Full Style

>

అధిక బరువు వాస్తవాలు అలవాట్లు ,అధిక బరువు, ఊబకాయం, ఒబెసిటి, స్థూలకాయం, Over weight and Diet habits



బరువు తగ్గితే ఆరోగ్యం


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. సుమారు 120 కోట్ల మంది అధిక బరువుతో.. 30 కోట్ల మంది వూబకాయంతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో 13 శాతం మంది, పిల్లలు యువకులే కావటం విశేషం. గత పదేళ్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో పట్టణాల్లో ఉన్నత, మధ్య తరగతి మహిళల్లో 30-50 శాతం మంది.. పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధిక బరువు, స్థూలకాయం వివిధ జబ్బులకు దారితీస్తుండటంతో వీటిని తగ్గించుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం కూడా ఒకటి. ముఖ్యంగా స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడుపుతుండటం.. పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం.. వ్యాయామం చేయకపోవటం.. శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు.. ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవనశైలి దోహదం చేస్తోంది.

మన సమాజంలో కేలరీలు అధికంగా ఉండే పిండి పదార్థాలు, వేపుళ్లు, నూనె, నెయ్యి, కొవ్వు పదార్థాల వాడకం ఒకప్పటికన్నా నేడు బాగా పెరిగిపోయింది. ఇలా ఎక్కువెక్కువగా తింటూ అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయకపోవటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగటానికి దారి తీస్తోంది. దీనికి దురలవాట్లు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది.

వ్యాధుల దాడి
స్థూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్‌, వూపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీల్లో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యల వంటివన్నీ చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావటంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదమూ ఉంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగి, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గుతుంది. ఇవి పక్షవాతానికి, గుండెజబ్బులకు దారితీస్తాయి. మనం కిలో బరువు పెరిగితే రోజుకి అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతో పని చేస్తూ గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

బరువెందుకు పెరుగుతారు?
ఏ వయసులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. చాలామంది మధ్యవయసులోనే ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొందరు చిన్నతనంతోనే అధిక బరువుతో ఉండొచ్చు.
*
కొందరు వంశపారంపర్యంగా అధిక బరువు సమస్య బారిన పడొచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ స్థూలకాయులైతే సుమారు 73 శాతం మంది పిల్లలకూ అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో 45 శాతం మంది దీని బారినపడొచ్చు.
*
స్త్రీలల్లో కొన్ని గ్రంథుల స్రావాలు అధిక బరువును తెచ్చిపెట్టొచ్చు. రజస్వల అయినపుడు, గర్భం ధరించినపుడు, ముట్లుడిగిన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. స్టిరాయిడ్లు, గర్భ నిరోధకమాత్రలు, ఇన్స్‌లిన్‌ వంటివి తీసుకోవటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసిక అలసట, అశాంతి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, స్వీట్లు ఎక్కువగా తినటం, వంటివన్నీ బరువు పెరగటానికి కారణమవుతున్నాయి.

మూడు రకాలు
ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును మూడు రకాలుగా విభజించారు.
1. సామాన్య బరువు
2. అధిక బరువు
3. వూబకాయం.
ఎత్తు బరువుల నిష్పత్తి (బాడీ మాస్‌ ఇండెక్స్‌-బీఎంఐ) ప్రకారం దీనిని గణించొచ్చు. బీఎంఐ 20-25 ఉంటే సాధారణ బరువుతో ఉన్నట్టు. 25-30 ఉంటే అధికబరువుగానూ 30-35 ఉంటే వూబకాయంగానూ పరిగణిస్తారు.

వ్యాధిగ్రస్థ వూబకాయం: బీఎంఐ 40కి పైగా ఉంటే వ్యాధిగ్రస్థ వూబకాయం (మార్బిడ్‌ ఒబేసిటీ)లోకి అడుగిడినట్టే. ఈ దశలో నడవటమే కష్టమవుతుంది. ఏమాత్రం వ్యాయామం చేయలేరు. కష్టపడి వ్యాయామం చేసేందుకు ప్రయత్నించినా, తిండి తగ్గించినా కూడా బరువు తగ్గటమన్నది మాత్రం దుర్లభంగా తయారవుతుంది.

తగ్గే మార్గాలు
వ్యాయామం:
సహజసిద్ధంగా బరువును తగ్గించుకోవటానికి వ్యాయామాన్ని మించింది లేదు. దీంతో శరీరాకృతిని కూడా తీర్చిదిద్దుకోవచ్చు. తలనొప్పి, నడుంనొప్పి, ఆందోళన వంటి సమస్యలూ తగ్గిపోతాయి. వయసు పైబడుతున్నా వ్యాయామాన్ని మానరాదు. వయసుకు తగ్గ వ్యాయామాలను ఎంచుకోవాలి.

ఆహారం:
వ్యాయామం చేయటంతో పాటు జీవన విధానాన్ని మార్చుకోవటమూ అవసరమే. ఇందులో ఆహార నియమాలు, మితం పాటించటం ముఖ్యమైనవి. ముఖ్యంగా కొవ్వులు, నూనె పదార్థాలను తగ్గించి సమతులాహారం తీసుకోవటంపై దృష్టి పెట్టాలి.

ధూమానికి దూరం:
అప్పుడుప్పుడు సిగరెట్లు, బీడీలు కాల్చితే అంతగా ముప్పు ఉండదని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. వీటిల్లోని నికోటిన్‌ గుండె, శ్వాసకోశం, ఇతర కండరాలకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఏమాత్రం పొగ తాగినా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. పొగ తాగటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ మోతాదు పడిపోయి రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ పొగ అలవాటుంటే వ్యాయామానికి అరగంట ముందూ తర్వాతా తాగకుండా ఉండటం మంచిది.

* ఆరోగ్యకరమైన జీవనశైలిని చిన్నప్పట్నుంచి పాటిస్తుంటే స్థూలకాయం ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

బేరియాట్రిక్‌ సర్జరీ
వూబకాయం ప్రమాదకర స్థాయికి (మార్బిడ్‌ ఒబేసిటీ) చేరినవారు బరువు తగ్గాలంటే ‘బేరియాట్రిక్‌ సర్జరీ’ సమర్థ మార్గం. ఆహారాన్ని తగ్గించి వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గనివారు, అధిక బరువు మూలంగా దైనందిన కార్యక్రమాలు చేయలేకపోతున్న వారికీ ఈ సర్జరీ మేలు చేస్తుంది. దీని ద్వారా తీసుకునే ఆహార పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో వివిధ రకాలున్నాయి. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణాశయం, పేగుల మొదటి భాగాల్లో జీర్ణమవుతుంది. అనంతరం చిన్నపేగుల గోడల ద్వారా పోషకాలు రక్తంలో కలుస్తాయి. మిగిలిన వ్యర్థాలు పెద్దపేగు ద్వారా బయటకు వెళ్తాయి. బేరియాట్రిక్‌ సర్జరీలో జీర్ణాశయంలో కొంతభాగాన్ని బాండ్‌తో బిగిస్తారు. దీనిని ‘గ్యాస్ట్రిక్‌ బ్యాండింగ్‌’ అంటారు. దీంతో జీర్ణాశయం సైజు తగ్గి ఆహారం తీసుకోవటం తగ్గిపోతుంది. ఇక చిన్నపేగుల బైపాస్‌ సర్జరీ ప్రక్రియలో పేగుల పొడవును తగ్గిస్తారు. దీని వల్ల ఆకలి తగ్గి క్రమంగా బరువు తగ్గుతారు.

* బేరియాట్రిక్‌ సర్జరీలో పొట్ట సైజును తగ్గించినంత మాత్రాన ఆకలి, తినాలనే కోరిక ఎలా తగ్గుతుందని చాలామంది అనుమానిస్తుంటారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో జీర్ణాశయానికి తగినట్టుగానే హార్మోన్ల ఉత్పత్తిలోనూ మార్పులు వస్తాయి. దీంతో ఎక్కువగా తినాలనే కోరిక కలగదు. వీటిని చేయించుకున్నవారిలో కొద్దిపాటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదురవ్వొచ్చు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ వీటిని నివారించుకోవచ్చు.

ఇదీ బీఎంఐ.. ఎత్తు-బరువుల నిష్పత్తి
* బరువును కేజీల్లో ఎంతుందో చూసుకోవాలి.
* అలాగే ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి.
* తర్వాత ఎత్తు సంఖ్యను తిరిగి అదే సంఖ్యతో గుణించి.. ఆ వచ్చిన సంఖ్యతో బరువును భాగించాలి.
* ఉదాహరణకు మీ బరువు 68 కేజీలు, ఎత్తు 1.6 మీటర్లు ఉందనుకోండి. అప్పుడు ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) 68/1.6X1.6 = 26 అవుతుంది.

నడుము చుట్టుకొలత
* స్త్రీలు 80 సెం.మీ. (31.6 అంగుళాలు), పురుషులు 90 సెం.మీ. (35.6 అంగుళాలు) మించి నడుం కొలత పెరగకుండా చూసుకోవాలి.
* బీఎంఐ తక్కువగా ఉండి, ఒక్క నడుము చుట్టుకొలత ఎక్కువున్నా వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని మరవరాదు.

(26 అక్టోబర్ – ప్రపంచ వూబకాయ నియంత్రణ దినం)--డా|| కె.ఎస్‌.లక్ష్మి--ఒబేసిటీ సర్జన్‌, గ్లోబల్‌ హాస్పిటల్‌--హైదరాబాద్‌

అధిక బరువు... అలవాట్ల వాస్తవాలివి ->...
రోజు వారి ఆహారంలో ఏం తినాలి.. ఏం తినకూడదు. కార్బోహైడ్రేట్లు మంచివా.. చెడ్డవా? పాలు, పాలపదార్థాల గురించి కొంతమంది మంచివంటే మరికొందరు బరువు పెంచుతాయంటారు... ఏది నిజం తెలుసుకోవాలంటే పోషకాహార నిపుణులు చెబుతున్న వాస్తవాలు తెలుసుకోవాల్సిందే!

అవాస్తవం: కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్‌ నిరోధించి.. బరువు పెంచుతాయి
వాస్తవం: బరువు పెరగడం అనేది ఫలానా పదార్థం వల్ల ఉంటుంది అని చెప్పలేం. అధిక కెలొరీలు స్వీకరించడం, అవి ఖర్చయ్యేలా వ్యాయామాలు చెయ్యకపోవడం వల్లే సాధారణంగా బరువు పెరుగుతారు. అలాగని బరువు పెరుగుతాం అన్న అభిప్రాయంతో కార్బోహైడ్రేట్లు తీసుకోకపోవడం మంచిది కాదు. దానివల్ల మన ఆహారంలో కాల్షియం, పీచు పదార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. దాంతో ఆరోగ్యాన్నందించే ఫైటోకెమికల్స్‌ తగ్గుతాయి. బదులుగా అన్ని పోషకాలు అందించడానికి సప్లిమెంట్లను తీసుకొంటున్నాం కదా అనొచ్చు. కానీ అవి పోషకాల అందించే శక్తికి ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు అంటారు పోషకాహార నిపుణులు. కార్బోహైడ్రేట్లను తగు మోతాదులో తీసుకోవడం తప్పనిసరి.

అవాస్తవం: సాయంత్రం ఏడింటికే భోజనం కానిచ్చేయాలి.
వాస్తవం: సాయంత్రం ఎప్పుడు తిన్నా నిద్రించడానికి మూడు గంటలు ముందుగా భోజనం చేయాలి. ఒకవేళ మీ పనివేళలు ఇందుకు సహకరించకపోతే నూనెలు అధికంగా ఉన్నవాటిని నియంత్రించుకోవాలి. అవి కూడా ఆలస్యంగా తినడం శ్రేయస్కరం కాదు. తిన్న వెంటనే నిదురించడం ఎంత మాత్రం మంచిది కాదు. బరువు ఎక్కువయ్యే అవకాశము చాలా ఎక్కువ . తిన్నది జీర్ణం అయిన తర్వాతే నిద్రకు ఉపక్రమించండి.

అవాస్తవం: పాలు, పాల ఉత్పత్తులు అధిక బరువుకు కారణం.
వాస్తవం: పాలు సంపూర్ణ పోషకాహారం. ఇందులో సుమారు 14 రకాల ప్రధాన పోషకాలుంటాయి. ముఖ్యంగా మాంసకృత్తులు.. కాల్షియం ఉంటాయి. 'పాల నుంచి అందే కాల్షియం వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి అందే కాల్షియం కంటే త్వరగా శరీరానికి అందుతుంది. దీనిలో లినోలిక్‌ ఆమ్లం... కొవ్వును కరిగించడానికి ఉపకరిస్తుంది. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

అవాస్తవం: ప్రొటీన్లను.. కార్బోహైడ్రేట్లను కలిపి స్వీకరించకూడదు. లేదా రెండు రకాల ప్రొటీన్లను ఒకేసారి తీసుకోకూడదు!
వాస్తవం: ఒకే రకమైన ఆహారాన్ని తినడానికి శరీరం సహకరించదు. దాంతో తక్కువ తింటాం. కానీ దీని వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందవు. అయితే దీని ఫలితాలు ఒక్కసారి కనిపించకపోయినా దీర్ఘకాలంలో అనేక వ్యాధులు వేధిస్తాయి. అందుకే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే పొట్టుతీయని గోధుమలతో చేసిన రొట్టెలు, చిక్కుడి జాతి గింజలు, పప్పులు, గింజలు, మాంసపు ఉత్పత్తులు తినాలి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బరువు తగ్గడానికి అన్ని తినాలి.. కానీ ఆ కెలొరీలను కరిగించడానికి తగిన వ్యాయామం కూడా అవసరమే అని గుర్తించుకోవాలి.


Post a Comment

0 Comments