* శిశువుకు ఐదేళ్ళ వయసు వచ్చే వరకు జూన్, జనవరి నెలలలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి - విటమిన్ ఏ చుక్కలు ఇవ్వాలి.
* గర్భవతులు - ప్రారంభ దశలో - టీటి లేదా బూస్టర్ ఇన్జెక్షన్/ సూది ; 4 వారాల తరువాత టీ.టి 2
టీకాల ద్వారా నిరోధించగల అంటు వ్యాధులు
1. డిఫ్తీరియా : ఇంటిలో పిల్లలకి గొంతులో అంగుటమీద తెల్లటి పొర ఏర్పడి తీవ్ర జ్వరం, దుష్పలితాలు ఏర్పడతాయి. చాలా ప్రాణాపాయం.
2. పర్ ట్యూసిస్ : కోరింత దగ్గు ఇందులో పిల్లలు జ్వరం, విపరీతంగా తెరలు తెరలుగా దగ్గుతూ నీరసించి పోతారు. ప్రాణాపాయం ఎక్కువ.
3. టెటనసం – ధనుర్వాతం : దీని వలన జ్వరం, ఫిట్స్, విల్లులుగా వెనక్కి విరచుకుపోతారు. ప్రాణం పోవచ్చు.
4. పోలియో – పక్షవాతం : దీనిలో జ్వరంతో మొదలయి కొద్దిపాటి విరోచనాల తరువాత కాళ్ళు చేతులు పక్షవాతంకి గురి అవుతాయి.
5. బిసిజి : ఈ టీకావలన క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.
6. పొంగు : మీజిల్స్ టీకావలన పిల్లలకి ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చును.
7. హెపటైటిసం బి : కాలేయమునకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధించవచ్చును.
ఏ వయస్సులో ఏ టీకా ఇవ్వాలి?
వయస్సు ----------- మందు పేరు ----
పుట్టిన వెంటనే -------- బి.సి.జి. మరియు ఓరల్ పోలియో,
6 వారాలకు--------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో,
10 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
14 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
9 మాసాలకు-------------- మీజిల్స్,
16 – 24 నెలలు----------- డి.పి.టి., పోలియో, బూస్టర్ డోసుల
ప్రతి 5 సంవత్సరాలకు బూస్టర్ డోసు ఇవ్వాలి -- మీ ఫామిలీ డాక్టర్ ని సంప్రదించంది .
నిరోధక టీకాల కార్యక్రమం గత చరిత్ర :
ప్రధాన లక్ష్యాలు
*మూడు ప్రధాన లక్ష్యాలతో మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
1. 1990 నాటికి దేశంలోని ఏడాదిలోపు పిల్లల్లో 85 శాతం మందికి ఒక మోతాదు బిసిజి టీకా, మూడు మోతాదుల ఓరల్ పోలియో, మూడు మోతాదులు డిపిటి, ఒక మోతాదు తట్టు సూది అందించడం. 100 శాతం గర్భవతులు టెటనస్ టాక్సాయిడ్‌తో రక్షించడం.
2. 1990 నాటికి టీకాల గురించి 'డిమాండ్' కలిగించడం. అంటే ప్రజలలో టీకాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి, వారు ఆరోగ్య కార్యకర్తలను టీకాలు ఇవ్వమని అడిగే స్థితికి ఎదగడం. ' ప్రజారోగ్యంలో ప్రజల భాగస్వామ్యం' అనే గొప్ప ఆదర్శానికి ఈ లక్ష్యం ఆయువు పట్టు.
3. టీకాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి కావడం.
ఇరవై ఐదేళ్ల కిందట అంటే నవంబరు 19,1985 న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా నాటి ప్రభుత్వం మన పిల్లల రక్షణకు ఒక మహోజ్వల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే 'సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం'. ఈ నెల 19కి కార్యక్రమం రజతోత్సవం జరుపుకున్నాం.
చిన్న పిల్లల రక్షణలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఒక మైలురాయి. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎన్నో విన్నూత్నమైన అంశాలు ఇందులో ప్రవేశపెట్టారు. వ్యాక్సినులు పాడుగాకుండా రక్షించే శీతలీకరణ పద్ధతి, పరిశుభ్రమైన సూదుల వాడకం, వీటిని రక్షించడంలో అనేక కొత్త మెలకువలు, వ్యాక్సీనులతో నిరోధించే వ్యాధులపై నిఘా, విజయవంతంగా టీకాలు వేసేందుకు ప్రజల భాగస్వామ్యం...ఇలా ఎన్నో అంశాలు.
ఈ అంశాల గురించి కార్యక్రమం మొదలు పెట్టేముందు డాక్టర్లకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందినప్పుడు అందరికీ 'ఇంతవరకు మనం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం శాస్త్రీయంగా, పటిష్టంగా నిర్వహించలేదు' అనే భావన కలిగింది. దేశంలో అప్పటికే ప్రైవేటు వైద్యవ్యవస్థ బలంగా ఉంది. ప్రైవేటు వైద్యులు కూడా పిల్లలకు టీకాలు వేస్తారు. మాకు శిక్షణలో చెప్పిన చాలా అంశాలు ప్రైవేటు వైద్యులు పాటించరు. వ్యాక్సీను సీసా తెరిచిన తర్వాత వెంటనే టీకా మందును దగ్గర్లోని మెడికల్ షాపు వాళ్ల ఫ్రీజర్‌లో పెట్టేవాళ్లు. చాలా మంది మెడికల్ షాపు యజమానులు డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను తృప్తిపరిచేందుకు రిఫ్రిజిరేటర్ పెట్టేవాళ్లు. రాత్రిపూట రిఫ్రిజరేటర్ ఆపు చేసేవారు. 'ప్రైవేటు డాక్టర్లకు కూడా ఈ కార్యక్రమం గురించి శిక్షణ' ఇస్తే బాగుంటుందని మాకందరికీ అనిపించింది. మా శిక్షకులకు ఈ అభిప్రాయాన్ని తెలిపాం. ప్రైవేటు డాక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ సంతృప్తికరంగా నిర్వహించలేదు.
తొలి రోజుల్లో...
అప్పటికే నాలాగా ఆలోచించే వారందరూ 'ప్రాథమిక ఆరోగ్య రక్షణపై ఆల్మా-ఆటా ప్రకటన' నిషాలో ఉన్నాం. '2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం' - అదోక గొప్ప ఊహ. కార్యక్రమం గురించి అప్పటి ప్రభుత్వ దార్శనికత నన్నెంతో ఉత్తేజితున్ని చేసింది. 'నాదేశంలో పిల్లలందరికీ క్షయ, పోలియో, గొంతువాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు వ్యాధుల నుండి త్వరలో విముక్తి'. నాలో ఉత్సాహం కట్టలు తెంపుకొంది. కలల్లో కూడా ఇవే ఆలోచనలు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా, దశల వారీగా జిల్లాలను ఎంపిక చేసి అమలు చేసారు .
కార్యక్రమం మొదలు పెట్టేముందు వైద్యాధికారులందరికీ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు వైద్యకళాశాల ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ, ఆ మాడ్యుల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ స్లైడ్స్ ద్వారా ఎన్నో విషయాలు బోధించారు. వ్యాధి నిరోధక టీకాల గురించి లోతుగా అధ్యయనం చేయాలని ఆరోగ్య కేంద్రంలో పారామెడికల్ సిబ్బందికి కూడా తెలుగు మాడ్యుల్ సహాయంతో శిక్షణ ఇచ్చారు . నవంబర్ 19, 1985న ఆరోగ్య కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. నిజంగా అది మా అందరికీ పండుగ. 1989 వరకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రద్ధతో అన్ని గ్రామాలు తిగిరి పిల్లలకు టీకాలు వేశారు. . 1987 ప్రపంచ ఆరోగ్య సంస్థ- ప్రపంచ ఆరోగ్య దినం నినాదం 'ఇమ్యునైజేషన్ ఎ అచివ్ ఫర్ ఎవిరి చైల్డ్' - వ్యాధి నిరోధక టీకాలు ప్రతి బిడ్డకు ఒక అవకాశం. ఈ నినాదం మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రపంచ ఆరోగ్య దినం 1988 నినాదం 'ఆరోగ్యం అందరికీ- అందరూ ఆరోగ్య కోసం'. 1989 నినాదం ' మనం ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుకుందాం ' లాంటి అంశాలు మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సమసమాజం, ఆరోగ్యం సామాజికీకరణ చేయడం, ఆరోగ్యంలో సమానత్వం లాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. ఈ ఆలోచనల ప్రభావం సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలులో ఉండేది. దేశంలో జరుగుతున్న ' బిడ్డ నుండి బిడ్డకు', 'లిటిల్ డాక్టర్స్' కార్యక్రమాలు, మన రాష్ట్రంలో అమలువుతున్న 'తెలుగు బాలల సుఖీభవ పథకం', ప్రపంచ బాలల నిధి ప్రచురించిన 'ఫ్యాక్ట్స్ ఫర్ లైఫ్ - ప్రాణ రణక్ష సూత్రాలు', హెస్పేరియన్ ఫౌండేషన్ ప్రచురించిన 'వేర్ దేర్ ఇజ్ నో డాక్టర్- వైద్యుడి లేని చోటు' లాంటి ఎన్నో అంశాలు ప్రజారోగ్యం పట్ల మాకు స్ఫూర్తినిచ్చాయి. పరోక్షంగా సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి దోహదపడ్డాయి.
వైద్యకళాశాలల పాత్ర
ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు వైద్య కళాశాలల పాత్ర ప్రముఖంగా ఉండేది. అక్కడ పనిచేసే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఎస్‌పిఎం) ప్రొఫెసర్లు వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఉండేది. వైద్యకళాశాల ఉండే పట్టణానికి కార్యక్రమం అమలు బాధ్యత వైద్యకళాశాలలదే. ఇందులోని ఎస్‌పిఎం ప్రొఫెసరు ఈ కార్యక్రమానికి ఆ పట్టణానికి నోడల్ ఆఫీసరు. దీని అమలులో వైద్య విద్యార్థులు ప్రొఫెసర్ నాయకత్వంలో పాల్గొనేవారు. ఒక ప్రజారోగ్య కార్యక్రమానికి వైద్య విద్యార్థి దశలోనే పాల్గొనే ఒక గొప్ప ఆదర్శానికి నాంది పలికారు. వైద్య విద్యార్థులను సమాజం పట్ల వారి బాధ్యతలను పెంచే ఒక గొప్ప ప్రక్రియ ఇది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పూర్తిగా గండికొట్టారు. ఇటీవల వచ్చే చాలా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయడం లేదు. అందువల్లే వైద్యకళాశాలల నుండి వచ్చిన కొత్త డాక్టర్లకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజల ఆరోగ్య ప్రాధాన్యాల గురించి ఎలాంటి అవగాహన లేదు. వీరు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ కార్యక్రమాల అమలులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
నేషనల్ టెక్నాలజీ మిషన్
మన దేశంలో ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలైన మంచినీరు, నూనె గింజలు, పాల ఉత్పత్తి, అక్షరాసత్య, టెలికమ్యూనికేషన్స్, వ్యాధినిరోధక టీకాలపై 1986లో ఆరు నేషనల్ టెక్నాలజీ మిషన్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ టెక్నాలజీ మిషన్స్‌లో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఒక భాగం కావడం వల్ల సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి మరింత ఊపునిచ్చింది.
పట్టణ సమస్యలు
మన దేశంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగా ఇంటి దగ్గరే ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థీకృత ఆరోగ్య వ్యవస్థ పట్టణాలలో లేదు. కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి పట్టణాలలో అందరికీ టీకాలు అందించడం చాలా కష్టతరమైన సమస్యగా తయారైంది.1985 నుంచి 89 జిల్లా యాంత్రాంగానికి పట్టణాలలో టీకాల సమస్య అధిగమించడానికి ఒక ఆలోచన వచ్చింది. నెలకు 3 రోజులు పట్టణానికి చుట్టూ ఉండే గ్రామీణ ప్రాంత ఆరోగ్య కార్యకర్తల సహకారం తీసుకుని అమలు చేసే పద్ధతి. ఆ కార్యక్రమం కింద 24 బాలవాడీలు ఉండేది. పట్టణంలోని మౌలిక సేవల్లో పనిచేసే సిబ్బంది, పట్టణంలోని ఆసుపత్రి, ఆరోగ్య సిబ్బంది, చుట్టూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్తల సహకారంతో 8 టీములు తయారు చేశారు . నెలలో 3 రోజులు, రోజూ 8 చోట్లా - బాలవాడీ కేంద్రాలలో టీకాల కార్యక్రమం నిర్వహించేవారు . ఆ నాటి జిల్లా కలెక్టర్‌కు ఈ బాలవాడి కేంద్రాలలో పిల్లలకు వైద్య పరీక్షలు చేయలనేది ఒక కోర్కె. ఇలా టీకాల కార్యక్రమం నిర్వహిస్తూనే, బాలవాడీలలో పిల్లకు వైద్య పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చేవారు . ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారి ప్రసంశలు జీవితంలో మరచిపోలేనివి. టీకాల కార్యక్రమం అమలు చేయడంలో పట్టణాలు ఎదుర్కొంటున్న సమస్యను ఈ పాఠాలు ఒక చక్కటి పరిష్కారం.
0 Comments