Full Style

>

ఆహారంలో.. ఐరన్ ప్రాముఖ్యత


శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్‌ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్‌ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా అది రక్తహీనతకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇనుము లోపం. ఎందుకంటే ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం, విటమిన్‌ బి12 వంటి పోషకాలు కావాలి.
ఇవి లోపిస్తే రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య తలెత్తకుండా వుండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. శరీరానికి అవసరమైన ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.

ఐరన్‌ ఎక్కువగా దొరికే పదార్ధాలు:
చేపలు, కోడిగుడ్లు, కాలేయం, బీట్‌రూట్లు, పండ్లు, ములక్కాడల్లో ఇనుము అధికంగా వుంటుంది. వీటిని తరుచుగా తీసుకోవాలి. 
విటమిన్‌-సి ఉన్న ఆహారం తరచుగా తీసుకుంటుండాలి. సి-విటమిన్‌ ఇనుము శోషణ రేటును పెంచుతుంది. జామపండ్ల వంటివి తీసుకుంటే ఆహారంలోని ఇనుమును శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. 
అన్నం లేదా ఏదైనా తిన్న తరువాత టీ, కాఫీ వంటివి తీసుకుంటే అవి మనం తిన్న ఆహారంలోని ఇనుమును శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయి. కాబట్టి కనీసం రెండు గంటల సమయం తరువాత టీ, కాఫీలు తీసుకోవాలి. 
చిరుధాన్యాల్లో ఐరన్‌తో పాటు సూక్ష్మ పోషకాలన్నీ తగు మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా సజ్జలు, రాగుల్లో ఇనుము అధిక మోతాదులో ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవాలి.
ఆకు కూరలు
అన్నం, పప్పు, ఆకుకూరలను బాగా ఉడికించి, మెత్తగా, మృదువుగా తయారు చేసి తినాలి. మసాలాలు, కారం ఎక్కువగా ఉండకూడదు.
సజ్జల వంటి చిరుధాన్యాలను మొదట రోస్ట్‌ చేసి, పొడిగా తయారుచేసి, మెత్తని పేస్టు రూపంలో తీసుకుంటే సులువుగా జీర్ణం అవుతాయి. 
చిన్న పిల్లల్లో ఇది నివారించాలంటే శిశువుకు ఆరు నెలల వయసు వచ్చే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆరునెలల నుంచి తల్లి పాలతో పాటు ఇంట్లోనే తయారు చేసిన కాంప్లిమెంటరీ ఫుడ్‌ ఇవ్వాలి. ఒక్కోక్కటి మెల్ల మెల్లగా అలవాటు చేయాలి. 
అన్నం, పప్పు, కూరగాయలు మఖ్యంగా ఆకుకూరలు, కొత్తిమీర, టమాటా, క్యారెట్లు ఎక్కువగా తీసుకుంటే ఇనుము లోపం తలెత్తే అవకాశమే ఉండదు.
సాధారణంగా బయట దొరికే కాంప్లిమెంటరీ ఆహారంలో ఇనుము తగినంత ఉండదు. వాటిని తీసుకోకపోవడమే మంచిది. 
కాల్షియం ఇనుము కలపొద్దు
ఇనుము అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను ఎదుర్కోవచ్చు. టాబ్లెట్ల రూపంలో ఐరన్‌ సప్లిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మలేరియా వంటి ఇన్ఫెక్షన్లు ఉంటే అవి పూర్తిగా తగ్గిన తరువాతే ఈ మందులను వాడాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్లు మరింత బలోపేతం అవుతాయి.
కాల్షియం, ఇనుము సప్లిమెంట్లను కలిపి తీసుకోకూడదు. రెండింటికి మధ్య కనీసం రెండుగంటల వ్యవధి ఉండాలి. 
ఇవి రెండూ ఒక దానితో ఒకటి చర్య జరిపి ఏవీ పనికి రాకుండా పోతాయి. 
అయితే చికిత్స గురించి ఆలోచించే కన్నా సమస్య మొదలవకుండా ఎప్పుడూ తగినంత ఇనుము ఉండే పోషకాహారం తీసుకోవడం మేలు.
ఉప్పులో ఇనుము
పేద, ధనిక తేడా లేకుండా అందరూ వాడే వస్తువు ఉప్పు. అందుకే ఉప్పును ఎంచుకున్నారు. 
అయోడైజ్‌ ఉప్పు మాదిరిగా ఉప్పులో ఇనుము కూడా కలుపుతున్నారు. దీనిలో ఇనుము అయోడిన్‌ సమాన పరిమాణంలో ఉంటాయి. 
అయితే రెండేళ్ళ కన్నా తక్కువ వయసు పిల్లలకు ఇది ఉపయోగకరం కాదు. 
భవిష్యత్తులో మనం రోజూ తినే అన్నం ద్వారా కూడా ఇనుము పొందగలిగే రోజు రానుంది. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా ఇనుము శాతాన్ని పెంచి, ఫైటేట్స్‌ పరిమాణాన్ని తగ్గించి జన్యుపరివర్తిత బియ్యాన్ని తయారు చేస్తున్నారు.
జాతీయ పోషకాహార సంస్థ నేషనల్‌ అనీమీయా కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఇనుము, ఫోలిక్‌ ఆమ్లం సప్లిమెంట్లను సరఫరా చేయాలని సంకల్పించింది. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వారానికి ఒక ట్యాబ్లెట్‌ చొప్పున చిన్నారులకు అందివ్వగలిగితే చాలా వరకు ఇనుము లోపాలను అధిగమించవచ్చు. ఒక్కో ఐరన్‌ ట్యాబ్లెట్‌లో వంద మిల్లీగ్రాముల ఐరన్‌, 0.5 మిల్లీగ్రాముల ఫోలిక్‌ ఆమ్లం ఉంటాయి.

Post a Comment

0 Comments