Full Style

>

కిడ్నీలో రాళ్లు గుర్తించేదెలా?

మూత్రపిండాలలో రాళ్ల సమస్య అనేది ఈ మధ్య తరచు వింటున్న మాట. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడితే చాలామంది తమ కిడ్నీల పని ఇక అయిపోయిందని భయపడుతుంటారు. ఈ వ్యాధిని గుర్తించడం, వైద్యులను సకాలంలో సంప్రదించడం వంటివి చేస్తే ఈ సమస్యనుంచి సులభంగా బయటపడవచ్చు. ముందుగా వ్యాధిని ఎలా గుర్తించాలి...వైద్యులను సంప్రదిస్తే వారు చేపట్టే పరీక్షలేమిటో తెలుసుకుందాం..


- మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండడం, నడుము వద్ద విపరీతమైన నొప్పి తరచు రావడం, నొప్పి తట్టుకోలేక వాంతులు కావడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి.

- నడుము వద్ద నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్‌లను, లేదా ఇంజెక్షన్‌లను ఆశ్రయిస్తుంటారు. తాత్కాలికంగా నొప్పి తగ్గినా మళ్లీ కొన్ని గంటల్లోనే అది మొదలు కావచ్చు.

- యూరాలజిస్టును లేదా నెఫ్రాలజిస్టును సంప్రదించడం వల్ల వ్యాధి నిర్ధారణకు మార్గం సులభమవుతుంది.

- కిడ్నీలో రాళ్లు ఉన్నదీ లేనిదీ నిర్ధారించడానికి ముందుగా రక్త పరీక్షలు చేస్తారు. రక్తంలో కాల్షియం, యూరిక్ యాసిడ్ పరిమాణం ఎంత ఉన్నదీ రక్త పరీక్షల ద్వారా తెలుస్తుంది.

- మూత్రానికి సంబంధించి యూరిన్ అనాలిసిస్, యూరిన్ కల్చర్ టెస్టులను చేయడం జరుగుతుంది. మూత్ర విసర్జన ఎంత పరిమాణంలో జరుగుతోంది, కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ తదితర ఖనిజాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో తెలుసుకునేందుకు 24 గంటల మూత్ర సేకరణ పరీక్ష జరుపుతారు. మూత్రాన్ని ఇంట్లోని ఉండి సేకరించవచ్చు.

- కిడ్నీలో రాళ్లను నిర్ధారించడానికి పొట్ట భాగంలో ఎక్సరేలు తీయడం జరుగుతుంది. అయితే దీంట్లో సూక్ష్మరూపంలో ఉండే రాళ్లు కనిపించే అవకాశం ఉండదు. అందువల్ల హైస్పీడ్ కంప్యూరైజ్డ్ టోమోగ్రఫీ(సిటి) స్కాన్‌తో మెరుగైన ఫలితం ఉంటుంది. అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా కూడా కిడ్నీలోని రాళ్లను గుర్తించవచ్చు. చేతిలోని నరాలకు ఒక ప్రత్యేక ద్రావకాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళాల ద్వారా ఆ ద్రావకం కిడ్నీలకు, మూత్ర కోశానికి ఎలా పయనిస్తున్నదీ ఎక్సరేల ద్వారా తెలుసుకునే ఇంట్రావీనస్ పైలోగ్రఫీ(ఐవిపి) పరీక్ష కూడా కిడ్నీలో రాళ్ల నిర్ధారణకు అత్యంత కీలకమైనది.

కిడ్నీలో రాళ్ల నిర్ధారణ తర్వాత వాటిని ఎలా తొలగించేది అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు నిర్ణయించడం జరుగుతుంది.

Post a Comment

0 Comments