కట్టుడు పళ్ళు ఎందుకు? అంటే, ముసలి వాళ్లు పడుచుగా కన్పించడానికని చెప్పడం సులభమైన సమాధానం. ఎంత వృద్ధాప్యంలో వున్నా కాస్త పడుచుగా కనపడదాం అనుకోవ డం మానవ సహజ లక్షణం. ఇక్కడ స్త్రీ/పురు షుల తేడా లేనేలేదు. అయితే, కట్టుడుపళ్ళు పెట్టుకొనేది కేవలం ముసలి వాళ్ళు మాత్రమే కాదుకదా! ¸°వ్వనంలో మిసమిసలాడు తున్న వాళ్ళు, వృద్ధాప్యానికి ముసుగు తొడగా లనుకొనే వృద్ధులు ఇలా ఎందరో కట్టుడు పళ్ళు వాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు కూడా. పైన చెప్పిన మాట ఒకనాటి మాట. ఈనాడు వీటికి అర్థాలు వేరు. అవసరాలు అనేకం.
మనదేశంలో కట్టుడు పళ్ళు పెట్టుకొంటే, వారు సాధారణంగా వృద్ధులయివుంటారు. ఎందుచేత నంటే ఇంకా కొద్దో గొప్పో మనం అంతా భారతీయ సంస్కృతికే కట్టుబడి వున్నాం, కనుక. పళ్ళు సరిగా తోముకొనకపోయినా కనీసం భోజనం అయిన తరువాత గాని, అల్పాహారం ముగించిన తరువాత గాని, చిరుతిండ్లు తిన్న తరువాత గాని నోరుపుక్కిలించే అలవాటు, కనీసం వేలితో పళ్ళు రుద్దుకొనే అలవాటు సంప్రదాయబద్ధంగా మిగిలిన ఉండడం వల్ల, వృద్ధాప్యంవరకు కాకపోయినా, నడివయస్సు వచ్చే వరకయినా దంతాలను కలిగి వుంటున్నారు. మన సమాజంలో చాలామంది. ఖరీదయిన టూత్ బ్రష్‌లు, పూటకొకరకం పేష్టులు వాడుకొనేవారు మన సమాజంలో తక్కువగానే ఉన్నా, ప్రకృతి సిద్ధమైన పను దోము పుల్లలతో పళ్ళు తోముకొనేవారు చాలామంది ఉన్నారు.
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల పరిస్థితి వేరుగా వుంది. యాంత్రిక జీవిత విధానాలలో, వాటితో సరి పుచ్చుకొనే అలవాట్లతో పళ్ళు తోముకోవడానికి వాళ్ళకి సరిపడి నంత సమయం చిక్కదు. దంత సంరక్షణ మీద వారికి సమయం కేటాయించే అవకాశ మే ఉండదు. వీరిది పూర్తిగా 'టిష్యూ పేపర్' కల్చర్. ఏమి తిన్నా పలుచని కాయితంతో నోరు తుడుచుకొని అవతల పారేయడం వీరి నాగరికత. అభివృద్ధికి చిహ్నం. అందుచేత నే, వీరిలో ఎవరు కట్టుడుపళ్ళు పెట్టుకొన్నారో, ఎవరికి సహజసిద్ధ మైన పలువరుస ఉందో గమనించడం కష్టం. అంటే ఎక్కువ శాతం మంది కట్టుడు పళ్ళు గలవారే అక్కడ ఉంటారన్నది నగ్న సత్యం. కారణాలు ఏమైనప్పటికి కట్టుడు పళ్ళు ఎందుకు? అన్న విషయం విపులంగా తెలుసుకొనవలసిన అవసరం ఇక్కడ వుంది.
పై దవుడలో పదహారు పళ్ళు కింద దవుడలో పదహారుపళ్ళు, ఉండడం వల్ల, ఒకదానికి ఒకటి పోటీగా ఆనుకొని, దవుడకీలు సరైన పద్ధతిలో నిలిచి వుండడానికి అవకాశం వుంది. ఇలా లేనప్పు డు విశ్రాంతి సమయంలో, ఈ కీళ్ళకు సరిపడ పోటీలేక, అవి క్రిందికి జారడం ఆపైన నొప్పి కలగడం జరుగుతుంది. ఇరువైపుల ఈ దవుడకీళ్ళు బాలెన్సును నిలపడానికి తప్పనిసరిగా కట్టుడు పళ్ళు అవసరం అవుతాయి. రెండవదిగా పళ్ళుపోయిన వారు, తమ మిగిలిన కాలం ఆరోగ్యంగా వుండి బ్రతికి బట్ట కట్టడానికి సరయిన ఆహారం తీసుకోవాలి కదా! తీసుకొన్న ఆహారం సరిగా నమలబడాలి గదా! సరిగ్గా నమలని ఆహారపదార్థాలు జీర్ణం కావు కదా! ఈ పరిస్థితులలో కట్టుడుపళ్ళు అవసరం కాదంటారా? ఈ పళ్ళు అసలు పళ్లు మాదిరిగా నూటికి నూరుపాళ్ళు తమ కార్య కలాపాలను సాగించలేక పోయినా తొంబయిశాతం పనికి న్యాయం చేకూరుస్తాయి.
తరువాత, మాట స్పష్టతకోసం, అందంగా కన్పించడం కోసం, పళ్ళు పెట్టించుకోవచ్చు. బోసి నోటికి, పళ్ళు పెట్టుకొన్ననోటికి ఎంతో తేడా కన్పిస్తుంది. ఎందరో సినిమా నటులు, నాటక రంగానికి చెంది న నటీ-నటులు, తాము వృద్ధులయి దంతాలను కోల్పోయినప్పటికి కట్టుడు పళ్ళను పెట్టుకొని, హీరోలుగా మన ముందు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే!
ఇక అసలు విషయానికొస్తే, శరీరంలో ఏ అంగం లోపించినా, దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ అంగాలను అమర్చే విధానాన్ని 'ప్రొస్థటిక్స్' అంటారు. దంత వైద్యపరంగా ఈ విధానాన్ని 'ప్రొస్థటిక్ డెంటిస్ట్రి' లేక 'డెంటల్ ప్రొస్థటిక్స్' అంటారు. వాడుక భాషలో ఈ పద్ధతినే పళ్ళు కట్టించుకోవడం అంటారు.
కృత్రిమ దంతాలను అమర్చే విధానం అనుకున్నంత సులభం కాకపోయినా, పెద్ద కష్టమయిన పనేమి కాదు. ఈ దంతాలకు మాత్రం సహజదంతాలకు తీసుకొనవలసిన జాగ్రత్తలకంటే ఎక్కువ జాగ్రత్తలనే పాటించవలసి వుంటుంది. పూర్వం స్ప్రింగు పద్ధతుల ద్వారా దంతాలనమర్చేపద్ధతి వాడుకలో వుండేది. మాజీ అమెరికా అధ్యక్షుడు స్వర్గీయ జార్జ్‌వాషింగ్టన్, ఇటువంటి స్ప్రింగు దంతాలనే వాడేవారట. కాని ఇలాంటి స్ప్రింగు దంతాలు నోరుకొంచెం ఎక్కువగా తెరిస్తే వూడి క్రిందపడేవట. దీనితోపాటు స్వర నిర్భంధం కూడా జరిగేదట.
తరువాత, తేనెపట్టు మైనం (వాక్స్) ఉపయోగించి, దంత నిర్మాణం కావలసిన ప్రాంతాన్ని అచ్చుతీసి, తద్వారా సరయిన కొలతలతో దంతాలను నిర్మించడం వెలుగులోనికి వచ్చింది. ఈ పద్ధతి వల్ల కూడా ఆకృతి మార్పిడి వంటి లోపాలు ఎదురుకావడంతో క్రమంగా ఈ విధానానికి కూడా స్వస్థి పలకవలసి వచ్చింది.
రోజురోజుకి క్రొత్త రేకులు తొడుగుతున్న నాగరికతతో పాటు, శాస్త్ర విజ్ఞానం కూడా అమితంగా విప్పారడంతో 'ప్లాస్టర్ ఆఫ్ పారీస్' వంటి పొడులతో, అవసరమయిన చక్కటి ఆకృతులను తీసుకొనే అవకాశం కలిగింది. దీనికి భిన్నరూపం 'ఇంప్రెషన్ కాంపౌండ్' ఇది మామూలు పరిస్థితులలో గట్టిగా వుంటుంది. దీనిని దవుడలో ఒకటి లేక ఎక్కువ పళ్లు లేనప్పుడు వాటి స్థానంలో కృత్రిమంగా అమర్చుకొనే దంతాలను పాక్షిక దంతాలు అంటారు. పాక్షికదంతాలను తిరిగి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవసరమయినప్పుడు తీసి-పెట్టుకొనే అవకాశం కలిగి వుండ దంతాలు మొదటి రకం. వీటిని 'రిమువబుల్ పార్షియల్ డెంచర్స్' అంటారు దీనికి భిన్నంగా, అతి సహజంగా మళ్ళీ తీయడానికి అనువుకాకుండా, స్థిరంగా వుండే దంతాలు రెండో రకం. వీటిని 'ఫిక్స్ పార్షియల్ డెంచర్స్' అంటారు. ఇవి సహజ దంతాలకు అతి చేరువగా వుంటాయి.
ఇదే విధంగా 'పుల్ డెంచర్స్'లో కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం 'రిమువబుల్ పుల్ డెంచర్స్', రెండవ రకం 'ఫిక్స్‌డ్ పుల్ డెంచర్స్' వీటినే 'ఇంప్లాంట్ -డెంచర్స్' అని కూడా అంటారు. దవుడ ఎముకలో శస్త్ర చికిత్స చేసి తద్వారా ఈ పళ్ళను అమరుస్తారు. ఈనాడు ఈ చికిత్సా విధానం అధిక ప్రాధాన్యతను సంతరించుకొని వుంది. అయితే ఇది సామాన్యుడికి అందుబాటులో లేనివైద్యం. పైగా, అందరి శరీరం, ఇటువంటి కట్టుడుపళ్ళు పెట్టించుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఇది సామాన్యులకు అందుబాటులోనికి వచ్చిననాడు, మరింత ప్రాచుర్యం పొందే అవకాశం వుంది.
ఇవి కాకుండా, పంటి ముక్కలపై తయారుచేసే పంటి తొడుగులు 'జాకెట్ క్రౌన్స్' అంగుటి భాగం కోల్పోయిన వారికి అమర్చే 'ఆబ్‌డ్యురేటర్లు' కృత్రిమ దంతాల సరసనే నిలుస్తాయి.
కృత్రిమ దంతాలను ధరించేవారు, దంతధావనం విషయంలో సహజ దంతాలపై తీసుకొనే శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి వుంటుంది. లేకుంటే నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంటుంది. సరిగా అమరని దంతాల విషయంలో దంతవైద్యుల దృష్టికి తీసుకువచ్చి, త్వరగా సరిచేయించుకోవాలి. విరిగిన కట్టుడు పళ్ళను, కదిలి వదులుగా ఉన్న కట్టుడు పళ్ళను ఎట్టి పరిస్థితిలోను వాడకూడదు.
ఒకరి దంతాలు మరొకరు వాడడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఒకరి దంతాలు మరొకరికి పట్టవు కూడా.
కట్టుడు పళ్ళను కట్టుడు పళ్ళగానే చూడాలి తప్ప, తమ గత సహజ దంతాలను దృష్టిలో ఉంచుకొని చూడకూడదు. తరువాత ఒకరికి ఉన్నమాదిరిగా, తమకు ఉండాలన్నది దురాశ అవుతుంది. ఎవరి దవుడ ఆధారంగా వారి దంతాలు తయారవుతాయన్నది గుర్తుంచుకోవాలి.
0 Comments