Full Style

>

phobia(Fear)-ఫోబియా(భయం)

-phobia(Fear)-ఫోబియా(భయం)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మనిషి కున్న అతి పెద్ద జబ్బు ఏమిటి? కాన్సరా? ఎయిడ్సా?  హృద్రోగామా? ఇవేవీ కాదు. మనిషిని పట్టి అతిగా బాధించే అతి పెద్ద జబ్బు పేరు "భయం". భయం లేని వాణ్ణి ఏ జబ్బూ ఏమీ చేయ లేదు. భయపడే వాడికి ఏ జబ్బైనా విపరీతంగా బాధ పెట్టేదే! శరీరానికి జబ్బులు వస్తాయి. రాకుండా వుండవు. భయం మాత్రం మీకు రాకుండా చూసుకుంటే  మీ జీవితం హాయిగా  గడిచి పోతుంది.

మనిషి కున్న మహా భయం చావును గురించి, అట. మనిషికే గాదు, ప్రతి ప్రాణికీ చావంటే - భయం. కానీ - చాలా ప్రయోగాల ద్వారా తెలిసింది ఏమిటంటే - భయం లేని వాడికి, చావు చాలా సులభం, కష్టం లేనిదీ అని. ఎప్పుడో, రాబోయే దాన్ని గురించి యిప్పుడు భయపడడం, దుహ్ఖించడం - చాలా అవివేకం .భయానికి విరుగుడు - ధ్యానం. ధైర్యమున్న చోట భయముండదు. భయమున్న చోట ధైర్యముండదు. భయానికి కారణం అజ్ఞానమే. ధైర్యం గా వుండే వాడే సంతోషంగా వుండగలడు. సంతోషంగా వుండడం అలవాటుగా మార్చుకోండి.

ఏ విషయం గురించయినా అతిగా భయపడడాన్ని ఫోబియా (Phobia) అంటారు.

మానసిక సమస్యల్లో చాలా తరచుగా కనబడేదీ.. ఎక్కువ మందిని వేధించేదీ.. జీవితాల్ని చాలా ఇబ్బందికరంగా మార్చేదీ.. ఫోబియా! అంతే కాదు.. చికిత్సతో సంపూర్ణంగా నయమైపోయేది కూడా ఈ ఫోబియాలే కావటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం!

'ఫోబియా' అంటే ప్రధానంగా భయం! అది కూడా అర్థరహితమైన భయం!! సాధారణంగా ఎవరూ భయపడని, ఎవరికీ భయం కలిగించని వాటి పట్ల మనం భయపడుతుండటం..
ఫోబియాల ప్రత్యేకత.
ఏదైనా ఒక వస్తువుపట్లగానీ, ఒక సందర్భం పట్లగానీ, పరిస్థితుల పట్లగానీ అసహజమైన భయాన్ని పెంచుకోవటాన్నే 'ఫోబియా' అంటారు. నిజానికి దాన్ని అనుభవిస్తున్న వ్యక్తికి కూడా తెలుస్తూనే ఉంటుంది, ఆ భయానికి అర్థం లేదనీ, భయపడాల్సిన అవసరమే లేదని! అయినా కూడా ఆ సన్నివేశం, ఆ సంఘటన, లేదా ఆ వస్తువు ఎదురైనప్పుడు ఉన్నట్టుంది విపరీతమైన ఆందోళనకు గురవుతుంటారు. సాధ్యమైనంత వరకూ దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక దశలో దానికి దూరంగా ఉండేందుకు ఎన్ని కష్టాలకైనా సిద్ధపడుతుంటారు. దీనివల్ల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంటుంది. నిజానికి దీన్ని వదిలించుకోవటం కష్టమేం కాదు. ఈ విషయంలో మానసిక చికిత్సా రంగం మంచి ఫలితాలను అందిస్తోంది.
ఫోబియాల జాబితాకు.. భయానికి గురిచేస్తున్న అంశాలకు అంతులేదు. దాదాపు 500లకు పైగా భయాల గురించి తరచుగా వింటుంటాం. కానీ స్థూలంగా చెప్పుకోవాలంటే ఈ ఫోబియాలు రెండు రకాలు.
1.నిర్దిష్టమైన అంశాలు, వస్తువులు, సందర్భాల పట్ల భయం. దీన్నే మానసిక చికిత్సా రంగంలో 'స్పెసిఫిక్‌ ఫోబియా' అంటారు.
రెండోది- సామాజికంగా నలుగురిలోకి వెళ్లినప్పుడు ఎదురయ్యే 'సోషల్‌ ఫోబియా'. చిన్న చిన్న అంశాల పట్ల భయాలు పెంచుకోవటమన్నది ఇతరులకు చాలా హాస్యాస్పదంగా అనిపించొచ్చు. కానీ దాన్ని అనుభవించే వారికి మాత్రం అది నిజంగా పెను భూతమే!

* ఒక ఉదాహరణ: ఒకరికి కుక్కలంటే భయం అనుకుందాం. అంతా కుక్కలను పెంచుకుంటూనే ఉన్నారు, అదేమంత భయపడాల్సిన జంతువు కాదని వారికీ తెలుస్తూనే ఉంటుంది, వాళ్లూ మనసులో అనుకుంటూనే ఉంటారు. నిజంగా కుక్క ఎదురుగా కనిపించేంత వరకూ బాగానే ఉంటారు కూడా. కానీ ఒక్కసారి ఆ జంతువు ఎదురైతే మాత్రం.. తీవ్రమైన ఆందోళనలోకి, భయంలోకి జారిపోతారు. ఈ భయం ఎంత దూరం వెళుతుందంటే ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవటానికి కూడా ప్రయత్నిస్తారు. చివరికి ఎక్కడైనా కుక్క ఉందని ముందే తెలిస్తే.. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనటానికి సిద్ధపడతారుగానీ ఆ ప్రాంతానికి వెళ్లటానికి మాత్రం ఇష్టపడరు.

* ఇంకో ఉదాహరణ: ప్రయాణమంటే భయం. ఊరొదిలి వెళ్లాలంటే భయం. ఉత్తప్పుడంతా బాగానే ఉంటారు. కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కడ లేని భయం ముంచుకొచ్చేస్తుంది. దీంతో మొత్తానికి ప్రయాణాలనే వాయిదా వేస్తుంటారు. ఇలా ఏళ్ల తరబడి రైళ్లు, విమానాలు, బస్సులు ఎక్కని వాళ్లు, ఊళ్లకెళ్లని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. విమానాశ్రయాల వరకూ వెళ్లి వెనుదిరిగి వచ్చేవారూ ఉన్నారు. ఉద్యోగరీత్యా క్యాంపులు, ప్రయాణాలు అనివార్యమైనా సరే.. భయానికి లొంగిపోయి చివరికి ప్రమోషన్ల వంటివి వదులుకునేళ్లు కూడా ఎంతోమంది. ఇలా వీళ్లు దైనందిన జీవితంలో భయాలను తప్పించుకు తిరిగేందుకు, సాధ్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి లిఫ్టులంటే భయం. లిఫ్టు ఎక్కకుండా ఉండేందుకు పదిపదిహేను అంతస్తులైనా మెట్లు ఎక్కటానికి సిద్ధపడుతుంటారు. పైగా తమ భయం బయటపడకుండా దాచిపెట్టుకునేందుకు.. మెట్లు ఎక్కితేనే ఆరోగ్యం.. ఇదే మంచిదని వాదన కూడా చేస్తుంటారు.

అనుకోకుండానో, బలవత్తరంగానో తమ భయకారకాలను ఎదుర్కొనాల్సి వస్తే ఒక్కసారిగా తీవ్ర భయంలోకి జారిపోయి, ఆందోళనలో కూరుకుపోయి, ఆగమేఘాల మీద అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంటారు. స్థూలంగా చెప్పుకోవాలంటే వీరిలో అసందర్భమైన భయాలు (ఇర్రేషనాలిటీ), వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు తంటాలు పడుతుండటం (అవాయిడెన్స్‌), బలవత్తరంగా వాటిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎదురైతే ఆందోళనలో కూరుకుపోవటం (యాంగ్త్జెటీ) అనే మూడు లక్షణాలూ ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. అలాగే వీరిలో చాలామందికి ఆందోళన (జనరలైజ్డ్‌ యాంగ్త్జెటీ), మానసిక కుంగుబాటు (డిప్రెషన్లు) కూడా కలగలిసి ఉంటాయి.

మరో రకం: సోషల్‌ ఫోబియాలు
నలుగురిలోకి వెళ్లటానికి భయం. అలా వెళితే అందరూ తనను చూసి ఎక్కడ నవ్వుతారో, అలా నవ్వేపని తాను ఎక్కడ చేస్తానోనని మనసులో భయం. తడబడటం, చెమటలు పట్టటం, నలుగురిలో ఏం చెయ్యాలన్నా ఇబ్బంది. చివరికి నవ్వులపాలయ్యే కంటే అసలు అక్కడికి పోకుండా ఉంటేనేనే మేలన్న భావనలోకి జారిపోతుంటారు.

చాలా రకాల ఫోబియాల్లో ప్రధానంగా కనబడేది.. తమ నియంత్రణలో లేని అంశాల పట్ల భయం పెంచుకోవటం. ఉదాహరణకు కొందరికి రైలు ప్రయాణాలంటే భయం. హఠాత్తుగా ఏదైనా జరిగితే రైళ్లను మనం నియంత్రించలేం, అది మన చేతుల్లో ఉండదని భయపడుతూ ఎంత దూరమైనా సొంతకార్లలో వెళుతుంటారు. ఇలా పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు, వాటిని మనం నిర్దేశించలేమన్న సందర్భాల్లో భయం, ఫోబియాలు ఎక్కువ అవుతుంటాయి.
భయంలో ఏమవుతుంది?
తమకు భయాన్ని కలిగించే సందర్భం ఎదురవగానే విపరీతమైన మానసికమైన ఒత్తిడి మొదలవుతుంది. గుండె దడ, నిస్సత్తువ, చెమటలు, ఊపిరి వేగంగా తీసుకోవటం, మరో ఆలోచన లేకపోవటం, ఇక్కడి నుంచి పారిపోకపోతే మరుక్షణంలో ఏదైనా అయిపోతుందన్న ప్రాణ భయం.. ఇవన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొంటాయి. ఈ సందర్భమేదో పది సెకండ్లే ఉన్నా.. అదే ఒక యుగంలా అనిపిస్తుంటుంది. ఈ ఫోబియాలు ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు తెచ్చిపెట్టకపోయినా జీవనశైలిని, దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి ఇబ్బందుల్లోకి నెట్టటం వీటిలో ముఖ్యాంశం.
సామాజిక సమస్యలు
భయాల వల్ల వీరు తరచుగా సామాజిక జీవనానికి, బహిరంగ జీవితానికి దూరమవుతుంటారు. ఉదాహరణకు ప్రయాణాలంటే భయం ఉన్నవారు.. ఇతరులను నొప్పించకుండా ఉండేందుకు రకరకాల కారణాలు చెబుతుంటారు. దీనివల్ల ఇతరులు వీరిని కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారని అపార్థం చేసుకునే అవకాశమూ ఉంటుంది. ఉదాహరణకు ఏళ్ల తరబడి విమానాలు ఎక్కకుండా ఉండిపోయేవాళ్లు.. విదేశాల్లో ఉన్న తమ పిల్లలు రమ్మంటున్నా వెళ్లకుండా ఏదో కారణం చెప్పి తప్పించుకుంటుంటారు. రద్దీ ప్రాంతాలంటే భయపడేవారు పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల వంటి వాటికి వెళ్లటానికి వెనకాడుతూ భయంతో బిగుసుకుపోతుంటారు. దీనివల్ల ఎన్నో సామాజిక సమస్యలు, వృత్తిపరంగా, ఇతరత్రా సమస్యలు పెరుగుతాయి.

భయాలు.. రకరకాలు
    ఏక్రోఫోబియా (Acrophobia)     : ఎత్తైన ప్రదేశాలంటే భయం
    క్లాస్ట్రోఫోబియా (Claustrophobia): ఒంటరితనం అంటే భయం.
    నెక్రోఫోబియా (Necrophobia)     : చావు అంటే భయం
    పైరోఫోబియా (Pyrophobia)     : అగ్గి అంటే భయం
    హీమోఫోబియా (Hemophobia)     : రక్తం అంటే భయం
    హైడ్రోఫోబియా (Hydrophobia)     : నీరు అంటే విపరీతమైన భయం

* జంతువులంటే భయం: పులి అంటే ఎవరికైనా భయమే. అదంటే భయం లేకపోతే అసహజం. కానీ అలా కాకుండా చాలామంది బల్లులు, సాలీళ్లు, బొద్దింకల వంటివాటిని చూసి భయపడుతుంటారు.

* ఎత్తులంటే భయం: చాలామందికి ఎత్తులకు వెళ్లాలన్నా, ఇరుకు ప్రదేశాలన్నా తీవ్రంగా భయపడుతుంటారు. అసలా తలంపే వారిని తీవ్ర భయానికి లోను చేస్తుంటుంది.

* రక్తం, దెబ్బలంటే భయం: గాయాలు, దెబ్బలు, రక్తం వంటివి చూడలేకపోవటం ఎంతోమందిని ఇబ్బంది పెట్టే ఫోబియా.

* జబ్బులంటే భయం: చాలామందికి తాము ఎక్కడ జబ్బు పడతామో, ఎక్కడ జబ్బులు అంటుకుంటాయోనన్న భయం వేధిస్తుంటుంది. ఉదాహరణకు 'ఎయిడ్స్‌ ఫోబియా' ఉన్నవాళ్లు సెలూన్‌కు వెళ్లి గడ్డం చేయించుకోవటానికి కూడా భయపడుతుంటారు. ఎప్పుడైనా ఒక్కసారి వెళితే జీవితాంతం భయపడుతుంటారు. ఆసుపత్రులకు వెళితే అక్కడి జబ్బులు ఎక్కడ అంటుకుంటాయోనన్న భయం వంటివీ ఎందరినో బాధిస్తుంటాయి.

* పర్యావరణం: కొందరు ఉరుములు, మెరుపులు, వర్షాలకు విపరీతంగా భయపడుతుంటారు. ఆకాశం మేఘావృతమైనా వీరికి భయమే.

ఈ ఫోబియాల చిట్టా అనంతం! వీరు అనుభవించే భయమూ అనంతమే!

మూలాలెక్కడ
* జీవితంలో మనకు ఎదురైన సందర్భాల ఆధారంగా మనం ఏర్పరచుకునే ఫోబియాలు కొన్ని. ఉదాహరణకు ఒకసారి మనల్ని కుక్క కరిచినా, లేదా కుక్క ఎవరినైనా కరవటం మనం చూసినా కుక్కల పట్ల ఫోబియా పెంచుకునే అవకాశం ఉంటుంది.

* చిన్నతనంలో దయ్యం భూతం బూచాడంటూ మన ఇళ్లలో మనమే కొన్ని భయాలను పిల్లల మెదళ్లలో నాటుతుంటాం. ఇవి ఫోబియాలుగా స్థిరపడి, వ్యక్తితోపాటే పెరుగుతూ వస్తాయి, కొన్ని మధ్యలో కూడా రావచ్చు. అయితే కొన్ని ఫోబియాలు వయసుతో పోతాయి. ఉదాహరణకు చిన్నతనంలో చీకటంటే భయం.. పెద్దయితే అది ఉండకపోవచ్చు.

* చాలావరకూ మనం పుట్టిపెరిగిన, చూసిన, తిరిగిన వాతావరణంలో ఎటువంటి అనుభవాలను, సందర్భాలను ఎదుర్కొన్నామో వాటి ఆధారంగా కూడా కొన్ని ఫోబియాలు స్థిరపడతాయి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా కొన్ని భయాలుంటే ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలకు కూడా ఫోబియాలు రావచ్చు.

* ఫోబియాలకు సంబంధించి.. 'జనరలైజేషన్‌' కూడా ఒక కీలకాంశం. ఉదాహరణకు ఒక దానితో భయం తలెత్తితే దాన్ని పోలి ఉన్న దేన్ని చూసినా భయాలు మొదలవుతాయి. ఉదాహరణకు బొచ్చుకుక్క అంటే భయం అయితే చివరికి బొచ్చు ఉన్న ఫర్‌క్యాప్‌ చూసినా కూడా భయం తలెత్తవచ్చు.

* జన్యుపరంగా, వ్యక్తిత్వంలో భాగంగా కూడా కొన్ని ఫోబియాలు రావచ్చు. అలాగే స్వతహాగానే భయస్తులైన వారికి ఆయా పరిస్థితులు కూడా తోడైతే భయాలు మరింత స్థిరపడతాయి.

* ముఖ్యంగా పరిణామక్రమంలో మనుగడ కోసం, ప్రాణ రక్షణ కోసం కూడా మనలో కొన్ని భయాలు చోటుచేసుకుని ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు విషపురుగులు, జంతువుల వంటి మనకు హానితలపెట్టే జీవులు; మనకు హాని జరగటానికి అవకాశముండే ఎత్తు ప్రదేశాలు, చీకటి వంటి పర్యావరణ అంశాలు; గాయాలు, రక్తం వంటి ప్రమాద ఘట్టాలు; ఇరుకు ప్రదేశాల్లో ఇరుక్కుపోవటం వంటి ప్రమాదకర పరిస్థితులు.. ఇవన్నీ పరిణామ క్రమంలో భాగంగానే మనలో భయాలకు తావిస్తుండొచ్చని విశ్లేషిస్తున్నారు.
చికిత్సతో పూర్తి ఫలితాలు
సెరౖన చికిత్స తీసుకుంటే ఫోబియాలను చాలా వరకూ పూర్తిగా పోగొట్టుకోవచ్చు. చికిత్సలో భాగంగా ముందు వీరికి ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గేందుకు 'యాంటీ యాంగ్త్జెటీ' మందులు, 'యాంటీ డిప్రసెంట్లు' ఇస్తారు. మానసికంగా విశ్రాంతిగా ఉండేలా.. 'రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌' నేర్పిస్తారు. వీటితో కొంత కుదుటపడిన తర్వాత.. ఫోబియాలు పోగొట్టేందుకు అత్యంత కీలకమైన 'బిహేవియర్‌ థెరపీ' ఆరంభిస్తారు. దీనిలో ప్రధానంగా రెండు విధానాలుంటాయి.

* మొదటిది: సాధారణంగా దేనికి భయపడుతున్నారో అదంటే భయాన్ని పోగొట్టేందుకు మానసికంగా ముందు సన్నద్ధం చేస్తారు. దీన్నే 'సిస్టమాటిక్‌ డీసెన్సిటైజేషన్‌' అంటారు. ఈ దశలో.. ఊహించుకోవటం ముఖ్యమైన దశ. ఉదాహరణకు లిఫ్ట్‌ ఎక్కటమంటే భయం అనుకుంటే ముందు లిఫ్ట్‌ ఎక్కుతున్నట్టుగా ఊహించుకోవటంతో మొదలుపెట్టిస్తారు. ఎక్కకపోతే పని జరగనట్లు, ఎక్కుతున్నట్టు ఊహించుకునేలా చేస్తారు. మామూలుగా ఇలా ఊహిస్తున్నప్పుడు కూడా వీరిలో ఆందోళన పెరుగుతుంటుంది. దీన్ని తగ్గించటానికి 'సైకలాజికల్‌ రిలాక్షేన్‌ టెక్నిక్స్‌' ఉపయోగిస్తూ ప్రయత్నిస్తారు. ఇలా క్రమేపీ ఊహల్లో భయం తగ్గుతున్నప్పుడు.. మెల్లగా వాస్తవికమైన పరిస్థితుల్లోకి తీసుకువెళతారు. 'లిఫ్ట్‌ ఎక్కద్దులే.. పక్కన నిలబడి చూడు.. తర్వాత ఎక్కి మొదటి అంతస్థు వరకే వెళ్లి వచ్చేద్దాం..' అంటూ పక్కన ఒకరిని తోడు ఇచ్చి పంపిస్తూ.. ఇలా క్రమేపీ వాస్తవానికి దగ్గరగా తీసుకువెళతారు. ఈ ప్రక్రియతో భయం తగ్గుతూ.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంటుంది. అలాగే భయపెడుతున్నదేమిటో రాయించి.. ఏ భయం ఎక్కువ ఆందోళన సృష్టించిపెడుతోంది? దేన్ని ముందుగా మనం ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. చివరికి ఆ వస్తువు, ఆ పరిస్థితి దగ్గరి వరకూ తీసుకువెళ్లి.. ఆ భయాన్ని సంపూర్ణంగా పోగొట్టటం ఇందులో ముఖ్యాంశం.

* రెండోది: ఏదంటే భయమో దాన్నే బలవంతంగా ముందు పెట్టేయటం మరో విధానం. దీన్నే 'ఫ్లడింగ్‌ టెక్నిక్‌' అంటారు. ఉదాహరణకు లిఫ్ట్‌ అంటే భయపడుతుంటే ఒక్కసారే దాన్లోకి తీసుకువెళ్లిపోతారు. ఒక్కసారే ఇలా జరిగే సరికి మొదట్లో కొద్దిగా ఆందోళనచెందినా.. క్రమేపీ అందులో ఎక్కినా తనకేం జరగటం లేదన్న నమ్మకం, ఇక తనకేం కాదన్న భరోసా కలుగుతుంది. దీంతో మనిషి క్రమేపీ వాస్తవికమైన పరిస్థితుల్లో భయం అక్కర్లేదని గుర్తిస్తారు. నిపుణులు పక్కన ఉండే ఇలా చేస్తారు.

* భయాలను 'సిస్టమాటిక్‌ డీసెన్సిటైజేషన్‌' ద్వారా చాలా వరకూ ఎదుర్కొనొచ్చు. దానికి కొన్ని వారాలు పట్టొచ్చు. అయితే ఫ్లడింగ్‌ టెక్నిక్‌లో మాత్రం ఒకటిరెండు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. ఈ చికిత్సా విధానాలు సమర్థంగా పని చేస్తాయి. అయితే ఓపిగ్గా చికిత్స తీసుకోవటం ముఖ్యం.

* కొందరికి 'కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ' బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఏ ఆలోచన భయాన్ని తెచ్చిపెడుతోందన్నది గుర్తించటం, దానిలోని అసంబద్ధతను చర్చించటం, ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొంటామన్నది శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఎంతోమంది ఫోబియాలతో నిత్యం సతమతమవుతున్నాగానీ చికిత్సకు ముందుకు రారు. ఫలితంగా హాయిగా జీవించే పరిస్థితి లేకుండా చేసుకుంటుంటారు. దీనివల్ల ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలూ పెరుగుతాయి. కాబట్టి ఇలాంటివి వదిలించుకోవటమే ముఖ్యమని గుర్తించాలి.

Post a Comment

0 Comments