Full Style

>

అధిక బరువు తెలివికి చేటు! - OVER WEIGHT

వూబకాయంతో వచ్చే రకరకాల చిక్కుల గురించి వింటూనే ఉన్నాం. గురక నుంచి గుండె జబ్బుల వరకూ దీనితో ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవే కాదు... ఊబకాయం వల్ల పిల్లల్లో విషయ గ్రహణ సామర్థ్యం కూడా దెబ్బతింటున్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా అధిక బరువు గల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో ఈ తేడా స్పష్టంగా కనబడుతున్నట్టు వీరు గమనించటం విశేషం. పిల్లల బరువు, నిద్ర సమస్యలు, తేలివి తేటలన్నీ ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధికబరువు గల పిల్లలు తగినంత నిద్రకు నోచుకోవటం లేదని.. ఇది తరగతిలో పాఠాలను నేర్చుకోవటంలో ఇబ్బందులకు కారణమవుతోందని తేలటం విశేషం. చికాగో ప్రికర్‌ స్కూల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కరెన్‌ స్ప్య్రూట్‌ ఇటీవల ఒక అధ్యయనం చేశారు. సగటున 8 సంవత్సరాల విద్యార్థులను ఎంచుకొని వారికి పాఠాలను నేర్చుకోవటం, జ్ఞాపకశక్తి, ప్రణాళికా రచన, సమస్యలను పరిష్కరించటం, ఏకాగ్రత వంటి తెలివి తేటలకు సంబంధించిన పరీక్షలు పెట్టారు. అలాగే రాత్రిపూట వాళ్లు నిద్రపోయే విధానాన్నీ పరీక్షించారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
* నిద్ర సరిగా పట్టని పిల్లలకు ఊబకాయం ముప్పు పెరగటమే కాదు తెలివి తేటల పరీక్షలో తక్కువ మార్కులు కూడా వచ్చాయి.
* వూబకాయ పిల్లల్లో నిద్ర సంబంధ శ్వాస సమస్యలు, విషయ గ్రహణ సామర్ధ్య లేమి వంటి ఇబ్బందులు పొంచి ఉంటున్నాయి.
* ఇక పాఠాలు నేర్చుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారిలో ఊబకాయం, నిద్ర సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చూస్తే- అధిక బరువు పిల్లల్లో నిద్ర సంబంధ శ్వాస సమస్యల వంటివాటిని నిర్లక్ష్యం చేయరాదని కరెన్‌ సూచిస్తున్నారు. తరగతిలో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న పిల్లల్లో తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన అంశాల్లో నిద్ర కూడా ఒకటని నిపుణుల అభిప్రాయం. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరముందని భావిస్తున్నారు.

వూబకాయంతో చిగుళ్ల సమస్య
వూబకాయులు తరచూ చిగుళ్ల సమస్యను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో అధిక కొవ్వు, స్థూలకాయం కారణంగా పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం ఇప్పటికే తెలిసిందే. వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, నిద్ర రుగ్మతలు, ఎముకల బలహీనత వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. స్థూలకాయులు బ్యాక్టీరియా బారిన ఎక్కువగా పడుతుంటారనీ, ఫలితంగా చిగుళ్ల వ్యాధులు వస్తాయని బోస్టన్‌ యూనివర్సిటీలో చేపట్టిన తాజా అధ్యయనంలో గుర్తించారు.ఇటీవల చేపట్టిన అధ్యయనంలో.. ఊబకాయుల నోటిలో జింజివైటిస్‌ సమస్య తీవ్రంగా ఉంటుందనీ, వారిలో దంతాల ఎముకలు బాగా దెబ్బతింటాయని, ఇన్‌ఫెక్షన్‌ కూడా ఎక్కువేనని వెల్లడైంది. ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే రసాయనాలు కూడా వూబకాయుల్లో తక్కువేనని గుర్తించారు.

Half an hour for health,ఆరోగ్యానికో అరగంట

సన్నగా నాజూగ్గా ఉన్నవారిని చూసి, తమ శరీరతత్వంతో పోల్చి చూసుకుని బాధపడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దానికి బదులు వారు పాటిస్తున్న ఆరోగ్య నియమాలను తెలుసుకుని ఆచరిస్తే మంచిది. భోజనం మానేస్తే బరువు తగ్గొచ్చు అనుకోవడం, బరువులెత్తే వ్యాయామాలు చేయడం వల్ల సన్నబడతాం అన్నది అపోహ మాత్రమే. తగినంత ఆహారం తీసుకున్నప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే ఎక్కువ కెలొరీలు ఉండే జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పోషకాలూ, పీచూ, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. నిర్ణీత సమయానికి భోంచేయడం, వేళకు పడుకోవడంతో పాటూ నడకా, పరుగూ, తోటపనీ వంటి వాటికి కొంత సమయం కేటాయించాలి. అది (సమయం)కనీసం అరగంట ఉంటే ఫలితం ఉంటుంది. మానసిక ఆందోళన కూడా అధిక బరువుకి కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత తీరిక లేకుండా ఉన్నా కనీసం కొంత సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకోండి. ఇది కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. బరువు తగ్గే దిశలో మీకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. 

Post a Comment

0 Comments