దంతాలు బలంగా ఉండాలంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలి. చిగురు దెబ్బతింటే దంతం నిలబడదు. చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకితే అందులోని హానికారక బ్యాక్టీరియా గుండె జబ్బులకు దారితీయవచ్చు. అందుకే చిగుళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు దంత వైద్యులు.
దంతంలో పైకి కనిపించే పొర పింగాణి. దాని లోపల డెంటిన్ అనే పొర ఉంటుంది. పంటిలోపల రక్తప్రసారం జరిగే భాగానికి పల్ప్ అని పేరు. దంతాన్ని ఆనుకుని ఉండే తొలి చిగురును జింజైవా అంటారు. ఆ పైన ఉండే దంత మూలానికి ఆధారంగా ప్యారడాంటల్ లిగమెంట్ ఉంటుంది. జింజైవా ఇన్‌ఫెక్షన్లకు గురైనపుడు నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్లు లిగమెంట్ దాకా వెళతాయి. దీనివల్ల పునాదులు దెబ్బతిన్న గోడల మాదిరిగా దంతాలు రాలిపోతాయి.
డెంటల్ ప్లాక్
ఉదయం నిద్రలేవగానే దంతాలపై కనిపించే పలుచని పొరను ప్లాక్ అంటారు. దీనిమీద బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా చేరిన ఆ ప్లాక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అది క్రమంగా గట్టిపడి పచ్చగా (క్యాల్కులస్)దంతాల మీద నిలిచిపోతుంది. ఇందులోని బ్యాక్టీరియా దంతక్షయానికి కారణమవుతుంది.
దంతాల ఒరిపిడి(అక్లూషన్) పుట్టుకతోనే కొందరికి దంతాలు పొడవుగా ఉంటాయి. దీనివల్ల పై పళ్లకు, కింది పళ్లకు మధ్య ఉండే ఖాళీ తగ్గిపోతుంది. దంతాలు నిరంతరం ఒరుసుకుంటాయి. మరికొందరిలో నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. పళ్లలో జరిగే ఈ నిరంతర ఒరిపిడి కారణంగా చిగుళ్లు దెబ్బతింటాయి.
రూట్‌కెనాల్ చికిత్స
ఏదైనా ప్రమాదంలో పన్ను విరిగి డెంటిన్ దెబ్బతిన్నప్పుడు లోపల ఉండే రక్తకణాలు ఇన్‌ఫెక్షన్లకు లోనవుతాయి. అయితే ఒక్కోసారి ప్రమాదం జరిగిన వెంటనే కాకుండా కొన్ని వారాల తరువాత ఇన్‌ఫెక్షన్ల సమస్య మొదలవుతుంది. పంటి రంగు మారడం, అతివేడి లేక అతిచల్లదనానికి దంతాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే లోపల ఉండే రక్తనాళాలు చనిపోయాయని గ్రహించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే దెబ్బతిన్న భాగాన్ని తొలగించి ఆ ఖాళీని ఒక ప్రత్యేకమైన సిమెంట్‌తో నింపుతారు. దీన్నే రూట్‌కెనాల్ చికిత్స అంటారు. పిప్పి పళ్ల విషయంలోనూ ఈ చికిత్స అవసరమవుతుంది.
పదార్థాల నిలువలు
దంతాల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, దంతాల మధ్య సందులు ఉన్నప్పుడు తిన్న పదార్థాలు వాటిలో నిలిచిపోతాయి. ఆ పదార్థాలను పూర్తిగా శుభ్రం చేయనప్పుడు అవి కూడా బ్యాక్టీరియాలకు నిలయమవుతాయి. పిప్పి పళ్లలో ఏర్పడే రంధ్రాలను సిమెంట్‌తో నింపుతారు. ఈ ఫిల్లింగ్స్ అవసరానికి మించి కాస్త ఎత్తుగా వేసినపుడు వాటి మీద కూడా ఆహారపదార్థాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల కూడా చిగుళ్లు దెబ్బతిని బ్యాక్టీరియా చేరుతుంది.
ఇతర వ్యాధులు
మధుమేహం, ల్యుకేమియా, హీమోఫీలియా, «థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం, సి-విటమిన్ లోపించడం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం కలుగుతుంది. విటమిన్ డి లోపించినపుడు దంతాల్లో పెళుసుదనం, విటమిన్ కె లోపంతో చిగుళ్లలో రక్తస్రావం ఏర్పడుతుంది.
చిగురు వాపు (జింజైవా)
చిగురు ముందు భాగం తొలుత ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంది. ఈ స్థితిలో అప్పుడప్పుడు కొద్దిపాటి రక్తస్రావం ఉంటుంది. ఆ తరువాత చిగురు ఉబ్బి మెత్తగా మారుతుంది. ఆ భాగమంతా ఎర్రగానూ మెరుస్తూ కనిపిస్తుంది. దీనివల్ల చిగురుకు, పన్నుకు మధ్య ఒక ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని ప్యారడాంటల్ సమస్య అంటారు. అక్కడ బ్యాక్టీరియా చేరిపోయి ఖాళీ మరింత పెద్దదవుతుంది. రక్తప్రసారం తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే చీము చేరిపోయి చిగురు తన పట్టుకోల్పోతుంది. పంటికి ఆధారంగా ఉండాల్సిన చిగురు దెబ్బతినడంతో పన్ను ఊగడం మొదలవుతుంది.
బ్యాక్టీరియా దంతాన్ని తినేస్తుంది. దీనివల్ల దంతం విరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. పంటిలోని రక్తనాళాలు ఇన్‌ఫెక్షన్లకు లోనైనపుడు అది ఇతర అవయవాలకు పాకే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఇన్‌ఫెక్షన్లు గుండెపైన ఉండే ఎండోథెలియమ్ అనే పొరను దెబ్బతీస్తాయి. దీనితో గుండె నొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇన్‌ఫెక్టివ్ ఎండ్‌కార్‌డైటిస్ అంటారు.
జాగ్రత్తలు
ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం చాలా అవసరం. అయితే బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు పూర్తిగా శుభ్రం కావు. పళ్ల మధ్య ఉండే అతి సన్నని సందులలోకి, దవడ చివరలో ఉండే పన్ను దాకా బ్రష్ వెళ్లకపోవచ్చు. అందువల్ల పళ్ల సందులను దారాలతో శుభ్రం చేయడం (ఫ్లాసింగ్), మౌత్‌వాష్ ద్రావణంతో నోరు పుక్కిలించడం(రిన్సింగ్) వంటివి చేయాలి. ప్రతి ఆరుమాసాలకు ఒకసారి దంతవైద్యున్ని సంప్రదించాలి. దీనివల్ల సమ్యస్యను తొలిదశలో గుర్తించడం సాధ్యమవుతుంది. తద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టుకునేందుకు వీలవుతుంది.
చికిత్స
దంతాల మీద చేరిపోయిన హానికారక పదార్థాలను తొలగించడం(ప్రొఫెలాక్సిస్)జరుగుతుంది. పళ్లు లోపలి వరకు దెబ్బతిని రంధ్రాలు ఏర్పడి అందులో బ్యాక్టీరియా నిండినపుడు అక్కడ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఖాళీలను ఎముకపొడితో (సిమెంట్) నింపాల్సి ఉంటుంది. దీన్ని ప్లాప్ సర్జరీ అంటారు.
రూట్‌కెనాల్ చికిత్స
బ్యాక్టీరియా కారణంగా దంతంలోని రక్తకణాలు దెబ్బతింటున్న తొలిదశలో నొప్పి ఉంటుంది. అయితే ఆ రక్తకణాలు మొత్తంగా చనిపోయిన తరువాత నొప్పి ఉండదు. నొప్పి లేకపోవడం వల్ల సమస్య పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ పన్ను లోపలి భాగం పూర్తిగా దెబ్బతింటుంది. చివరకు పన్ను విరిగిపోయే స్థితి ఏర్పడుతుంది. అంతకంటే కాస్త ముందు వైద్యున్ని సంప్రదిస్తే చికిత్స చేయవచ్చు. ఎక్స్‌రే ద్వారా పంటిని పరిశీలించి రక్తకణాలు పూర్తిగా దెబ్బతిన్న భాగాన్ని శుభ్రం చేసి సిమెంట్‌తో నింపాల్సి ఉంటుంది. దీన్ని రూట్‌కెనాల్ చికిత్స అంటారు. ఈ చికిత్స ద్వారా పన్ను విరిగిపోయే ప్రమాదం తప్పుతుంది.
ఆహారం
- చిగుళ్లను రక్షించడంలో విటమిన్ సి పాత్ర చాలా కీలకం. నిమ్మ, దానిమ్మ వంటి పళ్లను తరచుగా తీసుకోవడం, లేక డాక్టర్ సలహా మేరకు విటమిన్ సి మాత్రలు వేసుకోవడం చేయాలి.
- దంత నిర్మాణాన్నికాపడటంలో కాల్షియం, విటమిన్ డి కూడా ముఖ్యమే. ఉదయం వేళ కొంత సమయాన్ని సూర్యరశ్మిలో గడపటం, పాలు, గుడ్లు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకోవాలి.
- రక్తసంబంధమైన లోపాలు రాకుండా ఉండటం కోసం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యమైన చిగుళ్లు మీ సొంతమవుతాయి.
0 Comments