పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.
పులిపిరులను చికిత్స చేయడానికి మామూలుగా లేఖనం (స్క్రేపింగ్), దహనం (బర్నింగ్), ఛేదనం (కటింగ్), ఫ్రీజింగ్ మొదలైన చికిత్సా పద్ధతులను వాడుతుంటారు. ఐతే ఈ పద్ధతులు పులిపిరుల పునరావృతాన్ని నిరోధించలేవు. పైగా ఈ చికిత్సా పద్ధతులవలన ఏర్పడిన మచ్చలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే వీటి చికిత్స కంటే శాశ్వతనివారణ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పులిపిరులకు సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్సలను, నివారణ పద్ధతులనూ సంక్షిప్తంగా తెలుసుకుందాం.
పులిపిరులను ఆయుర్వేదంలో ‘చర్మకీల’ అంటారు. వీటికి సంబంధించిన వివరణలు ఆయుర్వేద సంహితా గ్రంథాల్లో క్షుద్రవ్యాధులు వివరించే అధ్యాయాల్లో లభిస్తాయి. క్షుద్రవ్యాధులు అంటే అల్పమైన లక్షణాలు, పురోగతి, తీవ్రతలు కలిగిన వ్యాధులని అర్ధం. పులిపిరులు చాలావరకూ ‘స్వయం అంతాలు’గా ఉంటాయి. అంటే చాలామటుకు ఏ చికిత్సా తీసుకోకపోయినప్పటికీ వాటంతట అవే సమసిపోతాయన్నమాట. అయితే కొంతమందిలో మాత్రం వాటంతట అవి తగ్గవు. పైగా పులిపిరులు నిరంతరమూ సాంక్రామిక లక్షణాలు కలిగిన వైరస్‌లను విడుదల చేస్తుండటం వలన వీటి సంఖ్య, పరిమాణాలు పెరిగే అవకాశముంది. ఇలాంటి సందర్భాలలో చికిత్స తీసుకోవాలి. పులిపిర్లను కలిగించే వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలను కలిగించటానికి 1-8 నెలలు పట్టవచ్చు.
పులిపిర్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కామన్ వార్ట్స్ (చేతివేళ్ళ చుట్టూ వస్తాయి), ప్లాంటార్ వార్ట్స్ (పాదాల మీద వస్తాయి), ఫ్లాట్ వార్ట్స్ (ముఖంమీద, మెడమీద వస్తాయి), జననాంగాలమీద వచ్చేవి జనైటల్ వార్ట్స్. అవి వేరే కోవకు చెందుతాయి.
సూచనలు
చర్మం తేమగా ఉంటే పులిపిర్లను కలిగించే వైరస్‌లు పెరగటానికి, జీవించి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మాన్ని, ముఖ్యంగా పాదాలను, చేతులను, మెడను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. చెమటతో తడిసిన సాక్సులను, దస్తీలను ప్రతిరోజూ మార్చి వాడాలి. వాడబోయే ముందు వీటిని తడి ఆరిపోయేలా ఎండలో బాగా ఆరబెట్టాలి.
పులిపిరులను కలిగించే వైరస్‌లు గాయమైన చర్మం నుంచి శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి కనుక గాయాలూ, దెబ్బలూ కాకుండా చూసుకోవాలి. కరచాలనం వంటి అలవాట్లు మానుకోవాలి. పులిపిరులు ఏర్పడిన చర్మాన్ని పదేపదే స్పర్శించకూడదు.
పులిపిరులను కలిగించే వైరస్‌లు గాయమైన చర్మం నుంచి శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి కనుక గాయాలూ, దెబ్బలూ కాకుండా చూసుకోవాలి. కరచాలనం వంటి అలవాట్లు మానుకోవాలి. పులిపిరులు ఏర్పడిన చర్మాన్ని పదేపదే స్పర్శించకూడదు.
పులిపిరి వచ్చిన చోట వాటర్ ఫ్రూఫ్ స్టిక్కింగ్ టేప్‌ని రెండు మూడు పొరలుగా అతికించాలి. ఆరున్నర రోజులు అలాగే ఉంచి టేప్ తొలగించాలి. 12 గంటలపాటు గాలిని తగలనిచ్చి మళ్లీ ఆరున్నర రోజులపాటు టేప్‌ని అతికించాలి. దీంతో వార్ట్స్ శుష్కించిపోయి ఊడి వచ్చేస్తాయి. టేప్ కారణంగా గాలిచొరబడని వాతావరణం ఏర్పడటంవల్ల వైరస్ నశిస్తుంది.
గృహ చికిత్సలు
వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి.
ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది.
పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి.
కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.
రావిపట్టను కాల్చి మసిచేసి సమంగా కొత్త సున్నం, వెన్న కలిపి పైకి పూయాలి. లేదా కొత్త సున్నాన్ని తమలపాకు రసంతో సహా కలిపి నూరి పులిపిరులపైన పూయాలి.
పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేపనూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్లమీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
పులిపిరులు మొండిగా తయారై ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య సలహా మేరకు కాశీసాది తైలాన్ని పైపూతకు, వాతారి గుగ్గులు అనే మందులను లోపలకూ నిర్ణీత కాలంపాటు వాడాలి.
0 Comments