మానవ దేహంలోని గుండె
మీకు సుపరిచితమైన లబ్ డబ్ శబ్దం సిరలు(veins)నుంచి గుండెకు మరియు ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పనిలో మీ గుండె నిమగ్నమై ఉందని సూచిస్తుంది, అలా సరఫరా కాబడిన రక్తాన్ని ఆమ్లజనితో శుద్ధి చేసిన అనంతరం ధమనులు(arteries)ద్వారా శరీరానికి తిరిగి పంపిణీ చేస్తుంది.
గుండె ఎలా పని చేస్తుంది?
మానవ దేహంలోని గుండె అచ్చమైన పంపులాంటిది, మీ పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని మిలియన్ల సంఖ్యలో గల కణాల నుంచి రక్తాన్ని పంపిణీ మరియు స్వీకరించే కార్యకలాపాలను చేపడుతుంది. ఇది నాలుగు గదులుగా నిర్మితమై ఉంటుంది. చెరోవైపు గల రెండు గదులను పటిగా పిలవబడే గోడ కుడివైపును ఎడమవైపును విభజిస్తుంది.
ఈ రెండు స్వీకరించే గదులు కవాటములుగా(valves) పిలువబడే రెండు మార్గాలను కలిగి ఉంటాయి. గుండెకు చెరోవైపున ఉండే రెండు కవాటాలు గుండె ద్వారా రక్తం ప్రవహించేందుకు సహకరిస్తాయి. కుడివైపున గల త్రిపత్ర కవాటము(Tricuspid valve)మరియు ఎడమవైపున గల ద్విపత్రకవాటము(Mitral valve)చెరోవైపున కర్ణిక(Atrium)మరియు జఠరిక(Ventricle) మధ్య రక్త ప్రసారాన్ని నియంత్రిస్తాయి.
ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పుపుస కవాటముగా(Pulmonary valve) పిలవబడే కుడి కవాటము కుడి జఠరిక నుంచి పుపుస ధమనులకు రక్త ప్రసరణను అనుమతిస్తుంది. బృహద్ధమన కవాటముగా(Aorta valve)పిలవబడే ఎడమ కవాటము, ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనికి(Aorta) రక్త ప్రసరణను నియంత్రిస్తుంది.
ఆరోగ్యవంతమైన దేహంలో నిరంతరాయంగా ప్రవహించే దిశగా ఐదు లీటర్ల రక్తాన్ని గుండె పంపు చేస్తుంది. గుండె నుంచి బయలుదేరిన రక్తం ధమనులుగా పిలవబడే నాళాల ద్వారా కేశనాళికలుగా(capillaries) పిలవబడే రక్త నాళములలో అతి సూక్ష్మమైన నాళికల ద్వారా ప్రవహించి చివరకు గుండెకు చేరవేసే సిరలలోకి ప్రవేశిస్తుంది.
ఈ కార్య చక్రం 60 సెకండ్లలో పూర్తి అవుతుంది, అదే సమయంలో దేహం యొక్క కణాలలోని ధాతువులు, అంగాలు, కండరాలు మరియు ఎముకలకు ఆమ్లజనితో పాటు బలవర్థకాన్ని రక్తం అందిస్తుంది.
గుండెజబ్బులు
గుండెజబ్బులు రావటానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. మధుమేహం, రక్తపోటు, పొగత్రాగటం, అధిక కొవ్వు, అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు ప్రధానమైనవి. ఇదివరకు పురుషులు మాత్రమే ఎక్కువగా గుండె జబ్బులకు గురయ్యేవారు. అయితే ఇప్పుడు మహిళలలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.సహజంగా చిన్నపిల్లల్లో తలెత్తే హృదయ సంబంధిత వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించేవిగా ఉంటున్నాయి. అదేవిధంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు కూడా ఉంటున్నాయి. గుండెజబ్బులు తలెత్తే వారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు అవసరమవుతాయి. నిజానికి గుండె జబ్బు ఉన్నట్లు ముందుగా గుర్తించినట్లయితే మందులతోనే వ్యాధిని నయం చేయవచ్చు. అయితే కొందరు వ్యాధిని గుర్తించినప్పటికీ సత్వర చికిత్సను అశ్రద్ధ చేస్తారు. ఫలితంగా మందులతో నయమయ్యే వ్యాధి కాస్తా శస్త్ర చికిత్సకు దారి తీస్తుంది. నిపుణులైన వైద్యులు ఒకసారి వ్యాధి పరిస్థితిని వివరించిన తర్వాత దానికి తగ్గట్లుగా స్పందిస్తే రోగి ప్రాణాలను కాపాడినవారవుతారు.
లక్షణాలు
ఉదర సంబంధిత నొప్పి రావటం, అసాధారణమైన నాడీ స్పందన, గుండెపోటు, ఆయాసం, ఆకలి మందగించటం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తటం, ఛాతీ నొప్పి, చర్మం నీలి వర్ణంలోకి మారటం, మానసిక వ్యాకులత, కళ్లు తిరగటం, శ్వాసావరోధం, వంటికి నీరు చేరటం, మూర్చిల్లటం, వేగమైన హృదయ స్పందన, జ్వరం, దగ్గుతోపాటు రక్తం పడటం, కండరాలు బిగుతుగా మారటం, బరువు పెరగటం, బరువు తగ్గటం వంటివి వాటిని మనం హృదయ సంబంధిత సమస్యలకు సంబంధించి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
జాగ్రత్తలు
ధూమపానం అలవాటును మానుకోవాలి. ప్రతి రోజూ అర గంటసేపు నడక అలవాటును తప్పక పాటించాలి. రక్తపోటు మరియు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. టెన్షన్‌ను విడనాడాలి. ఎల్లప్పుడూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఆశావహ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.
ఆహారాన్ని
ప్రధానంగా అధికంగా నూనెల వాడటాన్ని తగ్గించుకోవాలి. దీంతోపాటు తాజా పండ్లను, కూరగాయలను తీసుకుంటుండాలి.
క్లిష్టమైన శస్త్ర చికిత్సలు
పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులు, గుండెకు కొవ్వు చేరటం, హార్ట్ ఫెయిల్యూర్ విషయంలో శస్త్ర చికిత్సలు క్లిష్టతరంగా ఉంటాయి.
Updates : Heat diseases ->
ఐక్యూ (తెలివితేటలు) తక్కువగా వున్న వ్యక్తులకు సగటున గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని ఇటీవల ఒక సర్వేలో పరిశోధకులు నిర్ధారించారు. దాదాపు నాలుగు వేల మందిపై నిర్వహించిన ఈ సర్వే వివరాలను యూరోపియన్ హార్ట్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. ఇందులో ఉన్నత, దిగువ స్థాయి సామాజిక, ఆర్థిక వర్గాలలో మరణాల వ్యత్యాసం దాదాపు 20 శాతానికి పైగా వుందని వీరు నిర్ధారించారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు తనానికి గురైన వర్గాల వారు గుండెజబ్బులు, క్యాన్సర్, ప్రమాదాల వంటి వాటితో త్వరగా మరణించేందుకు అవకాశం వున్నట్లు తమకు తెలుసని ఈ సర్వే బృందానికి నేతృత్వం వహించిన డా.డేవిట్ బట్టి చెప్పారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం, ధూమపానం, భోజనం, భౌతిక కార్యకలాపాల వంటి ఆరోగ్యపరమైన ప్రవర్తన వంటి అంశాలు ఈ వ్యత్యాసానికి కారణాలని, అయితే ఇందులో అన్నీ ఇందుకు కారణం కాబోవని వివరించారు. తెలివితేటల పెరుగుదలకు దోహదపడే అంచనాకు అందని మానసిక కారణాల వల్ల గుండెజబ్బుల పెరుగుదలకు అవకాశం వుందని ఆయన వివరించారు.
విటమిన్ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం
ఆరోగ్యానికి 'బి విటమిన్లు చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే అయితే మరోసారి ఈ 'బి విటమిన్లలోని ఫోలేట్, బి6 ఉన్న ఆహారాన్ని తీసుకుంటే పక్షవాతం, గుండెజబ్బుల వల్ల కలిగే మరణాల ముప్పు తగ్గుతుందని జపాన్ పరిశోధ కుల అధ్యయనంలో తేలింది.
జపాన్ కొలాబరేటివ్ కోహార్ట్ స్టడీలో భాగంగా 40-79 ఏళ్ళ మధ్యగల 23, 119 మంది పురుషులు, 35, 611 మంది మహిళల మీద అధ్యయనం చేశారు. వారి ఆహార అలవాట్లను నమోదు చేసుకుని, 14 సంవత్సరాల పాటు గమనించారు.
అనంతరం చనిపోయిన వారి వివరాలను సునిశితంగా పరిశీలించారు. వీరిలో ఫోలేట్, బి6 ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో గుండె వైఫల్యం కారణంగా వచ్చే మరణాలు తక్కువ సంఖ్యలో నమోదైనట్టు గుర్తించారు. అదే మహిళల్లో గుండెజబ్బులు, పక్షవాతం వల్ల కలిగే మరణాలు తక్కువగా ఉన్నాయి.
మనం తినే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, బీన్స్, ఆకుకూరల్లో ఫొలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక బి6 చేపలు, కాలేయం, ముడిధాన్యాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇవేకాక నూనెలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పక్షవాతం, గుండె జబ్బులకు చెక్ చెప్పడమే కాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. అంతేకాదు ఈ ఆహారాన్ని తీసుకోవడం శరీరానికి పీచుపదార్థం (ఫైబర్) ఎక్కువగా అందుతాయి. స్థూలకాయులు కూడా ఈ ఆహారాన్ని మితంగా తినడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవ్ఞ్చ.
0 Comments