జీవగడియారం గుండెలయకు ఆధారం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మనకు చీకటి పడగానే నిద్ర ముంచుకురావటం, తెల్లారగానే మెలకువ రావటం సహజమే. ఇలా వెలుతురును బట్టి మనలోని జీవగడియారం (సిర్కాడియన్ రిథమ్) శారీరక, మానసిక, ప్రవర్తన మార్పులను కలిగిస్తుంటుంది. అంతేకాదు దీనికి గుండెపోటుతోనూ సంబంధం ఉంటున్నట్టు తాజాగా బయటపడింది. గుండెపోటు రావటానికి గుండెలయ దెబ్బతినటమే (అరిత్మియా) ప్రధాన కారణమవుతోంది. గుండెలయ తప్పటమనేది సాధారణంగా తెల్లవారుజాముననే ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చాలాకాలం కిందటే గుర్తించారు. మరికొందరిలో ఇది సాయంత్రం వేళల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ విషయం తెలిసినప్పటికీ ఇందుకు ఏయే అంశాలు దోహదం చేస్తున్నాయో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. ఇది క్రపెల్-లైక్ ఫ్యాక్టర్ 15 (కేఎల్‌ఎఫ్-15) అనే ప్రోటీన్‌తో ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్ కేఎల్‌ఎఫ్-15 జన్యువు సంకేతాలతో ఉత్పత్తి అవుతుంది. ఇది జీవగడియారంతో అనుసంధానమై గుండెలోని విద్యుత్ ప్రసారాన్ని నియంత్రిస్తున్నట్టు తాజాగా కనుగొన్నారు. కేఎల్‌ఎఫ్-15 మరీ ఎక్కువైనా, తక్కువైనా గుండెలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది గుండెలయ దెబ్బతినటానికి కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు గుండె వైఫల్యం బారినపడ్డవారిలో కేఎల్‌ఎఫ్-15 లోపం ఉంటుండగా.. ఇది మరీ ఎక్కువగా గలవారిలో గుండె కొట్టుకునే వ్యవస్థలో మార్పులు కనబడుతున్నాయి. గుండెపోటు మరణాలను తగ్గించేలా కొత్త చికిత్సలు రూపొందించటానికి ఈ అధ్యయనం తోడ్పడగలదని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె వైఫల్యం బారినపడ్డవారికి మందులతో కేఎల్‌ఎఫ్-15 మోతాదు పెరిగేలా చేస్తే.. గుండెపోటు మరణాలను తగ్గించొచ్చని ఆశిస్తున్నారు.
0 Comments