Full Style

>

పిల్లలు ఎందుకు ఏడుస్తారు?


చిన్నారులు తొలి రోజుల్లో తమ అనుభవాలను మాటలతో చెప్పలేరు. వారికి బాధ కలిగితే, కోపమొస్తే ఏడుపు ద్వారా తెలుపుతారు. బాగా మాటలు వచ్చేవరకు ఏడుపే చిన్నారుల భాష. ఏడుపు చిన్నారులకు ప్రకృతి ప్రసాదించిన వరం. మనలో చాలా మంది పిల్లలు ఏడిస్తే చాలు వారికి కడుపు నొప్పి వచ్చిందని అనుకుంటాం. ఎడాపెడ ఏదో ఒక మందు పోస్తాం. ఇది చాలా ప్రమాదకరమైన పని. చాలా సందర్భాల్లో ఏడుపుకు కడుపునొప్పి కారణం కాదు. ఏడుపు అలా ఉంచితే, మందులతో ఎన్నో ప్రమాదాలు జరగొచ్చు.
మరో ముఖ్యమైన విషయం 90 శాతం సందర్భాల్లో పిల్లలు ఏడుపుకు కారణం రోగాలు కాదు. కాబట్టి మందులు వాడనవసరం లేదు.ఏడుపే వారి భాష కాబట్టి ఏడుపు ద్వారా వాళ్ల అవసరాలు తెలుపుతారు. మనం జాగ్రత్తగా గమనిస్తే, ఏడుపుకు కారణం ఇట్టే కనిపెట్టవచ్చు. ఏడుపు మాన్పించొచ్చు. సాధారణంగా చాలా మంది పిల్లలు ఆకలయితే ఏడుస్తారు తల్లిపాలు తాగే పిల్లలకు తల్లిపాలు పట్టాలి. పాలు చాలక ఏడుస్తున్నాడని తొందరపడి పోతపాలకు పోకండి. చిన్నారి రోజుకు ఆరుసార్లుపైన మూత్ర విసర్జన చేస్తుంటే తల్లిపాలు సరిపోయినట్లే !

  • అదనపు ఆహారం ఇచ్చే పిల్లలకు, ఆహారం పెట్టి చూడండి. ఆకలి తీరితే ఏడుపు మానతారు.
  • కొందరు లావుగా ఉండే పిల్లలు దప్పికతో ఏడుస్తారు. వారికి నీరు తాపించి చూడండి. దప్పికి తీరితే ఏడుపు మానేస్తారు.
  • పక్క తడిపితే పిల్లలు ఏడుస్తారు. వెంటనే ఒళ్తు తుడిచి, పొడి బట్టలు వేయాలి.
  • వేసవిలో బిగుతుగా బట్టలు వేసినా, చలి కాలంలో బట్టలు వదులుగా వేసినా - అసలే వేయకున్నా చిన్నారులు ఏడుస్తారు.
  • కొందరు చిన్నారులు ఎక్కువ వెలుగును భరించలేక ఏడుస్తారు. మరి కొందరు ఎక్కువ చీకటిని భరించలేక ఏడుస్తారు.
  • కొందరు చిన్నారులకు ఎక్కువ శబ్దాలు అంటే సరిపోదు. ఇంటి పరిసరాలలో, ఇంట్లో శబ్దాన్ని బాగా తగ్గించండి. వీరికి ఎక్కువగా కొత్తవారు ఇంటిలో తిరిగితే చికాకు. చెప్పలేరు కాబట్టి ఏడుస్తారు. సున్నితమైన సంగీతంతో వీరు ఏడుపు మానవచ్చు.
  • కొందరు పిల్లలు అలసిపోతే ఏడుస్తారు.
  • కొందరు పిల్లలు కొంచెం సేపు ఏడ్చి కాని నిద్రపోరు. ఒంటరిగా వదిలేస్తే తోడుకోసం చిన్నారులు ఏడుస్తారు.
  • తల్లిదండ్రులలో మానసిక ఒత్తిడి ఉంటే కూడ పిల్లలు ఏడుస్తారు.
  • కొందరు సంపన్నుల కుటుంబాలలో పిల్లలు - త్వరగా 'లావు' కావాలని అనవ సరంగా ఎక్కువగా డబ్బాపాలు, అదనపు ఆహారం పెడతారు. ఆ పిల్లలు అదనపు ఆహారం తినే శక్తిలేక ఏడుస్తారు.
  • అతి గారాబం కూడా చిన్నారులలో ఏడుపుకు కారణమే ! ఎప్పుడూ ఎవరో ఒకరు ఎత్తుకోవడం, హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తుంటే ఏడుస్తారు.
  • ఈ మధ్యకాలంలో పిల్లలపై జరిగే హింస కూడా వారి ఏడుపుకు కారణం.
  • జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తారు. పలుచని గుడ్డ ఒత్తిలాగ చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. ముఖానికి కాస్త ఆవిరిని జాత్త్రగా పట్టాలి.
  • ఛాతిపై తరచుగా తట్టండి. ఆట్టే ఏడుపు మానతారు.
  • ఏడిచే చిన్నారులకు పై కారణాలలో ఏది సరిపోతుందో వెతకండి. పైన సూచించిన చర్యలు చేపట్టండి.
పై చర్యలతో ఏడుపు మానకుంటే ఒక సారి వేడి నీళ్లతో స్నానం చేయించండి. కొందరు ఏడుపు మానేస్తారు.

ఏమి చేసినా కొందరు పిల్లలు ఏడుపు మానరు. అలాంటి పిల్లలు మూడు నెలల వయసు వచ్చేవరకు అంతే ! ఏడుస్తూనే ఉంటారు. వీరంతా కొంత కాలం ఈ ప్రపంచపు వాతావరణానికి వెంటనే సర్దుకుపోలేని వాళ్లు. ఏడ్వనివ్వండి. మీ ఓపికకు వాళ్ల ఏడుపు ఒక పరీక్ష. మీరు చిన్నారి ఏడుపుకు స్పందించకుండా మాత్రం ఉండవద్దు. మీరు స్పందించకపోతే, చిన్నారులు తమ భావాలు ఎలా తెల్పాలో వారికి తెలియదు. తమ బాధలు పెద్దలకు అంగీకారం కాదేమో అని బాధలను నెమ్మదిగా అణచి వేసుకుంటూ ఉంటారు. వాళ్లు పెద్దవాళ్లయిన తర్వాత కూడా అలాగే ఉంటారు.
ఎందుకైనా మంచిది ఒక సారి డాక్టరుకు చూపించండి. ఏదైనా జబ్బుకు సంబంధించిన ఏడుపేమో కనుక్కోండి.
ఈ అంశాలు మీ కుటుంబ సభ్యులతో, మీ సహచరులతో, మీ స్నేహితులతో పంచుకోండి. రండి ! మనం చిన్నారులకొక మంచి సమాజాన్ని నిర్మిద్దాం !! మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !!!

Post a Comment

0 Comments