మన ప్రమేయం లేకుండానే.. ముఖం మెల్లగా అక్కడక్కడ వివర్ణమైపోతుంటుంది. ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా ఏ ఇబ్బందీ పెట్టని ఈ మచ్చలు.. మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. ఎందుకిలా? వీటితో నలుగురిలోకి వెళ్లేదెలా..? ఈ మచ్చల బెడద వదలించుకునేదెలా?
మనసులో ఒకటే మథనం!
నిజానికి ఈ 'మంగు' మచ్చలను నిర్ధారించటానికి పెద్దపెద్ద పరీక్షలేం అవసరం లేదు. వైద్యులు చూస్తూనే సులభంగా పట్టుకుంటారు కానీ.. వీటిని పూర్తిగా నయం చెయ్యటం మాత్రం అంత సులభం కాదు. వీటికి ఎన్నో రకాల చికిత్సా విధానాలున్నాయి. వీటితో కొద్దిమందికి మచ్చలు పూర్తిగా పోయినా.. చాలామంది విషయంలో మచ్చల రంగు, తీవ్రత తగ్గించటం మాత్రమే సాధ్యం కావచ్చు. మొత్తానికి ఈ 'మంగు' మచ్చల విషయంలో 'ఓర్పు' మాత్రం చాలా అవసరం.
మంగు బాధితుల్లో 90% మంది మహిళలే. ఇది పురుషుల్లోనూ కనిపిస్తుంది కానీ.. మహిళలతో పోలిస్తే వీరిలో తక్కువ.
మంగు చిన్న పిల్లల్లో.. అంటే రజస్వలకు ముందు కనిపించదు. 30-40 ఏళ్ల వయసులో, మళ్లీ ముట్లు నిలిచిపోయే దశలో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంగా గర్భిణుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే వీటిని 'మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ' అనీ అంటారు.
మంగు వల్ల కేవలం మచ్చల బెడద తప్పించి ఇతరత్రా మంట, దురద వంటి బాధలు, లక్షణాలేమీ ఉండవు. కాకపోతే చూడటానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా కనబడతాయి కాబట్టి చాలామంది అంద వికారంగా తయారవుతున్నామేమిటా? అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు.
ముఖాన మచ్చలను చూస్తూనే... అవేమిటో గుర్టుపట్టెయ్యచ్చు! అదే మంగు ప్రత్యేకత. ఈ మచ్చలనే వైద్య పరిభాషలో 'మెలాస్మా' అంటారు. (గ్రీకులో 'మెల్' అంటే నలుపు, 'ఆస్మా' అంటే రంగు అని. దాన్నుంచి వచ్చిందే ఈ పదం!) ఈ రకం మచ్చలు స్త్రీలలో ఎక్కువ. గర్భిణుల్లో కనిపించే ఈ మచ్చలు కాన్పు అయిన తర్వాత తగ్గొచ్చు.. అయితే ఆ తర్వాత కాలంలో మళ్లీ రావచ్చు కూడా. మంగు మచ్చలు తెల్లవారిలో కంటే మనలాంటి నల్ల జాతీయుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన ప్రాంతంలో మంగు చాలా తరచుగా కనిపిస్తుంటుంది.
ఎందుకు వస్తుంది?
మంగు రావటానికి మూడు ప్రధానమైన కారణాలున్నాయి...
1. జన్యు సంబంధ కారణాలు: మంగు రావటానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం.. చర్మానికి ఎండ తగలటం. అలాగని ఇది ఎండలో తిరిగిన అందరికీ రాదు. కాబట్టి దీనికి జన్యుసంబంధ కారణాలూ దోహదం చేస్తాయి.
2. ఎండ తగలటం: ఎంతోకొంత ఎండ తగలకపోతే మంగు రాదు. చాలామంది 'మేం బయటకు ఎక్కడికీ వెళ్లటం లేదు కదా. ఎందుకొస్తుంది?' అని పొరపడుతుంటారు. కానీ మనకు తెలియకుండా, అనుకోకుండా కూడా సూర్యరశ్మి ప్రభావానికి గురవుతుంటాం. కేవలం ఒకరోజు ఎండ తగిలినా మెలాస్మా రావొచ్చు. యాత్రలకు వెళ్లినపుడో, దూరప్రాంతాలకు పోయినప్పుడో సూర్యరశ్మి తగలొచ్చు. కొందరు సముద్ర తీర ప్రాంతాలకు విహారానికి వెళ్తుంటారు. అలాంటి సమయంలో నీళ్లు, సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు.. రెండూ కలిసి వీటి ప్రభావంతో త్వరగా మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండలో తిరగటమంటే కేవలం వేసవిలోనే అని భావించాల్సిన పని లేదు. మబ్బుగా ఉన్న రోజుల్లో కూడా పగటి వెలుతురులోనూ అతినీలలోహిత కిరణాలు (విజిబుల్‌లైట్, యూవీ-ఏ, యూవీ-బీ) ఉంటాయి.మంగుకు ఇవన్నీ కారణం కావచ్చు.
3. హార్మోన్ల ప్రభావం: మంగు విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణం హార్మోన్లు. మన శరీరంలో స్త్రీ హార్మోన్త్లెన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ల మధ్య సమతౌల్యం తప్పినప్పుడు.. మంగు వచ్చే అవకాశం ఎక్కువ. గర్భనిరోధక మాత్రలు వేసుకునే వారిలో మంగు ఎక్కువగా కనిపించటానికి కూడా కారణం ఇదే. అలాగే ముట్లుడిగిపోయే వయసులోనూ స్త్రీశరీరంలో హార్మోన్ల మధ్య సమతౌల్యం మారిపోతుంది, ఫలితంగా మంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ హార్మోన్ల వ్యత్యాసం, దీనికి సూర్యరశ్మి, జన్యు కారణాలు కూడా ఒకదానికి ఒకటి తోడైతే మంగు త్వరగా వస్తుంది.
ఇవి కాకుండా..
* కొన్నిరకాల మందులు కూడా 'మంగు' మచ్చలు రావటానికి కారణమవుతాయి. మూర్ఛ, క్యాన్సర్, మానసిక సమస్యలకు వాడే కొన్ని మందుల వల్ల కూడా మంగు వస్తుంది. టెట్రాసైక్లిన్, నొప్పి తగ్గటానికి వాడే కొన్నిరకాల మందులతోనూ ఇవి రావొచ్చు. అయితే ఈ మందులతో పాటు సూర్యరశ్మి ప్రభావం తోడైనప్పుడే మంగు రావటానికి ఆస్కారం మరింతగా ఉంటుంది. థైరాయిడ్, గర్భాశయ కణుతుల వంటి సమస్యలున్న వారికీ రావచ్చు.
* సౌందర్య సాధనాల వల్ల కూడా మంగు రావచ్చన్నది కొందరి అభిప్రాయం. అయితే దీన్ని సాధారణంగా 'ఫొటో కాంటాక్ట్ డెర్మటైటిస్'గా భావిస్తుంటారు.
* కొందరిలో హార్మోన్లు, ఎండ, జన్యు కారణాల వంటివేవీ లేకుండా కూడా మంగు కనబడుతుంటుంది, దీనికి పైకి కనిపించకుండా ఏర్పడే హార్మోన్ల వ్యత్యాసం వంటివి కారణమవుతాయి.
* కొందరు ముఖానికి వెల్లుల్లి/నిమ్మరసం వంటివి రాసుకుంటూ ఉంటారు, వాటివల్ల 'పిగ్మెంటేషన్' పెరిగి.. నల్లమచ్చలు రావచ్చు. వాటిని మంగు మచ్చలుగా పొరబడే అవకాశం ఉంటుంది.
మచ్చల్లో మూడు రకాలు
శరీరం మీద మచ్చలు వచ్చే ప్రాంతాన్ని బట్టి 'మంగు' ప్రధానంగా 'సెంట్రో ఫేషియల్', 'మాలార్', 'మాండిబ్యులర్' అని 3 రకాలు.
* సెంట్రో ఫేషియల్: ఇది ముక్కు, ముక్కుకు ఇరువైపులా చెక్కిళ్ల దగ్గర, వీటితో పాటు నుదురు, ఒకోసారి పెదవుల పైభాగంలోనూ కూడా వస్తుంటుంది. ముక్కు-చెక్కిళ్ల ప్రాంతంలో ఈ మచ్చలు సీతాకోక చిలుక ఆకారంలో కనిపించటం వల్ల దీనిని 'బటర్‌ఫ్త్లె రాష్' అనీ అంటారు.
* మాలార్: కొందరికి ఇది కేవలం చెక్కిళ్ల కిందనే వస్తుంది.
* మాండిబ్యులార్: ఈ రకం మంగు దవడల ప్రాంతంలో వస్తుంది.
మంగు మచ్చలు చాలా వరకూ ముఖం మీదే వచ్చినప్పటికీ కొందరికి మెడ మీద, ఛాతీ మధ్య భాగంలో కూడా వస్తాయి. అరుదుగా ముంజేతుల మీదా కనిపిస్తుంది.
రంగుల్లో మూడు రకాలు..
* చాలామందికి గోధుమ రంగులో గానీ, గోధుమ.. నలుపు కలగలిసిన రంగులో గానీ వస్తాయి. * కొందరికి బూడిద రంగులోనూ ఉండొచ్చు. * మరికొందరికి బూడిద, నీలం కలిసిన రంగులో ఉంటాయి. ఇలాంటి వారిలో మంగు చర్మం లోపలి పొరల నుంచీ ఉందని అర్థం.
లోతులోనూ మూడు రకాలు
* ఎపిడెర్మల్ మెలాస్మా: వీరిలో మచ్చ కేవలం చర్మం పైపొర మీదే ఉంటుంది. * డెర్మల్ మెలాస్మా: ఇది చర్మం కింది పొరలోనూ ఉంటుంది. * డెర్మో, ఎపిడెర్మల్ మెలాస్మా: ఇది రెండు పొరల్లోనూ కలగలసి ఉంటుంది.
ఎలా గుర్తిస్తారు?
మంగు మచ్చలను చూస్తూనే వైద్యులు గుర్తుపట్టేస్తారు. ఇక మచ్చలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలుసుకోవటానికి 'వుడ్స్ ల్యాంప్' అనే పరికరం బాగా ఉపయోగపడుతుంది. దీని కింద చూసినపుడు మంగు మచ్చలు పైపైపొరల్లోనే ఉన్నాయా? కింది నుంచీ ఉన్నాయా? అన్నది తెలుస్తుంది.
చికిత్స
1. సూర్యరశ్మికి దూరంగా ఉండటం: మెలాస్మా చికిత్సలో ఇది అతి ముఖ్యమైంది. ఎండకు దూరంగా ఉండకపోతే మంగు మచ్చలను తగ్గించటం కష్టమనే చెప్పాలి.
2. సన్‌స్క్రీన్ లోషన్లు: సూర్యరశ్మిలోని వెలుతురు, యూవీ-ఏ, యూవీ-బీ వంటి వాటన్నింటినీ రక్షణ కోసం 'బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్' లోషన్లు బాగా ఉపయోగపడతాయి. ఈ లోషన్లు రాసుకోకుండా ఎలాంటి చికిత్స చేసినా ప్రయోజనం ఉండదు. వీటిలో టైటానియమ్ డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్‌లు అనే సన్‌స్క్రీన్స్ ముఖ్యమైనవి. ఇవేకాకుండా కెమికల్ సన్‌స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిజికల్ సన్‌స్క్రీన్స్ రాసుకుంటే తెల్లగా పైకి కనిపిస్తాయి. జిడ్డుగా ఉంటాయి. అదే కెమికల్ సన్‌స్క్రీన్స్ పైకి కనిపించవు గానీ 2-3 గంటల సేపే పనిచేస్తాయి. ఫిజికల్ సన్‌స్క్రీన్స్ 4-6 గంటల పాటు.. కొన్నిసార్లు 8 గంటల వరకూ పనిచేస్తాయి. ఇప్పుడు రెండింటినీ కలిపి కొత్తరకం సన్‌స్క్రీన్స్‌ని కూడా తయారు చేస్తున్నారు. వీటిని ప్రతి 3-4 గంటలకు ఓసారి రాసుకోవాలి. బయటకు వెళ్లటానికి అరగంట ముందే రాసుకోవాలి. ఎక్కువసేపు బయట గడపాల్సి వస్తే రెండు, మూడుసార్లు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.
3. బ్లీచింగ్ ఏజెంట్స్: ముదురు రంగు తీవ్రతను తగ్గించే రసాయనాలివి. వీటిల్లో హైడ్రోక్వినోన్ అనే క్రీము ఎక్కువగా వాడకంలో ఉంది. అయితే వీటిని ఎక్కువగా రాసుకుంటే ఆ భాగంలో తెల్లటి మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వైద్యుల పర్యవేక్షణలోనే, చెప్పినట్టుగానే వాడుకోవాలి.
* అజెలాయిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్‌లతో చేసిన క్రీములు కూడా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు వీటిల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, బెర్రీ పళ్ల సారం కలిపినవీ దొరుకుతున్నాయి. ఇంకా అధునాతన క్రీములు ఉన్నప్పటికీ అవన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.
* స్టిరాయిడ్ క్రీమ్స్‌ని వాడటం అంత మంచిది కాదు. వీటితో మొదట్లో మంగు తగ్గినట్టు అనిపించినా ఆ తర్వాత మళ్లీ ఉద్ధృతంగా.. దాడి చేసినట్టుగా వచ్చేస్తుంది.
4. కెమికల్ పీల్స్: ప్రధానంగా ఇవి కూడా రసాయనాలే. వీటిని రాసి, కొంతసేపు ఉంచి తర్వాత తొలగించాల్సి ఉంటుంది. కెమికల్ పీల్స్‌ను కూడా బ్లీచింగ్ ఏజెంట్స్‌గా వాడుతున్నారు. వీటిల్లో సింగిల్ పీల్, కాంబినేషన్ పీల్, కాక్‌టెయిల్ పీల్, సీక్వెన్షియల్ పీల్.. ఇలా రకరకాలున్నాయి. ఏ రకం పీల్ దేనికి ఉపయోగపడుతుంది? ఎంతసేపు ఉంచుకోవాలనేది వైద్యులు అనుభవం ద్వారా గుర్తించి, సూచిస్తారు.
* పీల్స్‌ను ఎక్కువగా వాడితే ఆ భాగం మరీ తెల్లగా (బొల్లి మచ్చల్లా) అయ్యే ప్రమాదం కూడా ఉంది. పైగా వీటితో కొన్నిసార్లు దురద, మంట (కాంటాక్ట్ డెర్మటైటిస్, కాంటాక్ట్ అలర్జిటిక్ డెర్మటైటిస్) వంటి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కొందరికి రాసినంత మేరా చర్మం చాలా సున్నితంగా కూడా తయారవ్వచ్చు.
* హెర్పిస్ సింప్లెక్స్, చర్మం మీద దళసరి కీలాయిడ్స్ వచ్చే స్వభావం ఉన్నవారు ఈ కెమికల్ పీల్స్‌ను వాడరాదు.
5. డెర్మాబ్రేజన్: ఇందులో ప్రత్యేక పరికరాలతో చర్మం మీది పైపొరలను గీరేసినట్టుగా తొలగిస్తారు (డెర్మాబ్రేజన్). ఇది మెలనోసైట్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. లేకపోతే రంగు మరింతగా ముదిరే ప్రమాదం ఉంది. ఇది మన భారతీయుల చర్మాలకు అంతగా ఉపయోపడదు.
6. లేజర్: వీటిల్లోనూ చాలా రకాలున్నాయి. ఎపిడెర్మల్ మెలాస్మాలోనే లేజర్లు బాగా ఉపయోగపడతాయి. డెర్మల్ మెలాస్మా, మిక్స్‌డ్ మెలాస్మాకు కష్టం. పైగా ఇవి భారతీయుల్లో తిరిగి రంగు ముదిరేలా (పిగ్మెంటేషన్) చేస్తాయి. తెల్ల చర్మం గల వారిలో మాత్రం జాగ్రత్తగా వాడితే ఫలితం ఉంటుంది. మంగు చికిత్సలో లేజర్లను ముందుగా వాడటం ప్రమాదం. ఇతరేతర చికిత్సలతో ఫలితం కనబడనప్పుడు, చివరి దశలోనే దీనిని ఉపయోగించాలి.
ఓర్పు ప్రధానం
మంగును సంపూర్ణంగా నయం చేసే పూర్తిస్థాయి చికిత్స ఏదీ ఇప్పటి వరకూ అందుబాటులో లేదు. కాకపోతే ఆ మచ్చల రంగు, తీవ్రత బాగా తగ్గిపోయేలా చేసే చికిత్సలు మాత్రం చాలా ఉన్నాయి. కొన్నిసార్లు తగ్గిపోయిన తర్వాత రెండేళ్లకో, మూడేళ్లకో మళ్లీ వచ్చే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఈ చికిత్స తీసుకునే వారికి ఓర్పు చాలా అవసరం.
* మెలాస్మా కేవలం 5 శాతం మందిలోనే పూర్తిగా తగ్గుతుంది. గర్భం వచ్చినపుడు వచ్చే మంగు మచ్చలు కొందరిలో కాన్పు తర్వాత వాటంతట అవే పోతాయి.
* చాలామందిలో మంగు మచ్చలు 50-60 శాతం వరకు తగ్గుతాయి. మచ్చలు పైకి పెద్దగా, ఎబ్బెట్టుగా కనబడకుండా చికిత్స చేయటం సాధ్యమే. దీంతో చాలామంది, చాలావరకూ సంతృప్తి పడతారు.
* ఈ చికిత్సలు వేటితోనూ సంతృప్తికర ఫలితం లేకపోతే కొన్నిసార్లు మచ్చలు చర్మం రంగులో కలిసిపోయినట్టు కన్పించేలా చేసే పైపూతలనూ వాడుకోవచ్చు.
జీవన శైలి
* టమోటా, క్యారెట్, దోసకాయ, ద్రాక్ష, రేగు, నేరేడు, దబ్బపండ్ల వంటివి ఎక్కువగా తినటం మంచిది. వీటిల్లోని లైకోపేన్, విటమిన్లు, పండ్ల ఆమ్లాలు మేలు చేస్తాయి. అలాగే ఆకుకూరలు, క్యారట్ వంటి ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగుపై జరిపిన అధ్యయనాల్లో- విటమిన్ సి, విటమిన్ ఈ, ఐసోఫ్లేవనాయిడ్లు, పండ్ల నుంచి తీసిన ఆమ్లాలతో కూడిన ఆహారాన్ని తినిపించి చూశారు. ఇది మంచి ఫలితాన్ని కనబర్చింది.
ఎండ సోకితే ఏమవుతుంది?
మన చర్మంలో 'మెలనోసైట్స్' అనే ప్రత్యేక కణాలుంటాయి. ఇవి 'మెలనిన్' అనే రంగు పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మన చర్మానికి ఆ రంగు వచ్చేది ఈ మెలనిన్ వల్లే! అయితే ఎండ సోకినపుడు, హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మెలనోసైట్స్.. మెలనిన్ రంగు పదార్ధాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమస్యకు మూలం.
మన చర్మంలో 'మెలనోసైట్స్' అనే ప్రత్యేక కణాలుంటాయి. ఇవి 'మెలనిన్' అనే రంగు పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. మన చర్మానికి ఆ రంగు వచ్చేది ఈ మెలనిన్ వల్లే! అయితే ఎండ సోకినపుడు, హార్మోన్ల ప్రభావం వల్ల ఈ మెలనోసైట్స్.. మెలనిన్ రంగు పదార్ధాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఇదే సమస్యకు మూలం.
పిగ్మెంటేషన్ , Pigmentation--Treatment
ఈమధ్యకాలంలో పిగ్మెంటేషన్ పెద్ద సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖంలో వచ్చే పిగ్మెంటేషన్ భయపెట్టి, బాధపెడుతోంది. ఒకవిధమైన ఆత్మ న్యూనతలో పడేస్తోంది.
పిగ్మెంటేషన్ వల్ల ముఖంలో రంగు మారి గ్లామర్ తగ్గుతుంది. దాంతో చాలామంది కుంచించుకుపోతారు. కాంప్లెక్స్ కు లోనవుతారు. నలుగురిలోకీ వెళ్ళడానికి భయపడుతుంటారు. ఆ సమస్య నుండి బయట పడేందుకు మార్కెట్లో దొరికే క్రీములు, సొల్యూషన్లు ప్రయోగిస్తూ ఉంటారు. ఒకవేళ తగ్గితే సరే, గొప్ప రిలీఫ్ పొందుతారు. తగ్గలేదో.. మళ్ళీ కొత్త టిప్స్, రెమెడీస్, మెడిసిన్స్ కోసం అన్వేషణ మొదలవుతుంది.
ఈ నేపథ్యంలో పిగ్మెంటేషన్ కు బ్రహ్మాండమైన దివ్య ఔషధం గురించి చెప్పుకుందాం. ఇందులో ఎలాంటి కెమికల్సూ లేవు. పూర్తిగా హెర్బల్. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. ఖర్చు పెట్టాల్సిందీ లేదు. కష్టపడాల్సిందీ లేదు. ఇంతకీ ఎలా చేయాలంటే - ఒక గుప్పెడు లేత వేపాకులో చిన్న పసుపుకొమ్ము, కుంకుడు గింజల్లోని పప్పులు పది తీసుకుని కొన్ని నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్టును రాత్రిపూట ముఖానికి రాసుకుని, ఉదయం కడిగేయాలి. ఇలా ఒక వారంపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ పేస్టు కళ్ళలోకి వెళ్ళకుండా చూడాలి. అయినప్పటికీ ముఖానికి రాసుకున్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు కారతాయి. అందుకు భయపడనవసరం లేదు.
0 Comments