మూత్రంలో ఇన్‌ఫెక్షన్, Urinary Infection- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ను మనం అన్ని వయసుల వారిలో చూస్తుంటాం. మూత్రంలో చీము వచ్చినప్పుడు యురినరి ట్రాక్ ఇన్‌ఫెక్షన్ అని అంటారు. సరైన సమయంలో దీనికి చికిత్స చేయకుంటే ఇది మూత్రపిండాలకు సోకే అవకాశముంది. దీన్ని ఆక్యుట్ పైలొనెఫ్రైటిస్(acute pylonephritis) అంటారు.
లక్షణాలు : మూత్రంలో మంట. చలితో జ్వరం ముఖ్యమైన లక్షణం. మూత్రంలో మంట. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం. రక్తపోటు పడిపోతుంది. వాంతులవుతాయి. నడుం నొప్పిఉంటుంది.
అక్యుట్ యురినరిట్రాక్ ఇన్‌ఫెక్షన్ : మూత్రంలో మంటగా ఉండంతోపాటు చలి జ్వరంతో బాధపడతారు. ఎక్కువసార్లు మూత్రం పోయడం. దీనికి చికిత్స చేయకుంటే వాంతులవుతాయి. మిగతా అవయవాలకు పాకే అవకాశముంది. మూత్రపిండాల్లో చీము చేరి, క్రియాటిన్, యురిన్ పెరగడం జరుగుతుంది. బిపిపడిపోవడం, జరుగుతుంది. గుండెపై ప్రభావం చూపుతంది. దీన్నే క్రానిక్ యురినరి ఇన్‌ఫెక్షన్. అంటారు.
కారణాలు : యురినరి ఇన్‌ఫెక్షన్ కలగడానికి వివిధ కారణాలున్నాయి. మూత్రవిసర్జనలో అడ్డు ఉండడం. అంటే మూత్రపిండంలో రాళ్లు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌కు ప్రధాన కారణం నీళ్లు తక్కువగా తీసుకోవడం. నీళ్లు ఎక్కువ తాగినప్పుడు మూత్రం నిల్వఉండదు. దీంతో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశముండదు. తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి ఇన్‌ఫెక్షకు దారితీస్తుంది. క్రిములు పెరిగే అవకాశముంటుంది. కొత్తగా పెళ్లయిన వారిలో హనిమూన్ సిస్టిటిస్ అనే సమస్య కనిపిస్తుంది. ఇది కూడా ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. మగవారి కంటే ఆడవాళ్లలో మూత్రంలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువ. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రనాళం సైజు చిన్నగా ఉంటుంది. లోపల ఉండడం వల్ల క్రిములు చేరుతాయి. ఇవేకాక మూత్రనాళంలో అడ్డు ఉండడం, రాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువసార్లు వస్తుంది. చిన్న చిన్న రాళ్లు మూత్ర విసర్జనలో వెళ్లిపోతుంటాయి. మూత్ర వ్యవస్థలో అసాధారణ సమస్యలు ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. పిల్లల్లో పుట్టుకతోనే మూత్రనాళంలో అసాధారణ మార్పులు ఏర్పడుతుంటాయి. మెడుల్యరి స్పాంజ్ కిడ్నీ సమస్య కొంత మందిలో ఉంటుంది. ఇందులో రెండు కిడ్నీలు కింది భాగంలో అతుక్కుని ఉంటాయి. దీని వల్ల ఎక్కువ మూత్రం నిల్వ ఉండే అవకాశముంది. చిన్న పిల్లల్లో రిఫ్లక్స్ నెఫ్రోపతి సమస్య ఉంటుంది. మూత్రనాళం ద్వారా బయటికి వెళ్లే మూత్రం వెనక్కి వెళ్తుంది. మూత్రం నిల్వ ఉండి కిడ్నీ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశముంది. ఏడాదిలోపు వయసు ఉన్నప్పుడు చలితో జ్వరం వచ్చినప్పుడు మూత్రంలో ఇన్‌ఫెక్షన్, రిఫ్లక్స్ సమస్యను నిర్ధారించుకోవాలి. సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేస్తే కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. వృద్ధుల్లో మూత్రం ఇన్‌ఫెక్షన్‌కు కారణం పురుషుల్లోని పౌరుష గ్రంథి (ప్రొస్టేట్ గ్రంథి). ఇది మూత్రాశయం చుట్టూ ఉంటుంది. వయసుపెరిగే కొద్ది ఇది పెద్దగా మారుతుంది. దీన్ని బినైన్ ప్రొస్టేటిక్ హైపర్ ప్లాసియా అంటారు. 60 ఏళ్ల తర్వాత ఇది పెరగడం వల్ల మూత్రనాళం ఒత్తిడికి గురై సన్న బడుతుంది. సాధారణంగా మూత్రం ధారగా రావాలి. కానీ ఈ సమస్య వల్ల వృద్ధుల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం పోసిన పదినిమిషాల తర్వాత మళ్లీ పోయాల నుకుంటారు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇక మహిళల్లో... అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లరు. ఇలాంటప్పుడు మూత్రం నిల్వ ఉండి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశముంది. ఇక వీరిలో మూత్రనాళం సన్నగా, లోపలికి ఉండడం వల్ల సులభంగా క్రిములు వెళ్లి ఇన్‌ఫెక్షన్ వస్తుంది. మధుమేహం నియంత్రణ లేని వారి మూత్రంలో క్రిములు పెరుగుతాయి. వీరిలో ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ కోసం వాడే కండోమ్స్, స్పెర్మ్‌డల్‌ఫోమ్ వల్ల కూడా ఇన్‌ఫెక్షన్ వస్తుంది.
నిర్ధారణ పరీక్షలు : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు కంప్లీట్ యూరిన్ పరీక్ష చేయించాలి. దీని వల్ల మూత్రంలో చీము కణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. చీము కణాలు ఉంటే యూరిన్ కల్చర్ పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష వల్ల ఇన్‌ఫెక్షన్ ఎందుకొచ్చిందో తెలుస్తుంది. సీరం క్రియాటినిన్‌తో కిడ్నీ పనితీరును తెలుసుకోవచ్చు. తర్వాత మూత్రనాళంలో అడ్డు, రాళ్లు ఉన్నాయో, లేవో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. తర్వాత మూత్రం సాధారణంగా కిందికి వస్తుందా? లేదా పైకి వెళ్తుందా అనేది ఎంసియుజి పరీక్ష వల్ల తెలుసుకోవచ్చు. యురినరి ఇన్‌ఫెక్షన్ కిడ్నీకి పాకిందా లేదా అని తెలుసుకోవడానికి సిటి స్కాన్ చేస్తారు.
చికిత్స : 80 శాతం కేసుల్లో యురినరి ఇన్‌ఫెక్షన్ ఇ-కొలై అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌కు మొదట యాంటి బయాటిక్‌తో చికిత్స చేస్తారు. మూత్రంలోని ఇన్‌ఫెక్షన్ కిడ్నీలకు చేరుకుని దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. పనిచేయడం ఆగిపోతుంది. విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం, వాంతులు, మూత్రం రావడం కూడా ఆగిపోవచ్చు. వీరికి డయాలసిస్ కూడా అవసరం ఉండొచ్చు.
నివారణ : మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. మూత్రం ఎక్కువ నిల్వ ఉండకూడదు. ప్రతి రెండు గంటలకు విసర్జించాలి. రోజూ సుమారుగా 1.5 నుండి రెండు లీటర్ల మూత్రం విసర్జించాలి. అందుకని మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్కువగా మూత్రం ఆపుకోకూడదు. మూత్రం పసుపచ్చగా వస్తుంటే కామెర్లు అని అనకుంటాం. కానీ నీళ్లుతాగడం వల్ల తక్కువ తీసుకునే వారిలో ఇది కనిపిస్తుంది. నీళ్లు బాగాతీసుకుంటే ఈ రంగు రాదు. గర్భధారణ సమయంలో కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశముంది. గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు మూత్రనాళాలపై ఒత్తిడి వల్ల మూత్రం నిల్వ ఉండి ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్ అబర్షాన్‌కు దారితీసే అవకాశముంది. అందుకని ఎక్కువ నీళ్లు తీసుకోవాలి.
0 Comments