భావించొచ్చు. ఇతరత్రా శారీరక సమస్యలతో దీని బారినపడే అవకాశం లేకపోలేదుగానీ వారితో పోల్చుకుంటే ఎటువంటి సమస్యాలేకపోయినా శీఘ్రస్ఖలనంతో సతమతమయ్యే వారి సంఖ్యే ఎక్కువ.

సమస్య చిరకాలమైనదైనప్పటికీ, దీనిపై విస్తృతంగా చర్చలు జరిగినప్పటికీ దీనికి చికిత్స మాత్రం అంత తేలికేం కాదన్నది వాస్తవం. కొన్ని దశాబ్దాల క్రితం దీన్ని ఎదుర్కొనటానికి మానసికమైన 'సైకోసెక్సువల్‌' చికిత్సలు కొన్ని ప్రయత్నించారు. ముఖ్యంగా హెలెన్‌ సింజెర్‌ కప్లాన్‌ వంటి వారు కొంతసేపు ప్రేరేపించి ఒక దశకు రాగానే ఆపటం, కొద్దిసేపు విరామం తర్వాత తిరిగి ప్రేరేపణ ప్రారంభించటం వంటి 'స్టార్ట్‌-స్టాప్‌' టెక్నిక్‌లను, మాస్టర్స్‌-జాన్సన్‌ వంటివారు 'స్క్వీజ్‌' టెక్నిక్‌లను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చాలా శతాబ్దాలు చికిత్సారంగం వీటి చుట్టూతానే తిరిగిందిగానీ క్రమేపీ వీటి సమర్థతపై రకరకాల అంశాలు వెలుగులోకి రావటం ఆరంభమైంది. చాలా నింపాదిగా, ఓపికగా పాటించాల్సిన ఈ విధానాలు ప్రస్తుత హడావుడి, ఆధునిక కాలంలో ఎంతవరకూ సత్ఫలితాలనిస్తాయన్నదీ అనుమానంగా తయారైంది. అందుకే నేటి ఆధునిక వైద్య పరిశోధనా రంగం చాలావరకూ స్ఖలన ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే మెదడు, నాడుల నియంత్రణల మీద దృష్టి కేంద్రీకరిస్తోంది.

ఇటీవలి వరకూ కూడా శీఘ్రస్ఖలనాన్ని మానసిక సమస్యగా భావిస్తూ శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, ఔషధ ప్రయోగాల్లో నిరూపణ కాకపోయినా ఆందోళన, చురుకుదనాన్ని తగ్గించే మందులు వాడేవారు. ఆత్మవిశ్వాసం పెంపొందేలా కౌన్సెలింగ్‌ కూడా ఇస్తుండేవారు. కానీ సమస్య పరిష్కారానికి ఇవేవీ సమర్థమంతమైన విధానాలు కావని రాన్రాను బయటపడుతూ వస్తోంది. అయితే ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల మూలంగానే శీఘ్రస్ఖలనం అవుతున్నట్టు గుర్తించిన వారిలో కౌన్సెలింగ్‌ కొంతమేరకు పనిచెయ్యచ్చు. సంభోగం సమయంలో ఆదుర్దా, ఆత్రుత, పనికిరాదని.. సంభోగానికి ముందు ముద్దు ముచ్చట్ల (ఫోర్‌ప్లే) వల్ల భావప్రాప్తి, తీవ్రత (ఇంటెన్సిటీ) మీద నియంత్రణ వస్తుందని.. అవగాహన పెంచటం వల్ల ఉపయోగం ఉండొచ్చు. కానీ ఈ పద్ధతి అందరికీ పనికిరాదు. ఫలితాలు అంతంత మాత్రమే. పైగా సంభోగానికి ముందు ప్రతిసారీ ఈ సూచనలు పాటించటం కుదరకపోవచ్చు. తమను తాము నియంత్రించుకోవటం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి పద్ధతులకు భాగస్వామి సహకరించకపోవటం, అసంతృప్తికి లోనుకావటం వంటివీ జరగొచ్చు. అందువల్ల మందులతో ఫలితం కనబడనివారికి మాత్రమే ఇలాంటి సైకో సెక్సువల్‌ కౌన్సెలింగ్‌ సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుతం శీఘ్రస్ఖలన చికిత్సలో కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ''డెపాక్సటీన్‌ (ప్రిలిజీ)'' అనే మందు బాగా పనిచేస్తున్నట్టు ప్రయోగాల్లోనూ, అధ్యయనాల్లోనూ వెల్లడైంది. దీన్ని ఇటీవలే చాలా ఐరోపా దేశాల్లో అధికారికంగా విడుదల చేశారు. త్వరలో దీనికి అమెరికా 'ఎఫ్‌డీఏ' అనుమతీ రావొచ్చు. ఇది మానసిక సమస్యల్లో వాడే మందుల్లా కాకుండా శీఘ్రస్ఖలన ప్రక్రియకు దోహదం చేసే మెదడులోని భాగాల మీద నేరుగా పనిచేస్తుంది. మున్ముందు ఈ తరహా మందలు మరిన్ని వచ్చే అవాకాశం కనబడుతోంది.
స్ఖలనం కాకపోవటం
కొద్దిమందికి అసలే స్ఖలనం కాదు. దీన్ని 'అనెజాక్యులేషన్‌' అంటారు. ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి నిజంగానే స్ఖలనం కాకపోవటం. దీనికి వీర్యం ఉత్పత్తి చేసే, దాన్ని నిల్వచేసే భాగాలు సరిగా అభివృద్ధి చెందకపోవటమో.. వీర్యం బయటకు వచ్చే మార్గంలో అడ్డంకులు ఏర్పడటమో కారణం కావొచ్చు. రెండోది నాడీ సంబంధ సమస్యలు. స్ఖలనాన్ని ప్రేరేపించేందుకు అవసరమైన నాడులు పని చేయకపోయినా అసలే స్ఖలనం కాకపోవచ్చు. ఇవి కాకుండా మానసిక సమస్యల కారణంగా భావప్రాప్తి లేక, స్ఖలనం కాకపోవటం కూడా జరగొచ్చు. కొందరికి ఒక భాగస్వామితో స్ఖలనం సాధ్యమైనా మరొకరి వద్ద స్ఖలనం కాకపోవటం, హస్తప్రయోగ సమయంలో స్ఖలనమవుతూ సంభోగంలో కాకపోవటం, తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్ల స్ఖలనం కాకపోవటం వంటివి జరుగుతాయి.

తీవ్రమైన మానసిక సమస్యల్లో ఉన్న కొందరు మెలకువగా, పూర్తి స్పృహలో ఉన్నప్పుడు స్ఖలించలేకపోవచ్చుగానీ వీరికి రాత్రి నిద్రాసమయంలో స్ఖలనాలు మామూలుగానే ఉండొచ్చు. వీరికి కారణాన్ని బట్టి కౌన్సెలింగ్‌, మందులతో ఉపయోగం ఉంటుంది. వైబ్రేటర్‌ థెరపీ ఇవ్వటం, విద్యుత్‌ ప్రచోదనాల ద్వారా ప్రేరేపణ ఇచ్చి స్ఖలమమయ్యేలా చెయ్యటం (ఎలక్ట్రోఎజాక్యులేషన్‌) వంటి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్ఖలన మార్గంలో అవరోధాల వంటివి ఉంటే సర్జరీతో సరిచెయ్యాల్సి ఉంటుంది.

జాప్య స్ఖలనం!
శీఘ్రస్ఖలనానికి పూర్తి భిన్నమైన సమస్య- జాప్య స్ఖలనం. చాలామంది దీంతో ఇబ్బందేంటని, సంభోగంలో మరికాస్త సమయం ఆనందంగా ఉండొచ్చు కదా అని ప్రశిస్తుంటారు. కానీ శృంగారంలో గాఢమైన అనుభూతికి, ఆనందానికీ- కేవలం అంగాన్ని ప్రవేశపెట్టటం, తుంటి కదలికలు మాత్రమే కారణం కాదు. పైగా దీర్ఘసమయం ఈ చర్యలతో భాగస్వామికి అసౌకర్యం, నొప్పి కూడా ఎదురవుతాయి. ఒకవేళ స్త్రీ అప్పటికే భావప్రాప్తి పొంది ఉంటే అంతే ఉత్సాహంతో సంభోగానికి సహకరించకపోవచ్చు. ఆమెలో మృదువైన కదలికలకు అవసరమైన స్రావాలూ తగ్గిపోతాయి. ఎంత ప్రయత్నిస్తున్నా స్ఖలనం జరగకపోవటం వల్ల పురుషుడికీ తృప్తికర అనుభూతులుండవు. ఇలా జాప్య స్ఖలనంతో అసౌకర్యమే కాదు, భాగస్వామితో సంబంధాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి చికిత్స తప్పనిసరి. ప్రధానంగా తరచుగా హస్తప్రయోగానికి అలవాటుపడిన వారు అంగంపై ఎక్కువ బిగువుగా, ఒత్తిడి ఇచ్చుకోవటానికి అలవాటుపడతారు. కానీ వాస్తవంగా సంభోగ సమయానికి వచ్చేసరికి భాగస్వామి నుంచి వారికి అదే తీరులో బిగువు లభించదు. దీనివల్ల స్ఖలనంలో జాప్యం
జరిగే అవకాశం ఉంటుంది. ఒకపక్క భాగస్వామితో రతిక్రియలో పాల్గొంటూనే.. ఆ అనుభూతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా శృంగారానికి సంబంధించి మనసులో ఏవేవో ఊహించుకుంటూ, గత భావనలను గుర్తుచేసుకుంటూ, వాటి గురించి మధనపడుతుండటం వల్ల కూడా కొన్నిసార్లు ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. లైంగిక భావనలకు, గాఢానుభూతికి శారీరక ప్రేరణల కంటే మానసిక భావోద్వేగాలూ కీలకమే. కాబట్టి సాధ్యమైనంత వరకూ వీరు శృంగార ప్రేరణనిచ్చే లైంగిక భావనల మీద దృష్టిపెట్టటం చాలా అవసరం. తన భాగస్వామిలో తనను ప్రేరేపించే అంశాల వంటివాటి మీద దృష్టి పెట్టటం, భాగస్వామిని కూడా ఇష్టమైన రీతిలో ప్రేరేపించమని కోరటం మంచిది. భాగస్వామిని తృప్తిపరుస్తున్నానా? లేదా? అన్న అంశం గురించి మరీ అతిగా మధనపడుతున్నారేమో చూసుకోవటం కూడా అవసరం. లైంగిక తృప్తి అన్నది కేవలం భాగస్వామికి ఇచ్చేదీ, ఇవ్వాల్సిందే కాదు, ఇందులో తాను పొందాల్సిందీ ఉందన్న భావన అలవరచుకోవాలి. నేరుగా సంభోగ సమయంలో అంగాంగ ప్రేరణకు పూనుకోవటం వల్ల సున్నితమైన భాగాలు మొద్దుబారి, స్పందించకుండా తయారయ్యే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ముందస్తు ముద్దుముచ్చటలకు, ఫోర్‌ప్లేకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ఎంత సమయం గడిపాం, టైమ్‌ ఎంత గడిచిందన్న భావనలను మనసులో నుంచి తుడిచిపెట్టెయ్యటం అవసరం. భాగస్వామి ఇబ్బందిపడుతూ ఫిర్యాదు చేస్తే తప్పించి లేకుంటే ఆనందించటం మీదే దృష్టిపెట్టటం మంచిది. సంభోగ సమయంలో కసిగా, ఆగ్రహంగా, ఆందోళనగా, భయంగా ఉండటం మంచిది కాదు. దీనివల్ల నాడీమండల స్పందనలు కొన్ని కొరవడి, స్ఖలనం, భావప్రాప్తి జరగకుండా అడ్డుకోవచ్చు. మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండటం, ప్రశాంత చిత్తంతో ఉండటం, భాగస్వామితో కలిసిమెలిసి భావోద్వేగాలను పంచుకుంటూ ఉండటం ముఖ్యం.

వీర్యం వెనక్కిపోవటం
కొందరికి స్ఖలనమైనా వీర్యం బయటకు రాకుండా వెనక్కి మళ్లి... మూత్రాశయంలోకి వెళ్తుంది. దీన్ని 'రెట్రోగ్రేడ్‌ ఎజాక్యులేషన్‌' అంటారు.చూడటానికి ఇందులో పైకి అసలు స్ఖలనమే కానట్టుంటుంది. పరీక్షలు చేస్తే అసలు విషయం బయటపడుతుంది. వీరిలో వీర్యం తయారయ్యే భాగాలు సక్రమంగానే ఉంటాయి. భావప్రాప్తి బాగానే ఉంటుంది, వీర్యం స్ఖలనమైన భావన కూడా కలుగుతుంటుంది గానీ వీర్యం బయటకు రాదు. స్ఖలన సమయంలో మామూలుగా మూత్రాశయం చివ్వరి భాగం, అక్కడి స్ఫింక్టరు మూసుకుపోయి వీర్యం వెనక్కి.. మూత్రాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూంటాయి. కానీ వీరిలో అవి సరిగా పనిచేయకపోవటం మూలంగా వేగంగా బయటకు రావాల్సిన వీర్యం.. దారిమళ్లి మూత్రాశయంలోకి వెళుతుంటుంది. మూత్రాశయం చివరి భాగానికి ఏదైనా దెబ్బతగలటం, నాడీసంబంధ సమస్యల వల్ల ఆ ప్రాంతం పట్టుకోల్పోవటం వంటి కారణాల వల్ల తలెత్తే సమస్య ఇది. సంభోగానంతరం వీరు మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు అతి తెల్లగా, మబ్బుగా అనిపిస్తుంటుంది. మధుమేహం కారణంగా నాడీమండల సమస్యలున్న వారిలో ఇది ఎక్కవగా కనబడుతుంటుంది. అలాగే వెన్నుపాము సమస్యలు, వెన్నుకు సర్జరీలు, మూత్రాశయం ప్రోస్టేటు గ్రంథి సర్జరీలు చేయించుకున్న వారిలో ఇటువంటి సమస్య తలెత్తవచ్చు. కొన్ని రకాల మందులూ దీనికి కారణం కావచ్చు. ఇమిప్రమైన్‌, ఎఫిడ్రిన్‌, ఫినైల్‌ప్రొపనోలమైన్‌ వంటి మందులతో దీనికి చికిత్స చేస్తారు. వీటితో చాలామందికి సమర్థమైన ఫలితాలు లభిస్తాయి. స్ఖలనం కాకపోవటం, వీర్యం వెనక్కి పోయే సమస్యలు సంతానలేమికి దోహదం చేస్తాయి. అయితే వీర్యం వెనక్కి మళ్లే వారిలో మూత్రాశయం నుంచి వీర్యకణాలు బయటకు తీసి ఐవీఎఫ్‌ వంటివిధానాల ద్వారా స్త్రీయోనిలోకి ప్రవేశపెట్టటం ద్వారా పిల్లలు కలిగే అవకాశం ఉంది.

స్ఖలనంలో నొప్పి
కొందరికి స్ఖలన సమయంలో నొప్పి వస్తుంటుంది. రక్తం కూడా పడుతుంది. కొన్ని రకాల వాపులు, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్లు దీనికి దోహదం చేయొచ్చు. అవన్నీ వ్యాధి సంబంధమైనవే కానీ శృంగార పరమైన స్ఖలన సమస్యలుగా భావించలేం. వీటిని గురించి వైద్యులతో చర్చించటం చాలా అవసరం.

Post a Comment

0 Comments