Full Style

>

బరువు.. కాస్త తగ్గినా క్యాన్సర్‌ దూరం - CANCER



వూబకాయం తెచ్చిపెట్టే అనర్థాలు ఎన్నెన్నో. దీంతో పలు రకాల సమస్యలు ముంచుకు రావొచ్చు. అయితే ఊబకాయులు ఏమాత్రం బరువు తగ్గినా మంచి ఫలితాలు కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగిడిన మహిళలు ఓ మోస్తరుగా బరువు తగ్గినా క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు బయటపడింది. వీళ్లు తమ శరీరబరువులో కనీసం 5 శాతం బరువు తగ్గినా సరే. రక్తంలో సి-రియాక్టివ్‌ ప్రోటీన్‌, ఇంటర్‌లుకైన్‌-6 వంటి వాపు సూచికలు గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. ఈ వాపు సూచికలు పెరిగితే గుండెజబ్బుతో పాటు రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఊబకాయ స్త్రీలు తక్కువ కేలరీ ఆహారం తీసుకోవటంతో పాటు వ్యాయామం ఎక్కువగా చేయటం ద్వారా బరువు తగ్గితే క్యాన్సర్‌ ముప్పూ తగ్గుతున్నట్టు ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అధ్యయనకర్త డాక్టర్‌ అన్నే మెక్‌టీర్నర్‌ చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా కొందరిని ఎంచుకొని తక్కువ కేలరీలు ఆహారం తీసుకోవాలని, రోజుకి 45 నిమిషాల సేపు (వారంలో ఐదు రోజులు) ఏరోబిక్‌ వ్యాయామాలు చేయాలని సూచించారు. వీలైతే రెండూ పాటించాలనీ చెప్పారు. ఏడాది తర్వాత తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 36 శాతం, ఇంటర్‌ల్యూకిన్‌ 26% తగ్గింది. కేలరీలు తగ్గించటంతో పాటు వ్యాయమమూ చేసినవారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 42 శాతం, ఇంటర్‌ల్యూకిన్‌ 24 శాతం తగ్గింది. కనీసం 5% బరువు తగ్గినవారిలో ఈ స్థాయులు గణనీయంగా పడిపోవటం గమనార్హం. మెనోపాజ్‌లోకి అడుగిడిన వారిలో సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 40% తగ్గితే రొమ్ము, ఎండోమెట్రియల్‌, తదితర క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. బరువు తగ్గటం వల్ల కొవ్వు కణాలు కుంచించుకుపోయి వాపు కారక హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. వాపు మూలంగా గుండెజబ్బులతో పాటు పలు సమస్యలూ ముంచుకొస్తాయి కూడా.

Post a Comment

0 Comments