Full Style

>

కూర్చుంటే సుఖం.. కాలికే నష్టం!

ఈనాటి సుఖవంతమైన జీవితం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల్లో వెరికోస్ వెయిన్స్ ఒకటి. కాళ్లకు పరిశ్రమ లేకుండా పోవడం...గంటల కొద్దీ కూర్చుని చేసే ఉద్యోగాలతోపాటు రోజంతా ఒకేచోట నిలబడి చేసే ఉద్యోగాల కారణంగా కాళ్లకు వెరికోస్ వెయిన్స్ వ్యాధి వస్తోంది. స్త్రీ పురుషులన్న తేడా లేకుండా ఎవరికైనా వచ్చే ఈ వ్యాధిని అలక్ష్యం చేస్తే అది కాలి అల్సర్‌కు దారితీయవచ్చని అంటున్నారు న్యూఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె.కె. పాండే.
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న వ్యాధులలో కాళ్లకు వచ్చే వెరికోస్ వెయిన్స్ ముఖ్యమైనది. నీలం రంగులో కాళ్ల నరాలు ఉబ్బిపోవడాన్నే వెరికోస్ వెయిన్స్ అంటారు. మనం ఎంత సుఖవంతమైన జీవితానికి అలవాటు పడతామో అంతే వేగంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మొదట్లో నరాలు కొంచెం ఉబ్బుగా కనిపించినా చాలామంది పట్టించుకోరు. ఏదో చిన్న సమస్యేలే అని నిర్లక్ష్యం చేస్తారు. కాని...సమస్య ముదిరినపుడు ఆదరబాదరగా డాక్టర్లను సంప్రదించడం మొదలుపెడతారు. చివరకు వివిధ డాక్టర్లు ఇచ్చే పొంతనలేని వైద్య సలహాలతో గందరగోళంలో పడతారు. ఆఖరికి కాళ్ల నరాలు నలుపు రంగులోకి మారి అల్సర్‌కు ఈ సమస్య దారితీస్తుంది.
ఎవరు బాధితులు?
వెరికోస్ వెయిన్స్ ముఖ్యంగా స్త్రీలు, దుకాణాలలో పనిచేసే వారికి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే కూర్చుని పనిచేసే ఉద్యోగాలైన కంప్యూటర్ ప్రొఫెషనల్స్, ఆఫీసు క్లర్కులు, రిసెప్షనిస్టులు ఈ వ్యాధికి త్వరగా గురవుతారు. ఇంకా...గంటల తరబడి నిలబడి పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్స్, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, కిందిస్థాయి పోలీసు అధికారులు, లేబరేటరీలలో పనిచేసే సైంటిస్టులు, ఇతర నిపుణులు కూడా బాధితులే. వీరితో ఉపాధ్యా వృత్తిలో ఉన్నవారు, కాల్ సెంటర్ ఉద్యోగులకు వెరికోస్ వెయిన్స్ బాధితులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే మార్నింగ్ వాకింగ్ చేయలేని వారు, గంటల తరబడి కూర్చుని, లేదా ఒకేచోట నిలబడి పనిచేసే వారు ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యాధి బారిన పడడం ఖాయమని చెప్పవచ్చు.
ఎలా గుర్తించాలి?
మీ కాళ్లను నిశితంగా పరిశీలించండి. మీ కాలి చర్మంపై వానపాము లేక సాలెపురుగు ఆకారంలో నీలం రంగులో సన్నని నరాలు కనపడుతున్నాయా? కాళ్ల మీద నల్లని మచ్చలేవైనా కనపడుతున్నాయా? అయితే మీరు వెరికోస్ వెయిన్స్ బాధితులుగా మారుతున్నారన్న మాట! కొద్ది దూరం నడిచినా కాళ్లలో వాపు రావడం లేదా నొప్పిగా ఉండడం జరుగుతోందా? త్వరలోనే వెరికోస్ వెయిన్స్ బాధితులు కాబోతున్నారని అర్థం. బాగా దూరం నడిచిన తర్వాత కాళ్లపైన పలచగా ఎర్రని వాతల్లాంటివి కనపడినా...కాళ్ల నరాలు నీలం రంగులోకి మారినా నిస్సందేహంగా మీకు వెరికోస్ వెయిన్స్ ప్రాథమిక దశలో ఉన్నట్లే.
ఎందుకు వస్తుంది?
ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారా? అయితే వెరికోస్ వెయిన్స్‌కు మీరు ఆమడ దూరంలో ఉన్నట్లే! ఉదాహరణకు మీరు స్నానానికి బాత్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ స్నానం చేయడానికి కావలసిన మంచినీటి ట్యాపులో ఎటువంటి ఇబ్బంది లేదు...అలాగే సోపు నీళ్లు బయటకు పోయే డ్రెయినేజ్ పైపులలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ స్నానం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. 
అయితే సబ్బు నీళ్లు పోయే డ్రెయినేజ్ గొట్టానికి ఆటంకం ఏర్పడిందనుకోండి...ఆ నీళ్లన్నీ బాత్‌రూమ్‌లోనే పేరుకుపోతాయి. అవి బయటకు పోవడానికి మార్గాన్ని వెతుక్కుంటాయి. అదే విధంగా మీ కాళ్లను కూడా బాత్‌రూమ్‌గా ఊహించుకోండి. బాత్‌రూమ్‌లో నీళ్ల ట్యాపులా ధమనులా ద్వారా నిరాటంకంగా రక్త సరఫరా కాళ్లకు జరుగుతుంది. ఈ రక్తం ద్వారానే వాకింగ్ చేస్తున్నపుడు కాళ్లకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కాళ్ల కండరాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తర్వాత ఆ రక్తం స్వచ్ఛతను కోల్పోతుంది. 
మళ్లీ సరఫరా కావడానికి, కాళ్లకు ఆక్సిజన్‌ను మళ్లీ తీసుకురావడానికి ఈ రక్తం శుద్ధి చెందాల్సి ఉంటుంది. అలా జరగాలంటే శుద్ధి పొందాల్సిన రక్తం కాళ్ల నుంచి గుండె ద్వారా ఊపిరితిత్తులకు చేరాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులలో శుద్ధి చేయబడిన తర్వాత స్వచ్ఛమైన రక్తం మళ్లీ గుండె మీదుగా ధమనుల ద్వారా కాళ్లకు ప్రవేశించాలి. ఏ కారణం చేతనైనా స్వచ్ఛత కోల్పోయిన రక్తం కాళ్లలోనే ఉండిపోయి ఊపిరితిత్తులకు చేరని పక్షంలో అలా పేరుకుపోయిన రక్తం చర్మం కింద ఉండే వేరే నరాలలోకి క్రమంగా చేరుకుంటుంది. ఈ రకమైన అసహజ ప్రక్రియలో ఏర్పడే కృత్రిమ నరాలు నీలం రంగులో చర్మంపైన కనపడడం మొదలుపెడతాయి. ఇది వెరికోస్ వెయిన్స్‌కు నాందిగా పరిగణించాలి.
ఎవరిని సంప్రదించాలి?
మీ కాలికి వెరికోస్ వెయిన్స్ ఉన్నట్లు తెలిసిన వెంటనే తాత్సారం చేయకుండా వ్యాస్కులర్ సర్జన్‌ను సంప్రదించండి. సాధారణంగా మన దేశంలో అజ్ఞానం వల్ల వెరికోస్ వెయిన్స్ బాధితులు ముందుగా చర్మవ్యాధి నిపుణుడినో లేక ఎముకల వ్యాధి నిపుణుడినో సంప్రదిస్తుంటారు. మరి కొందరైతే మర్దన చేస్తే నరం బాగుపడుతుందని రోడ్డుపైన మూలికా వైద్యులను, నకిలీ వైద్యులను కూడా ఆశ్రయిస్తుంటారు. అయితే చివరకు వ్యాధి ముదిరిపోయి కాలికి అల్సర్ సోకిన తర్వాత తమ తప్పు తెలుసుకుంటారు. అందుకే వ్యాస్కులర్ సర్జన్‌ను సంప్రదిస్తే సరైన వైద్య చికిత్స ఈ వ్యాధికి లభిస్తుంది.
సరైన చికిత్స ఏమిటి?
వెరికోస్ వెయిన్స్ ప్రాథమిక దశలో ఉన్నపుడు సర్జరీ కాని లేజర్ కాని ఆర్ఎఫ్ఎ చికిత్స కాని అవసరం ఉండదు. అయితే రోగి తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం రెండు పూటలా గంట చొప్పున వాకింగ్ చేయాలి. గంట కన్నా ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోకూడదు. అధిక బరువును వదిలించుకోవాలి. వాకింగ్ చేసే సమయంలో కాళ్లకు బిగుతుగా ఉండే మంచిరకం స్టాకింగ్స్ ధరించాలి. అలాగే రెండు నెలలకు ఒకసారి వ్యాస్కులర్ సర్జన్‌ను సంప్రదించడం మాత్రం మరచిపోకూడదు.
సర్జరీకి లేజర్‌కి తేడా ఏమిటి?
వెరికోస్ వెయిన్స్ నుంచి బయటపడేయడమే ఈ రెండు చికిత్సా విధానాల ఏకైక లక్ష్యం. వెరికోస్ వెయిన్స్‌ను తరిమేయడానికి కాలికి సర్జరీ చేయడం ఒక పద్ధతైతే లేజర్ లేదా ఆర్ ఎఫ్ఎ టెక్నిక్ ద్వారా కాలిలోపలే దాన్ని అంతం చేయడం మరో పద్ధతి. ఈ రెండు పద్ధతులూ ఉపయోగకరమైనవే. పేషెంట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ చికిత్సా పద్ధతిని ఎంచుకోవాలో డాక్టర్లే నిర్ణయిస్తారు.
లేజర్ టెక్నిక్ ప్రయోజనాలు
లేజర్ టెక్నిక్‌లో చర్మంపైన కోతలు ఉండవు. ఈ కారణంగా చర్మంపై కుట్లు వేయడం కాని వాటిని విప్పడం కాని ప్రసక్తే ఉండదు. దీని వల్ల ఆసుపత్రిలో ఉండడం తగ్గిపోతుంది. లేజర్ ట్రీట్‌మెంట్ తర్వాత అదే రోజు కాని మరుసటి రోజు ఉదయం కాని ఇంటికి వెళ్లిపోవచ్చు. అదే విధంగా రక్తస్రావం కాని బ్యాండేజ్‌లు మార్చడం కాని ఉండదు.
ఆధునిక చికిత్స ఆర్ఎఫ్ఎ
ఇటీవలి కాలంలో ఈ టెక్నిక్‌కు ఆదరణ పెరుగుతోంది. చర్మంపైన ఎటువంటి కోతలు, గాట్లు అవసరం లేదు. చికిత్స తర్వాత 24 గంటల్లో పేషెంట్ ఇంటికి వెళ్లిపోవచ్చు. చికిత్స తర్వాత బెడ్ రెస్ట్ కాని బ్యాండేజ్‌లు వేసుకోవడం కాని ఉండవు. రెండవ రోజే విధులకు హాజరు కావచ్చు. ఏడాది తర్వాత బిగుతుగా వేసుకునే స్టాకింగ్స్‌ని మానివేయవచ్చు. లేజర్‌తో పోలిస్తే ప్రస్తుతానికి చాలా మెరుగైన వైద్య చికిత్సగా పరిగణించడం జరుగుతోంది. అయితే ఫలితాలపై భవిష్యత్తులో జరిగే దీర్ఘకాల అధ్యయనాల ద్వారా సర్జికల్, నాన్ సర్జికల్ పద్ధతులలో ఏది మెరుగైనదో తేలుతుందని ఆశించవచ్చు.

Post a Comment

0 Comments