Hyperbaric Oxygen Therapy(HBOT),హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినప్పుడు ఆ గాయాలు ఎంత త్వరగా నయమైతే అంత మంచిది. ఆలస్యం అవుతున్నకొద్దీ ఇన్‌ఫెక్షన్ తలెత్తే అవకాశముంది. కొన్నిసార్లు ఈ ఇన్‌ఫెక్షన్ ఒళ్లంతా విస్తరించి ప్రాణాల మీదికీ రావొచ్చు. అందుకే వైద్యులు శక్తిమంతమైన యాంటీబయోటిక్ మందులతో గాయాలు త్వరగా నయమయ్యేలా చూసేందుకే ప్రాధాన్యమిస్తారు. అయినప్పటికీ కొందరికి గాయాలు ఎంతకీ మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారికి ఉపయోగపడేందుకు రూపొందించిందే హైపర్‌బేరిక్ ఆక్సిజన్ థెరపీ (హెచ్‌బీఓటీ). మనదేశంలోనూ కొన్ని ఆసుపత్రుల్లో ఇదిప్పుడు అందుబాటులోకి వస్తోంది. హెచ్‌బీఓటీ పరికరంలో ఒత్తిడితో కూడిన ఓ పొడవాటి గాజు గది ఉంటుంది. బయటి వాతావరణం గాలిలో ఆక్సిజన్ 20% ఉంటే.. ఇందులో 100% ఆక్సిజన్ ఉంటుంది. గాయాలైనవారిని ఈ గాజుగదిలో పడుకోబెట్టటమే ఇందులోని చికిత్స. గాయాలు మానటంలో ఆక్సిజన్ కీలకపాత్ర పోషిస్తుంది. మొండి గాయాలు, మధుమేహం పుండ్లు, కాలిన గాయాలు ఏర్పడిన భాగంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. గాయాలు మరీ తీవ్రమైతే అసలు రక్తసరఫరానే ఉండదు. అందువల్ల ఆ భాగానికి ఆక్సిజన్ అసలే అందదు. అయితే హెచ్‌బీఓటీలో ఒత్తిడిని 1.5 నుంచి 3 రెట్ల వరకు పెంచటం వల్ల శరీరంలోకి ఆక్సిజన్ సరఫరా అధికమవుతుంది. దీంతో గాయాలు ఏర్పడిన భాగానికి అవసరమైన మేరకు ఆక్సిజన్ అందుతుంది. కొత్త కణాలు, సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొచ్చి గాయం మానే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి చికిత్సకు సుమారు 60-90 నిమిషాల సమయం పడుతుంది. గాయం తీవ్రతను బట్టి దాదాపు 10 నుంచి 20 సార్ల వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. మామూలుగా గాయం మానటానికి నెలరోజులు పడుతుందనుకుంటే.. హెచ్‌బీఓటీ పద్ధతిలో పదిహేను రోజుల్లోనే నయమైపోతుంది. ఇది కాస్త ఖరీదైన చికిత్సే అయినప్పటికీ మొండి గాయాల విషయంలో మంచి ఫలితం కనబరుస్తుండంతో ఆదరణా బాగానే పెరుగుతోంది.
0 Comments